సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 75వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 75వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 138

శ్రీ రామచంద్ర కేశవ్ నాయక్ గారి అనుభవం.

శ్రీ సాయిభక్త పరాయణులైన శ్రీ భావుసాహెబ్ హరిసీతారాం దీక్షిత్ గారికి, శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి విషయానికి సంబంధించి అనుభవాన్ని వ్రాసి పంపుతున్నాను. మీకు యోగ్యమైనదిగా అనిపిస్తే శ్రీ సాయిలీల పత్రికలో ప్రచురించవలసినదిగా వినతి. 

నేను పూనాలో జన్మించాను. అక్కడ మా తండ్రిగారు మిలటరీలోని అకౌంట్స్ ఆఫీసులో పని చేస్తారు. శ్రీ అక్కల్ కోట్ మహారాజ్ గారి దర్శనానికై ముంబాయికి చెందిన లక్ష్మణ్ పండిట్ మరియు నగర్ కు చెందిన నానా జోషి రేఖే అక్కల్ కోటకు బయలుదేరారు. వారు పూనాలోని మా వాడాలోనే బస చేస్తారు. వారితో పాటుగా మా తండ్రిగారు నన్ను తీసుకొని అక్కల్ కోటకు వెళ్ళారు. ప్రతినెలా వారు అక్కల్ కోటకు నియమంగా యాత్ర చేసేవారు. వారితోపాటుగా తరచు నేనూ వెళ్ళేవాడిని. ఒకసారి అక్కల్ కోట నుండి “వెంటనే బయలుదేరి రమ్మని” మా తండ్రిగారికి టెలిగ్రాం వచ్చింది. ఆ టెలిగ్రాం చూడగానే మా తండ్రిగారు నన్ను తీసుకొని అక్కల్ కోటకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మహారాజ్ తుదిశ్వాస విడిచే క్షణాలు దగ్గర పడ్డాయని అర్థమైంది. మా తండ్రిగారు అక్కల్ కోట్ మహారాజ్ ను “ఇప్పుడు నాకు, నా పిల్లవానికి దిక్కెవరు?” అని అడిగారు. అప్పుడు స్వామి సమర్థ తమ పాదుకలను నాకు ఇచ్చి “వీటిని పూజించుకో” అని అన్నారు. “అహ్మద్ నగర్ జిల్లాలోని శిరిడీ గ్రామంలో, నా అవతారం ఉంది. నన్ను ఎలాగైతే భక్తి, ప్రేమలతో పూజించుకుంటున్నారో, అలానే అక్కడ కూడా చేయి. అప్పుడు నీ మనసుకు సుఖసమాధానాలు లభ్యమవుతాయి” అని అన్నారు.

అక్కడే కొన్నిరోజులుండి, తరువాత లక్ష్మణ్ పండిట్, నానా రేఖ్ మరియు మేము కలిసి శిరిడీకి వచ్చాము. దారిలో వారు మా తండ్రిగారితో “శిరిడీలోని పిచ్చి ఫకీరు గురించి మాకు తెలుసు. మేము ముసల్మాను పాదాలపై పడము. మీరు కావాలంటే ఆయన పాదాలకు నమస్కారం చేసుకోండి, తరచుగా అక్కడికి వెళ్ళి సేవ చేసుకోండి” అని అన్నారు. కానీ మా తండ్రి గారి నిశ్చయం ఏ మాత్రం సడలకుండా, మమ్మల్నందరిని తీసుకొని శిరిడీ వెళ్ళారు. ఆ ఫకీరు మమ్మల్నందరినీ చూడగానే దారిలో జరిగిన సంభాషణ అంతా చెప్పసాగారు. చివరగా నా వైపు మరియు నా తండ్రిగారి వైపు చూసి “వీరు ఛాందస బ్రాహ్మణులు. నీవు, నీ కుమారుడు కావాలంటే ఇక్కడకు రావచ్చు” అని చెప్పారు. తరువాత నాకు ముందరనున్న వేపచెట్టుని చూపించి, ఆ చెట్టు ఆకులను తెమ్మని చెప్పారు. వాటిని తేగానే మా అందరికీ ఇచ్చి మమ్మలను తినమని చెప్పారు. వారిద్దరికీ ఆ ఆకులు అతి చేదుగా ఉండి, నాకు, మా తండ్రి గారికి ఎంతో మధురంగా ఉన్నాయి. వారిద్దరు ఎంతో బేజారుకు గురయ్యారు. మా తండ్రి గారికి చేదు వేపాకులను తినిపించడంలోని అర్థం బోధపడింది. అక్కల్ కోట స్వామి కూడా అక్కల్ కోటలోని వేపచెట్టు సగభాగాన్ని తీపిగా చేసి, గాణాపూర్ నుండి వచ్చిన భక్తులకు నేను నృసింహ సరస్వతీ అవతారమనే అనుభవాన్ని ఇచ్చారు. అలాగే శ్రీ సాయిబాబా కూడా అటువంటి అనుభవాన్ని ఇచ్చి, తాము సాక్షాత్తు అక్కల్ కోట స్వామి గారి అవతారమనే అనుభవం ప్రసాదించారు.

ఆ రోజులలోని శ్రీ సాయిబాబా ఫోటో ఒకటి నా దగ్గర ఉంది. ఎవరైన చూడాలనుకుంటే నా దగ్గరకు రావచ్చు. మూడు భిన్న రీతులలో ఉన్న శ్రీ సాయిబాబా ముఖారవిందాన్ని ఒకే చిత్రంగా గీసిన ఫోటో శిరిడీలోని ప్రభుజాతికి చెందిన శ్రీ బాలక్ రామ్  గారు మరణించిన తరువాత ఆయన పుస్తకంలో వారి కుమారునికి లభించింది. కైలాసవాసి ఆత్మారామ్ బాలాజీ ఆ ఫోటో కాపీలను నాకు చూపించగానే ఆ గురుమూర్తిని దర్శించి, నా మనసు అత్యంత సుఖసమాధానాలకు లోనయింది.

తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు నేను కూడా శిరిడీకి వెళుతుండేవాడిని. ఒకసారి శ్రీ ఆనందనాథ్ మహారాజ్ (శ్రీ అక్కల్ కోట మహారాజ్ గారి శిష్యులు) గారి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఆయన శ్రీ శిరిడీ సాయిబాబా గురించి ప్రస్తావిస్తూ "ఆయన వేరెవరో కాదు, సాక్షాత్తూ భగవంతుని అవతారం” అని అన్నారు. ఆ మాటలు వినగానే నా మనసుకి పరమానందం కలిగింది.

తరువాత నుండి అక్కల్ కోట స్వామి దర్శనానికి వెళ్ళే ముందు శిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని, తరువాత అక్కల్ కోటకు వెళ్ళుతున్నాను. తరువాతి రోజులలో నాకు శ్రీ సాయిబాబా ప్రసాదించిన అనుభవాలను త్వరలోనే పంపుతాను.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo