సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 111వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నా ప్రార్థన మన్నించి మా పిల్లిని మా ఇంటికి చేర్చారు బాబా
  2. బాబా మనం ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఇస్తారు

నా ప్రార్థన మన్నించి మా పిల్లిని మా ఇంటికి చేర్చారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను కొన్ని సంవత్సరాల నుండి సాయిభక్తురాలిని. మా ఇంటిలో ఒక పిల్లి ఉంది. అది మా పెంపుడు పిల్లి కాదు కానీ, ఒక సంవత్సరం క్రితం అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి చేరింది. మేమంతా దానికి బాగా చేరిక అయిపోయాము. హఠాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటినుండి అది అదృశ్యమై రాత్రి వరకు తిరిగి రాలేదు. అది మా ఇంటిలోనే తిని, పడుకుంటుంది. బయటకి వెళ్లిన ప్రతిసారీ ఇతర పిల్లులు, కుక్కలు దానిపై దాడి చేస్తుండటంతో అది బయటకు వెళ్ళడానికి భయపడుతుంది. అందువలన మేము దానిగురించి చాలా ఆందోళనపడ్డాము. మరుసటిరోజు ఉదయం మేము దానికోసం వెతికినప్పటికీ దాన్ని కనుక్కోలేకపోయాము. నేను, "సురక్షితంగా పిల్లిని మా ఇంటికి తిరిగి చేర్చమ"ని సాయిని ప్రార్థించాను. బాబా కృపవలన దానంతట అదే రాత్రికల్లా మా ఇంటికి వచ్చింది. అది చాలా బలహీనంగా, భయపడుతూ కనిపించింది. కానీ రెండురోజుల్లో చురుకుగా తయారైంది. నా ప్రార్థన విన్నందుకు బాబాకు నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! ఈరోజుల్లో మేమంతా ప్రతిదానికి చాలా పోరాడుతున్నాము. అందరినీ ఆశీర్వదించండి. దయచేసి మా చెల్లెలికి సరైన వరుడిని చూపించండి. నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేలా నా తల్లిదండ్రులను ఆశీర్వదించండి. ధన్యవాదాలు బాబా!"
source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2382.html

బాబా మనం ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఇస్తారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! సాయిబాబా నా జీవితం. ఆయన అద్భుతమైన దైవం. నేను ఆయనను దాదాపు 7 సంవత్సరాలుగా పూజిస్తున్నాను. ఆయన నా సమస్యలనెన్నో పరిష్కరించి నాకు సంతోషాన్నిచ్చారు. మన జీవితంలో ఆయన ఉండటం నిజంగా మన అదృష్టం. మనం మన జీవితాంతం ఆయన పాదాలను విడవకుండా పట్టుకుని ఆయన సేవ చేయాలి. ఇక నా అనుభవానికి వస్తే...

నేనొక ప్రముఖ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. రెండు సంవత్సరాల నుంచి శాశ్వత ఉద్యోగినవడం కోసం ఎదురుచూస్తున్నాను. నాలుగుసార్లు నా కాంట్రాక్టును పొడిగించారు కానీ, బడ్జెట్ సమస్యల కారణంగా నన్ను శాశ్వత ఉద్యోగిగా మార్పు చేయలేదు. ఆ ఆశ కూడా నాకు కనిపించలేదు. 31, డిసెంబరు 2018 నాటికి నా కాంట్రాక్టు ముగిసిపోతుంది. కానీ అదే సంస్థలో కొనసాగాలన్నది నా కోరిక. కారణం, అక్కడ ఆడవాళ్లకి ఉండే భద్రత, సౌకర్యవంతమైన వాతావరణం. ముఖ్యంగా నా భర్త కూడా అదే సంస్థలో పనిచేస్తున్నారు. ఆ కారణాల దృష్ట్యా అదే సంస్థలో ఇంటర్నల్ ఉద్యోగం కోసం అన్వేషణ మొదలుపెట్టాను. కానీ నేను కాంట్రాక్టులో ఉండటం వలన శాశ్వత ఉద్యోగిగా తీసుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి.

ఈ పరిస్థితులలో నేను సాయిబాబాను విశ్వసించి, "నాకేది మంచిదో అది చేయమ"ని రోజూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అకస్మాత్తుగా దీపావళిరోజున మా సంస్థలోని ఒక ఇంటర్నల్ టీమ్ నుండి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఆ ఇంటర్వ్యూ నేను బాగా చేసాను. మరుసటిరోజే రెండవ రౌండ్ డిస్కషన్‌కి పిలిచారు. నాతో డిస్కస్ చేసిన తరువాత మరిన్ని వివరాలకు నా మేనేజరుతో డిస్కస్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సాయిబాబా నా మేనేజర్ రూపంలో చాలా సహాయం చేసారు. నా మేనేజర్ సంస్థలోని ఇతర బృందాలకు, టాప్ మేనేజ్‌మెంటుకు నా రెజ్యూమ్ పంపించి తనవంతు కృషి చేసారు. నేను కూడా అదే జాబ్ కోసం హెచ్.ఆర్. ద్వారా కూడా ప్రయత్నించాను. కానీ కాంట్రాక్టర్లను తీసుకోమనే చెప్పారు. కానీ సాయి మనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మన ప్రయత్నాలతో సంబంధం లేకుండా అద్భుతమైన రీతిన అది జరిగితీరుతుంది. 

బాబా కృపవలన ఇంటర్వ్యూలన్నీ సక్రమంగా సాగి నా జీతం విషయం వరకు వచ్చింది. అప్పటికి నాకు వస్తున్న జీతం కంటే కాస్త ఎక్కువ జీతాన్ని నేను ఆశించాను. కానీ రిక్రూట్‌మెంట్ టీమ్ వాళ్ళు నాకు అప్పటికి వస్తున్నంత జీతం కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ వార్త విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. కానీ జీతం కంటే ప్రస్తుతం శాశ్వత ఉద్యోగినవడం అవసరమని నేను సమాధానపడ్డాను. అందువల్ల, "కనీసం ప్రస్తుతం నాకు వస్తున్నంత జీతమైనా ఇవ్వండి. లేకపోతే మా కుటుంబ నిర్వహణకు చాలా కష్టమవుతుంద"ని చెప్పాను. కానీ ఆ వ్యక్తి చాలా మొండిగా ఉన్నాడు. నా పరిస్థితి చూస్తే నేను అంతకన్నా తక్కువ జీతానికి వెళ్ళలేను. ఏమి చేయాలో అర్థంకాని స్థితిలో సాయిని ప్రార్థించి, నా మేనేజరును సంప్రదించి పరిస్థితిని వివరించాను. అతను జోక్యం చేసుకుని నా తరఫున రిక్రూట్‌మెంట్ టీముతోను, మేనేజ్‌మెంట్ లెవల్ వాళ్లతోను మాట్లాడారు. చివరికి వాళ్ళు నాకు ప్రస్తుతం వస్తున్నంత జీతం ఇవ్వడానికి అంగీకరించారు. అన్నిరోజులుగా నేను పడుతున్న సమస్య నుండి ఉపశమనం పొందడంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ ఒక మాములు మనిషిగా జీతంలో పెరుగుదల లేనందుకు సంతృప్తిపడలేక కాస్త దిగులుపడ్డాను. అయితే సాయి మరో అద్భుతం చూపించారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయ్యాక నా జీతం చూసి ఆశ్చర్యపోయాను. నా జీతం 6.25% పెంచబడింది. సచ్చరిత్రలో చెప్పినట్లుగా బాబా మనం ఆశించిన దానికన్నా ఎక్కువగానే ఇస్తారన్న మాట నిజమైంది. నేను పట్టలేని ఆనందంతో సంతృప్తిగా బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

నేను అదే సంస్థలో శాశ్వత ఉద్యోగిగా డిసెంబర్ 20న చేరాను. బాబా మార్గాలు అనూహ్యమైనవి, అత్యుత్తమమైనవి. కేవలం ప్రేమతో ప్రార్థించడమే మన విధి. అంతా ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. సరైన సమయంలో అన్ని ఆనందాలూ ఆయన మనకు అందిస్తారు. కాబట్టి దేనిగురించీ చింతించకండి. మీ ప్రార్థనలను కొనసాగిస్తూ ప్రేమ మరియు సేవను అందరికీ పంచండి.
source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2383.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo