సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 55వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 55వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 103

బాళారామ్ మాన్కర్ అనే పేరు గలిగిన బాబా భక్తుడు ఒకరు ఉండేవారు. ఒకసారి బాబా తనను “మశ్చీంద్రగఢీకు వెళ్ళి తపస్సు చేసుకో” అని ఆజ్ఞాపించారు. బాళారాంకు ఖర్చుల నిమిత్తమై పది లేదా పన్నెండు రూపాయల డబ్బులు కూడా ఇచ్చారు. బాబా ఆజ్ఞ ప్రకారం బాళారామ్ మశ్చీంద్రగఢీకు వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు బాళారామ్ సాధనలో ఉండగా, తనకు జాగృదవస్థలో బాబా దర్శనం ప్రసాదించారు. అప్పుడు బాళారామ్ “బాబా నన్ను ఇక్కడికెందుకు పంపించారు?” అని అడిగారు. “నీ మనసు శిరిడీలో చంచలమవుతూ ఉందని” అని సమాధానం ఇచ్చారు. తరువాత తన తపస్సు పూర్తయిన తరువాత బాళారాం తిరిగి అక్కడినుండి బయలుదేరాడు. తాను పూణే వరకు వచ్చాడు. పుణేలో రైలు ద్వారా దాదరకు వెళ్ళి, అక్కడ నుండి బాంద్రాలోని ఇంటికి వెళ్ళవచ్చన్న ఉద్దేశ్యంతో పుణే స్టేషనుకు వెళ్ళాడు. టికెట్ తీసుకోవడానికి టికెట్ ఆఫీసు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక రైతు లాగా కనిపిస్తూ  భుజంపై ఒక నల్లటి కంబళిని వేసుకొని, లంగోటి కట్టుకుని ఒక మనిషి కనిపించాడు తాను కూడా దాదర్ వరకు టికెట్ తీసుకున్నాడు. బాళారాం కూడా టికెట్ తీసుకోబోతుండగా, ఆ వ్యక్తి బాళారాంతో “మీరు ఎక్కడికి వెళ్ళాలి?” అని అడిగారు. బాళారాం “దాదర్” అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి తన టికెట్ ను బాళారాం చేతిలో పెట్టి “ఈ టికెట్ మీరు తీసుకోండి. నేను కూడా దాదర్ కు వెళదామని అనుకున్నాను. కానీ నా ఆలోచన మారింది. అందువలన ఈ టికెట్ నాకు అవసరం లేదు” అని చెప్పాడు. తరువాత వెంటనే ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. ఆ వేషంలో ఎవరు అక్కడికి వచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా!

అనుభవం - 104

బాలాబువా సుతార్ (అభినవ తుకారాం) మొట్టమొదటిసారి బాబా దర్శనానికై వచ్చినప్పుడు "ఇతను నాకు నాలుగు సంవత్సరాల నుండి తెలుసు” అని బాబా అన్నారు. బాలాబువా ఇదివరకెన్నడూ శిరిడీ వెళ్ళి ఉండకపోవడం వలన, తనకు బాబా మాటలు అర్థం కాలేదు. కానీ ఆలోచించగా “తాను మొదట బాబా ఫోటోను సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం చూసి, నమస్కారం చేసుకున్న విషయం” చప్పున స్ఫురణకు వచ్చింది. అంటే బాబా మాటలకు అర్థం వెంటనే బోధపడింది.

అనుభవం - 105

|ముంబాయికి చెందిన ఒక గృహస్తు బాబా దర్శనానికై వెళ్ళగా బాబా తనకు రెండు రూపాయలను ఇచ్చి “నీ చిన్నతనంలో నీకు ఒక రూపాయిని ఇచ్చాను. ఆ రూపాయిని పెట్టిన చోటే ఈ రెండు రూపాయలను కూడా పెట్టు” అన్నారు. ఆ గృహస్థు ఎన్నడూ బాబా వద్దకు వెళ్ళలేదు. అందువలన బాబా మాటలు తనకు అర్థం కాలేదు. ముంబాయికి తిరిగి వెళ్ళిన తరువాత, ఇంట్లో వాళ్ళకు విషయం చెప్పగా, తన వృద్దురాలైన తల్లి “నీ చిన్నతనంలో మనం అక్కల్ కోట మహారాజ్ దర్శనానికై వెళ్ళగా, మహారాజ్ నీకు ఒక రూపాయని ఇచ్చారు. ఆ రూపాయని జాగ్రత్తగా దాచాము" అని చెప్పింది. అంటే అక్కల్ కోట మహారాజ్ మరియు బాబా ఒక్కరేనని ఆ గృహస్థుకు అర్థమై ఎంతో ఆనందం కలిగింది.

అనుభవం - 106

భాయీ అనే పేరు కలిగిన ఒక మరాఠి గృహస్తు ఉండేవాడు. “అక్కల్ కోటకు వెళ్ళి స్వామి సమర్థ పాదుకల వద్ద కొన్ని రోజులు ఉండాలి" అనే ఆలోచన మనసులో వచ్చింది. తాను ఆ ప్రకారమే అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు. తాను బయలుదేరే ముందురోజు తనకు ఒక స్వప్నంలో “నీవు అక్కల్ కోట వెళ్ళవద్దు. నేను ప్రస్తుతం శిరిడీలో ఉన్నాను. నీవు శిరిడీకి రా” అని అన్నారు. దాంతో భాయీ శిరిడీ వెళ్ళి ఐదు, ఆరు నెలలు ఉన్నాడు. అక్కడ భాయీ సాఠే  వాడలో ఎక్కడైతే బాబా యొక్క వేపచెట్టు ఉందో, వేపచెట్టు క్రింద అక్కల్ కోట మహారాజ్ యొక్క పాదుకలను స్థాపన చేశారు.

అనుభవం - 107 

శ్రీ బాపూసాహెబ్ బూటీకి ఒకరోజు శిరిడీలో ఉండగా డయేరియా వచ్చింది. కొన్నిసార్లు వాంతులు, భేదులు అయ్యాయి. తనకు విపరీతంగా దాహం వేయసాగింది. అప్పుడు తన స్నేహితుడు డా|| పిళ్ళై బాబా వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా బాబాకు చెప్పారు. “బాబా, బాపూసాహెబ్ కు త్రాగటానికి నీరు ఇమ్మంటారా (లేదా) కాఫీ ఇమ్మంటారా?” అని అడిగాడు. అప్పుడు బాబా “తనకు పాలలో రవ్వ, బాదం, పిస్తా, అక్రూట్ మొదలగునవన్నీ వేసి తనకు త్రాగడానికి ఇవ్వండి” అని చెప్పారు.   డా|| పిళ్ళై  బాబా చెప్పిన విధంగానే చేసాడు. అందువలన దాహం అయితే అలాగే ఉంది. కాని డయేరియా ఉపద్రవం మాత్రం తగ్గిపోయింది.

తరువాయి భాగం రేపు 


సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo