ఈరోజు భాగంలో అనుభవాలు:
- 'బాబాయే వచ్చారా!' అనిపించే అనుభవాలు
- కడుపునొప్పి తగ్గించిన బాబా
'బాబాయే వచ్చారా!' అనిపించే అనుభవాలు
జై సాయిరామ్! నా పేరు వల్లంకొండ మహేశ్వరి. మాది రాజమండ్రి. నేనిప్పుడు మీతో నాకు జరిగిన కొన్ని అనుభవాలను పంచుకుంటాను. సాయిభక్తుల కోసం బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా చాలా ధన్యవాదములు.
మొదటి అనుభవం:
ఒకప్పుడు మేము గృహనిర్మాణం చేస్తున్నాము. ఆ నిర్మాణం జరుగుతున్నచోటే నేను కూర్చుని ప్రతిరోజూ సచ్చరిత్ర పారాయణ చేస్తుండేదాన్ని. పారాయణ పూర్తయ్యాక అన్నదానం చెయ్యాలి కదా! గురువారంనాడు ఇంటి దగ్గరలో ఉన్న బాబా గుడి వద్ద ఉండే బిచ్చగాళ్ళకు ఏదైనా ఇద్దామని అనుకున్నాను. అయితే ఆరోజు ఉదయం నాకు ఇంటివద్ద పనులు ఉండి గుడికి వెళ్ళడం కుదరలేదు. సాయంత్రం గుడికి వెళితే ఒక్క బిచ్చగాడు కూడా లేడు. ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. గుడిలోకి వెళ్లి భజనలో కూర్చున్నాను. కానీ, 'బిచ్చగాళ్ళకి డబ్బులు ఇద్దామనుకుంటే ఎవరూ లేరే' అని లోలోపల బాధపడుతున్నాను. ఈ లోపల ఒక ముసలాయన వచ్చారు. ఆయన మురికిబట్టలతో బిచ్చగాడిలాగానే ఉన్నారు. కానీ గుడి లోపలకి బిచ్చగాళ్ళు రారు కదా! ఒకవేళ ఆయన బిచ్చగాడు కాకపోతే, నేను డబ్బులిస్తే బాధపడతారేమోనని సందిగ్ధంలో పడ్డాను. ఇంతలో అతను అందరివద్ద చేయి చాచి అడుగుతున్నారు. నేను గబగబా లేచి డబ్బులిచ్చి అన్నం తినమని చెప్పాను. కానీ నేను పిచ్చిదాన్ని, మనసులో నేను అనుకున్నవన్నీ కళ్ళముందే జరుగుతుంటే ఆయన బాబాయే అయివుంటారని నాకు అర్థం కాలేదు. తరువాత అంతా గుర్తు చేసుకుంటే ఆయన్ని గుర్తుపట్టలేకపోయానని చాలా బాధవేసింది. ఆయనే వచ్చి నా సంకల్పాన్ని నెరవేర్చారు. ఎంతటి భాగ్యం నాది!
రెండవ అనుభవం:
2016లో మేము శిరిడీ వెళ్లి నాలుగురోజులు అక్కడ ఉన్నాము. తిరుగుప్రయాణమయ్యే ముందు మళ్ళీ ఒకసారి ముఖదర్శనం చేసుకోవడానికి వెళ్లి అక్కడ కూర్చున్నాం. అప్పుడే మధ్యాహ్న ఆరతి పూర్తై ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. మా వారికి బాగా చెమటలు పడుతున్నాయి. ఒకతను వచ్చి అక్కడున్న స్విచ్చులన్నీ ఆన్ చేశారు, కానీ ఫ్యాన్ తిరగలేదు. కాసేపటికి తెల్లని దుస్తులు ధరించిన ఒకాయన మా వైపే వస్తుండటం నేను చూసాను. ఆయన చూడటానికి అచ్చం సాయిబాబాలాగానే అనిపించారు. ఆయన్ని చూస్తుంటే నమస్కారం పెట్టాలనిపించింది. కానీ ఏదో తెలియని సందిగ్ధంలో ఆగిపోయాను. అయితే ఆయన నన్ను చూసి నమస్కారం పెట్టారు. మేము ఉన్న చోటకి వచ్చి స్విచ్ ఆన్ చేసారు. వెంటనే ఫ్యాన్ తిరిగింది. నేను నిజంగా ఆయన సాయిబాబాయే అనుకున్నాను. లేకపోతే నేను మనసులో నమస్కరించాలనుకుంటే ఆయనకు ఎలా తెలిసింది? ముందు ఒకతను అన్ని స్విచ్చులు వేసినా తిరగని ఫ్యాన్ ఈయన ఒక్క స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరిగింది, ఇదెలా సాధ్యం? బయటకి వచ్చాక మావారితో, మా అమ్మాయితో ఈ విషయం చెప్తే, వాళ్ళు మేము ఎవరినీ చూడలేదు అన్నారు. పైగా నేను చూపించలేదని మావారు నామీద కోపగించుకున్నారు.
మూడవ అనుభవం:
బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో శిరిడీలో సేవ చేసుకునే భాగ్యాన్ని బాబా నాకిచ్చారు. అప్పుడొకరోజు మా సేవ పూర్తి చేసుకుని, ఆ పరిసరాలలో తిరుగుతూ అంతా చూశాము. కిటికీ గుండా బాబా కనిపించేచోట సాయంత్రం మేమంతా కూర్చున్నాం. అందులో ఒకామె నాతో, "మీరు పాటలు పాడుతారు కదా! ఒక పాట పాడండి" అని అడిగింది. జనం చాలామంది ఉన్నందున నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నా పాడటం మొదలుపెట్టాను. అయితే నా స్వరం కాస్త చిన్నగా ఉండటంతో వాళ్ళకి వినిపిస్తుందో లేదోనని బాధపడ్డాను. ఇంతలో గుంపుగా కూర్చుని ఉన్న అందరినీ దాటుకుంటూ ఒక కుక్క నా వద్దకు వచ్చి నా ఒడిలో తలపెట్టి పడుకుంది. అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. నేను మూడు పాటలు పాడాను. అంతసేపూ ఆ కుక్క నా ఒడిలోనే కళ్ళు మూసుకుని, చెవులు పైకి పెట్టి వింటూనే ఉంది. 'బాబాయే ఆ రూపంలో వచ్చి నా పాటలు వింటున్నారా' అని అనిపించి నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. 'ఎంతటి భాగ్యమ'ని మా వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మేము గదులు చేరుకున్నాక కూడా మా వాళ్ళంతా అదే విషయాన్ని నెమరువేసుకుంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేసారు.
కడుపునొప్పి తగ్గించిన బాబా
హైదరాబాదునుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ నమస్కారం. ఇటీవల ఒకసారి మా అబ్బాయి కడుపునొప్పితో నాలుగు రోజులు బాధపడ్డాడు. ఆ బాధ తట్టుకోలేక వాడు ఏడుస్తూ ఉండేవాడు. మేము డాక్టరుని సంప్రదించి ఆయనిచ్చిన మందులు వాడుతున్నా, అప్పుడప్పుడు నొప్పి వస్తుండేది. తననలా చూడలేక నేను చాలా బాధపడ్డాను. ఒకరోజు ఉదయం తను కడుపునొప్పి అంటూ నిద్రలేచాడు. మందులు వేసుకున్న ఒక గంట తరువాత కూడా నొప్పి అలానే ఉంది. నేను, "బాబా! తన కడుపునొప్పిని తొలగించండి. రాత్రి వరకు తనకి నొప్పి రాకపోయినట్లైతే నేను ఈ అనుభవాన్ని ఈరోజే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపవలన రాత్రి వరకు తనకు కడుపునొప్పి రాలేదు. తను హాయిగా నిద్రపోయాడు. "బాబా! మీ కృపకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి నాకు మంచి ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి. మా వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చేలా చేసి మా ఆర్థిక సమస్యలను తొలగించండి".
ఓం శ్రీ సాయినాథాయ నమః.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2320.html
source: http://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2320.html
🕉 sai Ram
ReplyDelete