కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 80వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 143
నీలకంఠరావు అలియాస్ బాబా సాహెబ్ సహస్రబుద్దే గారు 12-3-1910 తారీఖు శిరిడీ నుండి కాకాసాహెబ్ కు ఆంగ్లంలో వ్రాసిన ఉత్తరానికి అనువాదం:
శిరిడీ నుండి బయలుదేరడానికి అనుమతి నాకు ఇంకా ఎందుకు లభించలేదో, ఆ చిక్కుముడి ఇప్పుడు విడిపోయింది. కర్టిస్ సాహెబ్ (ఆ రోజులలో మధ్య భారత కమిషనర్), వారి పత్ని మిసెస్ కర్టిస్, మెక్ లీన్ సాహెబ్ (నేటివ్ అసిస్టెంట్) వగైరా మండలి 10వ తారీఖు ఉదయం ఇక్కడకు వచ్చారు. వారు వస్తున్నట్లు ముందస్తు సమాచారం అసలు లేదు. బహుశః, వారి రాకకు కారణం మేము ఇక్కడ రాజకీయాలలో మునిగి తేలుతున్నామేమో తెలుసుకోవడానికి వచ్చినట్లు ఉంది. కారణం, వీరు రాక ముందు బాబా ఉన్నట్టుండి కోపోద్రిక్తులై తమ కఫ్నీని పైకెత్తి “ఏం చూడాలి. నేను ఒక ఫకీరుని. నా వద్ద ముందర....., వెనుక... ఉన్నాయి” అని అన్నారు. ఎప్పుడైతే ఈ మండలి వచ్చిందో, అప్పుడు బాబా మాటలలోని అర్థం బోధపడింది. బాబాను కలవాలనే కోరికతో వచ్చినా, వారి అధికారగర్వం వలన, చివరకు బాబాను కలవకుండానే వెళ్ళిపోయారు.
ఎప్పుడైతే ఈ మండలి వచ్చిందో, ఆ సమయానికి శ్రీ బాలాసాహెబ్ భాటేగారు ఇంట్లో ఉన్నారు. “చావడికి వచ్చి కలవాల్సిందిగా" శ్రీ జోగ్లేకర్ గారి వద్దనుండి శ్రీ బాబాసాహెబ్ కు సందేశం వచ్చింది. బాబాసాహెబ్ ఆ సందేశాన్ని పట్టించుకోలేదు, అయినప్పటికీ నేను చెప్పడం వలన శ్రీ జోగ్లేకర్ స్వయంగా బాలాసాహెబ్ గారింటికి వచ్చారు. తరువాత మేమందరం చావడికి వెళ్ళాము. కర్టిస్ సాహెబ్ మరియు మెక్ లీన్ సాహెబ్ నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు జవాబులు ఎంత సమాధాన పూర్వకంగా జరిగాయంటే, వెళ్ళేటప్పుడు బాబాకు ఇవ్వడానికి ఇద్దరు సాహెబ్లు నాకు రూ. 5/- చొప్పున ఇచ్చారు. శ్రీ జోగ్లేకర్ గారు రూ. 2/- ఇచ్చారు. మొత్తం కలిపి రూ.12/- ఇచ్చారు. మొదట బాబా ఆ దక్షిణను తీసుకోవడానికి తిరస్కరించారు. కానీ తరువాత తీసుకొని, ఆ డబ్బులను సమీపంలో కూర్చొన్న ఒక పేదవానికి ఇచ్చేసారు. ఆ రోజు సాయంకాలమే నేను శ్రీ జోగ్లేకర్ గారికి పెద్ద ఉత్తరం వ్రాసాను. తరువాత నాకు కమీషనర్ సాహెబ్ యొక్క ఆఫీసులోని ఒక గుమస్తా నుండి తెలిసిన విషయం ఏమిటంటే ఆ ఉత్తరం శ్రీమతి కర్టిస్ కు ఎంతో నచ్చి, ఆ ఉత్తరాన్ని ఆమె దాచుకుంది అని! ఈ రోజు శ్రీమతి కర్టిస్ కు చూపించమని శ్రీ జోగ్లేకర్ కు ఇంకో ఉత్తరం వ్రాస్తున్నాను. ఆ ఉత్తరాన్ని శ్రీ బాలాసాహెబ్ భాటేకు చూపించాను. మొత్తానికి అంతా ఎంతో సమాధానపూర్వకంగా జరిగింది. ఇక్కడ ఏం లభిస్తుందో, దానిని ఎలా లభ్యం చేసుకోవాలో ఇప్పుడు ఆ సాహెబ్ కు మరియు ఆయన శ్రీమతికి అర్థమైంది. ఈరోజు ఉదయం ఇంకొక ఉత్తరాన్ని పంపించడానికి అనుమతి కోసమై నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు, బాబా నా శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి, నాకు విశేషమైన ఆశీర్వాదాన్ని ప్రసాదించారు.
పై ఉత్తరానికి సంబంధించి మాకు (సాయిలీల ప్రచురణ కర్తలకు) బాబాసాహెబ్ ద్వారానే క్రింది విధంగా ఇంకొన్ని వివరాలు తెలిసాయి:
ఈ సర్వమండలి ఏ చావడిలో అయితే బాబా నిద్రించేవారో ఆ చావడిలో బసచేసారు. వీళ్ళు వచ్చిన సమాయానికి బాబా ముఖం కడుక్కుంటున్నారు. ఆ తరువాత బాబా తమ రోజువారి కార్యక్రమం ప్రకారం భిక్షకు బయలుదేరారు. బాబా చావడి ముందుకు రాగానే, శ్రీమతి కర్టిస్ చావడి నుండి దిగి వచ్చి, గౌరవపూర్వకంగా బాబా వద్దకు వచ్చి, వారి సాంప్రదాయం ప్రకారం చేతులు జోడించి “మీతో మాట్లాడాలి” అని బాబాతో చెప్పింది. అప్పుడు బాబా “అర్థగంట ఆగు” అని చెప్పారు. భిక్ష పూర్తయ్యాక బాబా తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీమతి కర్టిస్ పైన చెప్పిన విధంగానే మరలా వచ్చి అడిగింది. “ఒక గంట ఆగు” అని బాబా చెప్పారు. అది బాబా అల్పాహారం తీసుకునే సమయం. కానీ వారి వద్ద సమయం ఎక్కువ లేకపోవడంతో బాబాను కలవకుండానే వారు ముందుకు కదలిపోయారు. పైన వివరించిన రూ.12/- లను బాబాసాహెబ్ ఎప్పుడైతే బాబా ముందర ఉంచారో, అప్పుడు బాబా "సాహెబ్ ఇచ్చిన దక్షిణ రూ. 30/- లు” అని అన్నారు. కానీ బాబాసాహెబ్ కు, కర్టిస్ సాహెబ్ నుండి వచ్చింది కేవలం రూ.10/-లు. దాంతో బాబా మాటలకు బాబాసాహెబ్ విస్మయానికి గురయ్యాడు. “బాబా మాటలు ఎన్నడూ వృథా కావు” అని తనకు కచ్చితంగా తెలుసు. చివరకు ఆ విషయం గురించి విచారణ చేయగా చావడిలో వారి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలిసింది. కర్టిస్ సాహెబ్ బాబాకు దక్షిణగా ఇవ్వడానికి మొదట కేవలం రెండు రూపాయలను మాత్రమే బయటకు తీసారు. అప్పుడు శ్రీమతి కర్టిస్ మీ “అధికార యోగ్యతను బట్టి మీరు కనీసం రూ.25/- లు ఇవ్వాలి” అని చెప్పారు. అలా చూసినప్పుడు కర్టిస్ సాహెబ్ది రూ.25/ -లు మరియు మెక్ నీల్ సాహెబ్ ది రూ. 5/-లు మొత్తం కలిసి రూ. 30/- లు. ఆ విధంగా సంభాషణ జరిగిందని బాబా తమదైన శైలిలో వివరించారు.
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
No comments:
Post a Comment