సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 96వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. తన మెడలోని పువ్వులను ప్రసాదించి పారాయణకు సమ్మతి తెలిపిన బాబా
  2. బాబా క్షణాల్లో దేవుని దర్శనం చేయించారు

తన మెడలోని పువ్వులను ప్రసాదించి పారాయణకు సమ్మతి తెలిపిన బాబా

ఓం సాయిరామ్! ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ప్రణామాలు. నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. 27.6.2019 గురువారం రోజు మా ఇంటి దగ్గర వున్న బాబా గుడిలో 9 గురువారాల సాయిసచ్చరిత్ర పారాయణ ప్రారంభించాను. ఆరోజు నేను, మా పాప సచ్చరిత్ర పుస్తకం తీసుకుని బాబా గుడికి బయలుదేరుతుంటే, మా అత్తయ్యగారు, "ఫ్రిజ్ లో  మల్లెపూలు వున్నాయి. నువ్వు, పాప పెట్టుకుని, నాకు కొంచెం వుంచండి" అన్నారు. అప్పుడు నేను అత్తయ్యగారితో, "ఈ పువ్వులను నేను బాబాకు సమర్పిస్తాను" అని చెప్పి, ఆ పూలను తీసుకువెళ్లి గుడిలో బాబాకి సమర్పించాను. నేను గుడిలో పారాయణ చేయడం అదే మొదటిసారి. నేను, “మీరే మీకు నచ్చిన విధంగా ఈ పారాయణను ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయించండి బాబా! నేను చేసే ఈ పారాయణ మీకు సమ్మతమయితే నాకు మీ లీల చూపించండి దేవా!” అని బాబాను ప్రార్థించి పారాయణ ప్రారంభించాను. నేను పారాయణ చేస్తుంటే మా పాప గుడిలోనే అటు ఇటు తిరుగుతూవుంది. అప్పుడు ఒకావిడ బాబాకి సమర్పించిన విరజాజి పూలదండని మా పాపకి ఇచ్చి, “మీ మమ్మీతో పెట్టించుకో!” అని చెప్పారు. ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు. మేము పువ్వులు పెట్టుకోలేదని తన మెడలోని పువ్వులను మాకు ప్రసాదించి నా పారాయణకు తమ సమ్మతిని తెలియజేశారు బాబా. "థాంక్యూ సో మచ్ బాబా!"

బాబా క్షణాల్లో దేవుని దర్శనం చేయించారు

నేను సాయిభక్తురాలిని. ఎప్పుడు ఏ గుడికి వెళ్లినా నేను అప్రయత్నంగానే బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటాను. ఒకసారి నేను, నా స్నేహితురాలు కలిసి దక్షిణ భారతదేశంలోని ఒక మందిరానికి వెళ్ళాము. అది ఏ మందిరమో నాకు సరిగ్గా గుర్తులేదు. మేము 14 కిలోమీటర్లు నడిచాక, దేవుణ్ణి దర్శించుకోవడానికి క్యూలైనులో నిలుచున్నాము. అప్పుడు సమయం సుమారు 9:00 అయింది. చాలా దూరం నడవటంవల్ల నేను ఎంతో అలసిపోయి వున్నాను. నా కాళ్లు కూడా బాగా వాచిపోయాయి. పదిగంటల సమయంలో నేను ఇక నిలుచోలేనని అనిపించి నా స్నేహితురాలితో, "నేనింక నిలబడలేను. నువ్వు దర్శనం చేసుకుని రా, నేను బయట కూర్చుంటాను" అని చెప్పి, నేను బయటికి వెళ్లి కూర్చున్నాను. అలా కూర్చుని ఉన్నప్పుడు, "నేను ఎంతోదూరంనుంచి వచ్చాను, కానీ చివరిక్షణంలో దర్శనం చేసుకోలేక పోతున్నాను. ఏదేమైనా అంతా మీ సంకల్పమే కదా!" అని బాబాతో చెప్పుకున్నాను. నేను బాగా అలిసిపోయి ఉండడంవల్ల ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియలేదు. సుమారు ఒంటిగంటకి ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, 'ఇక్కడ ఎందుకు కూర్చున్నార'ని హిందీలో అడిగారు. నా స్నేహితురాలు దర్శనం లైనులో ఉన్నదని, నాకు నిలబడే ఓపిక లేక ఇక్కడ కూర్చున్నానని చెప్పాను. అప్పుడాయన, "ఇక్కడిదాకా వచ్చి దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తారు? మందిరం మూసివేసే సమయమైంది, కాబట్టి మీరు వి.ఐ.పి. క్యూలో వెళ్లి దర్శనం చేసుకోండి" అని చెప్పి నన్ను వి.ఐ.పి. క్యూలోకి తీసుకెళ్లారు. మరికాసేపట్లోనే చక్కగా దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. బయటికి వచ్చి నా స్నేహితురాలికి ఫోన్ చేస్తే తనింకా క్యూలైనులోనే ఉన్నానని చెప్పింది. తను దర్శనం చేసుకుని బయటకు రావడానికి మరో పదిహేను నిమిషాలు పట్టింది. మన స్వచ్ఛమైన కోరికలు ఎప్పుడూ నెరవేరుతాయని నిరూపించే అద్భుతమైన లీల ఇది. అంతేకాక, అక్కడ ఎవరికీ తమిళం తప్ప వేరే భాష తెలియదు. కానీ, ఆ వ్యక్తి నాతో చక్కని హిందీలో మాట్లాడారు. అదే మా ఇద్దరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించింది. "థాంక్యూ బాబా!" 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo