సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 112వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • అనుకున్నది జరగకపోతే నిరాశపడకూడదనే పాఠాన్ని నేర్పి, ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా

సాయిభక్తుడు విఘ్నేష్ తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నేను పుట్టి పెరిగింది చెన్నై. ప్రస్తుతం కలకత్తాలో ఉంటున్నాను. నా తల్లిదండ్రులు, సిస్టర్ చెన్నైలోనే ఉన్నారు. నేను సాయిభక్తుడిని. సద్గురు సామ్రాట్ అయిన సాయినాథునికి నా హృదయపూర్వక నమస్కారములు. నాకు శ్రీ సాయిబాబా యందు అపారమైన నమ్మకం. నా జీవితంలో ప్రతిదీ ఆయన ఆశీస్సులతోనే జరుగుతుందని నా సంపూర్ణ విశ్వాసం. ఆయన తన చేతిలోని దారాన్ని లాగుతూ మనల్ని నడిపిస్తున్నారు. ఏ సమయంలోనైనా మనకు ఏది మంచిదో అది ఆయనే నిర్ణయిస్తారు. నా జీవితమే అందుకు చక్కటి ఉదాహరణ.

బాబా దయ, ఆశీర్వాదాలతో నేనొక ప్రముఖ బిజినెస్ స్కూల్లో చదువుతున్నాను. "నేనసలు ప్రవేశ పరీక్ష బాగా వ్రాసి, బిజినెస్ స్కూల్లో సీటు పొందగలనా?" అని అనుకునేవాడిని. అలాంటిది బాబా నాకు చాలా మంచి కాలేజీలో సీటు వచ్చేలా అనుగ్రహించారు. అలా ఆ సమయంలో నాకవసరమైన మంచి బహుమానాన్నిచ్చారు. 

ఇటీవల ఒక నెల ఆరంభంలో మా బ్యాచ్‌కి కాలేజీ ప్లేస్‌మెంట్స్ మొదలయ్యాయి. చాలా గొప్ప గొప్ప కంపెనీలు వస్తుండటంతో అందరూ ఇంటర్వ్యూ కోసం చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి సమయంలో నేను అనుకోకుండా అనారోగ్యం పాలై మంచం పట్టాను. ఆ కారణంతో నేను సరిగా ప్రిపేర్ కాలేకపోయాను. కానీ బాబా నన్ను నిరాశపరచరని, ఖచ్చితంగా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహిస్తారని నాకు ఆయనపట్ల పూర్ణ విశ్వాసం. మొదటిరోజు వచ్చిన మొదటి కంపెనీలోనే నాకు ఉద్యోగం రావాలని నేను ఆశించాను. నేను, "బాబా! నాకీ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చూడండి" అని ప్రార్థించి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అయితే గ్రూప్ డిస్కషన్‌లో నేను సరైన నైపుణ్యం చూపలేకపోయాను. నాకు బాధగా అనిపించినా బాబా నా మంచికోసమే అలా చేశారని అనుకున్నాను. ఆరోజు సాయంత్రం వేరే కంపెనీలోనైనా నేను ఎంపిక కావాలన్న లక్ష్యంతో ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ ఈసారి కూడా నేను గ్రూప్ డిస్కషన్‌లో విఫలమయ్యాను. ఏం జరుగుతుందో అర్థంకాక, "బాబా! నన్ను అనుగ్రహించండ"ని ప్రార్థించాను. అప్పటికే అలసిపోయి ఉన్నప్పటికీ అదేరోజు అర్థరాత్రి వేరే కంపెనీవాళ్ళు నిర్వహించిన టెస్టుకి కూడా హాజరయ్యాను. పరీక్ష కాస్త కష్టంగానే ఉంది. నేను పూర్తిగా బాబాపై ఆధారపడ్డాను.

మరుసటిరోజు ఉదయం వేరే కంపెనీ గ్రూప్ డిస్కషన్ సమర్థవంతంగా పూర్తిచేయగలిగాను. దాంతో ఈసారి నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. ఇక నేను నిరాశకు లోనై సాయిబాబా నాకు సహాయం చేయట్లేదని ఆయనను నిందించడం మొదలుపెట్టాను. "నేను ఎవరికి ఏ హాని చేశాను, నన్నిలా ఎందుకు శిక్షిస్తున్నారు?" అని బాబాను అడిగాను. తర్వాత ఒక కంపెనీ వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. తర్వాత ఆరోజు సాయంత్రం వేరే కంపెనీ ఇంటర్వ్యూకి ప్రయాణమయ్యాను. అక్కడ కూడా నేను సమర్థవంతంగా నా ప్రతిభ చూపలేకపోయాను. నన్ను బాబా శిక్షిస్తున్నారని చాలా భయపడిపోయాను. అదే సమయంలో ముందురోజు రాత్రి నేను టెస్ట్ రాసిన కంపెనీ నుండి 'నేను తర్వాత రౌండుకి ఎంపిక చేయబడినట్టు' మెయిల్ వచ్చింది. వాళ్ళు మొదట 25 మందిని ఎంపిక చేయాలనుకున్నారు కానీ, చివరి నిమిషంలో 30 మంది వరకు తీసుకున్నారు. ఆ జాబితాలో నేనే చివరివాడిని. మెయిల్ చూశాక నాకు కొంత ఆశ కలిగింది. కానీ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నందున ప్రిపరేషన్ మొదలుపెట్టకుండా నిద్రపోయాను.

మరుసటిరోజు వేకువఝామున లేచి స్నానం చేసి కంపెనీకి బయలుదేరాను. మార్గంలో అంతా సాయిబాబా భజనలు వింటూ ప్రయాణం కొనసాగించాను. అక్కడ ఇంటర్వ్యూ కోసం చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చాలామంది మొదటి రౌండు పూర్తయి రెండవ రౌండుకు వెళ్తున్నా, నాకు మాత్రం చాలాసేపటివరకు మొదటి రౌండు అవకాశమే రాలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూలో చాలా కఠినమైన టెక్నికల్ ప్రశ్నలు అడుగుతున్నారని అంటుంటే విన్నాను.  కానీ నేనేమీ కంగారుపడకుండా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్లేముందు సచ్చరిత్ర చదువుకుంటూ ఉండే నా అలవాటు ప్రకారం సచ్చరిత్ర చదువుతూ కూర్చున్నాను. బాబా నాకేది మంచిదో అది చేస్తారనేది నా నమ్మకం. అలా చాలా సమయం వేచి ఉన్నాక నన్ను పిలిచారు. నేను బాబాను ప్రార్థించుకుని ఇంటర్వ్యూ గది లోపలికి వెళ్ళాను. ఆశ్చర్యంగా నన్ను అన్నీ చాలా తేలికైన ప్రశ్నలు అడిగారు. నేనిచ్చిన సమాధానాలతో వాళ్ళు ఎంతగానో సంతృప్తి చెందారు. అంతా సజావుగా సాగి నేను బయటకు వచ్చి కూర్చున్నాక మళ్లీ రెండో రౌండు ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ రౌండులో కూడా నాకు అన్నీ తెలిసిన ప్రశ్నలు అడిగారు. నా సమాధానాలతో వాళ్ళు చాలా సంతోషించారు. తర్వాత నేను బయటకు వచ్చి కూర్చుని సచ్చరిత్ర చదవడం కొనసాగించాను. కొంతసేపటికి నన్ను పిలిచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఉద్యోగం ఆఫర్ చేశారు. నేను పట్టలేని ఆనందంతో పరుగున వెళ్లి సచ్చరిత్ర పుస్తకాన్ని గుండెలకు హత్తుకున్నాను. కళ్ళనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేకపోయాను. నేను వెళ్లిన ప్రతి కంపెనీలో ఉద్యోగమిమ్మని బాబాని ప్రార్థించాను. అన్నింట్లోకి ఏది అత్యుత్తమమైన కంపెనీయో అందులో బాబా నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించారు. టెస్టులో ఎంపిక కాబడినవాళ్ల జాబితాలో నేనే చివరివాడిని, ఉద్యోగాన్ని పొందినవాళ్ళలో మొదటి వ్యక్తినయ్యాను. అదీ బాబా చేసే అద్భుతమంటే! ఆయనే నన్ను అన్నీ తేలికైన ప్రశ్నలు అడిగేలా చేసి, నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు. సంతోషంతో మా వాళ్లకు ఫోన్ చేసి సాయి చేసిన లీల గురించి చెప్పాను. వాళ్ళు కూడా సంతోషించారు.

బాబా నాకోసం ఉత్తమమైన ఏర్పాట్లు చేస్తుంటే, నేను మాత్రం వేరే కంపెనీలలో ఎంపిక కాలేకపోయానని అజ్ఞానంతో ఆయనను నిందించాను. అందుకు బాబాకు మనసారా క్షమాపణలు చెప్పుకున్నాను. అంతేకాదు, ఎప్పుడైనా మనం అనుకున్నట్లు జరగకపోతే నిరాశపడకూడదనే పాఠం నేర్చుకున్నాను. బాబాకు తెలుసు, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో! ఆయనెప్పుడూ మనకి శ్రేయస్కరమైనదే చేస్తారు. శ్రద్ధ, సబూరీ మాత్రం కలిగి ఉండి ఆత్మస్వరూపుడైన సాయికి మన జీవితాన్ని అప్పగిస్తే, ఆయన మన కర్మలను తొలగించి మనకు ఉత్తమమైనదేదో అదే ఇస్తారు. ఏ సమయంలోనైనా ఆయనే మనకు గొప్ప మార్గదర్శకుడు.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2382.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo