సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 53వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 53వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 99

శ్రీరామనవమి ఉత్సవం కోసం శిరిడీ వచ్చిన భక్తిమండలిలో దాసగణు మహారాజ్ పరివారంలో ముర్వేడ్ నివాసి బాబా రామచంద్ర పత్తేవార్ పత్నీ (సౌ౹౹కృష్ణాబాయీ) సహితంగా ఉన్నారు. నిత్యం శిరిడీ వచ్చే భక్తులలో శ్రీ పత్తేవార్ కూడా ఒకరు. ఉత్సవ సమాప్తి కాగానే బాబా పత్తేవార్, సౌ౹౹కృష్ణాబాయీ మరియు దాముఅణ్ణా (దాసగణు మహారాజ్ గారి శిష్యులు) ముగ్గురు కలిసి శిరిడీ నుండి బొంబాయికి బయలుదేరారు. తెల్లవారుఝామున మూడు గంటలకు మన్మాడ్‌లో పాసింజర్ రైలులో కూర్చొన్నారు. ఆ రైలు మరుసటిరోజు 11 గంటలకు ఠాణే స్టేషన్‌కు చేరింది. తీవ్రమైన ఎండ మూలంగా సౌ౹౹కృష్ణాబాయికి విపరీతంగా దాహం వేసింది. ఠాణాలో బండి కొంచెంసేపు ఆగుతుందనే ఉద్దేశ్యంతో కుళాయి వద్ద నీరు త్రాగుదామని చెంబు తీసుకొని క్రిందకు దిగింది. వీరందరు వెనుకవైపున ఉన్న డబ్బాలో కూర్చొన్నారు. కుళాయేమో ముందరవైపు ఇంజన్ దగ్గర ఉంది. అందువలన ఆమె కుళాయి వద్దకు వెళ్ళింది. కుళాయి వద్ద విపరీతమైన రద్దీ ఉండటం వలన ఆమె అలాగే నిలబడి రావాల్సి వచ్చింది. చాలాసేపైంది, కాని కృష్ణాబాయీ తిరిగి రాలేదనే ఉద్దేశ్యంతో బాబా పత్తేవార్ కూడా క్రిందకు దిగి కుళాయి వద్దకు వెళ్ళారు. బండి బయలుదేరే సమయమైనా భార్యాభర్తలిద్దరూ  తిరిగి రాలేదనే ఉద్దేశ్యంతో దాముఅణ్ణా కూడా క్రిందకు దిగి కుళాయి వద్దకు వెళ్ళసాగాడు. తాను కుళాయి వద్దకు చేరే పూర్వమే బండి కదలడానికి ఈల వేసారు. అందువలన దాముఅణ్ణా వారితో త్వరగా ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాలో ఎక్కమని గట్టిగా అరచి చెప్పి తాను ఒక డబ్బాలోకి ఎక్కాడు. బండి బయలుదేరింది. కదులుతున్న బండిలోనే బాబా పత్తేవార్ ఎక్కారు. తరువాత డబ్బాలో సౌ౹౹కృష్ణాబాయీ ఎక్కసాగారు. కానీ చేతిలో చెంబు ఉండటం వలన మరియు బండి వేగం పుంజుకోవడం వలన బండి ఎక్కే ప్రయత్నంలో కాలు జారి రైలుకి మరియు ఫ్లాట్‌ఫామ్‌కి మధ్యలో పడిపోయింది. భార్యాభర్తలిద్దరూ బండిలోకి ఎక్కారా? లేదా? అని ఒక ప్రక్క నుండి దాముఅణ్ణా చూస్తున్నాడు. ఇంకొక ప్రక్కన తన భార్య బండిలోకి ఎక్కిందా? లేదా? అని బాబా పత్తేవార్ చూస్తున్నాడు. ఇద్దరూ ఆమె క్రింద పడటం చూసి కదులుతున్న బండిలోనుండి ఫ్లాట్‌ఫామ్ మీదకు దూకారు. “బాయీ(స్త్రీ) పడిపోయింది" అని అందరూ అరవసాగారు. బండి ఆపడానికి ఎర్రజెండా చూపించారు. బాబా పత్తేవార్, దాముఅణ్ణాల నోరు భయంతో తడారిపోయింది. ఛిద్రమైన ఆమె శరీరం చూడాల్సి వస్తుందేమోనని వారికి భయం వేసింది. బండి ఆగింది. అందరూ బండి క్రింద చూడసాగారు. ఇంతలో ఫ్లాట్‌ఫామ్ మరియు డబ్బా మధ్యభాగంలో కృష్ణాబాయీ నిలబడి ఉండటం కనిపించింది. దాముఅణ్ణా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పైకి లాగటానికి చేయి అందించాడు. సహజంగానే అందరూ గుమిగూడారు. “ఏమయినా దెబ్బ తగిలిందా? ఎక్కడ తగిలింది?” అని ప్రశ్నలు వేయసాగారు. కృష్ణాబాయి మాత్రం నిబ్బరంగా కనిపించింది. “నాకు ఏం కాలేదు, అందరూ బండిలో కూర్చోండి” అని చెప్పింది. అందరూ బండిలో కూర్చొన్నాక కృష్ణాబాయీ ఈ విధంగా చెప్పసాగింది. కాలు జారి క్రింద పడితే తరువాత ఏం జరుగుతుందో తెలుసు, కనుక వెంటనే సహజంగానే శ్రీసాయిబాబాను స్మరించుకుంది. వెంటనే శ్రీసాయిమహారాజ్ అక్కడ ప్రకటమై తనను ఫ్లాట్‌ఫామ్ క్రింద ఖాళీ భాగంలోకి నెట్టారు. అంతేకాదు, బాబా తన దగ్గరే ఉన్నారు. 5 లేక 6 డబ్బాలు తనను దాటి వెళ్ళిన తరువాత బండి ఆగిపోయింది. బాబాను ప్రత్యక్షంగా చూడడంతో ఆమె యొక్క భయం తొలగిపోయింది. బండి ఆగగానే ఆమె లేచి ఫ్లాట్‌ఫామ్ పైకి వచ్చేవరకు తనకు బాబా ప్రత్యక్షంగా ప్రక్కనే కనపడుతున్నారు. సౌ౹౹కృష్ణాబాయికి మోచేతి దగ్గర కొంచెం గీసుకుపోయింది. అది తప్పితే తనకు ఏ దెబ్బ తగలలేదు. మహారాజ్ ప్రస్తుతం దేహధారిగా లేనప్పటికీ వారి భక్తుల పట్ల వారికి అపారమైన శ్రద్ధ ఉంటుంది. కష్టకాలంలో భక్తుల కోసం ప్రకటమై వారిని ఎలా రక్షిస్తారనే దానికి ఈ లీల ఒక ఉత్కృష్టమైన ఉదాహరణ. బాబాపై సంపూర్ణ శ్రద్ధ కలిగి ఉన్నట్లైతే ఏ భక్తునికైనా పై అనుభవం లభించవచ్చు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

3 comments:

  1. Wow that was unusual. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didn't
    appear. Grrrr... well I'm not writing all that
    over again. Regardless, just wanted to say fantastic blog!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo