కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 52వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 98
డాక్టర్ డి.ఎన్. గుణే (స్టేట్ సర్జన్, పన్నా స్టేట్)గారు కొంతమంది రోగులకు ఎన్ని ఔషధాలు ఇచ్చినా నయం కాకపోవడంతో శ్రీ సమర్థ సాయినాథుని ఊదీ ఇచ్చి చూసారు. అందువలన ఆయా రోగులకు గుణం కనపడిన లీలలను మా వద్దకు పంపించారు.
1. ఒక 16 సంవత్సరాల అమ్మాయికి 10 - 12 రోజుల పాటు రోజు రక్తపు వాంతులు కాసాగాయి. అన్ని రకాలైన ఉపచారాలు ప్రయత్నించి చూసారు. సివిల్ సర్జన్ అమ్మాయిని నిశితంగా పరిశీలించి ఔషధాలు ఇచ్చారు. కానీ ఏ విధమైన గుణం కనిపించలేదు. అప్పుడు డాక్టర్ ఆ అమ్మాయికి ఊదీ ఇచ్చారు. ఆ అమ్మాయి ఎంతో భక్తితో నుదిటిపై పెట్టుకుని, కొంచెం ఊదీని నోట్లో వేసుకుంది. మరుసటిరోజు నుండి ఆ అమ్మాయికి ఆరోగ్యం కుదుటపడసాగింది. 2-3 రోజులలోనే ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుంది.
2. ముసల్మాన్ గృహస్థు కుమారునికి విపరీతంగా విరోచనాలు కాసాగాయి. డాక్టర్ ఆ పిల్లవానికి ఎన్నో ఔషధాలు వాడి చూసాడు. కానీ గుణం కనపడలేదు. డాక్టర్ ఆ ముసల్మాన్ గృహస్థుకు శ్రీ సాయిమహారాజ్ గురించి చెప్పి బాబా ఊదీని ఇచ్చాడు. ఆ ముసల్మాను ఎంతో భక్తితో ఆ పిల్లవాని నుదిటిపై ఊదీని పెట్టాడు. ఆ తరువాత విరోచనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి.
3. ఒక 14సంవత్సరాల వయస్సున్న పిల్లవానికి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వచ్చింది. దానివలన ఆ పిల్లవానికి ఎంతో కష్టంగా ఉండేది. ఇంట్లో వాళ్ళందరూ నిరాశ చెంది ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. డాక్టరు యొక్క ఉపచారం కొనసాగుతోంది. కానీ నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. ఆ పిల్లవాని తండ్రి భక్తిగా డాక్టర్ వద్ద నుండి ఊదీ తీసుకొని, ఇంటికి వెళ్ళి పిల్లవానికి పెట్టారు. మరుసటిరోజు నుంచి ఆ పిల్లవాని ఆరోగ్యం కుదుట పడసాగింది. ఒక వారంలోనే కేవలం ఊదీ ఉపచారంతోనే ఆ పిల్లవాడు పూర్తిగా స్వస్థుడయ్యాడు.
4. డాక్టర్ గుణే లేదా తన కుటుంబసభ్యులు ఎవరూ శిరిడీకి రాలేదు. డాక్టర్ గుణే నాసిక్ లోని బ్రహ్మీభూత్ గోపాల్ దాస్ మహారాజ్ గారిని గురువుగా కొలిచేవారు. శ్రీ సమర్థ సాయిమహారాజ్ గురించి డాక్టర్ కు వారి మామగారి నుండి తెలిసింది. డాక్టర్ కు శ్రీ సాయిపై శ్రద్ద కుదిరి, వారి ఇంట్లో బాబా ఫోటోను పెట్టుకున్నారు. సత్పురుషుల విషయంలో ఒకరి నుండి ఒకరికి ఎలా గుప్త సందేశం వెళుతుందనేదానికి గోపాల్ దాస్ కు సంబంధించి ఒక ఉదాహరణ. డాక్టర్ గుణే వారి మామగారిని చూడడానికి వచ్చారు. డాక్టర్ గారి మామగారు ఒకసారి శిరిడీకి వెళ్ళేటప్పుడు దారిలో ఏదో పని నిమిత్తం నాసిక్లో దిగాల్సి వచ్చింది. వారికి డాక్టర్ రూ. 5/- ఇచ్చి నాసిక్లో గోపాల్ దాస్ మహారాజ్ కు దక్షిణగా ఇమ్మని చెప్పారు. ఆ విధంగానే నాసిక్ వెళ్ళిన తరువాత డాక్టర్ గారి మామగారు ఆ రూ. 5/- రూపాయలను తీసుకొని పంచవటిలోని దేవాలయంలో శ్రీ గోపాల్ దాస్ మహారాజ్ వద్దకు సాయంకాలం 5 గంటలకు వెళ్ళారు. సాయంత్రం 6 గంటలకు శిరిడీ వెళ్ళడానికి అక్కడ నుండి బయలుదేరాల్సి ఉంది. దేవాలయానికి వెళ్ళి చూడగా గోపాల్ దాస్ మహారాజ్ వరండా మధ్య భాగంలో కూర్చొనియుండి ఆయనకు రెండువైపులా చాలాదూరం వరకు గొసావి బైరాగులు పంక్తి భోజనానికి కూర్చొని ఉన్నారు. మహారాజ్ ముందు ఒక పెద్ద పొయ్యి ఉండి, దానిపై ఒక పెద్ద బాణలిలో ఏదో పదార్థం ఉంది. ఆ పదార్థాన్ని మహారాజ్ భోజనానికి కూర్చొన్న వారికి వడ్డిస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియను చూడటానికి జనాలందరూ భారీ ఎత్తున గుమిగూడారు. డాక్టరు గారి మామగారు ఇదంతా చూసి మహారాజ్ దగ్గరకు వెళ్ళడం మరియు ఆయనకు రూ. 5/- లు ఇచ్చే విషయానికి సంబంధించి నిరాశ కలిగింది. ఆయనకు 6 గంటలకు శిరిడీ వెళ్ళడానికి బయలుదేరాల్సి ఉంది. అప్పుడు ఆయనకు ఇంకా వేచిఉండటంలో అర్థం లేదనిపించి డబ్బులు ఇవ్వకుండానే తిరుగు ప్రయాణం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో గోపాల్ దాస్ మహారాజ్ దూరం నుంచే చేయి ఊపి డాక్టర్ మామగారిని పిలిచారు. స్వయంగా శ్రీ మహారాజే పిలవడంతో భక్తులందరూ వెంటనే దారినిచ్చారు. ఆయన మహారాజ్ వద్దకు వెళ్ళగానే, మహారాజ్ చేయి ముందుకు చాపి “ఇవ్వు” అని అన్నారు. వెంటనే డాక్టరు మామగారు డబ్బులను మహారాజ్ చేతిలో పెట్టారు. “ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అంటూ లెక్కపెట్టి” అందాయి అంటూ ముందరనున్న బాణలిలో నుండి పిడికిలి నిండా శిరాను ప్రసాదంగా ఇచ్చి “తొందరగా వెళ్ళు, లేదంటే బండి వెళ్ళిపోతుంది” అని చెప్పారు. ఇదంతా ఐదు నిముషాలలోనే జరిగిపోయి డాక్టర్ మామగారు బయటపడ్డారు. అనుకున్న ప్రకారమే శిరిడీ చేరుకున్నారు. శిరిడీలో శ్రీసాయిసమర్థులు పై సంఘటనకు సంబంధించి ముచ్చటించి, “సర్వం తమకు ఎరుకే” అనే నిదర్శనం ఇచ్చారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
Hi there! This is my 1st comment here so I just wanted to give a quick
ReplyDeleteshout out and say I truly enjoy reading your posts.
Can you suggest any other blogs/websites/forums that deal with the
same subjects? Thanks for your time!
🙏🙏Om Sairam 🙏🙏
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDelete