కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 65వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 124
ఆళందికి చెందిన శ్రీపద్మనాభేంద్రస్వామి గారి ఉత్తరంలోని సారాంశము.
శ్రీమంత్ హరిసీతారాం దీక్షిత్ గారికి శ్రీ పద్మనాభేంద్ర స్వామి ఆశీర్వదించి వ్రాయునది. బాబా కృప వలన ఇక్కడ అంతా సంతోషం. మీ కబురు తీసుకొని శిరిడీ నుండి జనవరి 29వ తారీఖు గురువారం బయలుదేరి ఆళందికి వచ్చాను. ఫిబ్రవరి రెండవ తారీఖు శ్రీ గురు మహారాజ్ యొక్క పుణ్యతిథి ఉత్సవాన్ని చూసుకొని, మరుసటి రోజు మంగళవారం ముంబాయికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ అండర్ వుడ్ కు చెవివెనుక భాగంలోనున్న వాపుని చూపించాను. ఆపరేషన్ అవసరం లేదని ఆయన చెప్పారు. ఒకరకమైన ద్రవాన్ని (సీరం) ఆయన పిచికారి చేసి, దీంతో తగ్గుతుంది అని చెప్పారు. శ్రీ సాయిమహారాజ్ యొక్క తేజస్సు మరియు వాణి యొక్క విలక్షణ ప్రభావం నా మనసుపై ఎంతగా ఉందంటే వ్రాయడానికి నాకు చేతకావడం లేదు. నేను కేవలం బాబా దర్శనానికై వచ్చాను. బాబా దర్శనం చేసుకొని అత్యంత సమాధానుడనయ్యాను. నా యొక్క అనారోగ్యాన్ని గురించి బాబాకు తెలియ చేయమని అక్కడ నాకు చాల మంది చెప్పారు. కానీ నా అంతఃకరణం అలా చేయడానికి అంగీకరించలేదు. కారణం పారబ్ధ కర్మణా భోగాదేవ్ క్షయః "(ప్రారబ్ద కర్మను అనుభవించి క్షయం చేసుకోవాలి)" అనేది శ్రుతి వాక్యం. కానీ చివరకు బాబాకు నా అనారోగ్యం గురించి చెప్పమని మాధవరావ్ దేశ్ పాండేకు చెప్పాను. ఆ విధంగానే మాధవరావు దేశ్ పాండే బాబా వద్ద నా అనారోగ్య విషయం ముచ్చటించగానే “అల్లా అచ్చా కరేగా” అని బాబా అన్నారు. ఆ విధంగా బాబా ముఖతః అటువంటి ప్రేమోద్గారం వెలువడినప్పటినుండి నా వ్యధ ఆగిపోయింది. నాగపూర్ డాక్టర్ మరియు ఆళంది డాక్టరు ఆపరేషన్ చేయవలసిందేనని చెప్పారు. కానీ ముంబాయి డాక్టరు ఆపరేషన్ చేయకుండా సీరమ్ పిచ్ కారీ చేసారు. దాంతో వాపు పూర్తిగా తగ్గిపోయి, వేదనంతా తగ్గిపోయింది. జరిగినదంతా తలుచుకుంటే మరలా, మరలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటిరోజు దర్శనం చేసుకున్నప్పుడు బాబా నా వద్ద నుండి దక్షిణ అడిగారు. అప్పుడు నేను “బాబా, నేను సన్యాసిని. నా వద్ద డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి” అని అన్నాను. నేను దర్శనం చేసుకొని వచ్చిన తరువాత బాబా మాధవరావుతో “తాను నాకు ఏమయినా ఇస్తాడా? అని చూసాను. కానీ తాను ఏమీ ఇవ్వలేదు. తాను నా వద్దకు వచ్చాడు. కాబట్టి నేనే తనకు ఇవ్వాలి” అని అన్నారు. ఆ విధంగా బాబా ముఖతః ఆ మాటలు వెలువడగానే నేను కష్టం నుండి విముక్తుడనయ్యాను. అటువంటి మహాత్ముల గురించి నేను ఏమని వర్ణించగలను. ఆయన మానవరూపంలోనున్న సాక్షాత్తు విష్ణుమూర్తి!
శ్రీ పద్మనాభేంద్ర స్వామి.
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete