సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 109వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా ఊదీతో జలుబు, గొంతునొప్పి మటుమాయం
  2. బాబా మహిమ - ఆస్తమా నుండి చాలావరకు ఉపశమనం

బాబా ఊదీతో జలుబు, గొంతునొప్పి మటుమాయం

వై.శ్రీనివాసరావు గారు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ద్వారా సాయి తండ్రి యొక్క అమోఘమైన లీలలు ఎన్నో తెలుసుకుంటున్నాము. సదా శ్రీ సాయినాథుడు అందరికీ అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.                   

జులై 8వ తారీఖున బాబా ఊదీ వలన జరిగిన అద్భుతాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఆరోజు నాకు ఉన్నట్టుండి జలుబు చేసింది. జలుబుతో పాటు విపరీతమైన గొంతునొప్పితో చాలా బాధపడ్డాను. మా ఇంట్లోవాళ్ళు మందులు వేసుకోమని సలహా ఇచ్చారు. కానీ, నేను నా సాయినాథుడినే నమ్ముకొని, బాబా ఊదీని నోట్లో వేసుకొని, “తండ్రీ! నాకు వెంటనే గొంతునొప్పి, జలుబు తగ్గించండి” అని బాబాను మనసారా వేడుకున్నాను. అద్భుతం! తెల్లవారేసరికల్లా నా గొంతునొప్పి, జలుబు తగ్గిపోయాయి. ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తండ్రి లీలలు ఏమని వర్ణించగలము!? ఆ తండ్రిని నమ్ముకున్నవారెవరూ ఎప్పుడూ బాధపడరు. అహర్నిశలూ మనలను కంటికి రెప్పలా రక్షిస్తూ ఉంటాడు. "బాబా! ఎప్పటికీ మిమ్మల్నే నమ్ముకుని వుంటాము. నా పెద్ద కుమారునికి త్వరగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా!" 

బాబా మహిమ - ఆస్తమా నుండి చాలావరకు ఉపశమనం

విశాఖపట్నం నుండి శ్రీ లక్ష్మీనారాయణగారు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నా పేరు లక్ష్మీనారాయణ. సాయిభక్తులకు, ‘సాయిమహారాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. భక్తులు వ్రాస్తున్న అనుభవాలు చదువుతుంటే బాబా చూపుతున్న ప్రేమకు ఒళ్ళు పులకరిస్తున్నది. ఇంతకుముందు, కలలో బాబా నాకు ఊదీ ప్రసాదించి మా అమ్మాయి పెళ్లి చేసిన అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మీ ముందుకు వస్తున్నాను.

ఇది ఇంచుమించు 22 సంవత్సరాల క్రితం నాటి సంఘటన. నేను విశాఖపట్నం జిల్లా కోటవురట్ల గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ సహాయకునిగా పనిచేస్తున్న రోజులవి. మా ఇంట్లో అందరూ బాబా భక్తులే. నాకు ఊహ వచ్చినప్పటినుండి నాకు ఆస్తమా వ్యాధి ఉంది. కనీసం పది అడుగులు నడిచినా ఆయాసం వచ్చేది. మా కళాశాలలోనే కామేశ్వరరావు అనే ఉపన్యాసకులు ఉండేవారు. ఆయన కూడా బాబా భక్తుడే. ఆయన ఒకసారి, “మీరు బాబా భక్తులు కదా! నేను శిరిడీ వెళుతున్నాను, మీరు కూడా వస్తారా?” అని అడిగారు. నేను బాబా భక్తుడినే కానీ శిరిడీ వెళ్లాలనే కోరిక నాకు ఏనాడూ లేదు. అప్పట్లో మా జీతాలు కూడా అంతంత మాత్రమే. పైగా ఆస్తమా ఒకటి. అందువల్ల నేను శిరిడీకి రాలేనని ఆయనతో నిష్కర్షగా చెప్పేశాను. అందుకాయన, “రాను పోను టికెట్స్ తీస్తాను. మీ దగ్గర డబ్బులు వున్నప్పుడు ఇవ్వండి” అన్నారు. “టికెట్స్ మీరు పెట్టినా మిగతా దారిఖర్చులకు కూడా నా దగ్గర డబ్బులు లేవు” అన్నాను. వెంటనే మాతో పనిచేస్తున్న రికార్డ్ సహాయకురాలు సత్యవతిగారు, “ఖర్చుకు నేను డబ్బులు సర్దుబాటు చేస్తాను, తర్వాత వీలు చూసుకొని ఇవ్వండి” అని చెప్పి, వెంటనే 1500 రూపాయలు ఇచ్చారు. బాబా అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతోందని అనిపించి వాళ్ళతో శిరిడీ వెళ్ళడానికి అంగీకరించాను. ఆ తరువాత నేను, కామేశ్వరరావుగారు, నాతో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న మంత్రిప్రగడ శ్రీనివాసుగారు (బాబా దయవల్ల ఈయన ఇప్పుడు ఒక పెద్ద గెజిటెడ్ ఆఫీసర్) ముగ్గురం కలిసి శిరిడీ తెలిసిన ఒక గైడుని కూడా మాతోపాటు తీసుకుని మొదటిసారిగా శిరిడీ ప్రయాణమయ్యాం. 

అప్పట్లో శిరిడీలో అంతగా జనం ఉండేవారు కాదు. మేము వెంటవెంటనే మూడుసార్లు సమాధిమందిరానికి వెళ్ళి బాబాని తృప్తిగా దర్శించుకున్నాము. ఆ తరువాత కామేశ్వరరావుగారు, శ్రీనివాసుగారు మరలా బాబా దర్శనానికి వెళ్లారు. కానీ, నాకు, మాతో వచ్చిన గైడుకు ఓపికలేక అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర ఒక చెట్టుక్రిందవున్న చప్టామీద కూర్చుని సేదతీరుతున్నాము. మా ప్రక్కనే సుమారు 85 ఏండ్ల వయసున్న ఒక వ్యక్తి కూర్చున్నారు. ఆయన తెల్లని గెడ్డంతో, తెల్లటి మహారాష్ట్ర సంప్రదాయ దుస్తులు ధరించి వున్నారు. ఆయన చూపు ఎంతో ప్రసన్నంగా వుంది. మా గైడ్ నాతో, “బాబా మహాసమాధి చెందేనాటికి ఆయన వయస్సు 6 సంవత్సరాలు. ఆయన ఎవ్వరితోనూ మాట్లాడరు. ఏమైనా ఇస్తే మౌనంగా తీసుకుంటారు” అని చెప్పాడు. ఆ తరువాత మా గైడ్ ఆయనకు నన్ను పరిచయం చేసి, “ఈయనకు ఆస్తమా వుంది, దయచేసి ఏదైనా మందు ఇవ్వoడి” అని అడిగాడు. ఆయన జేబులోంచి ఒక చిన్న సీసా తీసి నాకు ఇచ్చారు. అందుల్ రోజ్ వాటర్ లాంటిది ఉంది. మా గైడ్ నాతో, జేబులో చేయి పెట్టి చేతికి ఎంత డబ్బు వస్తే అంత ఆయనకు ఇమ్మన్నాడు. నా జేబులో చెయ్యిపెడితే 20 రూపాయల నోటు వచ్చింది. అది ఆయనకి ఇచ్చి పాదాభివందనం చేశాను. ఆయనతో కలిసి ఫోటో కూడా తీసుకున్నాను. ఆ ఫోటో ఈనాటికీ నా దగ్గర భద్రంగా ఉంది. మా ఆఫీసువాళ్ళు బాబా దర్శనం చేసుకొని వచ్చాక ఈ విషయం చెప్పి, వాళ్ళకి సీసాలోని ద్రవం కొద్దిగా ఇచ్చి, కొద్దిగా అక్కడున్న భక్తులకి కూడా ఇచ్చి, మిగిలింది నా గొంతులో పోసుకొని సీసాను పారేశాను. 

ఆ తరువాత శిరిడీ చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని, మా ఊరికి క్షేమంగా చేరుకుని, శిరిడీ వెళ్ళడానికి నాకు అప్పు ఇచ్చిన వాళ్లందరికీ అప్పు తీర్చేశాను. 

బాబా ఏం మాయ చేశారో గానీ, అప్పటినుండి నా ఆస్తమా క్రమేపీ తగ్గడం ప్రారంభించింది. వ్యాధి పూర్తిగా తగ్గకపోయినా దాని తీవ్రత మాత్రం మునుపటిలా లేదు. ఇంతకుముందు రోజుకి 2 మాత్రలు వేసుకునేవాడిని, కానీ ఇప్పుడు 6 నెలలకు ఒక మాత్ర వేసుకుంటున్నాను. పట్టుమని పది అడుగులు కూడా నడవలేని వాడిని, ఇప్పుడు రోజుకి సునాయాసంగా పది కిలోమీటర్లు నడుస్తున్నాను. ఇదంతా బాబా మహిమే! బాబాకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఈ అనుభవం మీతో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు! 
సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo