సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 102వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఆపద్బాంధవుడు శ్రీసాయి.
  2. నమ్మకమే లేని వారి జీవితాలను కాపాడారు బాబా

ఆపద్బాంధవుడు శ్రీసాయి.

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు జయలక్ష్మి తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

జై సాయిరామ్! నేను న్యూజెర్సీలో నివాసముంటున్న సాయిభక్తురాలిని. సర్వశక్తిమంతుడైన బాబా ద్వారా నేనెన్నో ఆశీర్వాదాలను, ఆధ్యాత్మిక అనుభవాలను చవిచూశాను. నా జీవితంలో ఇటీవల జరిగిన ఒక అనుభవం గురించి నేనిప్పుడు వివరించాలనుకుంటున్నాను.

మేము దాదాపు 10 సంవత్సరాలనుండి న్యూజెర్సీలో నివసిస్తున్నాము. ఈ కాలంలో నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నా వలన ఒక్క ప్రమాదం కూడా జరగకుండా విజయవంతంగా నా కారుని నడిపాను. అయితే, విధివ్రాత వలన నేను అజీర్తి సమస్యలు, అలెర్జీలు, దద్దుర్లు, మరికొన్ని ఇతర అంతర్గత రుగ్మతలతో బాధపడ్డాను. వాటితో ఇక్కడ చాలా ఇబ్బందిపడిన తరువాత నేను నా 5 సంవత్సరాల కూతురిని తీసుకుని ఇండియా వెళ్ళాను. అలా నేను 2 సంవత్సరాలు డ్రైవింగుకి పూర్తిగా దూరమయ్యాను. గత ఏడాది జూలైలో ఇండియానుండి తిరిగి వచ్చాక, షాపింగుకి, సమీప ప్రదేశాలకు వెళ్ళడానికి కారు నడపవలసి వచ్చింది. నాకు దృష్టి సమస్యలున్నాయి. అందువల్ల నేను రాత్రి సమయంలో హైవేపై డ్రైవింగుకి దూరంగా ఉంటాను. ఎందుకంటే, రాత్రివేళ ఎదురుగా వచ్చే కార్ల లైట్స్ వలన వచ్చే కాంతి పూర్తిగా నాకు కనపడకుండా చేస్తుంది.

ఆగస్టులో ఒకరోజు సాయంత్రం చీకటిపడ్డాక నా భర్త ఫోన్ చేసి తనని బస్‌స్టాప్ వద్ద పికప్ చేసుకోమని చెప్పారు. నేను వెనుక సీటులో నా కూతురిని కుర్చోబెట్టుకుని కారు తీసాను. బస్‌స్టాప్ కి వెళ్తూ దారి తప్పి హైవేలోకి ప్రవేశించాను. నేను అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నా ఫోన్లో GPS ఆప్ అప్డేట్ చేయకపోవడంతో నేను ఎటు వెళ్తున్నానో తెలియకుండానే డ్రైవింగ్ కొనసాగించాను. హైవేలో రాత్రిపూట డ్రైవ్ చేయడానికి నేను పూర్తిగా సిద్ధంగా లేని కారణంగా నేను భయంతో బిగుసుకుపోయాను. నాకు ఏమి చేయాలో తెలియలేదు. ఆ స్థితిలో సహాయం కోసం బిగ్గరగా సాయిబాబాను పిలిచి, "నాకు మార్గం చూపించండి" అని ప్రార్థించాను. అకస్మాత్తుగా నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఆ ప్రకారం నేను అన్ని కుడివైపు మలుపులు తీసుకుని వెనుకకు తిరిగి వెళ్లి, హైవేనుండి బయటపడ్డాను. అక్కడనుండి నెమ్మదిగా రోడ్డు పక్కన ఉండే సంకేతాలను అనుసరిస్తూ బస్‌స్టాప్‌కి చేరుకున్నాను. అది చాలా భయంకరమైన అనుభవం. రాత్రివేళ హైవే మీద చాలా వేగంగా వాహనాలు నడుస్తుండగా, ఆగి ఆలోచించే వ్యవధి కూడా లేని పరిస్థితి. బాబా మాత్రమే సరైన సమయంలో నా మనసుకు సంకేతాలను ఇచ్చి నన్ను రక్షించారు. "బాబా! నన్ను, నా బిడ్డను రక్షించారు. మీరు నాపై చూపిన ఆశీర్వాదాలకు, కృపకు నేను చాలా చాలా కృతజ్ఞురాలినై ఉంటాను. నేను ప్రతిరోజూ, ప్రతిక్షణం మీరు నాతో మాట్లాడుతున్నారని అనుభూతి చెందుతున్నాను. నేనెప్పుడు ఏ ప్రశ్న అడిగినా, సహాయం కోసం అర్థించినా మీరు తక్షణమే పలుకుతారు. నేనెప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ, మీ స్మరణ చేస్తూ ఉండేలా నన్ను అనుగ్రహించండి. మీ సహాయ సహకారాలకు నా కృతజ్ఞతలు బాబా!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2375.html

నమ్మకమే లేని వారి జీవితాలను కాపాడారు బాబా

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేనిప్పుడు చెప్పబోయేది నా భర్త ఆరోగ్యానికి సంబంధించినది. మావారు శారీరకంగా చాలా ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా ఉండేవారు. నాకు తెలిసినప్పటినుండి తను కనీసం ఒక్కసారైనా జ్వరంతో బాధపడటం కూడా చూడలేదు. అలాంటి తనకి కొన్ని నెలల క్రితం హఠాత్తుగా కడుపునొప్పి వచ్చింది. డాక్టర్ని సంప్రదిస్తే, "అంతా బాగానే ఉంది, సమస్య ఏమీ లేద"ని చెప్పారు. కానీ తరువాత కూడా నొప్పి తగ్గకపోవడంతో నిర్లక్ష్యం చేయకూడదని మళ్ళీ డాక్టర్ని సంప్రదించాము. అప్పుడు డాక్టర్, "బహుశా అది అపెండిక్స్ కావచ్చు, వెంటనే వేరే డాక్టర్ వద్దకు వెళ్ళమ"ని చెప్పారు. మేము వెంటనే వేరే డాక్టర్ వద్దకు పరుగుతీసాము. అది నిజంగానే అపెండిక్స్ అని, వెంటనే శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. తరువాత మావారిని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకుని వెళ్లారు. బయట నేను భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఆధ్యాత్మిక భావాలు గల వ్యక్తినైనప్పటికీ నేనెప్పుడూ బాబాను ప్రార్థించలేదు. నా అమాయకత్వం కారణంగా ఆయన అసలు దైవమే కాదని అనుకునేదాన్ని. రెండు గంటలు సమయం దాటినప్పటికీ మావారు శస్త్రచికిత్స గదిలోనే ఉన్నారు. నాకేమీ అర్థంకాక ఆందోళనపడుతూ ఉన్నాను. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి నాతో, "శస్త్రచికిత్స చాలా కష్టమైంది. క్యాన్సర్ అని అనుమానిస్తున్నాము. కాబట్టి బయాప్సీ పరీక్షకు పంపుతున్నాము" అని చెప్పారు. ఆ మాటలు వింటూనే భయంతో నేను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను. రోజూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు మిత్రుల ద్వారా బాబా ఊదీ నాకు చేరింది. అప్పుడే నేను మొదటిసారి 'సహాయం చేయమ'ని బాబాను ప్రార్థించి, ఆయన సందేశం కోసం వెబ్‌సైట్‌లో వెతికాను. అప్పటినుండి నేనెప్పుడు వెబ్‌సైట్‌లో బాబా సందేశం కోసం వెతికినా నా పరిస్థితికి తగిన సందేశం లభిస్తుండేది. 'నాకు సహాయం చేస్తాన'న్న వాగ్దానం కూడా ఆయన నుండి లభించింది. మావారు చాలా రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలో నేను ప్రతిక్షణం బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు డాక్టర్ రిపోర్టులతో నావద్దకు వచ్చి, "ఇప్పుడంతా నార్మల్ గా ఉంద"ని చెప్పారు. నా సంతోషానికి అవధుల్లేవు. మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అదే రోజు మావారిని ఆసుపత్రినుండి డిశ్చార్జ్ చేసారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. బాబా మా జీవితాలను కాపాడారు. అసలు దేవుడంటే నమ్మకమే లేని మావారికి ఈ సంఘటన తరువాత బాబాపై నమ్మకం కుదిరింది. నేను కూడా ఆ క్షణం నుండి బాబాకు శరణాగతి చెందాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2376.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo