సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 59వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 59వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -118

శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే గారు శ్రీ సమర్థ సాయిబాబా గురించి తనకు వచ్చిన అనుభవాలను 18-2-1920 వ తారీఖున ఒక ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరంలో చాలా భాగం తప్పక చదవవలసినదిగా అనిపించడం జరిగింది. ఆ ఉత్తర సారాంశం క్రింది విధంగా ఉంది. 

1910వ సంవత్సరంలోని డిశంబరు నెలలో నేను బాంద్రాలో ఒక సోదరుని ఇంట్లో రాత్రివేళ పంచాదశి చదువుతూ ఉండగా సుమారు 11 గంటల ప్రాంతంలో మిత్రుడు భావూసాహెబ్ దీక్షిత్ మరియు నానాసాహెబ్ చందోర్కర్ ముంబాయి నుండి పార్లే వెళుతూ నా వద్దకు ఆకస్మికంగా వచ్చారు. కాసేపు మాట్లాడిన తరువాత “మీరు శిరిడీకి ఎప్పుడు వెళతారు?” అని నానాసాహెబ్ నన్ను అడిగారు. “ఎప్పుడో వెళతాను" అని సమాధానం ఇచ్చాను. ఇంతకు మునుపు ఆ మిత్రులిద్దరూ నాకు శిరిడీ వెళ్లి  బాబా దర్శనం చేసుకోవాలని చాలాసార్లు బ్రతిమాలి చెప్పారు. కానీ నాకే వెళ్ళేందుకు కుదరలేదు. దాంతో నన్ను వెంటనే మరుసటిరోజు బయలుదేరమని చెప్పారు. "సోమవారం పెన్షను తీసుకొని వెళతాను” అని వారికి బదులిచ్చాను. అప్పుడు ఎలాగైనా నన్ను శిరిడీకి వెంటనే పంపిచాలని ఆ ఇద్దరి మిత్రుల ఆతురత ముఖ్యంగా నానాసాహెబ్ చందోర్కర్ ఆతురత ఎంత విలక్షణంగా ఉందంటే, నాకు ఆయనకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ, నాకు వెంటనే ఖర్చులకోసం పదిరూపాయలను ఇచ్చి “మీ పెన్షన్ తీసుకువచ్చే బాధ్యత అన్నా సాహెబ్ దాభోళ్కర్ చూసుకుంటారు. మీరు శిరిడీ బయలుదేరండి” అని చెప్పారు. ఇదంతా కొంచెం శిష్యసాంప్రదాయానికి విరుద్ధంగా అనిపించినప్పటికీ అందులోనున్న సహేతుకతను చూసి ఆయన మాటకు ఒప్పుకోవలసి వచ్చింది. కానీ నాకు శిరిడీలో చాలా రోజులు ఉండాలనిపిస్తే నాకు ఈ పదిరూపాయలు ఎలా సరిపోతాయి? అనే ప్రశ్న తలెత్తగానే, నాకు అవసరమైనన్ని డబ్బులు కాగితం, పత్రం లేకుండా ఇమ్మని భావూసాహెబ్ దీక్షిత్ శిరిడీలోని తన కోశాధికారికి ఉత్తరం వ్రాసి నాకు ఇచ్చారు. వెళ్ళాలనే ఆలోచన నాకు లేకపోయినా చేసేదిలేక మొహమాటానికి ఆ మిత్రుల మాటను గౌరవించి, మరుసటి రోజు సాయంకాలం శిరిడీ బాట పట్టాను. ముంబాయి నుండి మన్మాడ్ కు వెళ్ళే రైలులో కూర్చోగానే, అదే డబ్బాలో యం.ఏ పరీక్ష వ్రాసి, ఎల్.ఎల్.బి పరీక్షలకు త్వరలోనే కూర్చోబోతున్న కోపర్గావ్ కు చెందిన ఒక యువకుడు ఉన్నాడు. తనతో నేను మాట్లాడటం మొదలుపెట్టాను. అప్పుడు “శిరిడీలోని సాయిబాబా గురించి మీకు ఎమైనా తెలుసా?” అని అడిగాను. “ఆ పిచ్చి ఫకీరు గురించి నాకు బాగా తెలుసు” అని సమాధానం ఇచ్చాడు. అది విని బాబా ఒక పిచ్చి ఫకీరు అనే నా పూర్వభావం దృఢమైంది. దారిలో కోపర్గాంలో ఆ నూతన మిత్రుని ఇంట్లో తేనీటి సేవనం మొదలగునవి పూర్తిఅయ్యాక (సోమవారం) ఉదయం సుమారు 9-10 గంటలకు నేను శిరిడీ చేరుకున్నాను. టాంగావాలా నన్ను రావ్ బహదూర్ సాఠే గారి వాడకు తీసుకు వెళ్ళాడు. అక్కడ భావుసాహెబ్ దీక్షిత్ గారి కోశాధికారి (మాధవరావ్ దేశ్ పాండే) గురించి విచారిస్తుండగా, ఇంతలో లోపల కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్న నా పాత స్నేహితుడు శ్రీ లక్ష్మణ్ కృష్ణాజీ ఉరఫ్ తాత్యాసాహెబ్ నూల్కర్ గారిపై నాదృష్టి పడింది. నేను ఆయనను పేరు పెట్టి పిలిచి నమస్కారం పెట్టాను. మధ్యలో చాలాకాలం గడచిపోవడం వలన తాను మొదట నన్ను గుర్తు పట్టలేదు. దాంతో మా మధ్య కాసేపు వినోదపూరితమైన సంభాషణ జరిగింది. నేను నా పేరు చెప్పగానే తాను ఎంతో ఆనందంగా గాఢాలింగనం చేసుకొని, ఇక నా బాధ్యతంతా తీసుకొనడం తన హక్కుగా భావించి నన్ను అక్కడే కూర్చోబెట్టారు. తరువాత మాధవరావ్ దేశ్ పాండే గారిని అక్కడికి పిలిపించి, నా విషయమంతా చెప్పారు. తరువాత బాబాకు ఆరతి జరిగే సమయానికి ముందే మేము స్నానం వగైరా పూర్తి చేసుకున్నాము. తాత్యాసాహెబ్ నన్ను తనతో ఆరతికి ద్వారకామాయికి తీసుకొని వెళ్ళాడు. బాబా చరణాలపై తాత్యాసాహెబ్ శిరస్సునుంచి నమస్కారం చేసుకొని ప్రక్కకు నిలబడడంతో, నేను కేవలం శిష్య సాంప్రదాయాన్ని అనుసరించి తనను అనుకరించాను. అలా చేయగానే “తాత్యాబాకు నమస్కారం చేయి, బాపుసాహబ్ కు నమస్కారం చేయి! అందులో మనకు చిన్నతనం ఏమీలేదు” అనే మాటలు బాబా నోటి నుంచి వెలువడ్డాయి. బాపుసాహబ్ జోగ్  గారిని నాకు శ్రీ తాత్యాసాహెబ్ గారు ముందే పరిచయం చేసారు. అప్పుడు బాబా చెప్పిన విధంగా మరలా కేవలం శిష్యసాంప్రదాయార్థం నేను వారిద్దరికి నమస్కారం చేసి నిలబడ్డాను. వెంటనే “తాత్యాబాకు సేవ చేసుకో” అనే మాటలను బాబా నన్ను ఉద్దేశించి అన్నారు. అదే మాటలను మరలా రెండవరోజు, మరలా మూడవరోజు మధ్యాహ్న ఆరతి సమయంలో నన్ను ఉద్దేశించి అన్నారు. హుబ్లిలోని శ్రీ సిద్దారూఢస్వామి, ఎలీచ్ పూర్ లోని శ్రీ శంకర్ భట్ జీ, పలూస్ లోని గోండీబాబా మరియు సుమారు ఇరవై, ఇరవై రెండు సంవత్సరాలకు పూర్వం పుణేలోని సోమేశ్వర దేవాలయంలో కొన్ని రోజులు నివాసమున్న ఒక నిజమైన పరమహంస వంటి ఇత్యాది పురుషశ్రేష్ఠుల దర్శనంతో, వేదాంతగ్రంథాలలో చెప్పిన విధంగా సత్పురుషులు ఈ జగత్తులో ఉన్నారు అనే భావన ఇంతకుమునుపే దృఢమై ఉంది. అయినప్పటికీ బాబా పట్ల మనసు శంకాపూరితమై ఉండటం వలన మొదటి రోజు నుండి బాబా యొక్క ఆజ్ఞానుసారం నాకు ఏదైనా సేవ ఇవ్వమంటూ - కేవలం తమాషాగా - తాత్యాసాహెబ్‌ను చాలాసార్లు బ్రతిమిలాడాను. చివరకు ఆయన “మీ మాటలు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి, అందువలన ఇక ఈ వినోదం చాలించండి” అంటూ తాను స్పష్టంగా చెప్పేవరకు నా ఈ తమాషా జరుగుతూనే ఉండేది. ఆ తరువాత ఒకసారి “మీరు చెప్పే విధానంలో ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఈ భక్తమండలి అంతా ఆ మాటల గురించి ఊరకనే పిచ్చివాళ్ళ మాదిరి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను అలా చేయను. నాకు ఏదైనా మీరు చెప్పాలని అనుకుంటే నాకు స్పష్టంగా, అర్థమయ్యే విధంగా చెప్పండి” అని బాబాకు విన్నవించుకున్నాను. “సరే” అని మాత్రమే బాబా అన్నారు. తరువాత కొన్ని రోజులకు “మా అనుభవం పరోక్షమైనది కాదు. ఎవరికయితే అది అర్థమైందో వారు ఉండాలి లేదా వారు వెళ్ళిపోవాలి” అని తమ సహజశైలిలో అన్నారు. ఆ మాటలను కేవలం నన్ను ఉద్దేశించే అన్నారని నాకు అర్థమైంది. “సరే నాకు బోధపడేవరకూ నేను ఇక్కడ నుండి వెళ్ళను” అని నేను వెంటనే బాబాకు తెగేసి చెప్పాను. అప్పుడు కూడా బాబా “సరే” అని మాత్రమే అన్నారు. నేను శిరిడీ నుండి తిరిగి వెళ్ళే విషయమై మాధవరావు రెండు రోజులకొకసారి బాబాను అడిగేవారు. అప్పుడు ఒకసారి బాబా “తనతో మనకు పని ఉంది. తనను ద్వారకామాయి వద్ద కుక్కలాగా పడిఉండనీ!” అని అన్నారు. అలాగే ఇంకొకసారి “తాను నా వాడు. తన పని నేనే చేయాలి. నేను తప్ప తనకు ఎవరున్నారు?” అని నాకు అభయవచనం ఇచ్చారు. ఇంతకాలం తాత్యాసాహెబ్ గారి ఆరోగ్యం బాగానే ఉంది. కానీ తరువాత కొన్నిరోజులకు ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినింది. అప్పుడు తిరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు ఇక్కడ నుండి కదలకూడదని నిశ్చయించుకున్నాను. చివరకు మార్చి నెలలో తాత్యాసాహెబ్ మరణించారు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు, నేను వచ్చిన మొదటి మూడు రోజులలో బాబా నన్ను ఉద్దేశించి అన్న మాటల యొక్క అర్థం అక్కడనున్న అందరికీ, ముఖ్యంగా తాత్యాసాహెబ్ కు ఎంత చక్కగా అర్థమయ్యాయంటే, ఒకరోజు “నీలకంఠరావ్, కేవలం నేను కష్టపడకుండా చూసుకోవడానికే బాబా నిన్ను ఇక్కడకు తీసుకువచ్చారు. బాబా మొదటి రోజు చేసిన ఆజ్ఞ యొక్క అర్థం అంతే కదా” అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అడిగారు. చివరకు తాను ఏకాగ్రదృష్టితో తన చిరంజీవులిద్దరినీ “ఆతా దృష్టి పుడే ఏసాచీతూరహే  (ఇక ముందు కూడా దృష్టి ముందు నీవు ఇలాగే ఉండాలి) అనే అభంగాన్ని పాడమని చెప్పి, వారు భజన చేస్తూ ఉండగా, బాబా యొక్క పాదతీర్థం నేను తనకు ఇచ్చిన తరువాత, బాబాస్మరణ చేసుకుంటూ తాను ప్రాతఃకాలం దేహత్యాగం చేశాడు. ఇది జరగడానికి ముందురోజు సుమారు 2-3 గంటలకు (తాత్యాబా ఆరోగ్యం పూర్తిగా విషమించడానికి ముందు) “నా మాట విని తాత్యాబా ఇక్కడ ఉండి, తన దేహాన్ని సార్థకం చేసుకున్నాడు” అని బాబా మాధవరావు దేశపాండేతో చెప్పారు. కానీ ఆ సమయంలో తాత్యాసాహెబ్ యొక్క మరణం అంత దగ్గరకు వచ్చిందనే ఆలోచన ఎల్.యమ్. అండ్ యస్ పరీక్షలో ఉత్తీర్ణుడై, జల్ గావ్ లో స్వంతంగా హాస్పిటల్ ను నడుపుతున్న తన పెద్ద కుమారునికి కూడా రాలేదు. తాత్యాసాహెబ్ యొక్క చివర ఘడియలను చూచి “ఇటువంటి మృత్యువును పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి” అనే మాటలు అక్కడనున్న వారందరి నోటి నుండి వెలువడ్డాయి. కారణం అందరికీ “అంతిమ ఘడియలలో నన్ను స్మరించినవారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి” అనే భగవద్గీత వాక్యాలు గుర్తుకు వచ్చాయి.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo