కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 56వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం -108
ఒకసారి కాకా మహాజని శిరిడీలో ఎనిమిది రోజులు ఉండటానికై అంతా సిద్ధం చేసుకుని వచ్చాడు. ప్రథమ దర్శన సమయంలోనే బాబా "ఎప్పుడు బయలు దేరుతున్నావ్?” అని అడిగారు. ఆ ప్రశ్న విని కాకాసాహెబ్ ఆశ్చర్యపోయాడు. “మీరు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు” అని కాకా సమాధానం ఇచ్చాడు. “రేపు ఉదయం బయలుదేరి వెళ్ళు” అని బాబా చెప్పారు. ఆ విధంగానే కాకా మరుసటి రోజు ఉదయం బాబా ఆజ్ఞను తీసుకొని బయలుదేరాడు. ఇక్కడకు వచ్చి చూస్తే తన ఆఫీసులోని ఇద్దరు గుమస్తాలు అనారోగ్యానికి గురికావడం వలన, ఆఫీసులో కాకా యొక్క హాజరు అత్యవసరమైంది. ఉన్నపళంగా బయలుదేరి రమ్మని కాకాకు ఆయన యజమాని శిరిడీకి ఉత్తరం కూడా వ్రాసారు.
అనుభవం -109
దత్తోపంత్ అనే గృహస్తు ఉండేవాడు. తనకు చాలా సంవత్సరాల నుండి కడుపునొప్పి జబ్బు ఉండేది. దాని వలన తనకు ఎంతో బాధగా ఉండేది. శ్రీ సాయిబాబా కీర్తిప్రతిష్టలు విని, తాను బాబా దర్శనానికై వెళ్ళాడు. బాబా తనకు ఆశీర్వాదం ప్రసాదించి కొన్ని రోజులు తమ వద్దనే ఉంచుకున్నారు. బాబా ఆశీర్వాదం ప్రసాదించినప్పటి నుండి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. తరువాత ఆ జబ్బు మరలా కనపడలేదు.
అనుభవం -110
ఒకసారి ముంబాయికి చెందిన సొలిసిటర్ మహారాజ్ దర్శనానికై వెళ్ళారు. తాను అయిష్టంగానే ఒక ద్రాక్ష తిన్నాడు. ఆ ద్రాక్షపండ్లను కడగకుండా తినడం ఇష్టం లేదు. అన్నింటికి మించి తిన్నాక ఆ ద్రాక్ష పండ్ల గింజలను ఎక్కడ పారవేయాలనే సమస్యతో సతమతమవసాగాడు. బాబా మరలా ద్రాక్ష పండ్లను తినమని చెప్పడంతో ద్రాక్షపండ్లను నోట్లో వేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఆ పండ్లలో విత్తనాలు తగలలేదు. జరిగిన లీల చూసి సొలిసిటర్ కు ఎంతో ఆశ్చర్యం వేసింది.
అనుభవం -111
అన్నా సాహెబ్ దాభోళ్కర్ యొక్క జాతికి సంబంధించిన కాన్ఫరెన్స్ రత్నగిరి జిల్లాలోని వేగులే తాలూకాలోని దాబోలి గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. సుమారుగా ఏడు సంవత్సరాల ముందు నుండి తనను “మహామండలి యొక్క అధ్యక్ష" పదవిని స్వీకరించమని విన్నవించడం జరిగింది. కానీ బాబా యొక్క అనుమతి లేనందువలన ఆ సంవత్సరం ఆ పదవిని స్వీకరించడం జరుగలేదు. మరుసటిరోజు కూడా అటువంటి విన్నపమే చేస్తారు. దానికి ముందే దాభోళ్కర్ కు ఒక దృష్టాంతం వచ్చింది. ఆ దృష్టాంతంలో బాబా దర్శనం ఇచ్చి అధ్యక్ష పదవిని స్వీకరించమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మఠం వారు చేసిన విజ్ఞప్తిని స్వీకరించారు. కాని ఆయన కుమార్తెలలో ఒకరికి మతి భ్రమించి అనారోగ్యానికి గురికావడం వలన మరియు అన్నా సాహెబ్ కు మినహా మిగతా ఎవరి మాట వినకపోవడం వలన, ఆమెను వదిలి వెళ్ళడం అన్నా సాహెబ్ కు ఏమాత్రం వీలుకావడంలేదు. ఒకవైపేమో కాన్ఫరెన్స్ యొక్క తేదీ దగ్గర పడుతుంది. కానీ అమ్మాయి ఆరోగ్యమేమో కుదుటపడటం లేదు. ఒక వైపు దృష్టాంతమేమో అలా, ఇంకొకవైపు అమ్మాయి ఆరోగ్యమేమో ఇలా! ఈ సమస్య గట్టెక్కడానికి నేను ఏం చేయాలి? అంటూ శిరిడీకి ఉత్తరం వ్రాసి బాబా యొక్క అనుమతి అర్థించారు. "వెళ్ళు, కానీ వెంటనే తిరిగి రా, ఒకటి,రెండు రోజుల కంటే ఎక్కువ ఉండవద్దు” అని బాబా అనుమతిని ప్రసాదించారు. ఆ విధంగానే అన్నా సాహెబ్ వెళ్ళారు. వెళ్ళడం, రావడం అన్ని కలుపుకుని మొత్తం నాలుగైదు రోజులలో తిరిగి వచ్చారు. తాను తిరిగి వచ్చిన తరువాత, తెలిసి వచ్చిన విషయమేమిటంటే, తాను ఊరిలో లేని రోజులు అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా బాగుందని! కానీ తిరిగి వచ్చిన తరువాత మరలా ఆరోగ్యం పూర్వం మాదిరే క్షీణించింది. తరువాత చాలా రోజులకు ఆ అమ్మాయిని బాబా ఆజ్ఞ ప్రకారం శిరిడీకి బాబా దర్శనం కోసమై తీసుకువచ్చారు. తీసుకువచ్చిన రోజే బాబా దర్శనం జరిగింది. బాబా తన నుదిటి పై ఊదీని పెట్టి, తమ వరదహస్తాన్ని ఆ అమ్మాయి శిరస్సుపై ఉంచారు. ఆ క్షణం నుంచి తన మతిభ్రమణం మటుమాయమై పోయింది. అంతేకాదు అదే సమయంలో తాను గర్భవతి! ఆ మతిభ్రమణం వలన తన పరిస్థితి ఎలా అయ్యిందంటే తనను గదిలో బంధించి రావాల్సి వచ్చేది. తీరా ప్రసవ సమయం దగ్గర పడుతుండటంతో ఏం చేయాలో కుటుంబసభ్యులకు పాలుపోలేదు. ఆ సమయంలో శస్త్రచికిత్స చేయించేంత ధైర్యం ఎవరికీ రావడంలేదు. ఒక డాక్టర్ శస్త్రచికిత్స చేయించమంటే, ఇంకొక డాక్టరు వద్దు అని అన్నాడు. భగవంతునిపై భారం వేసి ఏం జరిగితే అది జరగనీ అని శస్త్ర చికిత్స చేయించుదాం అని అందరూ అనుకున్నారు. కానీ మరుసటి రోజు తన మతిభ్రమణం తగ్గిపోయి అత్యంత అనాయాసంగా డాక్టరు అవసరం లేకుండానే ప్రసవించింది. సర్జన్ ను పిలవడానికి వెళ్ళిన వ్యక్తి సగందారిలో ఉండగానే, ఇక్కడ ప్రసవం జరిగిపోయింది. కానీ రెండు, మూడు రోజులలో తన ఆరోగ్యం పూర్వ స్థితికి వచ్చింది. పైన చెప్పిన విధంగా బాబా యొక్క ఊదీ వలన, ఆశీర్వాదం వలన తన మతిభ్రమణం పూర్తిగా తగ్గిపోయి, చిన్న బిడ్డతో సహా తాను బాబా దర్శనానికి తీసుకువెళ్ళారు.
తరువాయి భాగం రేపు
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete