సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 78వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 78వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 141 

గోవా బ్రాహ్మణుల కథ.

సుమారు ఇరవై సంవత్సరాలకు పూర్వం బుందేల్ ఖండ్ కు చెందిన ఇద్దరు దక్షిణ బ్రాహ్మణులు శిరిడికి బాబా దర్శనానికై వచ్చారు. దర్శనం కోసం ఎవరైనా వస్తే బాబా వద్దకు వారిని తీసుకువెళ్ళే పనిని ఎప్పుడూ మాధవరావు చేస్తుంటాడు. అదే విధంగా ఆ ఇద్దరు బ్రాహ్మణులను మాధవరావు బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ ఇద్దరూ బాబాకు నమస్కారం చేసుకుని కూర్చొన్నారు. అప్పుడు బాబా ఒక బ్రాహ్మణుని వైపు చేయి చూపిస్తూ మాధవరావుతో “షామా, తన దగ్గర రూ. 15/- అడుగు” అని అన్నారు. మాధవరావు ఆ విధంగానే తనను 15 రూపాయలు అడగడంతో, ఆ గృహస్థు 15 రూపాయలను సమర్పించారు. బాబా ఆ డబ్బులను స్వీకరించారు. ఇంకొక బ్రాహ్మణుడు తనకు తానే 35 రూపాయలను బాబాకు సమర్పించారు. బాబా ఆ 35 రూపాయలను చేతిలోకి తీసుకొని, మరలా ఆ బ్రాహ్మణునికి తిరిగి ఇచ్చేసారు. అదిచూసి మాధవరావు “దేవా, ఇటువంటి వ్యవహారం నేనెప్పుడు చూడలేదు. తనకు తానే స్వయంగా 35 రూపాయలిస్తే తీసుకోలేదు, అదే ఇంకొకరి దగ్గరనుండి అడిగి మరీ 15 రూపాయలను తీసుకున్నారు” అని బాబాను అడిగారు. బాబా మొదట ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపటి తరువాత బాబా “షామా, ఆ 35 రూపాయిలు మనవికావు. కానీ ఆ పదిహేను రూపాయలు దత్తునివి. దత్తుడు ద్వారకామాయి తల్లికి ఇచ్చాడు" (బాబా అప్పుడప్పుడు ద్వారకామాయిని ద్వారకామాయితల్లి అని అంటారు) అని అన్నారు. తరువాత ఆ సంఘటనకు సంబంధించి ఇలా చెప్పారు. ఒకసారి నేను తిరుగుతూ, తిరుగుతూ ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాను. వారు నాకు భోజనం పెట్టారు. తరువాత నేను అక్కడే నిద్రపోయాను. నా జేబులో 35 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. నేను నిద్రలో ఉండగా ఆ జేబు కత్తిరించి ఆ డబ్బులను దొంగిలించారు. సమీపం లో కిటికీ  ఉంది. ఆ కిటికీ ఊచలను తొలగించి దొంగలు లోపలికి వచ్చారు. నేను నిద్ర మేల్కొన్నాక చూస్తే నా జేబులో డబ్బులు లేవు. అప్పుడు నేను ఆ బ్రాహ్మణులతో నా డబ్బులు ఇచ్చేయమని అడిగాను. నేను విచారవదనంతో ఇంటి అరుగుపై కూర్చొన్నాను. అలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి ఒక ఫకీరు వచ్చాడు. నాతో "బాబా అలా ఎందుకు ఉదాసీనంగా కనిపిస్తున్నావు?” అని అడిగారు. అప్పుడు నేను ఆ ఫకీరుతో నా డబ్బులన్నీ దొంగిలించబడ్డాయని చెప్పాను. అప్పుడు ఆ ఫకీరు “నీవు ఆ ఫకీరుకు మొక్కుకో! నీకు ఇష్టమైన పదార్థం ఏదైతే ఉందో, దానిని వదిలేయి. అప్పుడు నీ డబ్బులు నీకు దొరుకుతాయి” అని చెప్పారు. నాకు అన్నం చాలా ఇష్టం, అందువలన దానిని వదలి వేసి మొక్కుకున్నాను. 15 రోజులలోపు ఆ బ్రాహ్మణులు కన్నం వేసి ఏ డబ్బులనైతే దొంగిలించారో, ఆ డబ్బులను తీసుకువచ్చి ఇచ్చారు. నాకు చాలా ఆనందం కలిగింది. తరువాత నేను అక్కడ నుండి బయలుదేరి తిరుగుతూ, తిరుగుతూ గోవా దారిలోకి వచ్చాను. ఒకరోజు రాత్రి ఆ ఫకీరు నా స్వప్నంలోకి వచ్చి, “ఇంకా ఆ ఫకీరు వద్దకు వెళ్ళలేదా?” అని అడిగారు అప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నౌక దగ్గరకు వస్తే, నౌక పూర్తిగా నిండిపోయి ఉంది. సాహెబ్ నన్ను నౌక ఎక్కనివ్వలేదు. అప్పుడు ఒక సిపాయి సాహెబ్ తో "తనను ఎక్కనివ్వండి, మన మనిషే” అని చెప్పారు. అప్పుడు సాహెబ్ మమ్మల్ని నౌకలోకి ఎక్కనిచ్చాడు. తరువాత నేను ముంబాయికి వచ్చాను. ఫకీరును కలిసాను. అందువలన నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బాబా ఈ విషయం అంతా చెపుతూ ఉండగా, ఆ ఇద్దరి బ్రాహ్మణుల కళ్ళనుండి అశ్రుధార ప్రవహించసాగింది.

ఈ గోష్టి పూర్తయ్యాక బాబా మాధవరావుతో “షామా, వీరిద్దరినీ ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం పెట్టు” అని అన్నారు. బాబా ఆజ్ఞ ప్రకారం మాధవరావు వారిద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భోజనం పూర్తయ్యాక మాధవరావు ఆ గృహస్థులతో “బాబా ఏ విషయం అయితే చెప్పారో, అది నాకు ఏమీ అర్థం కాలేదు. కాని బాబా చెప్పింది మీ గురించేనని అర్థమవుతుంది. బాబా చెప్పేటప్పుడు మీ కళ్ళలో నుండి అశ్రుధార ప్రవహించింది. ఒకవేళ, బాబా చెప్పింది మీకు అర్థమయ్యుంటే, దయచేసి నాకు కూడా చెప్పండి” అని అన్నాడు. అప్పుడు వారిలో ఒక గృహస్థు “ఈ గోష్ఠి ద్వారా బాబా తమ అంతర సాక్షిత్వాన్ని మాకు అర్థమయ్యేటట్లు చేసారు. అసలు విషయం ఏమిటంటే, మేము దక్షిణ్ లో ఉంటాము. ఉద్యోగ నిమిత్తం బుందేల్ ఖండ్ కు  వెళ్ళాము. మొదట 15 రూపాయల జీతం లభించసాగింది. అప్పుడు దత్తాత్రేయునికి రూ.15/- ఇస్తాను అని మొక్కుకున్నాను. ప్రస్తుతం నాకు రూ. 100/- ల జీతం వస్తుంది. కానీ 15 రూపాయల మొక్కు చెల్లించడం అలాగే ఉండిపోయింది. ఆ విషయాన్ని బాబా నర్మగర్భంగా చెప్పి, 15 రూపాయలను అడిగి తీసుకొని, నన్ను మొక్కునుండి విముక్తుడను చేస్తారు. జీతం బాగా వస్తుండటం వలన నేను చాలా డబ్బు కూడబెట్టాను. కానీ ఒకసారి నా బ్రాహ్మణుడు కిటికీ ఊచలు తీసి, ఆ డబ్బును దొంగిలించాడు. ముప్పై ఒక్క వేల రూపాయల నోట్లను దొంగిలించారు. ఆ బ్రాహ్మడు ముప్పై సంవత్సరాల నుండి నా వద్ద పనిచేస్తున్నారు. దొంగతనం గురించి పోలీసులకు పిర్యాదు చేసాను. కానీ డబ్బు గురించి ఏ విధమైన సమాచారం తెలియకపోవడంతో నేను బాధతో ఖిన్నుడనయ్యాను. ఒకసారి నా వద్దకు ఒక ఫకీరు వచ్చి “నేను శిరిడీ నుండి వచ్చాను. నువ్వు శిరిడీ సాయిబాబా దర్శనానికి వెళతానని మొక్కుకో. నీకు బాగా ఇష్టమైన పదార్ధాన్ని అంతవరకు వదులుకో, అప్పుడు నీ డబ్బులు నీకు దొరుకుతాయి” అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే నేను మొక్కుకున్నాను. నాకు బాగా ఇష్టమైన అన్నాన్ని తినడం మానివేసాను. తరువాత సుమారు 15 రోజులకు ఆ బ్రాహ్మణుడు తనకు తానే నా వద్ద నుండి దొంగిలించిన ముప్పై ఒక్క వేల రూపాయిలను తీసుకు వచ్చి ఇచ్చాడు. దాంతో నేను పరమానందభరితుడనయ్యాను. ఆ డబ్బులలో రూ. 2000/- రూపాయిలను ఆ బ్రాహ్మణునికి సంతోషంగా బహుమతిగా ఇచ్చాను. తరువాత 2-3 నెలలకు ఏదో పని మీద గోవా పక్క వచ్చాను. ఒకరోజు రాత్రి స్వప్నం వచ్చి, ఆ స్వప్నంలో బాబా కనపడ్డారు. అప్పుడు వెను వెంటనే శిరిడీకి వచ్చి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నౌక వద్దకు వస్తే, నౌకలో ఖాళీ లేదు. అప్పుడు ఒక సిపాయి “వీరు మనవాళ్ళే” అని చెప్పి మమ్మల్ని నౌకలోకి ఎక్కించారు. ఆ నౌకలో ముంబాయికి వచ్చి, అక్కడి నుండి ఇక్కడకు వచ్చాము. ఆ విధంగా జరిగిన సంఘటనను బాబా వివరిస్తుంటే, మేము ఆశ్చర్యచకితులమయ్యాము. సహజంగానే మా కళ్ళనుండి ఆనందాశ్రువులు ధారగా కారాయి.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo