సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 66వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 66వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 125.

శ్రీ సాయినాథ్ సగుణ్ లీల

శ్రీ కె. జె. భీష్మ గారి స్వానుభవం.

శ్రీ సద్గురు ప్రసాదించిన ఉపదేశం, ఆయన దర్శింప చేసిన స్వరూపం మరియు ప్రసాదించిన అనుభవం ఇతరులకు చెప్పకూడదు అని అందరూ అంటుంటారు. కానీ, సంత్ శిరోమణి అయిన శ్రీ తుకారాం మహారాజ్ తమ అభంగాల ద్వారా స్వానుభవాన్ని తెలియ చేస్తున్నారు. శ్రీ తుకారాం మహారాజ్ తమకు కలిగిన దృష్టాంతంలో తమకు ఉపదేశింపబడిన మంత్రాన్ని వ్రాసుకొని ఉంచారు. దీనిని బట్టి మన స్వానుభవాన్ని ఎవరికీ చెప్పకూడదు అనే మాటలో కచ్చితత్వం కనపడదు. మన స్వానుభవాన్ని విశదీకరించడమంటే, మన స్వీయయోగ్యతను ప్రకటం చేయడం యొక్క మహిమను వర్ణించడం! అందువలన నా స్వానుభవాన్ని వ్రాయడం ఆరంభిస్తున్నాను.

నాగపూర్ జిల్లాలోని “బోరి” అనే గ్రామంలో నివసించేటప్పుడు, భార్య చనిపోయినపుడు, మరలా సంసారంలో పడాలా, వద్దా? అని ఆలోచిస్తూ చాలాకాలం గడిపాను. చాలామంది ప్రియమిత్రులు మరలా సంసారాన్ని స్వీకరించమని చెప్పారు. కాని సంసారంలో పడటానికి మనసు రాలేదు. వ్యవసాయం చేస్తూ పోషణ జరిపించాను మరియు స్నేహితులు కూడా సహాయం చేస్తారు, కానీ మనసు యొక్క అస్థిరత్వం మాత్రం దూరం కాలేదు. ఆ విధంగా కొంతకాలం గడచిన తరువాత 1908వ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక నలుపు రంగు కలిగిన పురుషుడు దర్శనమిచ్చాడు. ఆయన శరీరంపై అక్కడక్కడ కాషాయ రంగు చిహ్నాలు ఉన్నాయి. నుదుటి పై త్రిపుండ్రం ఉండి, పాదుకలకు గంధంతో పూజ చేయబడి ఉంది. ఆ దివ్య పురుషుడు నాకు ఒక వర్తమానపత్రం ఇచ్చారు. నేను ఆ పురుషునితో “మీరెవరు? మీ నామధేయం ఏమిటి?” అని అడిగాను. కానీ ఆ పురుషుడు నాతో సంభాషించకుండా నా చేతికిచ్చిన వర్తమానపత్రాన్ని చదవమని వేలు చూపించారు. నేను ఆ వర్తమానపత్రాన్ని చూస్తే అందులో “సచ్చిదానంద” అనే అక్షరాలు కనిపించాయి. ఇంతలో ఆ పురుషుడు “చదువు” అని ఆజ్ఞాపించారు. మరలా ఆ పత్రంలో చూస్తే ఒక చోట "మంత్రం మరియు నేర్పించు” అని వ్రాసి ఉంది. “అదేమిటి, దానర్థమేమిటి?” అని అడుగుదామంటే ఆ పురుషుడు కనపడలేదు మరియు ఆ వర్తమానపత్రం కనపడలేదు. అప్పుడు నేను ఆశ్చర్యచకితుడనయ్యాను. ఇంతలో నా స్నేహితుడు వచ్చి తలుపుకొట్టడంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను. వెంటనే ఆ అనుభవాన్ని డైరీలో వ్రాసుకున్నాను. కానీ, ఆ స్వప్నం యొక్క అర్థమేమిటో అవగతం కాలేదు.

కొన్ని రోజులకు అమరావతికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దాదాసాహెబ్ ఖపర్దే “శిరిడీకి వస్తావా?” అని అడిగారు. నేను “సరే” అని చెప్పి, ఆయనతో శిరిడి వెళ్ళాను. శిరిడీకి వెళ్ళాక బాబాను దర్శించుకుని, నమస్కరించుకుని నమస్కారం చేసుకోగానే. బాబా చేతులు జోడించి “జై సచ్చిదానంద" ముఖుతః  అన్నారు. దాంతో నేను ఇంకా గందరగోళానికి గురయ్యాను. "నాకు కనిపించిన దివ్యపురుషుడు, ఈయన ఒకరేనా? వేరా? వేరా ? ఒకరే అని అందామంటే  ఆ దివ్యపురుషుడు వైష్ణవుడు, ఈయనేమో మహమ్మదీయుడు. మరి వేరు వేరు అని అందామంటే నేను నమస్కారం చేసుకోగానే “సచ్చిదానంద” అని ఎందుకన్నారు?” అనే ఆలోచనలో పడ్డాను. ఇక్కడ శుద్ద బ్రాహ్మణుడు కూడా బాబా చరణతీర్ణాన్ని సేవిస్తారు. కాని, నేను మాత్రం సేవించేవాడిని కాను. బాబా చిలిం పీల్చి, ఆ చిలింని పీల్చమని ఇతరులకు ఇచ్చేవారు. నేను బాబాకు అతి సమీపంలో కూర్చొనేవాడిని, కానీ బాబా మాత్రం నాకు చిలిం పీల్చమని ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే మేమందరము బాబా దర్శనం చేసుకొని, సమీపంలో కుర్చొన్నాము. బాబా యొక్క చమత్కారికగోష్టి జరుగుతూ ఉంది. ఇంతలో ఒకరు చిలిం నింపి బాబా చేతికి ఇచ్చారు. బాబా ఆ చిలింని పీల్చి, వెంటనే నాకిచ్చి పీల్చమన్నారు. ఆయన ఆజ్ఞను అనుసరించి ఆ చిలిం పీల్చి, మరలా ఆ చిలింని బాబా చేతికిచ్చాను. బాబా ఆ చిలింని తీసుకొని, “నేను అంతా తిరుగుతూ ఉంటాను. ముంబాయి, పుణె, సాతారా, నాగపూర్ అంతటా రాముడే నిండియున్నాడు” అని చెప్పి, నా వైపు చూస్తూ “నువ్వు ఒక్కడివే లడ్డూలు తింటావు. మాకు ఒక్కటి కూడ ఇవ్వవు. ఇకనైనా నువ్వు నాకు ఐదు లడ్లు ఇవ్వు” అని అన్నారు. బాబా ప్రతిఒక్కరి వద్ద దక్షిణ స్వీకరించి, ఆ డబ్బుని పరహితం కోసమై వినియోగిస్తారు.

“నేను అంతటా విహరిస్తుంటాను, ఐదు లడ్లు ఇవ్వు” అనే బాబా మాటలు నా మనసుపై విచిత్రపరిణామాన్ని కలుగచేస్తాయి. స్వప్నంలో కనిపించిన దివ్యపురుషుడు వేరు, బాబా వేరు అనే భావం  తత్ క్షణమే అంతరించిపోయింది. తీర్థం పంచే వ్యక్తి నుండి తీర్థం అడిగి తీసుకొని సేవించాను. బాబా చరణాలపై శిరస్సునుంచి నమస్కారం చేసుకున్నాను. అప్పుడు బాబా తమ వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచారు. అప్పుడు నా మానసిక పరిస్థితి ఎలా అయిందో చెప్పమంటే “అది నాకే తెలుసు” అని చెప్పవలసి వస్తుంది.

బాబా వరదహస్తం శిరస్సుపై ఉంచిన తరువాత, వాడాకు వెళ్ళి శ్లోకాలను పూర్తి చేసాను. ఆ శ్లోకాలను “సాయినాథసగుణోపాసన” పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరం సాయిలీలా మాసిక, అంకం 5 లో ఇవ్వడం జరిగింది.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo