సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 105వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • భక్తురాలిని చూడటానికి వచ్చిన బాబా

చారుశీల వరద్కర్ బాబా భక్తురాలు. ఆమెకు సత్పురుషుల పట్ల ఎంతో గౌరవభావం. ఒకసారి ఒక గొప్ప సత్పురుషుడు తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆశ్రమానికి రాబోతున్నారని తెలిసి ఆ విషయాన్ని ఆమె తన సోదరికి తెలియజేసింది. ఇద్దరూ ఆ సత్పురుషుని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. చారుశీల తన పనులను పూర్తి చేసుకుని తన సోదరి రాకకోసం వేచి చూసింది. కానీ ఎంతసేపు చూసినా తన సోదరి రాకపోవడంతో ఆమె తన సోదరి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక, తన సోదరి వెళ్ళిపోయి చాలా సమయమైందని తెలిసి ఆమె నిరాశకి గురికావడమే కాకుండా తాను వంచింపబడ్డానని చాలా బాధపడింది. వెంటనే ఆమె ఇంటికి తిరిగి వచ్చి, బాబా చిత్రపటం ముందర కూర్చుని, "బాబా! ఇద్దరం కలిసి వెళదామని తను నాకు మాట ఇచ్చింది. కానీ ఆమె ఒక్కతే వెళ్ళిపోయింది. ఆమె తన మాట నిలబెట్టుకోలేదు. నాకు ఆ సత్పురుషుని కలవాలని ఉంది, కానీ ఇప్పుడు నేనేమీ చేయలేని పరిస్థితి. నేను వంచించబడ్డాను" అని చాలా రోదించింది. కొంతసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పుడొక అద్భుతమైన కల! కలలో ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. అక్కడ చాలా జనసమూహం ఉంది. అందులో తను కూడా ఒక మూల నిలబడి ఉన్నది. అంతలో సాయిబాబా ఆ జనసమూహం మధ్యనుండి నడుచుకుంటూ తనవైపే వస్తున్నట్లు కన్పించింది. ఆయన నేరుగా వచ్చి తన ముందు నిలుచున్నారు. వెంటనే ఆమె ఆయన పాదాల మీద పడి, పాదాలను గట్టిగా పట్టుకుని ఆనందంతో, భక్తిపారవశ్యంతో వెక్కి వెక్కి ఏడ్చింది. తరువాత లేచి తన రెండు చేతులు జోడించి బాబా ముందు నిలబడగా, బాబా తన చేతులు ఆమె తలమీద ఉంచి, "ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా?" అన్నారు. వెంటనే ఆమెకు మెలకువ వచ్చింది. ఆమె పట్టరాని తన్మయత్వపుస్థితిలో మునిగిపోయింది. అదే సమయానికి ఆశ్రమం నుండి తన సోదరి తిరిగి వచ్చి ఆమెతో, "నీవు ఆశ్రమానికి రాకపోవడం మంచిదైంది. అనారోగ్యం కారణంగా ఆ స్వామి ఈరోజు రాలేదు" అని చెప్పింది. అది విన్న చారుశీల నవ్వి, "నాకిప్పుడు అక్కడకి పోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఆయనే నా ఇంటికి వచ్చారు. నాకు దివ్య దర్శనం ఇచ్చారు" అని చెప్పి తన కల గురించి వివరించింది. అది విని తన సోదరి ఆమెను వదిలిపెట్టి వెళ్ళినందుకు క్షమాపణ చెప్పింది.

మరో అనుభవం:

ఒకరోజు చారుశీలగారి పిల్లలు ఇంటి పైఅంతస్థులో ఉన్న బాల్కనీలో ఆడుకుంటూ ఒక వృద్ధుడు ఇంటి ప్రహరీ లోపలికి రావడం చూసారు. ఆయన చాలా వయసు పైబడినట్లుగా ఉండి, చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. వెంటనే ఆమె కూతురు పరిగెత్తుకుంటూ క్రిందకు వెళ్ళి తీగపై బట్టలు ఆరేస్తున్న తన తల్లితో ఆ విషయం చెప్పింది. వెంటనే ఆమె ముందుద్వారం దగ్గరకు వెళ్లి తలుపు తీసింది. ఆ సమయానికి మిగతా పిల్లలంతా అక్కడ గుమిగూడారు. ఆ ముసలాయన ముందుద్వారానికి ఆనుకుని ప్రశాంతంగా కూర్చొని ఉండటం చూశారామె. సందిగ్ధస్థితిలో ఆమె, "మీరు సాయిబాబానా?" అని గొణిగారు. అందుకాయన నవ్వారు. 

అప్పటికి 12 సంవత్సరాల వయస్సున్న చారుశీలగారి పెద్దమ్మాయి ఇలా చెప్పింది: "మా అమ్మ, 'మీరు సాయిబాబానా?' అని అడిగినప్పుడు, నేను తదేకదృష్టితో ఆయనను చూసాను. ఆయన మేము పూజించే చిత్రపటంతో పూర్తిగా పోలివున్నారు. ఆయన తెల్లని కఫ్నీ ధరించి, తలకు గుడ్డ కట్టుకుని ఉన్నారు. ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే, ఆయన చేతిలో ఉన్న కర్ర. అప్పటికే చుట్టుప్రక్కల వాళ్లంతా అక్కడకు చేరారు. మా అమ్మ, "మీరు పాలు తాగాలని అనుకుంటున్నారా?" అని అడిగింది. అందుకాయన, "అవును" అన్నారు. అమ్మ లోపలికి వెళ్ళి చిక్కటి వేడి పాలు తీసుకొచ్చి ఆయన చేతికిచ్చారు. ఆయన వాటిని త్రాగారు. తరువాత ఆయన అమ్మను కొంచెం నూనె, దక్షిణ అడిగారు. అమ్మ ఒక సీసాతో కొంచెం నూనె, రూ.1-25 పైసలు దక్షిణ ఇచ్చారు. అప్పుడు బాబా వెళ్ళటానికి లేచి నిలబడ్డారు. నన్ను, మా చెల్లెల్ని దగ్గరకు రమ్మని తల ఊపుతూ సైగ చేసారు. ప్రేమతో తమ చేతులు మా తలలమీద పెట్టి ఆశీర్వదించారు. తరువాత నడుచుకుంటూ ఇంటి ప్రహరీ దాటి బయటికి వెళ్ళారు. మేము ఆయన్ని అనుసరిస్తూ ఆయన ఎక్కడికి వెళ్తున్నారా అని గమనించాము. ఆశ్చర్యం! కొంచెం దూరం వెళ్ళాక ఆయన అంతర్థానమయ్యారు".

ref : ప్రసాద్, వాల్యూం ౩౩, నెంబర్.9, ఆగష్టు 1979.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo