కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 74వ భాగం.
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 135
శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు ఒక మిత్రుని వద్ద నుండి వచ్చిన లేఖలోని సారాంశం.
మీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం మరియు శ్రీ సాయిబాబా గారి ఊదీ చేరింది. ప్రతిరోజు నిత్యనియమంగా ఆ ఊదీని తీసుకుంటున్నాను. నా చిన్న కుమారుడు టైఫాయిడ్తో జబ్బున పడ్డాడు. నా శ్రీమతి శ్రీ సాయిబాబా ఫోటో ముందర దీపాలు వెలిగించి, పిల్లవాడు బాగయితే బాబా వద్దకు దీపాలు వెలిగించడానికి రూ. 5/- లను పంపుతానని మొక్కుకుంది. శ్రీసాయిబాబా కృప వలన పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు. అందువలన దీంతో పాటుగా ఐదు రూపాయల నోటును పంపుతున్నాను. కావున ఆ ఏర్పాటు ఈ డబ్బులతో చేయవలసిందిగా మనవి.
అనుభవం - 136
16-1-1925 వ రోజు ఒక స్నేహితుని వద్ద నుండి శ్రీ హరిసీతారాం దీక్షిత్ కు వచ్చిన ఉత్తరం లోని సారాంశం.
డియర్ సార్,
బహుశః మీరు నన్ను మరచిపోలేదనే అనుకుంటాను. పోయినసారి మనం కలసినప్పుడు మీరు సంతోషంగా నాకు శ్రీ సాయిబాబా ఫోటోను మరియు ఊదీ ఇచ్చారు. ఆ ఫోటోను మరియు ఊదీని నేను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం వలన, నేను ఎన్నో సమస్యలనుండి బయటపడ్డాను. శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందగలిగాను. ఈ రోజు అనుకోకుండా ఊదీ మహిమల గురించి ఇక్కడే నివసిస్తున్న నా ఆప్తమిత్రునితో చెప్పాను. తన యొక్క అల్లుడు ఊపిరితిత్తులు మరియు కడుపుకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. ఎంతో మంది వైద్యుల వద్ద నుండి వైద్యం పొందాడు. ప్రస్తుతం కలకత్తాలోని ఒక ప్రముఖ హోమియో వైద్యుని వద్ద నుండి చికిత్స పొందుతున్నాడు. నాకు కూడ ఆ అబ్బాయి అంటే ఎంతో ప్రేమ. ఒక విధంగా చెప్పాలంటే నేను కూడ అతనిని నా సొంత అల్లుని మాదిరిగానే భావిస్తాను. ఒక సంవత్సరం నుండి అతను చాల బాధపడుతున్నాడు. అతనికి మీరిచ్చిన బాబా ఫోటో, ఊదీ పంపించాలనే ఆలోచన నాకు వచ్చింది. అందువలన ఇప్పుడే అతనికి ఫోటో మరియు ఊదీ పంపించాను. అందువలన మీరు నాకు ఇంకొక నాలుగు ఫోటోలు (3 చిన్నవి ఎప్పుడూ మీ వద్ద ఉండేటటువంటివి, ఒకటి పెద్దది ఇంట్లో పెట్టుకోవడానికి) పంపించవలసినదిగా మనవి. వాటితో పాటుగా ఊదీ కూడ పంపించమని మనవి. అలాగే, రోగికి ఆ ఊదీని ఉపయోగించవలసిన తీరు కూడ తెలియపరచండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో తాను పూర్తిగా స్వస్థుడవుతాడనే సంపూర్ణవిశ్వాసం నాకుంది. అదే జరిగితే నేను మీకు ఎంతో ఋణపడి ఉంటాను.
అనుభవం - 137
ఒక నర్సు యొక్క అనుభవం.
శ్రీ సాయిబాబా పేరు కూడ నాకు తెలియదు. 1912వ సంవత్సరంలో నేను మా తండ్రి గారి ఇంట్లో పూజగదిలో పూజ చేసుకుంటున్నాను. పూజగది పైన ఉండేది. నా ఉపాసనాదైవం శ్రీరాముడు కావడంతో, హనుమంతుని విగ్రహం పూజలో ఉంది. పూజ పూర్తయ్యాక ముందు వరండాలో పడుకున్నాను. ముందరనున్న నేరేడుచెట్టు మీద ఒక తేజోమయమైన కోతి కనిపించింది. అది ఉన్నట్టుండి కిటికీ మీదకు దూకి, తరువాత మాయమైంది. రాత్రికి ఒక స్వప్నం వచ్చి అందులో శ్రీ సాయిబాబా కనిపించి “శిరిడీలో నీ రాముడు ఉన్నాడు, అక్కడకు వెళ్ళు” అని చెప్పారు. తరువాత మా గురువు దగ్గర నుండి నాకు శిరిడీ గురించి తెలిసింది. 1913వ సంవత్సరంలో నేను శిరిడీకి వెళ్ళాను. అక్కడ బాబాను చూసి స్వప్నంలో చూసింది ఈయననే అని నిర్ధారణకు వచ్చాను. అప్పటి నుండి బాబా సమాధి చెందేవరకు ప్రతిసంవత్సరం శిరిడీకి వెళ్ళేదానిని.
1917వ సంవత్సరంలో శిరిడీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్న ఆరతి పూర్తయి, భోజనం అయిపోయిన తరువాత నా పొలం గురించి బాబాను అడగాలి అనే ఆలోచన మనసులోకి వచ్చింది. కానీ స్వయంగా అడగడానికి ధైర్యం సరిపోదు. అందువలన, శ్రీ మాధవరావు దేశపాండేను నా పొలం గురించి నా తరపున అడగమని చెప్పాను. కానీ, ఆయన మీ విషయం మీరే అడగండి అని చెప్పాడు. నేను ద్వారకామాయిలోకి వచ్చేటప్పటికి బాబా ముందరనున్న గోడను పట్టుకుని వ్యాపారులను తిడుతున్నారు. ఆ తిట్లు భయంకరంగా ఉన్నాయి. బాబా కోపంతో ఎరుపెక్కిపోయి ఉన్నారు. నేను దూరంగా నిల్చొని ఉన్నాను. పదినిమిషాల తరువాత ద్వారకామాయిలోకి వెళ్ళి బాబాకు దగ్గరగా కూర్చొన్నాను. అన్నా చింఛణీకర్ కూడా దగ్గరలో కూర్చొన్నారు. ఆయన బాబా పాదాలను పడుతున్నారు. శ్రీ జోగ్ కూడా వచ్చారు. అప్పుడు బాబా “అన్నా, పిన్నిని ముంచాడు. పూర్తిగా నాశనం చేసాడు. నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టాడు” అని అన్నారు. చింఛణీకర్, శ్రీ జోగ్ తో “నేను ఎవరిదీ తీసుకోలేదు, ఎవరినీ ముంచలేదు. బాబా నేనెప్పుడైనా ఇబ్బంది పెట్టానా?” అని అన్నారు. ఇంతలో బాబా నావైపు చూచి నన్ను పైకి పిలిచారు. కాళ్ళు పట్టమని చెప్పారు. వీపుపై ప్రేమగా నిమిరారు. “పిన్నిని తిననివ్వు, మన అన్నా కూడా తింటున్నాడు కదా. ఫిర్యాదు చేయవద్దు. అల్లా మనకు ఇస్తాడు. మనకు ఏమీ తక్కువ చేయడు. నీవు, నేను మరియు అన్నా నాసిక్ లో ఉందాము” అని అన్నారు. నా తండ్రి పేరు అన్నా. నా సవతి తల్లికి, నాకు అసలు ఏ మాత్రం పడేది కాదు. నా ఉదర నిర్వాహణ కోసం అత్తగారు వాళ్ళు పొలం ఇచ్చారు. దానిని నా తండ్రి నాకు ఇవ్వడు మరియు నన్ను ఇంట్లో ఉండనివ్వడు. అందువలన ఫిర్యాదు చేయి అని కొందరు సలహా ఇచ్చారు. నాకు మొదట కష్టంగా అనిపించింది. తరువాత నర్సు పరీక్ష ఉత్తీర్ణురాలిని అయ్యాను. బాబా చెప్పినట్లు అల్లా ఇస్తున్నాడు, ఏమీ తక్కువ చేయడం లేదు.
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
It's genuinely very difficult in this full of activity life to listen news
ReplyDeleteon TV, so I just use web for that purpose, and get the hottest information.
🕉 sai Ram
ReplyDelete