సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - శిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ


శిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ

ఎప్పుడూ ఏ పర్వదినాన్నీ జరుపుకోమని ప్రత్యేకంగా ఆదేశించని శ్రీసాయిబాబా కనీసం పరోక్షంగా అయినా సరే గురుపూర్ణిమను జరుపుకోమని ఆదేశించారు. ఆ కారణంగా శ్రీసాయి ఆదేశానుసారం సాయిభక్తులు తప్పక జరుపుకోవలసిన పర్వదినం గురుపూర్ణిమ. నేడు ప్రపంచం నలుమూలలా ఉన్న సాయిభక్తులందరూ ఎంతో ఘనంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. మరి ఇంతటి విశిష్ఠమైన గురుపూర్ణిమ శ్రీసాయి సన్నిధిలో ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసుకుందామా!

తమను పూజించేందుకు బాబా ఎవరినీ అనుమతించేవారు కాదు. భక్తులెవరైనా పూలమాల వేయబోయినా నిరాకరించేవారు. ఒక గురుపూర్ణిమ రోజున మొట్టమొదట బాబాకు పూజ నిర్వహించే భాగ్యం తాత్యాసాహెబ్ నూల్కర్‌కు దక్కింది. ఒకరోజు ఉదయం నూల్కర్ మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించగానే, బాబా అతనికి మసీదులో ధుని ప్రక్కనున్న స్తంభాన్ని చూపుతూ, “రేపు ఆ స్తంభాన్ని పూజించు!" అన్నారు. బాబా అలా ఎందుకన్నారో నూల్కర్‌కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తరువాత బాబా ఆదేశాన్ని షామాకు చెప్పి, అలా ఆదేశించడంలో బాబా ఉద్దేశ్యం ఏమైవుంటుందని అడిగాడు. షామాకు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే బాబానే అడుగుదామని మసీదుకెళ్ళాడు. బాబా అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత తాత్యాకోతేపాటిల్ తోనూ, దాదాకేల్కర్ తోనూ బాబా అవే మాటలన్నారు. మరుసటిరోజు శనివారం. ఉదయం నిద్ర మేల్కొన్న నూల్కర్‌కు ఆరోజు గురుపూర్ణిమ అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు షామా తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం కేలండర్ తెప్పించి చూచారు. నిజమే! ఆరోజు గురుపూర్ణిమ! ఆ ముందురోజు బాబా తమతో 'రేపు ఆ సంభాన్ని పూజించ'మని ఆదేశించడంలోని పరమార్థం వారికప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయింది. వెంటనే అందరూ మసీదుకు వెళ్లి, 'గురుపూజ' చేసుకోవడానికి అనుమతించాలని బాబాను వేడుకొన్నారు. బాబా ముందురోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజచేసుకొమ్మన్నారు. “దేవా! ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా వుంటే, స్తంభాన్ని పూజించవలసిన పనేముంది?" అని షామా వాదించాడు. తమను పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు తమ పట్టు విడువలేదు. చివరకు, భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. “సరే, మీ ఇష్టం!” అన్నారు. భక్తుల ఆనందానికిక పట్టపగ్గాలు లేవు. వెంటనే గురుపూజకు సన్నాహాలు మొదలుపెట్టారు. బాబా భిక్షకు వెళ్ళివచ్చిన తర్వాత పూజ నిర్వహించాలని తలచి బాబాకు ఆ విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారికి అన్ని ఉపచారాలు (పూజావిధులు) చేయడానికి కూడా అనుమతించారు. బాబా రాధాకృష్ణఆయీకి, దాదాకేల్కర్‌కు కబురు పంపారు. రాధాకృష్ణఆయీ పూజాద్రవ్యాలు పంపింది. దాదాకేల్కర్ పూజా వస్తువులతో మశీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చివేశారు. పూజ అయిన తర్వాత ఆరతిచ్చారు. అలా ఆ సంవత్సరంనుంచి ప్రతిఏటా శిరిడీలో గురుపూర్ణిమ ఎంతో వైభవంగా జరగటం ప్రారంభమయింది. 

ఇందుకు సంబంధించిన శ్రీ నూల్కర్ ఉత్తరం:

గురుపూర్ణిమనాడు ప్రథమంగా శిరిడీలో జరిగిన గురుపూజ గూర్చి టూకీగా వివరిస్తూ, ఆ 'గురుపూజ'లో ప్రధానపాత్ర వహించిన శ్రీ నూల్కర్, ఆ సమయంలో శిరిడీలో లేని తన మిత్రుడు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్‌కు వ్రాసిన ఉత్తరం ఒకటి శ్రీ సాయిలీల పత్రికలో ప్రచురింపబడింది. దురదృష్టవశాత్తూ ఆ ఉత్తరం ఏ తేదీన  వ్రాయబడిందో పేర్కొనబడలేదు. ఇది ఆ లేఖకు తెలుగుసేత:

"శనివారంనాడు నేను నిద్రలేవగానే, ఆరోజు గురుపూర్ణిమ అని గుర్తుకొచ్చింది. వెంటనే సన్నాహాలు మొదలుపెట్టాం. భిక్షనుండి తిరిగి రాగానే పూజ చేసుకోవడానికి అనుమతించారు బాబా. షోడశోపచారాలతో తమను పూజిస్తుంటే, అభ్యంతరమేమీ చెప్పక మౌనంగా వున్నారు. ఆయనకు సమర్పింపబడిన దక్షిణలనంతా  పూజ పూర్తికాగానే అందరికీ తిరిగి ఇచ్చివేశారు. పూజ-ఆరతి జరుగుతున్నాయని, త్వరగా రమ్మని రాధాకృష్ణఆయీకి, దాదాభట్‌కు కబురు చేశారు. దానిపై రాధాకృష్ణఆయీ తన పూజాసామాగ్రి పంపింది. తన పూజాసామాగ్రితో దాదా కూడా వచ్చాడు."

పంచాంగం ప్రకారం గురుపూర్ణిమ ఈ క్రింది విధంగా వచ్చింది:

1908, జూలై, 13 - సోమవారం.
1909, జూలై, 3 - శనివారం.
1910, జూలై, 22 - శుక్రవారం. 

శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ గారి ఉత్తరం ప్రకారం శనివారంనాటి గురుపూర్ణిమ 1909లో  మాత్రమే వస్తుంది. కనుక శిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ మహోత్సవం 1909 జూలై 3 శనివారంనాడు జరిగి ఉండవచ్చు. 


🌹"ఆధ్యాతిక సాధనా సౌధానికి మూల'స్తంభం' సద్గురువు. (స్తంభాన్ని ఉద్దేశించి)బాబా చెప్పింది సద్గురువును పూజించమనే. సద్గురు కృప లేక గమ్యాన్ని చేరలేరు. గురుపూర్ణిమ సంబరాల పండుగ కాదు. సద్గురు సాయినాథుని అనుగ్రహం కుండపోతగా వర్షించే పర్వదినమిది. ఆ అమూల్యసమయాన్ని వ్యర్థ చింతనలతోను, పోచుకోలు కబుర్లతోను, అతినిద్రతోను వృధా చేసుకోకుండా ఆ రోజంతా సాయిస్మరణ, సాయిచరిత్ర పారాయణ, సాయినామ సంకీర్తన మొదలైన వాటితో 'సాయి ఊసు సాయి ధ్యాస' లో ఉంటూ వెల్లువలా ప్రవహించే ఆ సద్గురుచంద్రుని ప్రేమానుగ్రహ వెన్నెల ప్రవాహంలో ఓలలాడటమే గురుపూర్ణిమనాడు మనం చేయవలసింది"

- శ్రీబాబూజీ.

Source: ఆగస్ట్ 2002, జూలై 2003, సాయిపథం.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo