1. ఉద్యోగమిచ్చి మనశ్శాంతిని ప్రసాదించిన బాబా
2. బాబా కృప
3. కొత్తది కొనే అవసరం లేకుండా చిన్న సమస్యతో సరిపెట్టిన బాబా
ఉద్యోగమిచ్చి మనశ్శాంతిని ప్రసాదించిన బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాది విజయవాడ. నేను నా చిన్ననాటి నుండి సాయిబిడ్డను. అయినా ఇప్పటివరకు శిరిడీ వెళ్లే అవకాశం మన సాయితండ్రి నాకు ఇవ్వలేదు. మన సాయినాథుడు నడయాడిన పుణ్యభూమి అయిన శిరిడీ క్షేత్రాన్ని దర్శించే భాగ్యం నాకు, నా కుటుంబానికి ప్రసాదించమని ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మన సాయితండ్రిని పదేపదే హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. నా ఈ కోరిక నెరవేరి శిరిడీ క్షేత్ర దర్శన భాగ్యం పొందిన వెంటనే నా అనుభాన్ని మీ అందరితో పంచుకుంటాను. ఇక నా అనుభానికి వస్తే..
మా అమ్మాయి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతుంది. తను చాలా బాగా చదువుతుంది. కానీ, తన స్నేహితులందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో ఉద్యోగాలు వచ్చినా తనకి రాలేదు. తనకన్నా తక్కువ చదివేవారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి. మా అమ్మాయి మాత్రం ఎన్ని ఉద్యోగాలకి అప్లై చేసినా చివరివరకు వచ్చి అందినట్లే అంది చేజారిపోతుండేవి. కాలేజీలో సార్లు, "ఏమ్మా! నీకు ఇంకా ఉద్యోగం రాలేదు. బాగా చదువుతావు, చాలా యాక్టివ్‌గా ఉంటావు. ఇప్పటివరకు నీకు ఉద్యోగం రాకపోవడం ఏంటమ్మా?" అని అడిగేవారు. తనకు చాలా బాధగా అనిపించేది. నేను కూడా ఒకటి కాదు, రెండు కాదు ప్రతిసారీ ఇలా జరుగుతుంది అని చాలా బాధపడేదాన్ని. అనేకసార్లు, "బాబా! ఒకటి కాదు, రెండుకాదు ఎన్నోసార్లు ఉద్యోగం వచ్చేసిందనుకున్న చివరి క్షణంలో చేతికందకుండా పోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. చివరికి ఒకరోజు మా పాపను పిలిచి తనతో ఇలా చెప్పాను: "నీ సమస్యను బాబాకి చెప్పుకో. విఘ్నలు తొలగి ఈసారైనా మంచి ఉద్యోగం నాకు రావాలి బాబా అని బాబాని వేడుకో. నమ్మకంగా బాబాను అడిగి కోరిక తీరితే ప్రతి గురువారం ఏదో ఒక సమయంలో బాబాని పూజిస్తానని లేదా బాబా మందిరానికి వెళ్తానని అనుకో, అలాగే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో నీ అనుభవాన్ని పంచుకుంటానని చెప్పుకో. బాబా నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తారు" అని. అందుకు తను అయిష్టంగానే సరేనంది. ఎందుకంటే, తనకి దేవుడు మీద, అలాగే బాబా మీద అంత నమ్మకం లేదు. నాకు మాత్రం దేవుడన్నా, బాబా అన్నా చాలా చాలా నమ్మకం. బాబా అంటే చెప్పలేనంత ఇష్టం. నా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బాబా బిడ్డలుగా ఉండాలనేది నా తపన, కోరిక. అసలు విషయానికి వస్తే, బాబాని వేడుకున్న వారం రోజుల్లో 2022, సెప్టెంబర్ 26, సోమవారంనాడు ఒకటి, 2022, సెప్టెంబర్ 28, బుధవారంనాడు మరొకటి అంటే రెండురోజుల వ్యవధిలో మా అమ్మాయికి రెండు మంచి కంపెనీలలో ఒకే ప్యాకేజీ(జీతం)తో రెండు ఉద్యోగాలు వచ్చాయి. అప్పటివరకు ఎన్ని విఘ్నాలు కలిగినా బాబాను వేడుకున్న వెంటనే మా అమ్మాయికి రెండు ఉద్యోగావకాశాలు వచ్చినందుకు మేమందరము చాలా చాలా సంతోషించాము. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయితండ్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అమూల్యమైన అనుభవాన్ని ఇంత ఆలస్యంగా పంచుకున్నందుకు మన సాయితండ్రికి మేమందరం మనస్పూర్తిగా క్షమాపణలు కూడా చెప్పుకుంటున్నాము. "క్షమించు తండ్రి సాయినాథా".
బాబా కృప
సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇదివరకు మా డిపార్ట్మెంట్‌కి హెచ్ఓడిగా పనిచేసిన ఒక సార్‌తో నాకు పదమూడు సంవత్సరాల అనుబంధం ఉంది. మేము ఒకే కుటుంబంలా ఉంటాము. 2022లో ఆ సార్ పదవివిరమణ చేశారు. తరువాత కూడా మా అనుబంధం అలానే కొనసాగుతుంది. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆయన భార్య కూడా అనారోగ్యం పాలై అదే హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. నేను హాస్పిటల్‌కి వస్తానంటే, "వద్దు. ఇన్ఫెక్షన్స్ వస్తాయి" అన్నారు. అప్పుడు నేను, "బాబా! మీ దయతో మా సార్ వాళ్ల ఆరోగ్య సమస్యలు తగ్గి హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయితే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మా సార్ ఆరోగ్యం కుదుటపడి ఏప్రిల్ 10న డిశ్చార్జ్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా".
కొత్తది కొనే అవసరం లేకుండా చిన్న సమస్యతో సరిపెట్టిన బాబా
బాబా భక్తులకు నమస్కారం. నా పేరు మాధవి. మాది ఒంగోలు. నాకు ఇంట్లో ఏ సమస్య వచ్చినా నేను బాబాతోనే చెప్పుకుంటాను. ఈమధ్య మా ఇంట్లో ఏసీ రిపేర్ వచ్చింది. అంతకుముందు ఒకసారి ఆ ఏసీకి రిపేర్ చేయించినప్పుడు, "ఇంకోసారి రిపేర్ వస్తే ఇది పనికి రాదు. కొత్తది కొనాల్సిందే" అని చెప్పారు. అయితే రిపేర్ చేయించిన 20 రోజులకే గ్యాస్ లీక్ అయి ఏసీ పని చేయకుండా పోయింది. ప్రస్తుతం కొత్తది కొనాలంటే 40,000 రూపాయలకు పైనే అవుతుంది. అంత డబ్బు మా దగ్గర లేనందున నేను బాబాను, "ఈ ఒక్కసారి రిపేర్ అయ్యేటట్లు చూడండి బాబా. వచ్చే సంవత్సరం కొత్తది కొనుక్కుంటాము. ఈసారికి రిపేర్ అయినట్లయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆశ్చర్యంగా మెకానిక్, "ఇది చాలా చిన్న సమస్య" అని రిపేర్ చేసి వెళ్ళాడు. ఇదంతా బాబా దయ. ఆయన నా వెన్నంటి ఉండి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. "ధన్యవాదాలు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha