సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ప్రవేశంతో సుఖాంతమైన ప్రేమకథ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

 shirdisaideva.com
సాయిబంధువు సబాఖాన్ తన ప్రేమని బాబా ఎలా గెలిపించారో తెలియజేస్తున్నారు.

2009వ సంవత్సరంలో నేను ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగా, అదే కాలేజీలో నా బాయ్‌ఫ్రెండ్ చివరి సంవత్సరం చదువుతుండేవాడు. ఆ సంవత్సరమే కాలేజీ ఫ్రెషర్ పార్టీలో మేము మొదటిసారి కలుసుకున్నాం.  అప్పుడు మా ఇద్దరి మధ్య కేవలం పరిచయం మాత్రమే జరిగింది.

నాకు చిన్నప్పటినుంచి కాస్త సిగ్గు ఎక్కువ. పెద్దయిన తరువాత కూడా నా స్వభావంలో అది అలానే ఉండిపోయింది. అందువలన నేనెవరితోనూ అంత త్వరగా కలిసిపోలేను. ఫ్రెండ్లీగా మెలగడానికి చాలా సమయం పట్టేది. మా కాలేజీలో ర్యాగింగ్ చాలా ఎక్కువగా ఉండేది. మా సీనియర్స్ ఎటువంటి కారణం లేకుండానే చిన్న చిన్న విషయాలకి చాలా ఆట పట్టించేవారు. నేను తట్టుకోలేక ఏడ్చేసేదాన్ని. అలా ఒకరోజు నేను ఏడుస్తుండగా ఒకతను నా ప్రక్కన వచ్చి కూర్చుని నన్ను ఓదార్చబోయాడు. నేను అతన్ని సరిగ్గా గుర్తించలేదు గాని, నా సీనియర్ అని మాత్రం అర్థమయ్యింది. 'ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు?' అని తను అడిగాడు. దాంతో నేను నా బాధనంతా  చెప్పుకున్నాను. అలా మేము దాదాపు రెండు గంటలసేపు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము క్లాసెస్ కూడా మిస్ అయ్యాం. కుటుంబవిషయాలు, అలవాట్లు, ఎంబీబీఎస్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నదీ... ఇలా అన్నీ ఒకరి విషయాలు ఒకరం షేర్ చేసుకున్నాం. ఆరోజునుండి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కాలేజీలో నా కళ్ళు అతనికోసం వెతికేవి. అతని పరిస్థితి కూడా అంతే. ఇలా ఒక సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది. చివరిగా తనకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ వీడ్కోలు కేవలం అప్పటికి మాత్రమే! ఎందుకంటే మేము ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం. అయితే మా కుటుంబసభ్యులను ఒప్పించడం మాత్రం అంత తేలిక కాదని కూడా మా ఇద్దరికీ తెలుసు. ఎందుకంటే మా మతాలు వేరు. నేను ఒక ముస్లిం యువతిని. తను హిందూ మతస్థుడైన పంజాబీ. అయినా దానిని మేము పెద్ద సమస్యగా ఎప్పుడూ అనుకోలేదు. మా మనసుల మధ్యలోకి ఎప్పుడూ మతం అడ్డురాలేదు.

తర్వాత అతను తన పీ.జీ. స్టడీస్ కోసం యూ.ఎస్.ఏ వెళ్ళాడు. నేను అదే కాలేజీలో నా యంబిబిఎస్ కంటిన్యూ చేశాను. ఆ రోజుల్లో యు.ఎస్.ఏ కి కాల్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందువలన మేము ఎక్కువగా ఒకరికొకరు మెయిల్స్ పంపుకుంటూ, వారంలో ఒకసారి లేదా మరీ అవసరమైతే రెండుసార్లు మాట్లాడుకునేవాళ్ళం. ఇలా సాఫీగా రోజులు గడిచిపోయాయి. 2012లో నా ఎంబీబీఎస్ పూర్తై  పీజీ కోసం నేను కూడా యు.ఎస్.ఏ వెళ్ళాను. ఇద్దరం ఒకే స్టేట్‌లో ఉండటం వలన, ఒకే అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విషయం మా కుటుంబసభ్యులకు అస్సలు తెలియదు. తన పక్కనుంటే జీవితమెంతో అందంగా ఉండేది. ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు ఇండియానుండి, తన తండ్రికి ఒంట్లో బాగాలేదని, హాస్పిటల్లో జాయిన్ చేసామని, ఉన్నఫళాన ఇండియాకు రమ్మని తనకు ఉత్తరం వచ్చింది. అది చదివి తను చాలా కంగారుపడి, "నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని, కాబట్టి నేను వెళ్ళక తప్పదు. వెళ్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాను. మనం ఎప్పటిలానే మామూలుగా ఉండొచ్చు" అని నాకు ప్రామిస్ చేసి తను ఇండియా వెళ్ళాడు. కానీ అలా జరగలేదు. ఇండియా వెళ్లి 20 రోజులైనా తన నుండి ఫోన్ కాల్ రాలేదు. కనీసం నేను పంపిన మెయిల్స్‌కి బదులు కూడా లేదు. నాకేమీ అర్థం కాలేదు. అక్కడ తనకేం జరిగింది? తనెందుకు నాతో మాట్లాడట్లేదు?.. ఈ ఆలోచనలతో నేను చాలా ఆందోళనపడుతూ ఉండేదాన్ని.

హఠాత్తుగా ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో నా ఫోన్ రింగ్ అయింది. చూస్తే నా బాయ్‌ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. నేనెంతో ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేశాను కానీ, తన మాటల్లో నాకేదో ఆందోళన కనిపించింది. దానితో నేను భయపడుతూ, 'ఏం జరిగింద'ని అడిగాను. అప్పుడు తను, "అసలు నాన్నకేమీ జరగలేదు. నన్ను ఇండియాకు రప్పించడానికి హాస్పిటల్లో జాయిన్ చేసామని నాటకమాడారు. ఎందుకంటే, నేను యు.ఎస్.ఏలో ముస్లిం అమ్మాయితో కలిసి ఉంటున్నానని వాళ్ళకి తెలిసిపోయింది. మా కుటుంబీకులు బాగా చదువుకున్న వాళ్ళైనప్పటికీ పాతకాలపు ఆలోచనలు కలవారు. వాళ్ళు వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఒక ముస్లిం యువతితో కలిసి ఉంటున్నాడంటే అసలు ఒప్పుకునే రకంకాదు. వాళ్ళు నాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను అన్నిరకాలుగా ఒప్పించడానికి ప్రయత్నించాను కానీ, నా వల్ల కాలేదు. ముఖ్యంగా మా అమ్మని అసలు ఒప్పించలేక పోయాను. కాబట్టి నువ్వు నన్ను మర్చిపో!" అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే నా పాదాలకింద భూమి కంపించినట్టయింది. ఆ షాక్‌లో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. చివరిగా తను, "నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ, ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను చాలాసేపు ఏడ్చాను. తరువాత నన్ను నేను తమాయించుకొని, "నేను ఒకటి రెండు రోజుల్లో ఈ అపార్ట్‌మెంట్ విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళిపోతాను. నువ్వు నీ పెళ్లి తర్వాత నీ భార్యతో ఈ అపార్ట్‌మెంటులో సంతోషంగా ఉండొచ్చు. నేను నిన్ను మర్చిపోవడమంటూ ఎప్పటికీ జరగదు. కానీ, నా వంతు ప్రయత్నం చేస్తాను. నీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ సంతోషమే నేను కోరుకునేది" అని తనకు ఒక మెయిల్ పంపాను.

కానీ ఆ తరువాత నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయింది. రోజుల తరబడి ఎంతగా ఏడ్చానో చెప్పలేను. కాలేజీకి వెళ్లడం మానేసాను. అసలు కొన్నిరోజులపాటు ఇంటినుండి బయటికి వెళ్ళలేదు. మా ప్రేమ చిహ్నంగా ఉన్న ఫోటోలు, గ్రీటింగ్ కార్డులు, లెటర్స్ చూసుకుని కుమిలిపోతూ రోజంతా ఏడుస్తూనే ఉండేదాన్ని. ఇక నా జీవితంలో సంతోషమన్నది లేదని ఒకానొక సమయంలో నా జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఒక నెలరోజులు నా కుటుంబసభ్యులతో కూడా మాట్లాడలేదు. 45 రోజుల తర్వాత మా పేరెంట్స్‌కి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పేసాను. మా కుటుంబసభ్యులు నాకు ధైర్యం చెప్పి, "భగవంతునియందు నమ్మకముంచు. అంతా మంచే జరుగుతుంద"ని చెప్పి నాకు అండగా నిలిచారు. "తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోన"ని నా వద్దనుండి మాట కూడా తీసుకున్నారు. ఆ సమయంలో నాకు సాయిబాబా గురించి తెలిసి ఇంటర్నెట్ లో సాయిబాబా గురించి చదవడం మొదలు పెట్టాను. విడిపోయిన తన భక్తులను కలిపే ఆయన ప్రత్యేకశైలి గురించి తెలుసుకున్నాను. బాబా గురించి ఉన్న సైట్లన్నీ చదువుతూ ఉండేదాన్ని. ఆ ప్రయత్నంలోనే అనుకోకుండా ఒకరోజు http://www.shirdisaideva.com సైట్ చూసాను. ఆ సైట్ హెడ్ ప్రియాంకగారిని సాయి సచ్చరిత్ర, బాబా ఊదీ పంపమని అడిగాను. ఆమె కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పంపారు. తనకి నేనెప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను.

సచ్చరిత్ర నా దగ్గరకు రావడంతోనే, 'నా ప్రేమ నాకు దక్కాలి' అన్న ఒకే ఒక కోరికతో శ్రద్ధగా పారాయణ చేయడం మొదలుపెట్టాను. పారాయణ మొదలుపెట్టానో లేదో, మనసుకి ప్రశాంతత చేకూరడం మొదలైంది. అలా సచ్చరిత్ర పారాయణతో సాయి ధ్యాసలో నాలుగునెలలు గడిచేటప్పటికి మానసికంగా ధైర్యం పెరిగింది. ఆ సమయంలో ఒకరోజు ఇండియానుండి కాల్ వచ్చింది. ఆశ్చర్యంగా కాల్‌లో అవతలివైపు ఉన్నది నా బాయ్‌ఫ్రెండ్. తను, "నువ్వు ఉంటున్న కొత్త అడ్రస్ ఏమిటి?" అని అడిగి, నేను చెప్పిన వెంటనే ఫోన్ కట్ చేసాడు. నాకేమీ అర్థం కాలేదు. 'అడ్రస్ ఎందుకు అడిగాడా?' అని ఆలోచించి, 'బహుశా తన పెళ్ళిపత్రిక పంపడానికై ఉండొచ్చున'ని అనుకున్నాను. తర్వాత ఆ విషయం మర్చిపోయి, బాబాపై దృష్టి నిలిపి ఆయన పారాయణలో కాలం గడుపుతున్నాను.

కొన్నిరోజులు గడిచిన తర్వాత 2015 ఫిబ్రవరి 20న నా ఇంటి డోర్‌ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తెరిచి చూస్తే, ఎదురుగా చేతిలో పెద్ద ఫ్లవర్ బొకే, చాక్లెట్స్ పట్టుకుని నా బాయ్‌ఫ్రెండ్ నిల్చుని ఉన్నాడు. చాలారోజుల తరువాత చూసిన ఆనందంలో అమాంతంగా ఒకరినొకరం కౌగిలించేసుకున్నాం. నిజానికి మేము ప్రేమికులమైనా అంతకుముందు ఎప్పుడూ అలా చనువు తీసుకోలేదు. మా హద్దుల్లో మేముండేవాళ్ళం. తర్వాత నేను, "నీ పెళ్లి ఎలా జరిగింది? నీ భార్య ఎక్కడ?" అని అడిగాను. అందుకు తను, "అసలు నాకు పెళ్లయితే కదా!" అన్నాడు. 'అదేమిటి?' అని నేను ఆశ్చర్యంగా అడిగాను. "నేనెంతగా నచ్చచెప్పడానికి ప్రయత్నించినా మా వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రతిరోజూ మా మధ్య చాలానే నాటకీయ యుద్ధం జరిగేది. చివరిగా నేను, "మన ఇంటి కోడలిగా తనని ఒప్పుకోకపోతే నేనెప్పటికీ ఇలాగే ఒంటరిగా ఉండిపోతాన"ని గట్టిగా చెప్పాను. ఐనా సరే వాళ్ళు అంగీకరించలేదు. ముఖ్యంగా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. తరువాత ఒకరోజు మా ఆంటీతో కలిసి అమ్మ సాయిబాబా గుడికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియదుగాని గుడినుండి ఇంటికి వస్తూనే అమ్మ నాతో, "వెంటనే అమెరికా వెళ్లి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ ఫ్రెండ్‌ని ఇక్కడికి తీసుకుని రా! నువ్వు వచ్చేలోపల నేనిక్కడ అందర్నీ ఒప్పిస్తాను" అని చెప్పింది. ఆ మాట వింటూనే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, మన పెళ్ళి విషయంలో అమ్మ ఒక్కతే పూర్తి వ్యతిరేకంగా ఉండేది. అలాంటిది తనలో హఠాత్తుగా వచ్చిన ఆ మార్పుకి అవాక్కయిపోయాను" అని చెప్పాడు. నేను అసలు నమ్మలేకపోయాను.

తరువాత నేను ఈమధ్యలో నాకు బాబాపట్ల ఏర్పడిన భక్తివిశ్వాసాల గురించి చెప్పాను. అప్పుడు ఈ పరిణామాలన్నిటికీ బాబాయే కారణం అని మేము గ్రహించాం. ఆయన తన చల్లని ఆశీర్వాదాలతో పరిస్థితులను ఇట్టే మార్చేశారని మాకర్థమై బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇక మా సంతోషానికి అవధుల్లేవు. బాబా దయవలన మళ్లీ మేము కలుసుకున్నాము. మరుసటిరోజే మేము 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గుడికి వెళ్లి, ఎవరూ ఊహించని అనూహ్యమైన రీతిలో మా ఇద్దరినీ కలపడంలో ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఆ తర్వాత మేమిద్దరం ఇండియా వచ్చి తన ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నారు. 'అప్పటివరకు నన్ను  అసహ్యించుకున్నది ఈమేనా!' అని నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా వాళ్ళ ఇంట్లో బిడ్డను అన్నట్లుగా అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. రెండురోజుల తరువాత వాళ్ళ కుటుంబమంతా నాతోపాటు ముజఫర్‌నగర్‌లోని మా ఇంటికి వచ్చారు. అంతా మాట్లాడుకుని మా పెళ్లి నిశ్చయించారు. మా పెళ్లి రెండు మతాచారాల ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది. విడిపోయామనుకున్న మేము కేవలం బాబా అనుగ్రహంవలన తిరిగి ఒక్కటయ్యాం. బాబాకు మేమెంత కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు.

తర్వాత మేమిద్దరం బాబాకు ఎంతో అంకితభక్తులుగా మారిపోయాము. 2017 మే నెలలో బాబా ఆశీస్సులతో మాకు ఒక అందమైన పాప కూడా పుట్టింది. ఇక్కడ యు.ఎస్.ఏ లో ఇండియన్స్ కాకపోయినా బాబాపట్ల భక్తివిశ్వాసాలు ఉన్న మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ప్రతి ఆరునెలలకొకసారి మా ఇంట్లో సాయిబాబా భజన చేసుకుంటున్నాము. ఇండియా వచ్చినప్పుడు పేదవాళ్లకి వైద్య, ఆర్థిక సహాయాలు అందిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మేము అనుభవిస్తున్నామో అదంతా బాబా కృపే! నేను ఎదుర్కొన్న ఆ బాధాకరమైన సమయంలో సాయిభక్తుల అనుభవాలు నాకెంతో బలాన్నిచ్చాయి. అందుకే నా అనుభవాన్ని పంచుకోవడం కూడా నా బాధ్యతగా భావించి మీతో పంచుకుంటున్నాను. తద్వారా నాకు కలిగినట్లే ఎవరైనా సాటి సాయిభక్తులకు ధైర్యం చేకూరుతుందని నా విశ్వాసం. బాబాపట్ల నమ్మకం ఉంచండి, ఆయన మీకు అండగా ఉంటారు.

అల్లామాలిక్!

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo