శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఈరోజు దామోదర్ సావల్రాం రస్నే వర్ధంతి సందర్భంగా ఆ మహాభక్తుని గురించి స్మరించుకొనే ప్రయత్నంలో ఈ ఆర్టికల్ ప్రచురిస్తున్నాము.
వాడుక పేరు : దామూ అన్నా
వృత్తి : గాజుల వ్యాపారి
నివాస స్థలం : అహ్మద్ నగర్
బాబా దర్శనం : 1893
మరణం : 20-01-1941
విశేషాలు : ప్రతి ఏటా ఉరుసు ఉత్సవానికి (శ్రీరామనవమి) ఒక జెండాను కానుకగా ఇచ్చేవాడు.
బాబా ద్వారా విశిష్ట అనుభవాలను, పవిత్రమైన బోధనలను, లీలలను మూటగట్టుకున్న అదృష్టవంతుడు దామోదర్ సావల్రాం రస్నే. బాబా ఇతనిని "దామూ" అని పిలిచేవారు. మిగతా వారు 'దామూ అన్నా' అని పిలుచుకునేవారు.
అహ్మద్‌నగర్‌కు చెందిన దామూ కడు బీదవాడు. గాజుల వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకొనేవాడు. తరువాత అదృష్టం కలిసివచ్చి వ్యాపారంలో రాణించి ధనికుడయ్యాడు. అయితే ఇతను రెండు వివాహాలు చేసుకున్నప్పటికీ సంతానం కలగలేదు. ఆ బాధ ఇతనిని ఎంతగానో క్రుంగదీస్తుండేది. ఇతని స్నేహితుడు 'గోపాలరావు గుండు' కోపర్‌గాఁవ్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవాడు. ఇతనికి ముగ్గురు భార్యలున్నా సంతానం లేదు. ఇతను బాబాకు గొప్పభక్తుడు. సాయి ఆశీర్వాదబలంతో ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనందంలో గోపాలరావు బాబా అనుమతితో శిరిడీలో ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించాడు. గోపాలరావు సిఫారసుతో దామూ 1893 లో శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని, ఆయన ఆశీస్సులతో సంతాన భాగ్యాన్ని పొందాడు. అందుకు కృతజ్ఞతగా ఉరుసు ఉత్సవంలో ప్రతి ఏటా ఒక జెండాను కానుకగా ఇవ్వాలని గోపాలరావు దామూకు పురమాయించాడు. అలాగే నానాసాహెబు నిమోన్కర్‌ను మరో జెండా కానుకగా ఇవ్వమని పురమాయించాడు. ఈ రెండు జెండాలను ఉత్సవం జరిగే వేళలో మసీదు రెండు మూలలా నిలబెట్టి ఎగురవేసేవారు. శిరిడీలో 1897 సంవత్సరంలో శ్రీరామనవమినాడు ఉరుసు ఉత్సవం ప్రారంభమైంది. ఆనాటి ఉత్సవానికి హాజరైన దామూ ఆనాటి నుంచి పతాకాన్ని కానుకగా ఇవ్వటాన్ని సంప్రదాయంగా పెట్టుకున్నాడు. ఉత్సవానికి వచ్చే బీదలకు దామూ అన్నదానం చేసేవాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ శిరిడీలో అమలులో ఉంది.
ఒకసారి బొంబాయికి చెందిన ఓ స్నేహితుడు ప్రత్తి వ్యాపారంలో తనతో భాగస్వామిగా చేరి, రెండు లక్షల రూపాయల లాభం ఆర్జించవచ్చని దామూకు ఆశ పెట్టాడు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని, ఎంతమాత్రం నష్టానికి అవకాశం లేదని, కనుక అవకాశాన్ని పోగొట్టుకోక వెంటనే భాగస్వామిగా చేరమని దామూకు ఉత్తరం రాశాడు. దాము ఆ బేరంలోకి దిగాలా? వద్దా? అని సందేహపడ్డాడు. వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ, లాభం వస్తుందనగానే అతని మనసు అటువైపు లాగింది. అయినా తాను బాబాకు భక్తుడు కావటంవల్ల ఈ విషయమై శ్యామాకు వివరంగా ఒక లేఖ రాసి బాబా సలహాను అడిగి తెలుసుకొమ్మన్నాడు. మర్నాడు ఆ ఉత్తరం శ్యామాకు అందింది. శ్యామా దానిని తీసుకుని మసీదుకు వెళ్లి బాబా ఎదుట పెట్టాడు. బాబా ఆ కాగితం ఏమిటని శ్యామాను అడిగారు. అహ్మద్‌నగర్ నుంచి దామూ అన్నా ఏదో విషయమై సంశయం తీర్చుకునేందుకు లేఖ రాశాడని శ్యామా చెప్పాడు.
“దామూ ఏమి రాశాడు? ఏం ఎత్తులు వేస్తున్నాడు? భగవంతుడు ఇచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశానికి ఎగరాలని చూస్తున్నట్టున్నాడు. వాడు రాసిన ఉత్తరం చదువు” అన్నారు బాబా. శ్యామా ఆశ్చర్యపోయాడు. ఆ ఉత్తరంలో ఉన్న దానికే బాబా సమాధానమిచ్చారు. ఇక చదవటానికి ఏముంది కనుక? అప్పుడు శ్యామా బాబాతో, “దేవా! నువ్విక్కడే కూర్చుని భక్తులను ఆందోళనలపాలు చేస్తావు. వారు వ్యాకులపడితే ఇక్కడకు ఈడ్చుకుని వస్తావు. కొందరిని ప్రత్యక్షంగా, మరికొందరిని ఉత్తరముల రూపంలో తీసుకువస్తావు. ఉత్తరంలోని సంగతులు తెలిసి మళ్లీ నన్నెందుకు చదవమంటావు?” అన్నాడు. బాబా “శ్యామా! దయచేసి ఉత్తరంలో ఏముందో చదువు. నా నోటికి వచ్చినది నేను మాట్లాడతాను. నన్ను విశ్వసించే వారెవరు చెప్పు?” అన్నారు.
అప్పుడు శ్యామా ఉత్తరాన్ని చదివాడు. బాబా దానిని జాగ్రత్తగా విని ఇలా అన్నారు: "సేఠుకు పిచ్చెక్కినట్టుంది. 'అతనింట ఏ లోటూ లేద'ని సమాధానం రాయి. తనకున్న సగం రొట్టెతో సంతుష్ఠి చెందమను. లక్షలార్జించాలని ఆయసపడవద్దని చెప్పు”. శ్యామా అదే విషయాన్ని దామూకు సమాధానంగా రాశాడు.
బాబా సమాధానం కోసమే ఆతృతతో ఎదురుచూస్తున్న దామూ ఆ ఉత్తరాన్ని చదివి నిరాశకు గురయ్యాడు. తన ఆశ అడియాస అయిందని నిరాశ చెందాడు. బాబాను లేఖ ద్వారా సమాధానం కోరటానికి, స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయటానికి తేడా ఉంటుందని భావించి దామూ శిరిడీకి బయల్దేరాడు. బాబాకు నమస్కారం చేసి, పాదాలు వత్తుతూ కూర్చున్నాడు. అయితే తన వ్యాపారం విషయాన్ని బహిరంగంగా బాబా ఎదుట ప్రస్తావించటానికి అతనికి ధైర్యం సరిపోలేదు. "ఈ విషయంలో బాబా తనకు సహాయం చేస్తే ప్రత్తి వ్యాపారంలో వచ్చే లాభంలో సగం బాబాకు ఇస్తాను" అని దామూ మనసులో అనుకొన్నాడు. అయితే, బాబా అందరి అంతరంగాలను చదివే సర్వజ్ఞులు కదా! అందరి భూత, భవిష్యత్తులు బాబాకు అరచేతిలో ఉసిరికాయ వంటివి. దామూ అన్నా మనసులోని ఆలోచనను బాబా కనిపెట్టారు. బిడ్డలు తీపి మాత్రలే కోరుకుంటారు. కానీ బిడ్డల ఆరోగ్యాన్ని కోరి తల్లి వారికి చేదు మాత్రలనిస్తుంది. తీపివస్తువులు ఆరోగ్యానికి చేటు తెస్తాయి. చేదుమాత్రలు ఆరోగ్యాన్ని నయం చేస్తాయి. తల్లి తన బిడ్డ మేలు కోరి బుజ్జగించి చేదు మాత్రలనే మింగిస్తుంది. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భూత, భవిష్యత్, వర్తమానముల లాభముల గురించి బాబాకు తెలియనిది లేదు. దామూ అన్నా మనసును కనిపెట్టిన బాబా ఇలా అన్నారు: "ప్రపంచ విషయాల్లో తగుల్కొనటానికి నాకిష్టం లేదు”. తను మనసులో అనుకున్నది బాబా గ్రహించారని ఆశ్చర్యపోయిన దామూ ఇక తన వ్యాపార ప్రస్తావనను విడిచి పెట్టాడు.
మరోసారి దామూ అన్నా ధాన్యముల వ్యాపారం చేయాలని తలచాడు. ఈ ఆలోచనను కూడా బాబా కనిపెట్టి, “దామూ! నువ్వు అయిదుసేర్ల చొప్పున కొని ఏడుసేర్ల చొప్పున అమ్మాల్సి ఉంటుంది. కనుక ఈ వ్యాపారాన్ని కూడా మానుకో!" అని సలహా ఇచ్చారు. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర బాగానే ఉంది. కానీ, ఒకటి రెండు నెలల తరువాత వర్షాలు విస్తారంగా కురిసి ధరలు పడిపోయాయి. ధాన్యం నిల్వ చేసిన వారంతా నష్టాల పాలయ్యారు. ఈ అవస్థ నుంచి బాబా దామూను కాపాడారు. అనంతరం కొద్దిరోజులకు ప్రత్తి వ్యాపారం కూడా పడిపోయింది. దామూకు ఇంతకుముందు వ్యాపారంలో లాభాన్ని ఆశ పెట్టిన మిత్రుడు ఇంకొక మిత్రుని సాయంతో వ్యాపారంలోకి దిగాడు. ఆ వ్యాపారంలో వారిద్దరు తీవ్రంగా నష్టపోయారు. బాబా తనను రెండుసార్లు వ్యాపారంలో గొప్ప నష్టాల నుంచి కాపాడారని భావించిన దామూ బాబాపై మరింత విశ్వాసాన్ని పెంచుకున్నాడు. అప్పటినుంచి బాబా మహాసమాధి చెందేవరకు దామూ బాబాకు నిజమైన భక్తుడిగానే మసలుకొన్నాడు. దురాశపడక, ఉన్నదానితోనే తృప్తిచెందటం నేర్చుకొన్నాడు.
ఇంతకుముందు దామూకు బాబా సంతానభాగ్యం కలిగించారని తెలుసుకున్నాం కదా! ఆ లీలను బాబా ఎంతో చమత్కారంగా నడిపారు. "శ్రీసాయి సచ్చరిత్ర"లో ఈ ఉదంతం 'ఆమ్రలీల'గా వర్ణింపబడింది. దామూ అన్నాకు ఇద్దరు భార్యలు. కానీ సంతానం మాత్రం కలగలేదు. ఎందరో జ్యోతిష్కులను కలిశాడు. అతను కూడా స్వయంగా తనకు సంతాన యోగం ఉందో లేదో తెలుసుకోవటానికి జ్యోతిష శాస్త్రాన్ని చదివాడు. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటంవల్ల సంతానం కలిగే అవకాశం లేదని తెలుసుకొన్నాడు. ఈ క్రమంలో గోపాలరావుగుండు ద్వారా బాబా గురించి తెలుసుకున్న దామూ అతని సూచన మేరకు 1893-94 ప్రాంతంలో శిరిడీ వచ్చాడు. అతను శిరిడీలో అడుగు పెట్టటానికి కొద్దిక్షణాల ముందు బాబాకు రాళే అనే భక్తుడు గోవా నుంచి మామిడిపండ్లను పార్శిలు ద్వారా పంపాడు. వాటిని రాళే శ్యామా పేరున పంపాడు. శ్యామా వాటిని బాబాకు అందచేశాడు. బాబా పార్శిలు బుట్టలోని మామిడిపండ్లను మసీదులో ఉన్న భక్తులందరికీ పంచారు. నాలుగు పండ్లను మాత్రం తీసి ప్రక్కన పెట్టారు. ఆ నాలుగు పండ్లను తన కొలంబా (కుండ)లో భద్రపరచి, "ఈ నాలుగూ దామూవి. అవి ఇక్కడే ఉండాలి” అన్నారు. ఇంతలో దామూ మసీదులో అడుగుపెట్టాడు. బాబా అతనిని చూస్తూనే, “రావయ్యా దామూ! అందరి కళ్లూ ఈ మామిడిపండ్ల పైనే ఉన్నాయి. కానీ అవి నీ కోసమే ఉంచాను. వాటిని నీవే తిని చావాలి" అన్నారు. బాబా మాటలు వినటంతోనే దామూ ఉలిక్కిపడ్డాడు. బాబా ముఖ్యభక్తుడు మహల్సాపతి వెంటనే అందుకుని, “బాబా 'చావాలి' అన్నది అహంకారం గురించి. అదొక ఆశీర్వాదం వంటిది” అని దామూకు సర్దిచెప్పాడు. అప్పుడు బాబా దామూతో, “ఈ మామిడిపండ్లను నీ చిన్న భార్యకివ్వు. ఈ ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారం) వల్ల ఆమెకు నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు పుడతారు” అని చెప్పారు. దామూ ఆ నాలుగు మామిడిపండ్లను తన చిన్న భార్యకిచ్చాడు. కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. జ్యోతిష్కుల మాటలు ఉత్తవయ్యాయి. అప్పుడే కాదు, ఇప్పటికీ బాబా వాక్కు, ఆశీర్వాదాలు భక్తులను కాచి కాపాడుతున్నాయి.
ఈ సందర్భంలో బాబా దామూకు అమూల్యమైన అభయాన్నిచ్చారు. “సమాధి చెందినప్పటికీ నా సమాధినుంచే నా ఎముకలు మాట్లాడతాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో కూడా నా సమాధి మాట్లాడుతుంది. వారి వెన్నంటి కదులుతుంది. నేను మీ వద్ద ఉండనేమోనని భయంవద్దు. నా ఎముకలు మాట్లాడుతూ మీ క్షేమాన్ని కనుగొంటాయి. ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకోండి. నాయందే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నమ్మకం ఉంచండి. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందుతారు” అని బాబా పలికారు. ఇది జరిగాక దామూకు బాబాపై భక్తి, విశ్వాసాలు మరింత స్థిరమయ్యాయి. ఒకసారి అతనికి బాబా సమక్షంలో కలిగిన రెండు సందేహాలు ఎలా పటాపంచలయ్యాయో అతను డైరీలో రాసుకున్నాడు. దాని ప్రకారం...
ఒకసారి దామూ అన్నా బాబా పాదాలు వత్తుతూ మసీదులో కూర్చున్నాడు. ఆ సమయంలో దామూకి రెండు సందేహాలు కలిగాయి. ఒకటి- బాబాను నిత్యం ఎందరో దర్శించుకుంటున్నారు కదా! వారందరూ నిజంగా మేలు పొందుతున్నారా? రెండవది దామూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సందేహం. అది- బాబా భౌతిక శరీరం విడిచాక నా జీవితం ఏం కాను? నా జీవితమనే ఓడను ఎలా నడుపగలను? అది ఎటో అటు కొట్టుకుపోవాల్సిందేనా? అలా అయితే నా గతేం కాను? బాబా దామూలో కలిగిన రెండు సందేహాలను తన సర్వజ్ఞతతో గ్రహించారు. వాటినిలా తీర్చారు. “దామూ! పూర్తిగా పూత పూసి ఉన్న మామిడిచెట్ల వైపు చూడు. ఆ పువ్వులన్నీ పండ్లయితే ఎంత మంచి పంట అవుతుంది! కాని అలా జరుగుతుందా? పువ్వు పుట్టగానే చాలామటుకు సహజంగానే రాలిపోతుంది. కొంత గాలికి రాలిపోతుంది. చివరికి కొన్ని పిందెలు మాత్రమే మిగులుతాయి”. బాబా చూపిన ఉదాహరణతో దామూలో కలిగిన మొదటి సందేహం తీరిపోయింది.
అంటే, ఎందరో ఎన్నో కోరికలతో భగవంతుడిని దర్శిస్తారు. నిజంగా భగవంతునిపై నిజమైన భక్తి, విశ్వాసాలు గలవారు మాత్రమే తుదకంటూ భగవన్నామ స్మరణతో తరిస్తారు. అలాంటి నిజ భక్తులే భగవంతుని వల్ల మేలు పొందుతారు. తమపై, భగవంతునిపై సరైన విశ్వాసం లేని భక్తులు పూత, పిందెల్లా తొలిదశలోనే రాలిపోతారని బాబా చెప్పిన దానికి భావం.
ఇక, రెండవ సందేహాన్ని బాబా ఇలా తీర్చారు. “ఎక్కడైనా, ఎప్పుడైనా నా గురించి చింతిస్తే నేను అక్కడే ఉంటాను”.
దామూ బాబా పాదాలను మరింత స్థిరంగా వత్తుతూ తన్మయుడయ్యాడు. ఆ తరువాత తనకు కలిగిన అనుభవాన్ని, తన జీవితంలోని ముఖ్య సంఘటనలను కూడా తన డైరీలో ఇలా రాసుకున్నాడు.
"1918కి ముందు బాబా వాగ్దానం ప్రకారం తన వాక్కులను నెరవేర్చారు. 1918 తరువాత కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ బాబా నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు. ఈ సంఘటన 1910-11 మధ్య కాలంలో జరిగింది. కాలక్రమంలో నా సోదరులు వేరుపడ్డారు. నా సోదరి కాలధర్మం చెందింది. నా ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసుల విచారణ జరిగింది. ఈ సంఘటలన్నీ నన్ను కలవరపరిచాయి. నా సోదరి మరణంతో నా మనసు వికలమైంది. నేను జీవితంలోని సుఖాలను లక్ష్యపెట్టలేదు. అన్నిటినీ వదిలేసి ఆ సమయంలో నేను బాబా వద్దకు వెళ్లి నమస్కరించాను. వారు మంచి ఉపదేశంతో నా మనసును శాంతింపచేశారు. అప్పా కులకర్ణి ఇంట్లో నాకు బొబ్బట్లతో విందు చేయించారు. నా నుదుట చందనం పూశారు. అనంతరం కొంతకాలానికి నా ఇంట్లో దొంగతనం జరిగింది. నాకు ముప్పై సంవత్సరాలుగా ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడే మిత్రద్రోహంతో నా భార్య నగలపెట్టెను అపహరించుకుపోయాడు. అందులో శుభకరమైనదైన నత్తు (నాసికాభరణం) ఉంది. బాబా చిత్రపటం ముందు జరిగిన దానికి చింతిస్తూ ఏడ్చాను. ఆ మరుసటిరోజే నా స్నేహితుడే స్వయంగా వచ్చి నగలపెట్టెను నాకు అందచేసి, తను చేసిన పనికి క్షమాపణ కోరాడు”.
తనకు సంతానం కావాలనే కోరికతో దామూ బాబాను దర్శించుకున్నాడు. బాబా దయవల్ల ఆ కోరిక తీరగానే అతను బాబాపై భక్తి, విశ్వాసాలను కుదుర్చుకున్నాడు. ఆ తరువాత మెల్లగా బాబా అతనికి లౌకిక విషయాలపై విరక్తి కలిగించి పునీతుడ్ని చేశారు. ఈ మహాభక్తుడు 20-01-1941న సాయిలో ఐక్యమైనారు.
శ్రీ సాయినాథాయనమః
Very good
ReplyDelete🕉 sai Ram
ReplyDelete