శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
అవినాష్ పాద్య ముంబాయి నివాసి. అతను సాయిబాబా భక్తుడు. అతనెప్పుడూ, "బాబా! ఒక్కసారైనా మీరు నాకు కలలో దర్శనమిస్తే నేను ధన్యుడనవుతాన"ని ప్రార్థిస్తుండేవాడు. అదృష్టం కొద్దీ అతను 1991లో చాలాసార్లు శిరిడీ దర్శించాడు. ఒకసారి శ్రీరాంపూర్‌లో ఉన్న బంధువులను కలవాలని నిశ్చయించుకుని, ఫిబ్రవరి 27న వేకువఝామునే నిద్రలేచాడు. తెల్లవారి గం. 3:50 నిమిషాలకు బస్టాండుకి వెళ్లేసరికి అక్కడ చాలా తక్కువమంది ప్రయాణీకులు ఉండటంతో అతను చాలా సంతోషించాడు. కానీ బస్సు వచ్చాక, బస్సెక్కి చూస్తే సీట్లన్నీ నిండుగా ఉన్నాయి. అతనికి తప్పనిసరై మన్మాడ్ వరకు నిల్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. మనస్సులో "ఏ కష్టం లేకుండా ప్రయాణం సాగేలా సహాయం చేయండ"ని బాబాను ప్రార్థిస్తూ బాబా నామం నిశ్శబ్దంగా చెప్పుకుంటున్నాడు. అలా నామం చెప్పుకుంటూ, 'ఎప్పటికైనా బాబా కలలో కనిపిస్తారా' అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి బస్సు కోపర్‌గాఁవ్ వైపు వెళ్తుండగా, యాదృచ్ఛికంగా అతను బస్సు డోర్ వైపు తిరిగి చూసాడు. డోరు ప్రక్కగా ఒక ఫకీరు నిలుచుని ఉండటం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఆ ఫకీరు పొడుగాటి కఫ్నీ ధరించి, తలకు గుడ్డ చుట్టుకుని, ఎడమ భుజానికి జోలె వేసుకుని, కుడిచేతిలో రెండు ఇనుప పట్టీలు పట్టుకొని ఉన్నారు. ఆయన అచ్చం తన ఇంట్లో పూజించే పటంలోని బాబాలాగే ఉన్నారు. ఆయన నేరుగా అతన్ని చూసి నవ్వారు. 'ఆయన నిజంగా బాబా అయితే కోపర్‌గాఁవ్‌లో దిగి శిరిడీ వైపు వెళ్లాల'ని అతను మనస్సులో అనుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే ఆ ఫకీరు కోపర్‌గాఁవ్‌లో దిగాడు. ఆయన్ని అనుసరిస్తూ అతను కూడా బస్సు దిగాడు. ఆయన కొన్ని అడుగులు వేసిన తరువాత అతని వైపు తిరిగి, "బిడ్డా! ఇక నేను వెళ్ళాలి. రేపు గురువారం కనుక నాకు శిరిడీలో చాలా పని ఉంది" అని చెప్పారు. ఆశ్చర్యంతో అతను ఆ ఫకీరుకి సాష్టాంగనమస్కారం చేసాడు. అంతలో బస్సు కదిలింది. వెంటనే అతను కదులుతున్న బస్సెక్కి ఆలోచనలో పడ్డాడు. "ఎంతోకాలంగా నేను బాబా కలలో కనిపిస్తే ధన్యుణ్ణవుతానని అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నా కోరిక నెరవేరింది. ఆ ఫకీరు బాబాయేనని నాకు ఋజువైంది. ఈరోజు నేను బాబాను ప్రత్యక్షంగా చూశాను. అంతేకాదు, ఆయన నాతో మాట్లాడారు కూడా. ఇప్పుడు నేను వెయ్యిరెట్లు ధన్యుణ్ణి!" అని అనుకున్నాడు.
మూలం: సాయిప్రసాద్ పత్రిక, దీపావళి సంచిక 1997.
ఓం శ్రీ సాయి రామ్ 🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
ReplyDelete