సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నాకు మనిషిరూపంగా దర్శనమిస్తే మీ పాదాలే నమ్ముకుంటా...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నా పేరు బి.నాగమల్లేశ్వరి. గుంటూరు, వికాస్‌నగర్, 9వ లైనులో మా నివాసం. నాకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకునే అవకాశమిచ్చిన బాబాకి నా హృదయపూర్వక నమస్కారములు.

7, 8 సంవత్సరాల క్రిందట విద్యానగర్ 3వ లైనులో భీష్మఏకాదశి సందర్భంగా 42 రోజులపాటు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకున్నాము. అదేసమయంలో ఒక గురువారంనాడు “సాయిచరితామృతం" వారంరోజులు పారాయణ చేయాలన్న ఉద్దేశ్యంతో పూజ మొదలుపెట్టాను. పూజ ప్రారంభిస్తూ, "బాబా! కొంతమందికి మీ దర్శనం ద్వారా, మరికొంతమందికి ఆచరణ ద్వారా ఇలా రకరకాలుగా ఎన్నో నిదర్శనాలు చూపారు. నాకు మీరు 'మానవరూపం'గా దర్శనమిస్తే, నేను మీ పాదాలే నమ్ముకుంటాను" అని సంకల్పం చేసుకున్నాను. తరువాత 108 తెల్లనిపూలతో అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజచేసి,  పరమాన్నం నివేదన చేసి, పండు, తాంబూలం, 2 రూపాయలు దక్షిణ సమర్పించి, బాబాకి హారతి ఇస్తున్న సమయంలో “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి" అని ఒక క్రొత్త గొంతు వినిపించడంతో నేను ప్రసాదం, దక్షిణ తాంబూలంతో క్రిందికి వచ్చి చూస్తే, దూరంగా బాబా కాషాయబట్టలు ధరించి, భుజానికి జోలె తగిలించుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా నిదానంగా నడుచుకుంటూ వస్తూ కనిపించారు. ఆయన నేరుగా మా వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డారు. నేను తీసుకొచ్చిన ప్రసాదంతో ఆయన ముందు నిలబడగానే, ఆయన జోలెలో పెట్టమని జోలె చూపించారు. మా ఇంట్లో అద్దెకున్నావిడ నీళ్ళ ట్యాంకర్ కోసం నా వెనుకే నిలబడి అంతా చూస్తోంది. నేనెప్పుడైతే ప్రసాదం జోలెలో పెట్టానో  వెంటనే ఆయన 'కొత్త అమ్మా' అని రెండుసార్లు నాతో అన్నారు. కానీ నేనొక రకమైన తన్మయత్వంలో ఉండటం వలన ఆ మాటలు నా చెవిన పడలేదు. నా వెనుకనున్న ఆవిడ 'ఆయన క్రొత్తంటండీ!' అని నాకు చెపితే, "ఔను బాబా, మీరు నిజంగా క్రొత్తే. నాకు మనిషిరూపంగా దర్శనమివ్వాలని వచ్చిన ఆ బాబాయే మీరు" అని మనస్ఫూర్తిగా ఆయన పాదాలకు నమస్కరించుకున్నాను. పైకి లేచాక ఆయన నన్ను చేయి చాపమని అడిగారు. అది కూడా నాకు వినిపించకపోతే మళ్ళీ నా వెనకున్నావిడ చెప్పింది. అప్పుడు నేను చేయి చాపితే, ఆయన నా చేతిలో “విభూది” వేసి వెళ్లిపోయారు.

మరుసటిరోజు పసుపుపూలతో అష్టోత్తర శతనామ పూజ చేసి, పులిహోర నైవేద్యం పెట్టాను. ఆరోజు కూడా బాబా వస్తారని ఎదురుచూశాను కానీ, రాలేదు. తరువాత నేను రెండు బాక్సులలో పులిహోర ప్రసాదం పెట్టుకుని గుడికి వెళ్ళాను. అక్కడ విష్ణుసహస్రనామ పారాయణ పూర్తైన తరువాత మధ్యాహ్న హారతి ప్రారంభించే ముందు నేను తల త్రిప్పి బయటకు చూస్తే, ముందురోజు మా ఇంటికి వచ్చి ప్రసాదం, దక్షిణ తాంబూలం తీసుకున్న ఆయన త్వరత్వరగా నడుచుకుంటూ గుడివైపే వస్తున్నట్లు కనిపించారు. హారతి పూర్తైన తరువాత భక్తులు బాబా పాదాలకు నమస్కరించుకుని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు. నేను, ఆ గుడి కోశాధికారి రాణి, పూజారిగారు మాత్రమే మిగిలాము. తరువాత గుడికి తాళాలు వేసి మేము కూడా మా ఇళ్ళకి వెళదామని బయటకు  వచ్చేసరికి. గుడి మెట్లపై ఆయన కూర్చొని, కాళ్ళు చాపుకుని ధ్యానం చేసుకుంటున్నారు. రాణి ఆయన చేతిలో కమలాపండు తొనలను పెట్టింది. నేను అప్పటికే నాతో తెచ్చిన పులిహోర బాక్సులలో ఒకటి అందరికీ గుడిలో పంచిపెట్టాను. వేరొకటి మా అమ్మాయికి ఇవ్వడానికి సంచిలో పెట్టాను. అక్కడ బాబాని చూచిన వెంటనే నా వద్ద ప్రసాదం ఉందని నాకు తెలుసు కానీ, అది తీసి ఆయనకు ఎందుకో ఇవ్వలేకపోయాను. నా పర్సులో నుంచి  11 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టి, నా బిడ్డ 'రాజశ్రీ' ఇంటికి బయలుదేరాను. కానీ  బయలుదేరినప్పటి నుండి "నా దగ్గర ప్రసాదం ఉన్నా, నేనెందుకు బాబాకు ఇవ్వలేకపోయాన"ని నన్ను నేనే తిట్టుకుంటూ మా అమ్మాయి ఇంటికి చేరాను. మా అమ్మాయి, "కాళ్లు కడుక్కొని రామ్మా! భోజనం పెడతాను" అన్నది. ముందురోజునుండి ఆరోజువరకు జరిగినదంతా పూసగుచ్చినట్లు మా అమ్మాయికి చెప్పాను. దానికి తను, "ఎందుకమ్మా బాధపడతావు? మొదటిరోజు నీ వద్దనుండి ప్రసాదం, రెండవరోజు దక్షిణ తీసుకున్నారు బాబా. అంతకన్నా కావల్సింది ఏముంది?" అని చెప్పింది. తన మాటలకు తృప్తిపడి అప్పుడు భోజనం చేశాను. ఆ తర్వాత ఈనాటివరకు ఆయన మళ్ళీ ఎప్పుడూ రాలేదు, ఎక్కడా కనిపించలేదు. ఆవిధంగా మానుషరూపాన నాకు దర్శనమిచ్చిన నా తండ్రి నా జీవితంలో అణువణువునా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ అనుభవం మచ్చుకకు ఒకటి మాత్రమే. ఇవికాక ఎన్నెన్నో అనుభవాలిచ్చారు నా తండ్రి సాయి.

2 comments:

  1. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo