సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1455వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి మన మనసు తెలుసు - తలచుకుంటే చాలు ఎంత కష్టమైనా తీరుస్తారు
2. గాల్‌బ్లాడర్‌లో స్టోన్‌ని అదృశ్యం చేసిన బాబా

బాబాకి మన మనసు తెలుసు - తలచుకుంటే చాలు ఎంత కష్టమైనా తీరుస్తారు


ముందుగా సాయినాథ్ మహారాజ్ పాదపద్మములకు నా నమస్కారాలు. నా పేరు రాణి. నేను సాయి భక్తురాలిని. ఆయన నా జీవితంలోని కష్టసుఖాలన్నిటిలో ఉంటూ చాలా అద్భుతాలు చేశారు. వాటిలో ఇప్పుడు పంచుకోబోయే అనుభవాలు కొన్ని. మేము ఇటీవల (2023) సంక్రాంతి సెలవులకి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మావాళ్ళ ఊరు ఏలూరు నుంచి తిరుపతి వరకు ట్రైనులో వచ్చాము. మేము వేకువఝామున నాలుగు గంటలకు తిరుపతిలో దిగాము. అక్కడినుండి మా ఊరు వెళ్లాలంటే ఇంకో మూడు గంటల ప్రయాణం చేయాల్సి ఉండగా, బస్సులో వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ అంతలో ధర్మవరం వెళ్లే ట్రైన్ 5వ నెంబరు ప్లాట్‌ఫాం మీదకి వస్తుందని అనౌన్స్ చేశారు. అది విని 1వ నెంబర్ ప్లాట్‌ఫాం మీద ఉన్న మేము 'టికెట్ తీసుకొని 5వ నెంబర్ ప్లాట్‌ఫాంకి వెళ్లేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంద'ని భావించి టికెట్ తీసుకోకుండానే 5వ నెంబర్ ప్లాట్‌ఫాంకి వెళ్లిపోయి, హడావిడిలో రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కేశాం. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! మేము ఏ సమస్యా లేకుండా మా ఊరు చేరుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా మేము మా ఊరికి చేరుకున్నాం. తలచుకుంటే చాలు, ఎంత కష్టమైనా తీరుస్తారు బాబా. "ధన్యవాదాలు బాబా".


నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేయాలని ఎప్పటినంచో అనుకుంటున్నప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. సంక్రాతికి ఊరు వెళ్లొచ్చాక పారాయణ చేయాలనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో మా తోడికోడలు మా ఊరు వచ్చి, "మా అక్క పారాయణ గ్రూపులో ఉంది. తను మా ఇంట్లో ఉన్నప్పుడు పారాయణ చేసింది. నేను తనని అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాను. నువ్వు కూడా ఆ గ్రూపులో జాయిన్ అవ్వొచ్చు కదరా?" అని నన్ను అడిగింది. అయితే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలుండటం వల్ల తనని, "కొన్ని నియమాలు పాటించాలి కదా అక్క, కుదరదేమో!" అని అన్నాను. అప్పుడు తను, "లేదురా, ఎలాంటి నియమాలు లేవు. నువ్వు పారాయణ చేసుకో" అని నన్ను పారాయణ గ్రూపులో జాయిన్ చేసింది. కొన్ని రోజులకి నేను మహా పారాయణ గ్రూపులో కూడా జాయిన్ అయ్యాను. బాబా లీలలు అద్భుతం. ఆయన నా మనసులో కోరిక తెలుసుకుని నాకు పారాయణ చేసే అదృష్టం కల్పించారు. "సాయినాథా! నా మనసులో ఉన్న బాధ, దిగులును తొలగించు తండ్రి".


గాల్‌బ్లాడర్‌లో స్టోన్‌ని అదృశ్యం చేసిన బాబా


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!! ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు పద్మ. నేను బాబా భక్తురాలిని. నేను ప్రతిరోజూ పొద్దున్నే ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి, ఆపై నా పనులు మొదలుపెట్టుకుంటాను. అలా చాలా రోజుల నుంచి నేను తోటి భక్తుల అనుభవాలు చదువుతున్నాను. కానీ నా అనుభవాలు ఇంతవరకు పంచుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి సాయినాథా! ఇక నా అనుభవానికి వస్తే... నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మాయికి జ్వరం వస్తుండేది. దాంతోపాటు కడుపునొప్పి కూడా ఉంటుండేది. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి, "గాల్‌బ్లాడర్‌లో స్టోన్ ఉంది" అని చెప్పారు. దాంతో మేము లివర్ స్పెసలిస్ట్ డాక్టరుని సంప్రదించాము. ఆయన కూడా స్కానింగ్ చేసి, "స్టోన్ ఉంద"ని చెప్పి, అవి కరగడానికి మందులిచ్చారు. ఆ మందులు మూడు సంవత్సరాలు వాడినా రాయి కరగలేదు. ఇక డాక్టరుగారు, "రాయి కరగటం లేదు కనుక ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు ఆపరేషన్ చేస్తాను" అన్నారు. అప్పటికే నేను సాయిసచ్చరిత్ర, గురుచరిత్ర పారాయణ చేస్తూ, సదా బాబాను తలచుకుంటూ ఉంటుండేదాన్ని. రెండు నెలల తర్వాత అమ్మాయికి బాగా కడుపునొప్పి వస్తే, నేను అమ్మాయిని తీసుకొని మళ్లీ డాక్టర దగ్గరకి వెళ్ళాను. డాక్టర్ స్కాన్ చేసి, "అర్జెంటుగా ఒక వారం లోపల ఆపరేషన్ చేయాలి. లేకపోతే ఆ రాయి వేరే గ్రంధిలోకి పోయే అవకాశముంది. అదీకాక, రాయితోపాటు మట్టిలా కొంచెం రాయిపొడి కూడా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే చాలా ప్రమాదం" అని చెప్పి, డబ్బులు కూడా చాలా ఎక్కువ అడిగి, ఆపరేషన్ కోసం వేరే డాక్టర్ దగ్గరకి పంపుతానని అన్నారు. "అలా జరగకుండా రాయి కనపడకుండా పోయేలా చూడమ"ని మేము బాబాను వేడుకొని భారం ఆయన మీద వేశాము. డాక్టరు వారం తర్వాత రమ్మంటే మూడు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నేను నాతోపాటు శ్రీసాయిసచ్చరిత్ర తీసుకొని వెళ్ళాను. ప్రయాణంలో కూడా బాబా నామం తలచుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను సచ్చరిత్ర పారాయణ చేసుకుంటుంటే, మా అమ్మాయి డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. ఆయన కొంచెం కోపంగా, "ఒక వారంలో రమ్మంటే, ఇప్పుడా మీరు వచ్చేది? ఏదైనా ప్రమాదమైతే నాకు సంబంధం లేదు" అని మరలా స్కాన్ వ్రాశారు. మాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. కొద్దిసేపటికి మేము డాక్టరుగారి గదిలోకి వెళ్తుంటే, అప్పటికీ ఆయన రిపోర్ట్ చూసారు కాబోలు, "ఇదేంటమ్మా? నీ గాల్‌బ్లాడర్‌లో రాయి లేదు. ఆశ్చర్యంగా ఉంది" అని నవ్వారు. మేము పూర్తిగా లోపలికి వెళ్తే, ఎదురుగా టేబుల్ మీద బాబా ఫోటో, సచ్చరిత్ర పుస్తకము కనిపించాయి. అంటే, డాక్టరు కూడా బాబా భక్తులే. మేము కోరుకున్నట్లే రాయి కనపడకుండా చేసి మమ్మల్ని ఆ బ్రహ్మాండనాయకుడు కాపాడారని మేము మురిసిపోయాం, మైమరచిపోయాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


5 comments:

  1. సాయి నన్ను నా భర్తని కలుపు సాయి నా వంశీ నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి ప్లీజ్ సాయి తనకు దూరంగా నేను ఉండలేను సాయి ప్లీజ్ నన్ను వంశీ నీ కడుపు సాయి తన భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకెళ్లలో చూడు సాయి నేను అనుభవనంలో పంచుకుంటాను సాయి

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  5. Baba nannu ee kasthla nundi rakshichu baba Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo