సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1459వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి మహరాజ్ అనుగ్రహం
2. బాబాపై ప్రేమ చూపించడమంటే ఆయన చెప్పిన మార్గంలో నడవడం

సాయి మహరాజ్ అనుగ్రహం

సాయి మహరాజ్‌కి నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా ధన్యవాదాలు. ఒకప్పుడు గ్రామాల్లో సాయంత్రం వేళ అందరూ రచ్చబండ దగ్గర కలుసుకొని, అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకొని, మనసు తేలిక చేసుకొని ఆనందంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లేవాళ్లు. అందుకే అప్పట్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి. అలాగే ఇప్పుడు సాయిభక్తులకు ఉదయం నిద్రలేవగానే ఓపెన్ చేసి చూడటానికి 'సాయి మహరాజ్ సన్నిధి' అనే ఒక అద్భుతమైన గొప్ప వేదికను ఏర్పాటు చేసి, మా అందరి మనసులలోని భారాన్ని, బరువులను దించుకొని తేలికపడేటట్లు, అలాగే ఏదైనా సమస్య వస్తే బాబాకు చెప్పుకొనే అవకాశాన్ని కల్పించారు మీరు. మాకిప్పుడు ఎవరూ లేరనే భయం, బేలతనం లేవు. ఎందుకంటే, ఎవరితోనూ పంచుకోలేనివి కూడా ఈ బ్లాగ్ ద్వారా బాబాకు చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా, ఎలాంటి విషయమైనా గట్టి నమ్మకంతో బాబాకు చెప్పుకుంటే, అది తప్పకుండా జరుగుతుందనే భరోసా మాకు కలుగుతుంది. ఎన్ని అనుభవాలు! ఎంతమంది అనుభూతులు! మీ ద్వారా అందరికీ చేరుతున్నాయి. ఈ బ్లాగును నడిపిస్తున్న సాయి సహోదరులకు, వారి బృందానికి మేమెప్పుడూ ఋణపడి ఉంటాం.

ఇక అసలు విషయానికి వస్తే.. నా పేరు సావిత్రి. మేము హైదరాబాదులో ఉంటాము. నేను బాబా భక్తురాలిని. మట్టిముద్దలా ఉండే మా కుటుంబానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి, ప్రాణం పోసి మాకు ఒక మార్గం చూపించారు బాబా. ఆయన నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని పంచుకుంటున్నాను. మా అబ్బాయి హైదరాబాద్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. తను చాలా కష్టపడి JAIIB CAIIB పరీక్షలకి ప్రిపేర్ అయి పరీక్షలు వ్రాశాడు. తను ఒక్క సబ్జెక్టులో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులలోనూ పాసయ్యాడు. తరువాత ఆ ఒక్క సబ్జెక్టు కోసం చాలా శ్రమకోర్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు. ఎందుకంటే, మళ్ళీ ఫెయిల్ అయితే, ఈసారి మొత్తం 5 సబ్జెక్టులూ వ్రాయాల్సి ఉంటుంది. ఆ టెన్షన్ ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు కదా! అందుకే నేను బాబాతో, "బాబు ఆ సబ్జెక్టు పాసైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా కరుణతో మా అబ్బాయి ఆ సబ్జెక్టులో పాసయ్యాడు. అయితే, ‘ఈ ఒక్క అనుభవం ఏం పంచుకుంటాలే’ అని వేచి చూశాను. ఈలోపు మా అబ్బాయి స్నేహితునికి ఉద్యోగానికి సంబంధించి సెలక్షన్ దాదాపు పూర్తైంది. ఒక్క మెడికల్ టెస్టులో పాసైతే తనకి ఉద్యోగం వచ్చినట్లే. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఉద్యోగం లేదు. ఇంక పరిస్థితి చెప్పక్కరలేదు కదా! అదీకాక, ఆ అబ్బాయికి గుండె సమస్య వచ్చి, తగ్గింది. అలాంటి అబ్బాయికి మెడికల్ టెస్ట్ అంటే ఏమైనా సమస్య అవుతుందేమోనన్న భయం. అప్పుడు నేను, "బాబా! అతనికి ఉద్యోగం వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆ అబ్బాయికి ఉదోగ్యం వచ్చింది. ఇంతకంటే అద్భుతం ఇంకేం కావాలి?

మా అత్తగారికి 78 సంవత్సరాలు. ఈమధ్య ఆమెకి ఆయాసం వస్తుంటే మాకు చాలా భయమేసింది. ఎందుకంటే, 11 నెలల ముందు నా భర్త చనిపోయారు. ఆ షాక్ నుండి బయటకి రాకముందే మరలా హాస్పిటల్, ఆపరేషన్ అంటే తట్టుకోవడం మా వల్ల కాలేదు. అదీకాక, మా అత్తగారికి అదివరకే గుండె సమస్య ఉంది. 7, 8 సంవత్సరాల ముందు స్టెంట్లు వేయాలని అన్నారు. రెండుసార్లు స్టెంట్ వేయించాలని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కానీ ఏవో కారణాలతో ఆపరేషన్ జరగలేదు. మరలా ఈ వయసులో ఆపరేషన్ అంటే బాగా భయమేసింది. అందుచేత నేను, "బాబా! ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఉండేటట్లు అనుగ్రహిస్తే, నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో చెప్పుకుంటాను" అని బాబాకి మొక్కుకొని మా అత్తగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఈసీజీ, ఎకో టెస్టులు చేశాక కూడా డాక్టరుకి ఏదో అనుమానమొచ్చి, ‘ఒకవేళ రిపోర్టులు తప్పేమో’ అని పాత రిపోర్టులు చూపించమని అడిగారు. అద్భుతం! అన్ని రిపోర్టులు పరిశీలించాక హార్ట్‌లో ఎటువంటి సమస్యా లేదని చెప్పారు. మరి ఆయాసం ఎందుకు వస్తుందంటే, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇచ్చారు. ఇన్ని అద్భుతమైన అద్భుతాలు చేసిన సాయి మహరాజ్‌కు మా హృదయపూర్వక నమస్కారాలు. నాకున్న ఒక సమస్య నుండి బయటపడేసి ఆ శుభవార్తతో మరలా నా అనుభవాన్ని పంచుకొనే అవకాశం బాబా ఇస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాను.

బాబాపై ప్రేమ చూపించడమంటే ఆయన చెప్పిన మార్గంలో నడవడం

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. బాబా సకల దేవతా స్వరూపుడని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే, అందుకు తగిన నిదర్శనాలను బాబా నాకు స్వప్నంలో ఇచ్చారు. నేను ఈమధ్య బాబా ప్రేరణతో, ‘దత్తాత్రేయుడే బాబా’ అన్న భావనతో శ్రీగురుచరిత్ర పారాయణ ప్రారంభించి వసంతపంచమి ముందురోజు ముగించాను. మరుసటిరోజు వసంతపంచమి, పైగా గురువారం. ఆరోజు నేను బాబాకి నైవేద్యం సమర్పిద్దామని బాబా గుడికి బయలుదేరాను. బయలుదేరేముందు నా మనసులో, 'బాబా! ఈ వారంరోజులు నేను నిన్ను మందారపూలతో పూజించాను కదా! మీరు నా పారాయణని స్వీకరించినట్లైతే, మీరు నాకు మందారపూలతో దర్శనమివ్వాలి' అని ఒక భావన కలిగింది. ఆ సర్వాంతర్యామి ముందు మనమేమైనా దాచగలమా? అక్కడ గుడిలో బాబాను ఒకే ఒక్క మందారపువ్వుతో అలంకరించి ఉన్నారు. అలా బాబాను చూసిన నా పరిస్థితి మీరు ఊహించగలరు కదా! సాయిబంధువులారా! నేను ఎంత తన్మయత్వంతో పులకరించిపోయానంటే, 'బాబా! నీకు నాపై ఇంతటి ప్రేమ ఉందా? నీ ప్రేమకు నేను అర్హురాలినా బాబా?' అని మనసంతా ఆనందడోలికలలో ఉయ్యాలలూగింది. 'ప్రతి విషయంలో బాబా తన ప్రేమను ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. కానీ నేను ఇంత ప్రేమని బాబాపై చూపించగలనా? నాకు బాబాపై ఉన్నది నిజమైన ప్రేమేనా?' అనే ప్రశ్న మొదలైంది. నా అంతరాత్మ ఇచ్చిన సమాధానం - 'బాబాపై ప్రేమ చూపించడం అంటే బాబా చెప్పిన మార్గంలో నడవడం'. తమ మార్గంలో నడవడానికి కావలసిన శక్తిని బాబా నాకు ప్రసాదిస్తారని నమ్ముతూ...

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Baba na vamsi ni nannu kalupu sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo