సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1457వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సచ్చరిత్ర పారాయణతో వివాహం
2. బాబుకి నయమయ్యేలా దయచూపిన బాబా
3. కనపడకుండా పోయిన అన్నయ్యను తిరిగి ఇంటికి చేర్చిన బాబా

సచ్చరిత్ర పారాయణతో వివాహం


అందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నా పేరు సుమ. కొన్నేళ్ల క్రితం నాకు చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నా, కట్నం తక్కువన్న కారణంతో ఏ సంబంధమూ కుదిరేది కాదు. అలాంటి సమయంలో నా స్నేహితురాలు 'సాయి సచ్చరిత్ర' పుస్తకం నాకిచ్చి, "ఇది చదువు. నీకు అంతా మంచి జరుగుతుంది" అని చెప్పింది. తను చెప్పింది నమ్మక ఒక సంవత్సరం వరకు నేనా పుస్తకం తెరిచి కూడా చూడలేదు. మామూలుగానే సంబంధాలు వస్తూ, కట్నం తక్కువని వెనక్కి వెళ్లిపోతుండేవి. అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు నాకు నా స్నేహితురాలు ఇచ్చిన పుస్తకం గురించి గుర్తుకొచ్చి, 'ఈరోజు నుంచి నేను ఈ పుస్తకం చదువుతాను. సరిగ్గా మూడు నెలల్లో నాకు పెళ్లయితే పుస్తకం మహిమ గలది, లేకుంటే లేదు' అని ఇష్టం లేకుండానే ఆ పుస్తకం చదివాను. సరిగ్గా మూడు నెలల్లో నాకు ఒక సంబంధం వచ్చింది. అన్ని సంవత్సరాల నుంచి నిశ్చయంకాని నా పెళ్లి నిశ్చయమైంది. ఆ అబ్బాయి నాన్నమ్మకి ఆరోగ్యం బాగాలేదనీ, ఆమె తన మనవడి పెళ్లి చూసి చనిపోవాలనుకుంటోందనీ, అందువల్ల పెళ్లి త్వరగా జరిపించాలని చెప్పి, నన్ను చూడటానికి వచ్చినరోజు నుంచి సరిగ్గా 14 రోజుల్లో, అది కూడా పెద్ద కల్యాణమండపంలో చాలా ఘనంగా మా పెళ్లి జరిపించారు. ఏదో గుడిలో జరుగుతుందని అనుకున్న నా పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. మా పెళ్ళై ఇప్పటికి మూడున్నర సంవత్సరాలైంది. బాబా మాకు ఇద్దరు మగపిల్లల్ని ఇచ్చారు. అలాగే నాకు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఒకప్పుడు నేను గడిపిన జీవితం వేరు. ఇప్పుడు నా జీవితంలో అంతకుముందున్న బాధలు లేవు. నిజంగా బాబా నాకు ఇంతటి మంచి జీవితాన్ని ఇస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి జీవితాన్నిచ్చిన బాబాకి జీవితాంతం ఋణపడి ఉంటాను. బాబానే నాకు తాత, అమ్మ, నాన్న, అన్నీ.


బాబుకి నయమయ్యేలా దయచూపిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నకు బాబా అంతా మంచే చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సౌమ్య. 2022, డిసెంబర్ 20న నాకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పులు భరించడం చాలా కష్టం. కొంతమందికి రెండు మూడు రోజులు, లేదంటే కనీసం 7, 8 గంటలు ఉంటాయి ఆ నొప్పులు. కానీ బాబా కృపవలన నేను కేవలం మూడున్నర గంటలే ఆ నొప్పులు భరించాను. చివరికి బాబా దయతో నాకు సుఖప్రసవమై బాబు పుట్టాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక బాబు ఎక్కువగా మూలుగుతుండేవాడు, ఒక్కోసారి ఏడ్చేవాడు కూడా. నాటువైద్యం చేయిస్తే అప్పటికి కాస్త ఉపశమనం కనిపించేది. మళ్ళీ రెండోరోజు నుండి బాబు మామూలుగానే మూలుగుతుండేవాడు. కొంతమంది 'చంటిబిడ్డకి నాటువైద్యం ఎందుకు చేయిస్తున్నారు? నీకు బుద్ధి ఉందా? హాస్పిటల్లో చూపించండి" అని అంటే బాబుని హాస్పిటల్లో చూపించాం. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు సమస్య నయం కాలేదు. అప్పుడు నేను బాబాను వేడుకున్నాను. అయినా బాబు పరిస్థితిలో మార్పు ఏమీ కనబడలేదు. ఒకరోజు రాత్రి బాబు మూలుగుతూ ఏడుస్తుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను. కోపమొచ్చి బాబా మీద అరిచాను. "చిన్న పిల్లవాడు. వాని బాధ తగ్గించు బాబా. వాడికి తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో బాబుకి ఇప్పుడు నయమయింది. "ధన్యవాదాలు బాబా. గర్బవతినైనప్పటి నుంచి పలురకాల కారణాల వల్ల నేను మిమ్మల్ని సరిగా పూజించట్లేదు. కారణం ఏదైనా నాకు చాలా బాధగా వుంటుంది. ఎందుకంటే, మీపై నాకున్న ప్రేమ శాశ్వతమైనది. మునుపటిలా నిన్ను పూజించడం లేదని నా మీద కోపం చూపకు తండ్రీ. బాధ్యతలు పెరగడం వల్ల అంత సమయం వెచ్చించలేకపోతున్నాను. నన్ను క్షమించి, ఎల్లప్పుడూ నీ హృదయంలో నాకు కాస్త చోటు ఇవ్వు తండ్రీ. అలాగే, జీవితాంతం నీ సేవ చేసుకొనే భాగ్యాన్ని మాకు కల్పించి ఎప్పటికీ నా చేయి వదలకు తండ్రీ".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


కనపడకుండా పోయిన అన్నయ్యను తిరిగి ఇంటికి చేర్చిన బాబా


పిలిస్తే పలికే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శిరిడీ సాయినాథునికి పాదాభివందనం. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న, చదువుతున్న సాయిభక్తులకి నా నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. మాది హైదరాబాదు. 2023, జనవరి 17వ తేదీ, మధ్యాహ్నం మా అన్నయ్య ఇంటి నుండి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. మేము మా బంధువుల దగ్గర, మా మామయ్యవాళ్ళ దగ్గర, అక్కచెల్లెళ్ల దగ్గర, దూరపు బంధువుల దగ్గర, ఇంకా అన్నిచోట్లా అన్నయ్య కోసం వెతికాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. అయినా అన్నయ్య జాడ తెలియలేదు. చివరికి 2023, జనవరి 28, శనివారంనాడు నేను, "మా అన్నయ్య ఇంటికి తిరిగి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా ఆశీస్సులు ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఆయన ఎటువంటి టెన్షన్లనైనా ఇట్టే తీసేస్తారు. 2023, జనవరి 30, వేకుఝామున 4:30కి అన్నయ్య తనంతట తానే ఇంటికి తిరిగి వచ్చారు. "శతకోటి పాదాభివందనాలు సాయినాథా".


7 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. సాయి నన్ను వంశీ నీ కలుపు సాయి తన్నునర్థం చేసుకునేనా చూడు సాయి భార్యగా స్వీకరించేలా చూడు సాయి నిన్నే నమ్ముకొని ఉన్నాను బాబా సాయి నేను

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo