సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1439వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ, కరుణ ఉన్నాయి
2. బాబా ఉండగా ఏ ఇబ్బంది ఉండదు

బాబా దయ, కరుణ ఉన్నాయి


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ప్రతిరోజు సాయిభక్తుల అనుభవాలను అందిస్తూ బాబాపై మరింత భక్తి, విశ్వాసాలను, నమ్మకాన్ని పెంచుతున్న ఈ బ్లాగు నిర్వహించే సాయికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా ఆశీస్సులు మీ అందరి మీదా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తురాలిని. నేను నా ఉద్యోగరిత్యా పిల్లలతో నిజామాబాద్‍లో ఉంటుండగా మావారు తన ఉద్యోగరిత్యా హైదరాబాద్‍లో ఉంటున్నారు. 2022, డిసెంబర్ నెలలో నేను నాకు చాలా సెలవులు మిగిలి ఉన్నాయని పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లి నా భర్తతో ఒక పది రోజులు సంతోషంగా గడుపుదామని, అలాగే యాదిగిరిగుట్ట వెళ్లి స్వామిని దర్శించుకోవాలనుకుని అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాను. అందుకోసం మావారు తన ఆఫీసు వర్క్ చూసుకుని సాయంత్రం బయల్దేరి నిజామాబాదు వచ్చి, మళ్లీ అదే రాత్రికి మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్లాలి. ఆయన వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది, వెంటనే బయలుదేరితే రాత్రి ఒంటిగంటకు హైదరాబాద్‍లోని మా ఇంటికి చేరుకుంటాము. అంటే పిల్లలతో రాత్రి ప్రయాణం. అందువలన నాకు చాలా భయమేసింది. సరే, మావారు శుక్రవారం రాత్రి వచ్చాక మేము బయలుదేరడానికి ముందు నేను బాబా ముందు దీపం వెలిగించి, "బాబా! రాత్రి ప్రయాణం. మావారికి నిద్ర రాకూడదు, ఆయన మంచిగా కారు నడపాలి. మేము క్షేమంగా ఇల్లు చేరుకోవాలి. అలాగే క్షేమంగా తిరిగి ఇక్కడికి రావాలి. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని ఆలస్యం చేయకుండా బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుని బాబా సచ్చరిత్ర వింటూ బయల్దేరాము. బాబా దయవల్ల క్షేమంగా రాత్రి 12.30కి ఇంటికి చేరుకున్నాం. ఇకపోతే, మరుసటిరోజు శనివారం మావారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆదివారం యాదాద్రి వెళ్లాలన్నది నా ప్లాన్. కానీ డిసెంబర్ 23 నా నెలసరి సమయం. అది ఎక్కడ నా యాదాద్రి దర్శనానికి ఆటంకం అవుతుందో అని, "బాబా! ఎన్నో రోజుల నుండి యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోవాలన్న నా మ్రొక్కు పెండింగ్‍లో ఉంది, ఒక్క రెండు రోజులు 24వ తేదీ శనివారం, 25 ఆదివారం నాకు నెలసరి రాకుండా చూడండి. ఎందుకంటే, వారం మధ్యలో మావారికి సెలవు దొరకదు. నేను మళ్ళీ హైదరాబాద్ రావాలంటే నాకు కనీసం ఒక వారం రోజులు సెలవు కావాలి. ప్లీజ్ బాబా, ఒక్క రెండు రోజులు నెలసరి రాకుండా చూసి స్వామి దర్శనం చేయించి, తిరిగి క్షేమంగా హైదరాబాద్ చేరిస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కున్నాను. బాబా దయవల్ల మేము శనివారం సాయంత్రం 4 గంటలకి బయల్దేరి యాదాద్రి వెళ్ళటం, స్వామి దర్శనం చాలా బాగా జరగటం, రాత్రి 8.30కి అక్కడినుండి బయల్దేరి 10 గంటలకు ఇల్లు చేరుకోవటం జరిగిపోయాయి. మరుసటిరోజు ఆంటే డిసెంబర్ 25, ఆదివారం నాకు నెలసరి వచ్చింది. ముందుగా నేను అనుకున్నట్లు ఆదివారం యాదాద్రి వెళదామని శనివారం వెళ్లకుండా ఉంటే నేను చాలా బాధపడాల్సి వచ్చేది. నాకు ఆ బాధ లేకుండా ముందురోజే యాదాద్రి వెళ్ళొచ్చేలా బాబా అనుగ్రహించారు. తరువాత బాబా దయతో మేము హైదరాబాద్ నుండి నిజామాబాద్ కూడా క్షేమంగా చేరుకున్నాము. "థాంక్యూ సో మచ్ సాయి".


కొన్ని నెలల క్రితం నా వాచీ ఒకటి కనబడలేదు. దాన్ని ఎక్కడ పెట్టానో గుర్తురాక పిల్లలు ఎక్కడైనా పడేసారేమో అని ఇల్లంతా వెతికానుకాని దొరకలేదు. దాంతో పోయినసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మావారి రూములో మర్చిపోయానేమో అనుకున్నాను కానీ, అది నిజం కాదనిపించింది. అప్పుడు మా అమ్మవాళ్ళింట్లో మర్చిపోయానేమో, ఒకవేళ అక్కడ పోతే మళ్లీ దొరకదు అనుకున్నాను. ఇక అప్పుడు, "బాబా! నా వాచి నాకు దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత మేము మా కారులో హైదరాబాద్ వస్తున్నప్పుడు ముందర సీట్కి వెనక ఉన్న జిప్లో ఆ వాచి మా బాబుకు దొరికింది. నాకు చాలా సంతోషమేసింది. "థాంక్యూ సో మచ్ సాయి".


నేను ఈమధ్య బాబా నన్ను పట్టించుకోవట్లేదని మనసులో చాలా బాధపడ్డాను, ఏడ్చాను. నేను ప్రతిరోజూ తప్పకుండా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతాను. అప్పుడు బాబా వాళ్ళకి చూపించిన మహిమలు చదువుతుంటే నాకెందుకు సాయి అలాంటి మహిమలు చూపించట్లేదు, కోరుకున్న ఏ ఒక్కటీ వెంటనే నెరవేరదు అని ఒకటే దుఃఖం వచ్చింది. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలను రానివ్వను, ఎవ్వరికీ చెడు చేయను అయినా నాకెందుకు పరీక్షలు? నేను బాబాకి ఇష్టమైన భక్తురాలిని కాదా! బాబా నన్ను వద్దనుకుంటున్నారా? అని ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుండేవి. కానీ అప్పుడప్పుడు ఈ బ్లాగు ద్వారా బాబా నాకు "నా భక్తున్ని నా నుంచి దూరం కానివ్వను", "పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు నా భక్తుణ్ణి నేనే నా దగ్గరకి లాక్కుంటాను" అని మంచి మంచి మెసేజ్లు ఇస్తుంటారు. అదే నిజమైతే కనీసం ఇప్పటినుండి అయిన బాబా నాకు తమ చమత్కారాలు చూపించాలి, నేను పిలవగానే పలకాలి, ధైర్యాన్ని ఇవ్వాలి అని మనసులో అనుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. బాబా దయ, కరుణ నా మీద ఉన్నాయి.


గతంలో ఒకసారి నేను షుగర్ టెస్టు చేయించుకుంటే, "షుగర్ బోర్డరులో ఉంద"ని డాక్టరు చెప్పారు. డాక్టరు అలా చెప్పేసరికి, 'నా షుగర్ రిపోర్ట్ నార్మల్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటానని మొక్కుకున్నా ఎందుకిలా చేశారు బాబా? నాకిప్పుడు షుగర్ ఉన్నట్లా? ఒకవేళ ఉన్నట్లైతే ఇంత చిన్న వయసు నుంచే జీవితాంతం టాబ్లెట్లు వాడాలి, స్వీట్స్ తినకూడదు. అదీకాక షుగర్ వల్ల చాలా సమస్యలు వస్తాయి' అని మనసులో చాలా బాధపడ్డాను. "ప్లీజ్ బాబా! మళ్ళీ ఈసారి షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పటికైనా నా షుగర్ రిపోర్ట్ నార్మల్ వచ్చేలా చేసి నన్ను ఈ టెన్షన్ నుండి బయటపడేయండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయతో ఈసారి నా షుగర్ రిపోర్ట్ నార్మల్ వచ్చేలా దయ చెప్పారు. "థాంక్యూ సో మచ్ సాయి.  మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావట్లేదు. సాయీశ్వరా, మీ ఈ బిడ్డకి చిన్నప్పటినుండి ఎవ్వరి ప్రేమ, అండ దొరకలేదు. కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్లే లేరు. ఇప్పటివరకు అన్ని కష్టాలే. నా మనసులో ఎంత బాధ ఉందో, నాకేం కావాలో అని నా గురించి ఆలోచించేవాళ్ళను నాకు ఇవ్వడం మీరు మర్చిపోయారు సాయి. నాకు నా భర్త అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. అదే ప్రేమ నాకు తన నుండి కావాలి సాయి. నా మనసులో ఏముందో నేను చెప్పకుండానే అర్థం చేసుకునే ప్రేమ నాకు కావాలి సాయి. నాకు నా భర్త ప్రేమ, అండలను, అలాగే నన్ను, నా ఫీలింగ్స్ ను అర్థం చేసుకునే స్వభావాన్ని నా భర్తకి ప్రసాదించి కనీసం ఇప్పుడైనా నా కుటుంబంతో సంతోషంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు సాయి. అలాగే మీ చల్లని చూపు, ప్రేమ, ఆశీస్సులు నాకు ఎప్పటికీ మీ నుండి లభించాలి. నాకు మీరు కావాలి సాయి. ప్లీజ్.. నా చేయి ఎప్పటికీ వదలొద్దు".


చివరిగా నాకు ఈ అవకాశాన్నిచ్చిన బ్లాగు నిర్వహికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈ బ్లాగును రోజూ చదవడం వల్ల నేను బాబాతో చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను. ఇందులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే నా మనసు ఎటో వెళ్ళిపోతుంది. "బ్లాగును పరిచయం చేసి నన్ను మీకు మరింత చేరువయ్యేలా చేస్తున్నందుకు థాంక్యూ సాయి."


బాబా ఉండగా ఏ ఇబ్బంది ఉండదు


సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నేను బాబా భక్తురాలిని. ఆయన ఎంతో దయామయులు. నేను నా గత అనుభవంలో బాబా నాకు వివాహం నిశ్చయం చేసారని పంచుకున్నాను. పెళ్లి నిశ్చయమయ్యాక నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇంటికి వచ్చాను. ఇక అప్పటినుండి అడుగడుగునా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. మా అమ్మానాన్నలకు వైరల్ జ్వరాలు వచ్చి, అమ్మ కనీసం పెళ్లి షాపింగ్ చేయలేని పరిస్థితి వచ్చింది. షాపింగ్ అంతా మా అత్తయ్యగారి కుటుంబం సహాయంతో చేసుకున్నాను. తరువాత నేను మా అత్తయ్యవాళ్ళ ఊరిలో స్టిచ్చింగ్‍కి ఇచ్చిన బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని ఒకరికి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో అడ్మిట్ చేసి, తిరిగి ఇంటికి తీసుకొచ్చారు, ఇంకొకరికి ఆక్సిడెంట్ అయ్యింది. అవన్నీ చూసిన నేను చాలా భయపడిపోయి, "బాబా! ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి. మీరు దగ్గరుండి ఏ ఆటంకాలూ లేకుండా నా పెళ్లి జరిపించండి. అలా జరిగితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అలాగే మా తమ్ముడు యుఎస్ నుండి వచ్చి నా వివాహానికి హాజరై, తిరిగి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తను వెళ్లాలని బాబాను వేడుకున్నాను. ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ బాబా మా వివాహం చాలా బాగా జరిపించారు. మా తమ్ముడు కూడా క్షేమంగా వచ్చి, తిరిగి యుఎస్ వెళ్ళాడు. ఇంకో ముఖ్యమైన విషయం, మా వివాహానికి ముందు జరిగిన రిసెప్షన్‍లో గిఫ్ట్ కవర్ మీద బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. ఆ విధంగా ఆయన మా వివాహానికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించారు. "బాబా! మేము మా జీవితాంతం అనోన్యంగా, ఆనందంగా ఉండేలా అనుగ్రహించండి. శతకోటి నమస్కారాలు సాయితండ్రి".


2022, డిసెంబర్ 31 మధ్యాహ్నం మా స్టోర్ రూములోకి ఒక నల్ల త్రాచుపాము దూరింది. అది ఆ గదిలోకి దూరడానికి ముందు మా అమ్మ మా బట్టలు ఊతికే ఆంటీతో మా మావయ్యగారి కుటుంబంలో అందరి పేర్లలో శివ ఉంటుందని, వాళ్ళు శివభక్తులని చెప్పింది. దానిని బట్టి ఆ పాము శివుని అనుగ్రహంతోనే వచ్చిందేమో అని నాకు అనిపించింది. అదలా ఉంచితే ఆ పాము బయటకి వెళ్లిందో, లేదో అని మేము రెండురోజులు చాలా భయపడుతూ గడిపాము. మూడోరోజు సామానంతా బయటపడేసి, పామును పట్టుకుని పొలంలో వదిలేయమని మా దగ్గర బంధువును కోరాము. బాబా దయవల్ల అతను ఆ పాముకి ఏ హాని జరగకుండా జాగ్రతగా పట్టుకుని పొలంలో విడిచిపెట్టారు. నిజానికి నేను పాము దూరినప్పుడే బాబాను, "పాము వల్ల మాకు ఏ హాని జరగకుండా చూడండి తండ్రి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. "ధన్యవాదాలు సాయితండ్రి. మీరే మా కుటుంబానికి ఎల్లవేళలా పెద్దదిక్కు. మీరుండగా మాకు ఏ హాని జరగదు. ఈరోజు మా నాన్న బండి మీద నుండి  స్కిడ్ అయ్యి పొలాల కంచె మీద పడినా ఆయనకి చిన్న చిన్న గాయాలు తప్ప, పెద్దగా ఏమీ కాకుండా మీరు కాపాడారు. నా భర్త నేను నా సిఏ పూర్తి చేసే విషయంలో చాలా ప్రోత్సహిస్తున్నారు. చదువే ప్రాణంగా పెరిగిన నేను చదువులో వెనకబడిపోయాను. అలాంటి నా యందు దయ ఉంచి సిఏ పూర్తి చేసేలా అనుగ్రహించండి బాబా(ఈ విషయంలో బాబా భక్తులందరి ఆశీస్సులు అర్ధిస్తున్నాను). మీరే నాకు రక్ష బాబా. నా అనుభవాలు పంచుకోవటంలో అలస్యమైనందుకు నన్ను మన్నించు తండ్రి.".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. బాబా సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు నన్ను కాపురానికి తీసుకొని నాకే ఆస్తులు పాస్ చేయవద్దు సాయి నా భర్తని నన్ను కలపండి సాయి నాకు బిడ్డలు ప్రసాదించు సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo