1. శ్రీసాయినాథుని అనుగ్రహం
2. చెప్పుకున్నంతనే సమస్యల నుండి బయటపడేసిన బాబా
శ్రీసాయినాథుని అనుగ్రహం
'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు సభ్యులందరికీ నమస్కారాలు. శ్రీసాయినాథుని దయతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు దీప్తి. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. నేను శ్రీవెంకయ్యస్వామి చరిత్ర చదివినప్పుడు "నన్ను మీ దర్శనానికి రప్పించుకో తండ్రి" అని అనుకున్నాను. తరువాత నేను, నా స్నేహితురాలు 2022, మార్చిలో హోళీ పండగరోజున నాయుడుపేట వెళ్లి అక్కడున్న శ్రీశరమా మల్లికాంబ అమ్మవారి సన్నిధిలో శ్రీగురుచరిత్ర ఒక రోజు పారాయణ చేయాలని సంకల్పించాము. అలాగే గొలగమూడి వెళ్లి శ్రీవెంకయ్యస్వామి దర్శనం కూడా చేసుకుందామని ఆశపడ్డాము. కానీ మావారు ఒప్పుకుంటారో, లేదో అని భయపడ్డాను. అయితే ఆ సాయితండ్రి దయవల్ల మావారు అదే సమయానికి ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్లడం, మా అమ్మాయిల్ని మా అత్తమ్మవాళ్ళ ఊరికి పంపడం జరగడంతో మేము నాయుడుపేట వెళ్లి శ్రీగురుచరిత్ర పారాయణ చేసి, శ్రీవెంకయ్యస్వామి దర్శనం కూడా చేసుకున్నాం. అలా గురుచరిత్ర పారాయణ పేరుతో నాయుడుపేటకు వెళ్లడం, స్వామి దర్శనం చేసుకోవడం, అలాగే నెల్లూరులోని శ్రీసాయిబాబా గుడిని దర్శించి ధూప్ ఆరతిలో పాల్గొని తిరుగు ప్రయాణమవ్వడం అంతా బాబా దయ.
2022, జూన్‍లో మా బంధువుల అబ్బాయి పెళ్లికని మేము 40 మందిమి బెంగుళూరు వెళ్ళాము. బాబా దయతో పెళ్లి, విందు అన్ని బాగా జరిగాయి. గురువారం రోజున శ్రీసాయినాథుని దర్శించుకుందామని గూగుల్‍లో సెర్చ్ చేస్తే 800 మీటర్ల దూరంలో గుడి ఉందని చూపించింది. దాన్ని అనుసరిస్తూ గుడికి వెళ్ళి, బాబాను దర్శించుకుని కూర్చున్నాం. ఆ సమయంలో అక్కడ హుండీ లెక్కింపు జరుగుతుంది. ఆ సేవ చేసుకోవాలని నాకు అనిపించినప్పటికీ చేయవచ్చో, లేదో అని పక్కనే కూర్చున్నాను. అంతలో ఒకతను పక్క నుండి వెళ్తూ కన్నడంలో, "మీరు చేయండి" అని అన్నారు. నాకు అతను చెప్పింది అర్థంకాక, "నాకు అర్థం కాలేదు" అంటే, అతను ఇంగ్లీషులో చెప్పారు. అప్పుడు నేను ఆనందంగా సరేనని, ఆ సేవ చేశాను. కొద్దిసేపటికి నోట్ల మధ్యలో శిరిడీ ఊదీ ప్యాకెట్ కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఎందుకంటే, ఆరోజు ఉదయం నుండి ఎంతోమంది ఆ సేవ చేస్తుంటే అంతమందిలో నాకే సాయి ఆ ఊదీ ఇచ్చారు. ఆ ఊదీని అక్కడి వాళ్ళకి ఇస్తే, దాన్ని సాయి మీకే ఇచ్చారు అన్నారు.
తర్వాత మేము తిరుగు ప్రయాణమయ్యాము. మేము భోజనాలు చేసి బయలుదేరే సమయానికి ముందురోజు పెళ్లి అలంకరణలో భాగంగా ఉంచిన శ్రీసాయినాథుని ఒక ట్రక్‍లో తీసుకెళ్తున్నారు. నేను, "మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చండి బాబా" అని బాబాని వేడుకున్నాను. మాతో వచ్చిన చాలామంది క్యాబ్‌లో రైల్వేస్టేషన్‍కి వెళ్ళిపోయారు. నేను, మా తోటికోడలు, ముగ్గురు వదినలు ఒక కారులో బయలుదేరాం. ఆ కారు మంచిగా లేదు. పైగా డ్రైవర్ కొత్తవాడు. అతనికి కన్నడ తప్ప ఇంకో భాష రాదు. మాకు కన్నడ రాదు. అతను ఎవరినీ అడగకుండా చుట్టూ తిప్పుతున్నాడుగానీ రైల్వేస్టేషన్‍కి తీసుకుపోలేదు. మరుసటిరోజు ఒక వదిన కూతురికి ఎంట్రన్స్ పరీక్ష, ఇంకో వదిన కొడుకుకి స్కూల్ అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉన్నందున ఏడు కిలోమీటర్ల దూరంలో నేను కారు ఆపించి రోడ్డు క్రాస్ చేసి ఒక ఆటో అతనితో మాట్లాడి ఏడుగురం ఆ ఆటో ఎక్కాము. ఆ ఆటోలో వెళుతుంటే ఓ చోట పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. మా వదిన టెన్షన్ పడుతుంటే, "మనం రైలు ఎక్కుతాము" అని చెప్పి సాయి నామస్మరణ చేశాను. బాబా దయవల్ల మరో ఐదు నిమిషాలలో రైలు బయలుదేరుతుందనగా మేము పరుగున రైలు ఎక్కాము. ఆటో అతని రూపంలో బాబానే మమ్మల్ని సమయానికి రైలు ఎక్కించి క్షేమంగా ఇంటికి చేర్చారని నా అభిప్రాయం.
నా స్నేహితురాలి కుటుంబం గురుపౌర్ణమికి శిరిడీలో ఉండాలని రైలు టికెట్లు బుక్ చేస్తూ, నన్ను కూడా వాళ్లతో రమ్మన్నారు. బాబా దయ అనుకొని నేను సరే అన్నాను. అయితే టికెట్లన్నీ ఆర్ఏసిలో వచ్చాయి, కన్ఫర్మ్ అవ్వలేదు. అయినా సరే వెళదామని అనుకున్నాం. కానీ మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ అని వార్తల్లో చూసి టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాము. గురుపౌర్ణమినాడు మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్లొచ్చిన తర్వాత నేను, నా స్నేహితురాలు ఫోన్‍లో మాట్లాడుకుంటూ శిరిడీ వెళ్లలేకపోయామని బాధపడ్డాము. అది విన్న నా స్నేహితురాలి భర్త ట్రైన్ టికెట్లు చూసి "రాత్రి 8 గంటల నరసాపూర్-నాగర్సోల్ ట్రైన్‍కి టికెట్లున్నాయి, వెళ్తారా?" అని అడిగారు. నా స్నేహితురాలు వెంటనే నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను వెంటనే మా ఆయనకి కాల్ చేసి చెప్పి, ఒక గంటన్నరలో సికింద్రాబాద్ స్టేషన్‍కి చేరుకున్నాము. బాబా కరుణతో ఆర్ఏసీ టికెట్లు కాకుండా బెర్తులు ఇచ్చి సౌకర్యవంతమైన ప్రయాణం చేయించారు. గురువారంనాడు శిరిడీలో పల్లకీ ఉత్సవం చాలా దగ్గరగా చూసాము. అలా బాబా కరుణతో మమ్మల్ని తమ దగ్గరకి రప్పించుకున్నారు.
లోకసమస్తా సుఖినోభవంతు!!!
చెప్పుకున్నంతనే సమస్యల నుండి బయటపడేసిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి. 2022లో నా మేనల్లుడు యుఎస్ఏ నుండి సెలవులకని ఇండియా వచ్చాడు. తన బిజీ షెడ్యూలు వల్ల మేము తనని కలవలేకపోయాము. చివరికి తను 2022, ఆగస్టు 18న తిరిగి యుఎస్ఏ వెళ్తుంటే నేను నా పిల్లలు మధ్యాహ్నం మూడు గంటలకి స్కూలు నుండి వచ్చిన తరువాత తనని కలిసి వీడ్కోలు చెప్పాలని అనుకున్నాను. మా వదినవాళ్ల కుటుంబం సుమారు సాయంత్రం 5 గంటలకి ఇంటి నుండి బయలుదేరాలనుకున్నారు. మా ఇంటికి, మా వదినవాళ్ల ఇంటికి ఎయిర్ పోర్ట్ గంట ప్రయాణ దూరంలో ఉంది. అయితే అది వానాకాలం అయినందున వర్షం బాగా పడుతుంది. అందువల్ల 'ఈ వాతావరణంలో ఎలా వెళ్ళేది? ఒకవేళ వర్షం వల్ల ట్రాఫిక్‍లో ఇరుక్కుపోతే మేము మా మేనల్లుడిని కలవలేమ'ని, "ఈ సమస్యను పరిష్కరించండి బాబా" అని బాబాను ప్రార్థించాను. కొంతసేపటి తరువాత మా వదిన ఫోన్ చేసి, "ఈ వాతావరణంలో ఇంత దూరం రావద్దు. వర్షం వల్ల మేము 4 గంటలకే బయలుదేరుతాము. ఒకవేళ మీరు బయలుదేరినా సమయానికి చేరుకోలేరు" అని చెప్పింది. దాంతో నేను నా మేనల్లుడిని కలవాలన్న ఆలోచనను మానుకున్నాను. మేము వెళ్ళినట్లైతే వర్షం, ట్రాఫిక్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాబా ఆ క్లిష్ట పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడారు.
ఒకసారి ఏదో సమస్య వచ్చి మా వాషింగ్ మెషిన్ పని చేయలేదు. టెక్నిషియన్స్‌ని పిలిస్తే, వాళ్ళు వచ్చి సమస్యని గుర్తించి మెషిన్ బాగు చేసారు. కానీ వేరే ఏ కారణం చేతనో మెషిన్ పని చేయలేదు. చాలా సమయం చెక్ చేసిన తరువాత వాళ్ళు, "వాషింగ్ మెషిన్ టచ్ స్క్రీన్ పానల్ పని చేయట్లేదు. దాన్ని రేపు రిపేర్ చేస్తాము" అని అన్నారు. కారణం ఆ సమస్యని వేరే టెక్నిషియన్ సరి చేయాల్సి ఉంది. నేను సరే అన్నాను. మరుసటిరోజు వాళ్ళు వచ్చి మెషిన్ తాలూకు టచ్ స్క్రీన్ పానల్ సెట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. నాకు విసుగొచ్చి, "ప్లీజ్ బాబా! ఈ సమస్యను త్వరగా పరిష్కరించండి" అని బాబాను వేడుకున్నాను. నిజంగా బాబా అద్భుతం చేసారు. నేను ప్రార్థించిన తరువాత సమస్య పరిష్కారమై మెషిన్ మామూలుగా పని చేసింది. "బాబా! మీరు మాతో ఉన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".
సాయి నిన్నే నమ్ముకొని నీ మీద నమ్మకం పెట్టుకున్న భక్తులకు అన్యాయం చేద్దు సాయి నన్ను నా భర్త నీ కలుపు సాయి నన్ను
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me