1. ప్రతి నిమిషం జాగ్రత్తగా చూసుకుంటున్న బాబా
2. పాటలు వ్రాయించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచిన బాబా
ప్రతి నిమిషం జాగ్రత్తగా చూసుకుంటున్న బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి భక్తులకు మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా ఉద్యోగ నిర్వహణలో బాబా నన్ను ఎలా ఆదుకుంటున్నారో ముందుగా తెలియచేస్తాను. నేను నా వృత్తి జీవితాన్ని చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను. ఎందుకంటే, నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులను, కష్టాలను చాలా అనుభవించాను. ఒకానొక సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్ లోకి కూడా వెళ్ళాను. అయితే ఆ పరిస్థితుల నుండి నన్ను బాబానే బయటకి లాగి నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు. జీవితంలో అంతటి కఠిన పరిస్థితులను అనుభవించడం వల్ల నేను నా ఉద్యోగ నిర్వహణలో అప్పుడప్పుడు చాలా ఆందోళనకు, అభద్రతా భావానికి గురవుతూ ఉంటాను. చిన్న పని చేయలేకపోయినా, ఎవరైనా చిన్న మాట అన్నా చాలా సమయం వరకు ఆలోచిస్తూ బాధపడతాను. ఒకసారి నేను ఆఫీసులో ఒక పని సరిగా చేయలేకపోయాను. అది నా పై అధికారి దృష్టికి వెళ్ళింది. తరువాత ఒకసారి నేను నా పని నిమిత్తం ఆయన్ని ఒక విషయం గురించి అభ్యర్థన చేసాను. ఆయన దానిని తిరస్కరించారు. ఆయన ఒప్పుకోరని నేను అస్సలు ఊహించని కారణంగా గతంలో పని సరిగ్గా చేయకపోవటం వల్లే ఆయన నా అభ్యర్థనని ఒప్పుకోలేదు అనుకున్నాను. చాలాసేపు దాని గురించి ఆలోచించి చివరికి వదిలేశాను. ఈమధ్య ఇంకో పని విషయంలో ఆ అధికారి అనుమతి అవసరం అయింది. పని ముఖ్యమైనది అయినందువల్ల ఆయన ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అని భయపడ్డాను. ఎందుకంటే, నా మీద ఇంకా ఆయనకి పాత అభిప్రాయమే ఉండి ఈసారి కూడా ఒప్పుకోరేమో అనిపించింది. వెంటనే బాబాను, "ఆయన గనక ఒప్పుకుంటే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత బాబా దయవల్ల ఆయన ఒప్పుకోవడంతో పని సక్రమంగా జరిగిపోయింది. అంతేకాదు, ఆ అధికారికి నా మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదని నేను ఎంతో శాంతిని పొందాను.
ఇంకోసారి ఆఫీసులో మా సీనియర్ ఒకరు ఒక పని నాకు అప్పగించారు. అయితే ఆ పనిని నాకు అప్పగిస్తున్నప్పుడు అతని ప్రవర్తన నన్ను కాస్త బాధించింది. ఎందుకంటే, నేను ముఖ్యమైన పనులు చేయగలననే నమ్మకం అతనికి లేనట్లు అనిపించింది. అతను నాతో నేరుగా ఏమీ చెప్పనప్పటికీ, నా గురించి నేనే చాలా తక్కువగా భావించుకుని కనీసం ఇచ్చిన పనినైనా సరిగ్గా చేయాలి, ఏదో ఒకరోజు నాకు కూడా ముఖ్యమైన పనులు చేసే అవకాశం వస్తుందని నన్ను నేను ఓదార్చుకున్నాను. తరువాత నేను ఆ పని చేస్తుండగా మధ్యలో నాకు తెలియని చాలా దిద్దుబాట్లు ఉన్నాయని నేను గుర్తించాను. కానీ వాటి గురించి అతన్ని అడగడానికి సంకోచించాను. కారణం, అప్పటికే అతను నాపై బలహీనమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే నన్ను తక్కువగా ఆలోచించే అవకాశం అతనికి ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయింది. అందుచేత నేను బాబా సహాయం కోరి, "ఈ పని సక్రమంగా జరిగితే, మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తరువాత బాబా అనుగ్రహంతో నా పని విజయవంతంగా పూర్తయింది. "చాలా ధన్యవాదాలు బాబా".
మరొకసారి నాకు ఇంకో పని అప్పగించారు. దాన్ని పూర్తి చేయడం చాలా సులభమని నేను అనుకున్నాను. కాని నేను ఆ పని చేస్తున్నప్పుడు నా సీనియర్ నా వద్దకొచ్చి ఆ పనికి సంబంధించి అనేక సందేహాలను లేవనెత్తాడు. నేను చాలా టెన్షన్ పడిపోయాను కానీ, ఈ పని పూర్తి చేసేందుకు బాబా సహాయం చేస్తారు అని బలమైన నమ్మకం ఉండింది. ఆ నమ్మకం గెలిచింది. నేను ఆ పనిని పూర్తిగా చేయనప్పటికీ నా పనిని, సామర్థ్యాన్ని ప్రశ్నించే అవకాశం ఇతరులకు ఇవ్వకుండా నా వంతు కృషి చేశాను. ఇదంతా బాబా సహాయం వల్లనే జరిగింది. "బాబా! మీరు లేకుండా నా జీవితంలో నేను ఏదీ సాధించగలననే నమ్మకం నాకు లేదు. దయచేసి నాతో ఉండి నాకు మార్గనిర్దేశం చేయండి బాబా".
ఇటీవల నేను నా కజిన్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాను. నిజానికి నేను వాళ్లతో వెళ్లాలని అనుకోలేదు. కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చింది. ప్రయాణానికి రెండు రోజుల ముందు నాకు అకస్మాత్తుగా జలుబు మరియు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చాయి. పైగా అది నా నెలసరి సమయం కావడం వల్ల నేను చాలా టెన్షన్ పడ్డాను. ఏం చేయాలో తెలియక హాస్పిటల్ కి వెళ్లి మందులు తీసుకున్నాను. కానీ నెలసరి సమస్యకు టాబ్లెట్ తీసుకోవడం మర్చిపోయాను. బాబా దయవల్ల జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గాయి. కానీ ప్రయాణ సమయానికి ముందు నెలసరి వచ్చింది. అది విహారయాత్ర అయినప్పటికీ నాకు చాలా అసౌకర్యంగా అనిపించి, "ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ ప్రయాణం సుఖంగా సాగాలి. మా ప్రయాణం సవ్యంగా సాగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. బాబా దివ్య ఆశీస్సులతో నేను ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు. మొత్తం ప్రయాణంలో నా సోదరి నాకు సహాయం చేసింది. నేను ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అయితే ప్రయాణమైన మొదటిరోజే చల్లని వాతావరణం వల్ల జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చి నాకు చాలా ఇబ్బంది కలిగింది. నేను ఏమీ తినలేకపోయాను. అదేరోజు రైలులో వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి ఉన్నందున నేను టాబ్లెట్ వేసుకుని, "రేపు ఉదయానికల్లా ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగించమ"ని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విన్నారు. మరుసటిరోజు ఉదయానికి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. నేను చాలా సంతోషంగా నా కజిన్స్‌తో యాత్రను ఆస్వాదించాను. ఈ విధంగా బాబా ప్రతి నిమిషం నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ మా ప్రయాణాన్ని విజయవంతం చేసారు. ఇకపోతే విహారయాత్ర నుండి తిరిగి వచ్చిన కొన్నిరోజులకి నా ఎడమ చెవి కిందగా ఒక గడ్డ లేచింది. నేను చాలా భయపడ్డాను. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యేమోనని కొన్ని ప్రతికూల ఆలోచనలు నన్ను చుట్టుముట్టి, "బాబా! డాక్టర్ ఇది సీరియస్ కాదని చెబితే, మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల డాక్టర్ ఆ గడ్డను చూసి, "జలుబు వల్ల ఇలా వస్తుంది. దానివల్ల ఏమీ కాద"ని మందులు ఇచ్చారు. వాటితో ఆ గడ్డ తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా భక్తులందరికీ నా విన్నపం: మీకున్న సమస్యలు మీకు పరిష్కరించలేనివిగా అనిపించినా వాటిని ఎలా పరిష్కరించాలో బాబాకు చాలా స్పష్టంగా తెలుసు. మన జీవితాన్ని ఎప్పుడు, ఏ దిశలో ముందుకు నడిపించాలో బాబాకు తెలుసు. కాబట్టి శ్రద్ధ- సబూరీని కోల్పోకండి. చివరిగా నా అనుభవాన్ని ఓపికగా చదివిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
పాటలు వ్రాయించుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచిన బాబా
సాయి భక్తుల అనుభవాలను సేకరించి తోటి భక్తులకు అందిస్తూ శ్రీసాయినాథుని సేవ చేస్తున్న ఈ బ్లాగు నిర్వాహకులకు బాబా ఆశీస్సులు సర్వదా లభించుగాక! నా పేరు కల్పన. మాది హైదరాబాద్. ముందుగా బాబాకి శతకోటి వందనాలు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది. ఆయన ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, ఇంకా అన్ని విధాలా మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ఈమధ్య ఎవరైనా గట్టిగా మాట్లాడితే నా తలలో నరాలు కదిలిపోతున్నట్లుండి మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు నేను, "బాబా! రోజుకు మీ పాటలు తొమ్మిది పాడుకుంటాను స్వామి" అని అనుకున్నాను. తరువాత బాబా పాటలు సేకరించే నిమిత్తం కొన్ని గుడుల చుట్టూ, చార్మినార్ దగ్గర తిరిగాను. కానీ పాటల పుస్తకాలు దొరకలేదు. నాకు పాటలు నేర్పించిన అంజనమ్మగారిని కూడా అడిగాను. ఎందుకో ఆవిడ దగ్గర నుంచి కూడా నాకు పాటలు లభ్యం కాలేదు. ఇలాంటి స్థితిలో బాబా చేసిన అద్భుతం ఏమిటంటే, ఆయన నా మనసులో భావాలను కల్పించి నా చేత సుమారు 25 పాటలు వ్రాయించారు. ఎంతో చక్కని పాటలను ప్రసాదించారు. వాటిని పాడుకున్నంతనే వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది శ్రీసాయినాథుని మహిమ తప్ప మరొకటి కాదు. ఆయన దయవల్ల ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. "సాయినాథా! ఇంతటి మంచి అవకాశమిచ్చిన మీకు సర్వదా కృతజ్ఞురాలినై ఉంటాను. మీ పాటలతో నా జీవితం సాగిపోవాలని కోరుకుంటున్నాను. పిల్లల భాధ్యత తీరిపోతే మీ సేవలోనే ఉండిపోవాలని ఉంది. అంతకంటే గొప్ప వరం వద్దయ్యా". సాయి భక్తులందరం ఆయన మార్గంలో నడవాలి. అదే మనకు శ్రేయస్కరం. సాయి కృపతో అందరికీ మేలు జరగాలి.
నేను మా అబ్బాయికి పెళ్లి జరగాలని తొమ్మిది వారాల 'సాయి దివ్యపూజ' ప్రారంభించాను. మాములుగా ఏ పూజైనా నేను ఒక్కదాన్నే చేస్తాను. కానీ బాబా పూజను నేను, మావారు కలిసి చేశాము. పూజా విధానం తెలియనందున పంతులుగారిని పిలిచి చేసుకున్నాము. బాబా దయవల్ల పూజ ఎటువంటి ఇబ్బందులు లేక మంచిగా జరిగింది. 9వ వారం పూజలో ధూపం వేసినప్పుడు ఆ పొగలో బాబా మాకు దర్శనమిచ్చారు(కింద ఫోటో ఇస్తున్నాను, మీరూ దర్శించండి). మా ఆనందానికి అవధులు లేవు. ఇంతకంటే మంచి ఆశీర్వాదమేముందని ఆ సాయి ప్రభువు ఔదార్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. కానీ ఆ ఫోటో తీసిన పంతులుగారు ఈ విషయాన్నీ అందరికీ చెప్తే, 'సాయి పూజ చేసుకొనే ప్రతివారూ ఇలాంటి అనుభవం కలగాలని ఆశిస్తారు!' అన్నారు. అయితే బాబా తమ భక్తులను వివిధ రకాలుగా అనుగ్రహిస్తారు. అంటే కొందరికి పువ్వు ఇవ్వడం, మరికొందరికి కలలో ఆశీర్వదించడం, ఇంకొందరికి మానవ రూపంలో దర్శనమివ్వడం, ఇంకా అనేక రకాలుగా ఆయన తమ బిడ్డలను చేరదీస్తారు. ఇకపోతే, ఈ పూజ మొదలుపెట్టడానికి ముందు మేము కొనుక్కున్న ఇంటి గృహప్రవేశం ఎవరినీ పిలవకనే చేసాము. అప్పటినుండి గృహప్రవేశానికి ఎవరినీ పిలవలేదని అప్పుడప్పుడు మాకు అనిపిస్తూ ఉండేది. అందువల్ల పూజ జరిగే సమయంలో నలుగురిని పిలిచి భొజనం పెడితే వాళ్ళని పూజకి పిలిచినట్లు ఉంటుంది, అలాగే నలుగురు మా ఇంటికి వచ్చినట్లు ఉంటుందని భావించి కొంతమందిని ఆహ్వానించాము. బాబా దయవల్ల కార్యక్రమమంతా ఎటువంటి ఆటంకం లేక సవ్యంగా జరిగింది. ఇంత బాగా పూజ జరుపుకోవడం మాకు ఇదే మొదటిసారి. ఇంత మంచి అవకాశమిచ్చిన బాబాకి పాదాభి వందనాలు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam she is suffering with disk bulges and bless her to get better Jaisairam she is suffering with disk bulges and bless her Jaisairam
ReplyDelete