సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1453వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని కాపాడిన బాబా
2. బయాప్సీ రిజల్ట్ నార్మల్ వచ్చేలా దయచూపిన బాబా

ఆరోగ్యాన్ని కాపాడిన బాబా


నా పేరు కోమలి. ముందుగా, సాయితండ్రికి నా సాష్టాంగ నమస్కారాలు. ఈ బ్లాగులో తోటి సాయిబంధువుల అనుభవాలను రోజూ చదువుతుండడం వల్ల నాకు సాయితండ్రి మీద విశ్వాసం ఎన్నోరెట్లు పెరిగింది. అందుకే ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా కృతజ్ఞతలు. నేను కూడా ఈ బ్లాగులో ఒక సభ్యురాలిని అయినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనిప్పుడు బాబా నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడారో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 2021, ఆగస్టు నెలలో నాకు అంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఆయాసం, నీరసం ఉంటుండేవి. అలాగే నా కాళ్ళమీద చర్మం కమిలినట్టుగా మచ్చలు వచ్చి పోతుండేవి. ఎందుకలా ఉంటుందో మాకు అర్థం కాలేదు. మేము చాలా టెస్టులు చేయించాము. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయిగానీ, బ్లడ్ టెస్టులో ప్లేట్లెట్ల కౌంట్ 60 వేలకి పడిపోయినట్లు తెలిసింది. అప్పుడు వరుసగా 2 రోజులు పరగడుపున బొప్పాయి ఆకుతో రసం చేసుకొని తాగాను. దాంతో ఆయాసం తగ్గిపోవడం వల్ల నేనింక టెస్ట్ చేయించుకోలేదు. అయితే సంవత్సరం తర్వాత 2022, అక్టోబర్ నెల చివరిలో మళ్లీ ఆయాసం, నీరసం అనిపించాయి. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే ప్లేట్లెట్ కౌంట్ 48 వేలకు పడిపోయిందని వచ్చింది. అప్పుడు ముందు సంవత్సరంలోలాగానే 2022, నవంబరులో బొప్పాయి ఆకు రసం తాగాను. కానీ ఈసారి ఆయాసం తగ్గలేదు. అయినా బొప్పాయి రసంతో పాటు మంచి ఆహారం తీసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రతివారం ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేసుకుంటుండేదాన్ని. అలా నెల రోజులు గడిచినా కూడా ప్లేట్లెట్ కౌంట్ పెరగలేదు. అప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్‍కి వెళ్ళాము. అక్కడ అన్ని టెస్టులు చేసి, "మీకు ఐటిపి అనే ఒక రకమైన వ్యాధి ఉందనుకుంటున్నాము. ఆ వ్యాధి నిర్ధారణ కోసం బోన్ మ్యారో టెస్ట్ చేయాలి" అని చెప్పారు. మేము చాలా టెన్షన్ పడ్డాము. మరో డాక్టర్ సలహా తీసుకుందామని ఈసారి ఒక పెద్ద ప్రైవేటు హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ కూడా అదే చెప్పారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్నపాపకి మూడు సంవత్సరాల ఐదు నెలల వయసు. అందువల్ల నా భర్త చాలా టెన్షన్ పడ్డారు. నాకు మాత్రం 'బాబా ఉన్నారు. నాకు ఏమీ కాదు' అనే ధైర్యం ఉండేది. ఎందుకంటే, నా జీవితంలోకి ఏదైనా ఒక పెద్ద కష్టం రాబోతుందంటే, సాయితండ్రి ముందుగానే నాకు కలలో కనిపించి ధైర్యం చెప్పడమో లేదా ఆ పెద్ద కష్టాన్ని తమపై వేసుకొని చిన్నదిగా చేస్తున్నట్లు తెలియజేయడమో చేస్తారు. అలాంటిది ఈసారి బాబా నాకు కలలో కనిపించి నా ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేదు. కాబట్టి నేను, 'నాకు ఏమీ కాద'ని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ మేము మూడో డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ కూడా ముందు డాక్టర్లలాగే చెప్పి, "ఒకసారి బోన్ మ్యారో స్పెషలిస్ట్‌ని కలవండి" అని చెప్పారు. దాంతో నాకు భయమేసి ఒక గురువారంనాడు, 'బోన్ మ్యారో స్పెషలిస్ట్‌ని కలవాలా, వద్దా?' అని బాబా దగ్గర చీటీలు వేశాను. అందులో నుండి ఒక చీటీ తీస్తే, 'బోన్ మ్యారో స్పెషలిస్ట్‌ని కలవవద్దు' అని వచ్చింది. అంటే, 'బోన్ మ్యారో టెస్టు అవసరం లేద'ని బాబా చెప్పకనే చెప్పారు. దాంతో నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది. ఒక పది రోజులు, అంటే 2023, జనవరి 6వ తేదీ వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ ఆరోజు నాకు ఆయాసం ఎక్కువైంది. నా భర్తకు ఫోన్ చేస్తే స్కూల్ నుండి వచ్చారు. ఇద్దరం దగ్గరలో ఉన్న ల్యాబ్‍కి వెళ్లి, టెస్ట్ చేయిస్తే ప్లేట్లెట్ కౌంట్ 75,000 ఉంది. హిమోగ్లోబిన్ మాత్రం 19%కి పెరిగింది. మాములుగా ఆడవాళ్ళకి హిమోగ్లోబిన్ 14% ఉంటేనే చాలా ఎక్కువ ఉన్నట్లు. అలాంటిది నాకు 19% ఉంది. అది అబ్-నార్మల్ కండిషన్ అని ల్యాబ్ అతను, "మీరు ఒకసారి హైదరాబాద్ వెళ్లి స్పెసలిస్ట్‌కి చూపించుకోండి. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది" అని చెప్పాడు. దాంతో మావారు, "సంబంధిత డాక్టరుని సంప్రదిద్దాము. అన్ని అనుమానాలు క్లియర్ అయిపోతాయి" అని అన్నారు. ఇంక నేను ఐటిపి వ్యాధి గురించి యూట్యూబ్‍లో చూడసాగాను. ముఖ్యంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ కరుణకుమార్ (హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో స్పెషలిస్ట్) వీడియోలు బాగా చూశాను. చివరికి ల్యాబ్ అతను చెప్పినట్టుగా హైదరాబాద్ వెళ్లి చూపించుకోవాలని డాక్టర్ కరుణకుమార్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అప్పటివరకు నేను చాలా టెన్షన్ పడుతూ, "బాబా! దయ చూపండి. నాకు ఏమన్నా అయితే నా పిల్లలు అనాథలైపోతారు, నా భర్త దిక్కులేనివాడు అయిపోతాడు" అని చాలా ప్రార్థిస్తుండేదాన్ని. ఆరోజు మేము మా ఊరి నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు నాకు ధైర్యంగా ఉంటుందని రోజూ మా ఇంట్లో పూజించే సాయిబాబా చిన్న ప్రతిమను నా బ్యాగులో పెట్టుకొని వెళ్ళాను. బాబాను ప్రార్థిస్తూ, "సాయితండ్రీ! బోన్ మ్యారో టెస్ట్ అవసరం లేదని డాక్టర్ చెప్పేలా చూడండి. అలా చెప్తే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతలో నర్సు నా పేరు పిలిస్తే, వెళ్లి డాక్టర్ని కలిశాము.


డాక్టర్ నా రిపోర్టులన్నీ చూసి, "ఇంకొన్ని టెస్టులు చేద్దాం" అని చెప్పి, "మీకుంది మైల్డ్ ఐటిపి కాబట్టి బోన్ మ్యారో టెస్టు మాత్రం అవసరం లేద"ని చెప్పారు. అప్పుడు బాబా కరుణకు నా కళ్ళనుండి నీళ్లు కారాయి. డాక్టర్ మరికొన్ని టెస్టులు చేసి, "బి12 విటమిన్ లోపం ఉంద"ని చెప్పి, 15 రోజులకి టాబ్లెట్లు ఇచ్చి, "మీకున్న మైల్డ్ ఐటిపికి ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే, ఐటిపి పేషెంట్స్‌కి ప్లేట్లెట్ కౌంట్ 30,000 కంటే తక్కువ ఉంటేనే ట్రీట్మెంట్ అవసరం. కానీ మీకు 75,000 ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అంతేకాదు, మీరు ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్ చెక్ చేసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోనవసరం లేదు. బి12 విటమిన్ లోపం వల్ల కూడా ఆయాసం వస్తుంది" అని చెప్పారు. మొత్తానికి లోకల్లో ఉండే ముగ్గురు జనరల్ డాక్టర్లు బోన్ మ్యారో టెస్ట్ చేయాలని చెప్పినప్పటికీ, ఆ సాయితండ్రి స్పెషలిస్ట్ డాక్టరుతో బోన్ మ్యారో అవసరం లేదని చెప్పించారు, నా కుటుంబసభ్యుల ఆందోళనను తగ్గించారు, నా ఆరోగ్యాన్ని కుదుటపరిచారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. మాలో శ్రద్ధ, సబూరి ఇంకా ఇంకా పెంచండి. మీ పాదాలను విడవకుండా గట్టిగా పట్టుకునే శక్తిని మాకు ప్రసాదించండి".


బయాప్సీ రిజల్ట్ నార్మల్ వచ్చేలా దయచూపిన బాబా


బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతఙ్ఞతలు. నా పేరు వసంతకుమార్ రెడ్డి. సుమారు 1990 ముందునుంచి నేను సాయినాథుని కొలుస్తున్నాను. నేను ఇంతకుముందు ఒకసారి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా ఆత్మీయులొకరు క్యాన్సర్‌తో కొంతకాలం ఇబ్బందిపడి కోలుకున్నారు. సుమారు నాలుగేళ్ళ నుండి అతను రెగ్యులర్ చెకప్‌కి వెళుతున్నారు. 2023, జనవరి మూడవ వారంలో అతను చెకప్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ మళ్ళీ బయాప్సీ చేయాలని శ్యాంపిల్ తీసుకున్నారు. అది తెలిసి నాకు భయమేసి, "బాబా! రిజల్ట్ నార్మల్‌గా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకొంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. 2023, జనవరి 22న రిజల్ట్ నార్మల్ అని తెలిసింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మరో టెస్ట్ రిజల్ట్ రావాల్సి ఉంది. అది కూడా నార్మల్ వచ్చేటట్టు చూడు బాబా. అతను పూర్తి ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్షు కలిగివుండేలా అనుగ్రహించు తండ్రీ".


3 comments:

  1. ఓం సాయి రామ్ సాయి ఈరోజు నా భర్త పుట్టినరోజు సాయి తన నా ఆశీర్వదించండి సాయి తను నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి తను నేను మళ్ళీ కలుసుకునేలా చూడు సాయి తను నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నేను కూడా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి లో పంచుకుంటాను సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo