సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1278వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎల్లవేళలా భక్తులను రక్షించే బాబా
2. సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి
3. సమస్యను సామరస్యంగా పరిష్కరించిన బాబా 

ఎల్లవేళలా భక్తులను రక్షించే బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. ముందుగా మా ఇంటి దైవం శ్రీమల్లిఖార్జునస్వామికి, శ్రీసాయిబాబాకి నమస్కరిస్తూ బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు నా కంట్లో నలుసు పడి నేను చాలా చాలా బాధపడ్డాను. మందులు వేసుకున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. ఇంకా ఆ రాత్రి నేను నిద్రపోయేముందు బాబా ఊదీ ధరించి, "నొప్పి తగ్గి, నలుసు పోయినట్లైతే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని నిద్రపోయాను. తక్షణమే నిద్రపట్టి కొంత సమయం తరువాత మెలకువ వచ్చింది. అప్పటికి నొప్పి తగ్గింది. నలుసు కూడా పోయింది. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి నా తలకు దెబ్బ తగిలి నొప్పిగా ఉంటే, బాబా ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల నొప్పి తగ్గింది. ఇంకోసారి నా కాలు తిమ్మిరెక్కి ఎంతకీ తగ్గలేదు. రెండు, మూడు రోజులైనా కూడా ఆ తిమ్మిరి తగ్గలేదు. అప్పుడు నేను బాబా ఊదీ నా కాళ్ళకు రాసుకుంటే తిమ్మిరి తగ్గుముఖం పట్టి, క్రమంగా తగ్గిపోయింది.


ఒకసారి మేము తిరుపతి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక స్టేషన్‌లో రైలు ఆగితే నీళ్లకోసమని మా అన్నయ్య, బావ దిగారు. రైలు కదిలాక మా బావ వచ్చారు కాని, అన్నయ్య కనిపించలేదు. నేను కంగారుగా బాబాను తలుచుకుంటూ తనకోసం వెతికితే తను వాష్ రూమ్‌లో నుంచి బయటకి వచ్చాడు.


ఒకసారి నా బ్యాంకు ఏటీఎం కార్డు కనిపించలేదు. ఇంకా మినీ బ్యాంకుకి వెళ్లి నా అకౌంట్లో నుండి కొంత డబ్బు తెచ్చుకున్నాను. మరికొంత డబ్బు అకౌంట్లో ఉండగా హఠాత్తుగా  ఏటీఎం ద్వారా 500 రూపాయలు తీసిన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. నేను వెంటనే బ్యాంకుకి వెళ్లి ఏటీఎం కార్డు బ్లాక్ చేయించాను. తరువాత ఆలోచిస్తే, చాలారోజుల క్రితం నా ఏటీఎం నా ఫ్రెండ్‌కి ఇచ్చానని, తను నాకు తిరిగి ఇవ్వలేదని గుర్తొచ్చింది. ప్రస్తుతం అతను వేరే ప్రాంతంలో ఉన్నాడు. అతనికి నా ఏటీఎం పిన్  తెలుసు కాబట్టి అతనే నా ఏటీఎం కార్డు ద్వారా నా అకౌంట్లో నుండి డబ్బులు తీశాడని అర్థమైంది. బాబా దయవల్ల అతను నా అకౌంట్ నుండి డబ్బులు తీసే సమయానికి కొద్దిసేపు ముందే నేను మినీ బ్యాంకుకి వెళ్లి డబ్బులు తెచ్చుకున్నాను, లేదంటే ఆ డబ్బులు కూడా నష్టపోయేవాడిని. బాబానే పెద్ద నష్టం జరగకుండా, సమస్య ఎదురవకుండా నన్ను రక్షించారు.


ఒకరోజు రాత్రి నాకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. నేను ఆ నొప్పిని తట్టుకోలేక బాబాని ప్రార్థించి, "తలనొప్పి తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. కొద్దిసేపట్లో అంత నొప్పి కూడా తగ్గిపోయి నాకు నిద్ర పట్టింది. ఈవిధంగా బాబా కృప నాపైన, మా కుటుంబంపైన ఉంది. ఆయన ఎల్లవేళలా తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఆయన పిలిచిన పలికే దైవం. అంతా సాయిమయం. "ధన్యవాదాలు బాబా".


సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి


సాయి బంధువులందరికీ నమస్కారం. భక్తుల అనుభవాలను ప్రచురిస్తూ తోటి భక్తుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఈ బ్లాగు నిర్వహకులకు శతకోటి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాపేరు పద్మజ. మేము ఇండోర్‍లో ఉంటున్నాము. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. 2021, డిసెంబరులో నేను సెలవులకి గుంటూరులో ఉన్న మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడొకరోజు నా కొత్త ఫోను క్రిందపడి స్క్రీన్ మొత్తం పాడైపోయింది. ఇక అది పని చేయదని అనుకున్నాము. సామ్‍సంగ్ కంపెనీవాళ్ళకి ఫోన్ చేస్తే, ఫోన్ తీసుకుని రండి అని అన్నారు. సరేనని ఫోన్ తీసుకుని వెళితే, వాళ్ళు మొబైల్ అంతా చెక్ చేసి 8,000 నుండి 10,000 దాకా ఖర్చవుతుందని అన్నారు. అప్పుడు నేను, "బాబా! పైసా ఖర్చు లేకుండా నా ఫోన్ బాగైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు కంపెనీవాళ్ళు ఫోన్ చేసి, అంతా వివరంగా చెప్పి, ఫోన్ తీసుకుని రండి అని అన్నారు. నేను ఇండోర్కి తిరిగి వెళ్ళాక ఫోన్ తీసుకుని వెళితే, ఒకే ఒక్కరోజులో పైసా ఖర్చు లేకుండా నా ఫోన్ బాగు చేసి ఇచ్చారు. ఇదంతా బాబా కృపవలనే సాధ్యం అయింది. "ధన్యవాదాలు బాబా. మమ్మల్ని ఎల్లవేళలా ఇలాగే కాపాడు సాయిబాబా".


2022, జూన్ 30న ఎల్.ఐ.సిలో పనిచేసిన మా అమ్మ పదవీవిరమణ చేసారు. ఆ సందర్భంగా మేము గుంటూరు వెళ్లడానికి, "ఏ ఆటంకం లేకుండా చూడమ"ని బాబాను వేడుకున్నాము. ఆయన దయవల్ల చాలా సుళువుగా మావారికి లీవ్ సాంక్షన్ అయింది. అలాగే ఆ సమయంలో మా బాబుకి ఏ పరీక్షలు లేకుండా చేసారు బాబా. ట్రైన్ టిక్కెట్లు కూడా దొరికేలా అనుగ్రహించారు. మేము సంతోషంగా వెళ్లి, కార్యక్రమానికి హాజరై తిరిగి వచ్చాం. "ఎప్పుడైనా, ఎక్కడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంతనుంటాను. భయం వద్దు" అని చెప్పినట్లే బాబా నా పెద్ద పెద్ద సమస్యలను చాలా తేలికగా పరిష్కరించారు. నా సొంత ఇంటి కలను నేరవేర్చారు. మాకు కరోనా వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలతో మేము పడిన బాధను తీర్చారు. సాయినాథుని దయతో ఎటువంటి కష్టాలైనా తీరుతాయి. సాయిని ఎల్లవేళలా ప్రార్ధించండి. "ధన్యవాదాలు బాబా. అమ్మ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండేలా ఆశీర్వదించండి. నేను ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కోరిక కోరుతున్నాను తండ్రి. తొందరగా దానిని అనుగ్రహించండి బాబా".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


సమస్యను సామరస్యంగా పరిష్కరించిన బాబా 


సాయి బంధువులందరికీ నమస్కారం. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగును మాకు అందించిన బ్లాగు నిర్వాహక బృందానికి ధన్యవాదాలు. నా పేరు గోపాలకృష్ణ. నేను గతంలో కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కొంచెం ఆలస్యంగా ఈ అనుభవం పంచుకుంటున్నందుకు ముందుగా క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. 2022, జూలై 23, శనివారం నాడు మా ఇంట్లో నాకు, నా భార్యకు మరియు నా సవతి తల్లి(పిన్ని)కి పెద్ద గొడవ జరిగింది. దాంతో, 'నా సమస్యేంటో బాబాకి తెలుసు. ఆయన దానినుండి బయటపడవేస్తార'ని నమ్మకంతో బ్రతుకుతున్న నేను, సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని కాస్త అసహనానికి గురై ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయాను. తరువాత, "బాబా! ఇప్పటి నుండి ఇంట్లో ఏ గొడవ జరగకుండా చూడు తండ్రి. అలా చేస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అధ్భుతం చేశారు. నేను ఇంటికి వచ్చేసరికి అందరూ నిశబ్ధంగా ఉన్నారు. ఒక వారం రోజులు గమనించాను. బాబా దయవల్ల అందరమూ ప్రశాంతంగా ఉన్నాము. "ధన్యవాదాలు బాబా. ఇదేవిధంగా అందరికీ సహాయం చేయండి బాబా. నిన్నే నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి కాపాడు తండ్రి"..


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Please Baba feaver raakunda 🙏🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo