సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1270వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని కృపాకటాక్షవీక్షణాలు
2. బాబా కృప

శ్రీసాయినాథుని కృపాకటాక్షవీక్షణాలు


"అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ మహాప్రభూ!!! మీకు కోటానుకోట్ల పాదాభివందనాలు. అనుదినం, ప్రతీ అడుగు మీ సహాయంతో వేసే భక్తులం మేము నాయనా! ఒక్క క్షణం కూడా నీ కృపావీక్షణాలు మాపై నుండి మరల్చవద్దు. మమ్మల్ని మాయ శిక్షించకుండా కాపాడు తండ్రీ! చిన్నవి, పెద్దవి ఎన్ని అనుభవాలని వ్రాయగలం తండ్రీ? గుర్తొచ్చినవన్నీ ఈసారి బ్లాగులో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి సాయినాథా". నేనొక సాయిభక్తురాలిని. సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహించడం ద్వారా ఆ సాయినాథుని కృపాకటాక్షవీక్షణాలు మా అందరి యందు ప్రసరింపజేస్తున్న సాయికి కృతజ్ఞతలు. మీ వల్ల, ఈ బ్లాగు వల్ల మేము ప్రతిరోజూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ సాయినాథుని మనసారా కొలుచుకుంటున్నాము. ఈ బ్లాగులోని మిగతా భక్తుల అనుభవాలలో మా సమస్యలకు సమాధానాలు లభిస్తున్నాయనడంలో సందేహమే లేదు. 'భక్తులారా! చిన్న, పెద్ద విషయాలలో బాబా ఇచ్చే అభయహస్తం, ఆయన కరుణాకటాక్షవీక్షణాలు మనపై ఎలా ప్రసరిస్తాయో చెప్పే సాధనమే ఈ బ్లాగు. 'ఓం శ్రీ సాయినాథాయ నమః' అన్న ఈ నామమే భక్తకోటిని అడుగడుగునా రక్షించే దివ్యకవచం. సాయి నామాన్ని పఠించండి. ఎల్లవేళలా ఆయన రక్షణలో ఉండండి'. ఇక నా అనుభవాల విషయానికి వస్తే...


2022, మే నెల రెండవ వారంలో ఉపాధ్యాయులకు పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు వేశారు. రోజూ 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఎప్పుడు సెలవులు ఇస్తారా అని ఎదురుచూసే నాకు కూడా డ్యూటీ వేయడంతో, "సాయినాథా! నేను అంత సుదీర్ఘ సమయం కూర్చుని పనిచేయలేను. పైగా మండు వేసవి. నా ఆరోగ్య దృష్ట్యా ఈ డ్యూటీని ఎలాగైనా రద్దు అయ్యేలా చేయండి బాబా. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మా పైఅధికారులు, "పడిన డ్యూటీ ఎవ్వరికీ తప్పిపోవడమంటూ ఉండదు" అని బలవంతంగా (ఒకరకంగా చెప్పాలంటే బెదిరిస్తూ) అందర్నీ స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలో నిమగ్నపరచి పేపర్లు దిద్దించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మాత్రం మనస్సులో భయంగా ఉన్నా, బాబా మీద నమ్మకంతో ఆయన నామజపం చేస్తూ దూరంగా ఉండిపోయాను. కొంతసేపటికి ఇక తప్పదని డ్యూటీలో చేరిపోదామని మా సబ్జెక్టు క్యాంపు ఆఫీసర్(సీనియర్ హెడ్ మాస్టర్) దగ్గరకు వెళ్ళాను. ఆయన నా చేత సంతకం చేయించుకుని డ్యూటీలోకి తీసుకున్నారు. కానీ పావుగంట తరువాత ఆయనే,  "అమ్మా! స్పాట్ వాల్యుయేషన్ చేసే గ్రూపులన్నీ పూర్తిగా ఏర్పడ్డాయి. మీరు అదనంగా మిగిలిపోయారు. కాబట్టి మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నాను, వెళ్లిపోండి" అని అన్నారు. ఆశ్చర్యం! నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. నిజంగా ఇది బాబా చేసిన అద్భుతం. మా పాప చదువు విషయంలో బాబా తనని ముందుకు నడిపించి మంచి పేరుప్రఖ్యాతులున్న ఒక యూనివర్సిటీలో తనకి సీటు ఇప్పించి ఎంతో మేలు చేశారు. "బాబా! తనకి అడుగడుగునా దిశానిర్దేశం చేసి తన జీవితాన్ని చక్కగా స్థిరపరిచే బాధ్యత మీదే తండ్రీ".


"జాతకాలు చూడవద్ద"ని బాబా చెప్పినప్పటికీ ఒక మహిళ ప్రోద్బలం వలన మానవ సహజమైన కుతూహలంతో నేను 2022, జూన్ నెలలో ఒక జ్యోతిష్య పండితుణ్ణి సంప్రదించాను. అయితే, బాబా అతని మోసకారి బుద్ధి మాకు త్వరగా తెలిసివచ్చేలా చేసి మమ్మల్ని రక్షించారు. "తండ్రీ! మీ మాట వినలేదని కోపగించుకోకుండా మమ్మల్ని రక్షించావు. సదా మీ కరుణ మాపై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాపై కోపగించుకోకు దయామయా. మా అజ్ఞానాన్ని క్షమించి మమ్ము ఆదరించు బాబా".


నా తోటి ఉపాధ్యాయిని కుమారుడికి(చిన్నబాబు) తరచూ జ్వరం వస్తుంటే చాలా టెస్టులు వ్రాశారు. ఇటు జాబు, అటు బాబు గురించి ఆమె సతమతమవుతుంటే నేను ఆ తల్లి బాధ చూడలేక, "బాబా! ఆ బాబుకి నయమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ సమర్థ సద్గురు సాయినాథుని దయవల్ల ఇప్పుడు ఆ బాబు చక్కగా కోలుకుని స్కూలుకి వెళ్తున్నాడు.


ఒకరోజు సాయంత్రం మెడికల్ టెస్టుల కోసమని బయలుదేరి వెళ్లిన నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు క్రికెట్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ వేరే మార్గంలోకి మళ్లించడం వలన ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాను. ఒంటరిగా ఆటోలో కూర్చుని ఇంటికి చేరడానికి రెండు, మూడు గంటలు పడుతుందేమోనని, "బాబా! నన్ను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత మీదే" అని బాబాని ప్రార్థించసాగాను. అంత ట్రాఫిక్‌జామ్ కూడా చిత్రంగా అరగంటలో క్లియర్ అయిపోయింది. తరువాత మావారి సహాయం తీసుకుని మరో 20 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాను. ఇలా చిన్న, పెద్ద విషయాలలో బాబా చేసే సహాయాలు మరువలేనివి. "ధన్యవాదాలు బాబా. మా పాప కాలేజీ జాయినింగ్ విషయంలో మాకున్న సమస్యలన్నీ తొలగించి, మార్గం సుగమం చేసి, పని పూర్తి చేయించిన మీకు శతసహస్ర వందనాలు బాబా. పాప మంచిగా చదువుకుని, తను చక్కని జీవితం పొందేలా చూసే బాధ్యత మీదే బాబా. నా ఆరోగ్య సమస్యల దృష్ట్యా నాకు దగ్గర ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చూడు తండ్రీ. చెల్లెలి ట్రాన్స్‌ఫర్ మరియు ఇంటి సమస్యలను కూడా తీర్చి తన కుటుంబానికి కూడా మీ భక్తకోటిలో స్థానమివ్వు తండ్రీ. శిరిడీ, తిరుమల దర్శించి చాలాకాలం అయ్యింది. దయచేసి తొందరలో ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇల్లు కొనుగోలు విషయంలో, లోన్ శాంక్షన్ విషయంలో అడుగడుగునా మీ సహాయం మరువలేనిది బాబా. అలాగే మీ దయతో మిగిలిన పనులు కూడా సక్రమంగా జరిగి మేము గృహప్రవేశం చేసుకోవాలి తండ్రీ. మేము మా కొత్త ఇంటికి 'ద్వారకామాయి' అని పేరు పెట్టుకుంటున్నాము. సదా ఆ గృహం మీ నిలయంగా విలసిల్లాలని, ఒక్కక్షణం కూడా మేము మీ రక్షణకు, మీ దయకు దూరం కాకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రీ".


సర్వేజనాః సుఖినోభవంతు!!!

జై శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబా!!!


బాబా కృప


అందరికీ నమస్తే. నా పేరు అంజలి. నా జీవితంలో ప్రతి చిన్న విషయమూ బాబా దయవల్లే జరుగుతుందని నా పూర్తి విశ్వాసం. ఈమధ్య మా పాపకి బాగా జ్వరం వచ్చింది. నేను పాపచేత బాబా ఊదీనీళ్లు త్రాగించి, రాత్రంతా పాప శరీరాన్ని తడిబట్టతో తుడుస్తూ, "తెల్లవారేసరికి జ్వరం తగ్గి పాప మామూలుగా అయితే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి పాప నార్మల్ అయింది. కానీ పాపకి కొంచెం ఆయాసంగానూ, గొంతులో నసగానూ ఉండటంతో కోవిడ్ ఏమో అని నాకు అనిపించింది. వెంటనే, "బాబా! పాపకి ఉన్న ఇబ్బందులన్నీ తగ్గించండి తండ్రీ" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజుకి పాపకి ఆయాసం, జ్వరం పూర్తిగా తగ్గాయి. ఆ మరుసటిరోజు తెల్లవారేసరికి గొంతులో నస కూడా తగ్గిపోయింది. అయితే కొంచెం దగ్గు వస్తూ ఉదయం పూట కఫం పడుతూ ఉండేది. ఒకసారి ఆ కఫంలో కొద్దిగా రక్తం కనిపించేసరికి నాకు బాగా టెన్షన్‌గా అనిపించి, బాబా ఊదీని నీళ్లలో కలిపి పాప చేత త్రాగించి, "ఏ ప్రాబ్లెమ్ లేకుండా ఉంటే, బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. కేవలం రెండు రోజుల్లో ప్రాబ్లెమ్ తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

 

గుంటూరులో మేము కొన్న అపార్ట్‌మెంటుకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఏ సమస్యా లేకుండా నా పేరు మీదకి మారితే, బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయవల్ల గురుపౌర్ణమినాడే ప్రాపర్టీ ట్యాక్స్ నా పేరు మీదకి మారింది. ఈమధ్య మావారి కోపాన్ని బాబా తగ్గించారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.


ఈమధ్య నా భర్త, తమ్ముడు ప్రసాద్ కలిసి తిరుపతి వెళ్లారు. అప్పుడు నేను, 'వాళ్ళ తిరుపతి ప్రయాణం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తయి క్షేమంగా తిరిగి వస్తే, బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు తిరుపతి ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి స్వామి దర్శనం బాగా జరిగింది.


ఇకపోతే, తమ్ముడు ప్రసాద్ ఇంట్లో తన భార్యతో గొడవలు జరిగి బాగా డిస్టర్బ్ అయ్యాడు. తను చాలా మూడ్ ఆఫ్ లో ఉండి 2022, జూన్ 30, గురువారం మహాపారాయణ గ్రూపు నుండి బయటకి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ అనిపించి బాబాను, "బాబా! భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగేలా చేసి, వాళ్ళు తొందరగా నార్మల్ అయ్యేలా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల రెండురోజుల్లో వాళ్లిద్దరూ నార్మల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా. వాళ్ళు ఎటువంటి గొడవలూ లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రీ. అలాగే తమ్ముడు తిరిగి మహాపారాయణ గ్రూపులో జాయిన్ అయ్యేలా, మీ మీద తనకి నమ్మకం కలిగేలా చూడండి తండ్రీ" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత గురుపౌర్ణమినాడు నేను తమ్ముడితో కలిసి బాబా గుడికి వెళదామని అనుకున్నాను. బాబా ఆరోజు తమ్ముడిని గుడికి రప్పించుకోవడమేకాక హారతి, పల్లకి సేవలలో తను అటెండ్ అయ్యేలా చేశారు. నాకు చాలా చాలా సంతోషమేసింది. బాబా తమ భక్తులని ఎన్నటికీ దూరం చేయరు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



7 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sri Sai nath namaha

    ReplyDelete
  3. Sarwam sai mayam
    Ome sri sai ram🙏

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Sashi ki seat ravali thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo