సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1273వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. భయాలను దూదిపింజెలా తీసేసిన బాబా
2. బాబా చేసిన మేలు
3. కోరుకున్నది అనుగ్రహించే బాబా

భయాలను దూదిపింజెలా తీసేసిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. నేను ఈమధ్య నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవడం అలవాటుగా చేసుకున్నాను. అలాగని అన్నీ ఎక్కడ పంచుకోగలం? ఎందుకంటే, మనందరికీ సాయితో అనుభవాలు కోకొల్లలు. కానీ కష్టం మరీ ఇబ్బంది పెట్టినప్పుడు తెలియకుండానే బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పుకుంటున్నాను. అలాంటి అనుభవమే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. 2022, జూలై 10, ఆదివారం మేము మా సొంతూరు వెళ్ళాము. అక్కడొకరోజు మేము, మా తమ్ముళ్ళ కుటుంబాలు కలిసి బయట రాత్రి భోజనం చేశాము. ఇంకోరోజు అందరమూ ఒకరి ఇంట్లో భోజనాలు చేసి సంతోషంగా గడుపుతుండగా మావారు కొంచెం జ్వరంగా ఉందని, కాసేపు పడుకున్నారు. ఆయన లేచిన తర్వాత మేము మా ఊరికి వచ్చేశాం. అప్పటికి మావారికి బాగానే ఉంది కానీ, ఆ రాత్రి మళ్ళీ జ్వరమొస్తే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. మరుసటిరోజు ఉదయం మావారు తనకి నీరసంగా ఉందని అన్నారు. నాకు అనుమానమొచ్చి కోవిడ్ టెస్ట్ చేయాలనుకున్నాను. కానీ నా గత అనుభవాల దృష్ట్యా నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మేము మా ఆప్తులను పోగొట్టుకున్నాం. అయితే మా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరికీ కోవిడ్ రాలేదు. ఈమధ్యనే కొంచెం మాస్కులు తొలగించి తిరుగుతున్నాం. ఇంతలోనే మావారికి ఇలా అయ్యేసరికి అందరూ, "గతంలోలాగా ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేద"ని చెప్తున్నప్పటికీ నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. సాయిని స్మరిస్తూ, "కోవిడ్ లేకపోతే, నవగురువారవ్రతం చేస్తాన"ని బాబాకి మ్రొక్కుకుని కోవిడ్ టెస్టు చేస్తే, మావారికి పాజిటివ్ వచ్చింది. ఇంక నా భయం మాటల్లో చెప్పలేను. భయంభయంగా, "బాబా! సీరియస్ కాకుండా కొద్దిపాటి లక్షణాలతో మావారికి తగ్గిపోవాలి. నాకు, మా అమ్మాయికి కోవిడ్ రాకూడదు. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. కానీ మర్నాటికి మా ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కానీ బాబా దయవల్ల పెద్ద తీవ్రత లేదు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే, మాక్కూడా కోవిడ్ వచ్చాక నాకు కొంచెం భయం తగ్గింది. పరవాలేదులే అని అనుకుంటూ ఉండగా అక్కడ మా తమ్ముడికి పాజిటివ్ అని తెలిసింది. వాడికి అదివరకే ఒకసారి కోవిడ్ చాలా తీవ్రంగా వచ్చి ఉన్నందువల్ల నాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. కానీ బాబా దయవలన రెండు రోజుల్లో అందరికీ కోవిడ్ లక్షణాలు తగ్గి మామూలుగా అయ్యాము. కానీ, "ఎలాంటి చెడు జరగకూడద"ని బాబాను ప్రార్దిస్తూనే ఉన్నాను. బాబా కృప వలన సరిగ్గా వారంరోజులకి 2022, జూలై 18న మావారికి నెగిటివ్ వచ్చింది. రెండురోజుల్లో మేము టెస్ట్ చేసుకోవాలి. బాబా దయవల్ల మాకు కూడా నెగిటివ్ వస్తుందని నమ్మకంతో ముందుగానే నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను.


ఒకేసారి అన్ని సమస్యలు వచ్చి మీదపడతాయన్నట్టు, మేము పైన చెప్పిన కోవిడ్ కష్టంలో ఉన్నప్పుడే మా స్వంతింటి బాల్కనీలో ఎండ పడకుండా వేయించిన రేకులు పెనుగాలికి విరిగి కిందపడ్డాయని మాకు తెలిసింది. అయితే అదృష్టం కొద్దీ వాటివల్ల ఎవరికీ ఏ హాని జరగకుండా బాబా కాపాడారు. అసలే మా పక్కింటివాళ్ళు గొడవల మనుషులు. వాళ్ళవైపు ఆ రేకులు పడుంటే చాలా గొడవ అయ్యుండేది. ఆ ఇంట్లో మనుషులు ఉన్నా కూడా గొడవ జరిగి ఉండేది. అందుకే ఆ ఇల్లు అద్దెకివ్వకుండా ఖాళీగా ఉండేలా బాబా చేశారేమోనని నాకు అనిపిస్తుంది. అదే బాబా టైమింగ్. ఆయన ఇవ్వడం, ఇవ్వకపోవడం వంటి అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మా ఇంటిలోకి ఎవరైనా మంచివాళ్ళు అద్దెకి వచ్చేలా చూడండి సాయీ. చాలారోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. నేను మ్రొక్కుకున్న మ్రొక్కులను గుర్తుచేసి వాటిని తీర్చుకునేలా అనుగ్రహించండి సాయీ. చివరిగా మరోసారి  భయాలను దూదిపింజెలా తీసేసిన మీకు వేలవేల ధన్యవాదాలు సాయీ".


బాబా చేసిన మేలు


సాయిబంధువులందరికీ నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు చేసిన మేలుని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2022, జులై 18న మా అమ్మకి ఉన్నట్టుండి కడుపునొప్పి వచ్చింది. ఏ కారణం లేకుండా ఉన్నట్టుండి అలా అమ్మకి కడుపునొప్పి వచ్చేసరికి మేము చాలా భయపడిపోయాం. కానీ బాబా ఉండగా మనకి భయమేల? నేను వెంటనే, "బాబా! మీ దయతో అమ్మ కడుపునొప్పి తగ్గిపోతే, నేను ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. అంతే, ఒక పదినిమిషాల తర్వాత మా అమ్మ మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఏదో కొద్దిపాటి నొప్పి ఉన్నా మరుసటిరోజు ఉదయానికి అది కూడా తగ్గిపోయేలా చేశారు బాబా. "థాంక్యూ బాబా. ఎప్పుడూ ఇలానే మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించు తండ్రీ".


ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే టీ త్రాగడం నాకలవాటు. అలవాటు అనేకంటే వ్యసనం అని చెప్పాలి. ఎందుకంటే, టీ త్రాగకుండా నేను అస్సలు ఉండలేను. అలాంటిది ఒకసారి విపరీతమైన గొంతుమంట వలన రెండునెలలపాటు నేను టీ, పాలు త్రాగడం మానేయాల్సి వచ్చింది. చివరికి టాబ్లెట్లతో ఆ మంట తగ్గింది. ఈమధ్య మళ్ళీ అదే సమస్య వచ్చి ఏం తిన్నా చాలా మంటగా ఉండేది. అప్పుడు నేను, "బాబా! నేను టీలో ఊదీ వేసుకుని తాగుతాను, మందులు వేసుకోను. దయతో నా గొంతునొప్పి తగ్గించండి బాబా" అని బాబాతో చెప్పుకుని రోజూ టీలో ఊదీ వేసుకుని త్రాగాను. గొంతునొప్పి దానంతటదే తగ్గిపోయింది. అంతా బాబా దయ


ఈమధ్య ఒకసారి నా కాళ్ళుచేతులు విపరీతంగా లాగుతూ ఉండేవి. ఏదైనా ఆయిల్ లేదా బామ్ రాస్తేగానీ నిద్రపోలేని పరిస్థితి. అప్పుడు నేను బాబాను, "బాబా! నా కాళ్ళుచేతులు లాగడం తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల చాలావరకు కాళ్ళుచేతులు లాగడం తగ్గింది. అయితే రోజూ నా అనుభవం పంచుకుంటానని అనుకుంటూనే ఆలస్యం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య మొదలైంది. బాబాని క్షమించమని వేడుకుంటూ నా అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను. "నన్ను క్షమించండి బాబా".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


కోరుకున్నది అనుగ్రహించే బాబా


సాయిభక్తులకు నమస్కారం. నా పేరు శ్వేత సాయి. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన అనుభవమొకటి ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు 2022, జులై 21న జరిగిన మరో అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిని. ఈమధ్య నేను హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు డాక్టర్ స్కానింగ్, షుగర్ టెస్టు చేయించమని సూచించారు. అప్పుడు నేను, "బాబా! స్కాన్ మరియు షుగర్ రిపోర్టులన్నీ నార్మల్ వచ్చి, కడుపులో బేబీ బాగుందని చెప్పాలి. అలా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. అలాగే, స్తవనమంజరి ఒక వారం పారాయణ చేస్తాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా నేను కోరుకున్నట్టే రిపోర్టులన్నీ నార్మల్ వచ్చి, బేబీ బాగుంది అనేలా చేశారు. అలాగే నేను ప్రయాణం చేయడానికి డాక్టరు ఒప్పుకునేలా బాబా చేశారు. ఇది అందరికీ చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ ఒక గర్భవతి అయిన స్త్రీకి బేబీ చిన్న విషయం కాదు. అమ్మ కాబోయే స్త్రీకి బిడ్డ చాలా విలువైనది. సరే, నేను హాస్పిటల్ నుండి మధ్యాహ్నం హారతికి బాబా గుడికి వెళ్ళాను. అక్కడ నేను నా బ్యాగు తెరిస్తే, అందులో నా మొబైల్ కనిపించలేదు. ఫోన్ ఎక్కడ వదిలేసానో అర్థంకాక వెంటనే బాబాని తలచుకుని, "బాబా! ప్రస్తుతం నేనున్న ఆర్థిక సమస్యలలో కొత్త ఫోన్ కొనే పరిస్థితి లేదు. దయచేసి ఫోన్ దొరికేలా చేయండి. ఫోన్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకుని, 'శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని జపిస్తూ ఇంటికి వెళ్లి చూస్తే, ఫోన్ ఇంట్లోనే ఉంది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. మీకు మాట ఇచ్చినట్టుగానే గురువారం రెండు అనుభవాలు పంచుకున్నాను తండ్రీ. ఎప్పుడూ ఇలానే నాతో ఉంటూ నన్ను మీరే నడిపించండి సాయికన్నయ్యా. నా చేతిని ఎన్నడూ వదలకు తండ్రీ. నువ్వే నా ప్రాణం, సర్వం తండ్రీ. నువ్వు లేని జీవితం లేదు, వద్దు. ఎప్పుడూ మీ అభయహస్తం మాపైన ఉండనివ్వు సాయీ".


5 comments:

  1. ఓం సాయి బాబా టీ అనుభవం చాలా చక్కగా వుంది. సాయి బాబా పాత భక్తుల గురించి చాలా చక్కగా వివరించారు. అంటే బాబా జీవితాన్ని గడిపిన పుప్పుడు సాయి భక్తుల గురించి తెలిపారు. తెలియని సంగతులు వాళ్ళ అనుభవాలు బాగున్నాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Ome sri sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo