1. సాయిని నమ్ముకుంటే కాని పనంటూ ఏదీ ఉండదు
2. భయంకర ఘటన నుండి కాపాడిన బాబా
3. నడుము నొప్పి తగ్గించిన బాబా
సాయిని నమ్ముకుంటే కాని పనంటూ ఏదీ ఉండదు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా ఈ బ్లాగు నడిపిస్తున్న సాయికి నా హృదయపూర్వక అభినందనలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు సాయి మాకు చేసిన సహాయం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ చదువుకోసం ఈమధ్య మాకు కొంత డబ్బు కావాల్సి వచ్చింది. అప్పటికే మాకు కొంచెం అప్పు ఉండటం వల్ల మళ్ళీ అప్పు చేస్తే కట్టాల్సిన వడ్డీలు పెరుగుతాయని మేము మా పొలం అమ్మాలనుకున్నాము. కానీ మా పొలానికి దారి లేదు. ఎందుచేతనంటే, అన్నదమ్ములకు చెందిన పొలాలను ఆస్తుల పంపకం చేసినప్పుడు మా మావయ్యకి రోడ్డు నుండి లోపలకి ఉన్న పొలాలు వచ్చాయి. వేరే మావయ్య వాళ్ళకి రోడ్డుకి దగ్గరలో దారి ఉండేలాగా వచ్చాయి. మేము మా పొలం పనులకి వాళ్ళ పొలంలో నుంచే వెళ్లొస్తుంటాం. మా వరకు ప్రాబ్లం ఏమీ లేదు. కానీ, అమ్మాలంటే దారి ఉండాల్సిందే. ఈ పొలం సంగతి ఇలా ఉంచితే, మాకు వేరే చోట ఇంకో పొలం ఉంది. అయితే దానికి కూడా దారి లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఆ పొలానికి వెళ్లేందుకు మార్గంగా ఉపయోగించే స్థలాన్ని మా ఆడబిడ్డకు కట్నం కింద ఇచ్చారు. అవే మాకు ఇప్పుడు సమస్యలయ్యాయి. ఏ పొలం అమ్ముదామన్నా దేనికీ దారి లేదు. ఒక పొలం కొంటే మా ఆడబిడ్డ కొనాలి, ఇంకో పొలం కొంటే మా నాలుగో మావయ్య కొనాలి. కానీ వాళ్ళు 'మేము కొనము' అన్నారు. బయటవాళ్ళకి అమ్మాలంటే ముందు వాళ్ళకి దారి చూపించాలి. ఇటువంటి గందరగోళ స్థితిలో నేను, "అయ్యో, ఇప్పుడు ఎలా బాబా? మీరే మాకొక దారి చూపాలి తండ్రీ" అని అనుకున్నాను. అలా బాబాకి చెప్పుకున్న తరువాత మేము ఊహించని విధంగా మా నాలుగో మావయ్య 'నేను ఆ పొలం తీసుకుంటాన'ని సగం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. 'మిగతా సగం డబ్బు రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇస్తాను' అన్నారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మావారు ఆ డబ్బులో సగం మా బాబు బి.టెక్ చదువుకి ఫీజు కట్టారు. మిగతా డబ్బులతో మేము చేసే కేటరింగ్ బిజినెస్ కోసంగా ఫుడ్ స్టాల్ కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో మావయ్య ఇచ్చే మిగతా డబ్బులతో అప్పు తీర్చవచ్చని అనుకున్నాము. కానీ ఇంతలో మేము ఊహించని విధంగా మావయ్య 'మాకు ఆ పొలం వద్దు' అని అన్నారు. 'అయ్యో, ఇలా జరిగిందేంటి? మావయ్య ఇచ్చే డబ్బులతో అప్పు తీరుద్దామనుకుంటే, ఇప్పుడు ఆయనకే డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందే' అని అనుకున్నాము. చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే, 'వాళ్లే పొలం వద్దన్నారు కాబట్టి, మీరు వాళ్ళు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదు' అని. కానీ మావారు సొంత బాబాయితో గొడవ ఎందుకని, డబ్బులు తిరిగి ఇవ్వాలనుకున్నారు. కానీ మావయ్య ఇచ్చిన డబ్బులు అయిపోయాయి, అప్పు అలాగే ఉంది. ఆ స్థితిలో నేను, "ఏంటి సాయీ మాకు ఈ పరీక్ష? మేము ఎవరినీ మోసం చేయలేదు. అప్పు ఎగ్గొట్టాలని అనుకోలేదు. మా పొలం అమ్మి అప్పు తీర్చాలి అనుకున్నాము. అది నీకు తెలుసు సాయీ. మరి ఇంత న్యాయంగా ఉన్నా ఇలా జరిగిందేంటి సాయీ? మీరే మాకు దారి చూపించాల"ని ఇరవై నాలుగు గంటలూ వేడుకుంటూ సాయిని చాలా ఇబ్బందిపెట్టాను. వేరే ఏదైనా సమస్య అయితే ఓపిక పడతాము కానీ, డబ్బు సమస్య కావడం వల్ల నాకు నిద్రపట్టలేదు. సాయినీ నిద్ర పోనివ్వకుండా, 'సాయి, సాయి' అని అనుకుంటూ, "సాయీ! ఈ సమస్య నుండి మమ్మల్ని ఆదుకుంటే, 'సాయి మహరాజ్ సన్నిధి' ద్వారా నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. సాయి నుండి, "ఇది కాకపోతే, మీకు వేరే దారి ఉంది" అని మెసేజీలు రాసాగాయి. నేను, 'వేరే దారి ఎక్కడుంది, నా మొహం' అని అనుకున్నాను. కానీ అనుకోని విధంగా వేరే పొలాన్ని మా ఆడబిడ్డ తీసుకుంటాను అంది. అప్పుడు, వేరే దారి ఉంద'న్న సాయి మెసేజ్ నాకు అర్థమైంది. నిజానికి నా ఆడబిడ్డకు అసలు ఆ పొలం తీసుకోవాలన్న ఆలోచనే లేదు. సాయే ఆమె మనసును మార్చి తీసుకునేలా చేశారు. మేము సంతోషంగా మా పొలాన్ని ఆమెకు అమ్మి, వచ్చిన డబ్బులో కొంత నాలుగో మావయ్యకి ఇచ్చి, కొంత అప్పు కూడా తీర్చాము. సాయిని నమ్ముకుంటే కాని పనంటూ ఏదీ ఉండదు. కాబట్టి బాబాపై నమ్మకం ఉంచండి. బాబా అనుగ్రహంతో, మీ అందరి ఆశీస్సులతో మేము కొన్న ఫుడ్ స్టాల్‍కి మంచి ఆర్డర్లు వచ్చి, మా బిజినెస్ మంచిగా సాగాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ ఆశీర్వదించండి. "ధన్యవాదాలు బాబా. మా బిజినెస్ మంచిగా సాగి ఉన్న కాస్త అప్పు తీర్చేలా అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రీ".
భయంకర ఘటన నుండి కాపాడిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయి కుటుంబసభ్యులకు, బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు అమర్‌నాథ్. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఒక భయంకర ఘటన నుండి బాబా ఎలా కాపాడారో పంచుకుంటున్నాను. నేను ప్రస్తుతం రాజస్థాన్‍లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ హెడ్‍గా పనిచేస్తున్నాను. 2022, జూన్ 26 రాత్రి ఒంటి గంటన్నరకి మా సూపర్‌వైజర్ నాకు ఫోన్ చేసి, "మన టిప్పర్ కిందపడి ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు. శవం అక్కడే ఉంది" అని చెప్పాడు. ఆ ప్రదేశానికి వెళ్తే, చనిపోయిన వ్యక్తి గనక స్థానిక వ్యక్తి అయితే ఊరివాళ్ళు వెళ్లినవాళ్ళని చంపేస్తారు. అదీకాక మా కంపెనీ మీద పడి మొత్తం తగలబెట్టేస్తారు. ఇటువంటి స్థితిలో ఆ రాత్రివేళ ఏం చేయాలో నాకు అర్థంకాక సాయిని తలచుకుని, "నన్ను ఈ ఆపదనుండి కాపాడండి బాబా" అని ప్రార్థించాను. సాయినే తలచుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నాను. ఉదయం గం.4:30ని.లకి ఎస్సై ఫోన్ చేసి ఆఫీసుకి పిలిచి, "మీ టిప్పర్ని, డ్రైవర్ని తీసుకెళ్తున్నాము" అని చెప్పారు. ఒకవేళ టిప్పర్ డాక్యుమెంట్స్ అన్నీ సరిగా లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ఒకటే భయమేసింది. కానీ బాబా దయవల్ల అన్నీ సక్రమంగా ఉన్నాయి. అంతేకాదు, సాయి కృపవల్ల చనిపోయినతను మా సబార్డినేటర్ దగ్గర పనిచేసే లేబర్ అని తెలిసి నేను ఊపిరి పీల్చుకున్నాను. తరువాత కాంట్రాక్టరుతో మాట్లాడి ఫైర్, అంబులెన్స్, పోస్టుమార్టం విభాగాలతో మాట్లాడటం చకచకా జరిగిపోయాయి. డ్రైవరుకి బెయిల్ వచ్చింది. నేను, 'ఎంతో భయపడిన ఘటన వల్ల బాబా ఏ ఇబ్బందీ లేకుండా చేస్తున్నారు. ఆయన దయవలన చాలా ప్రశాంతంగా అన్నీ జరిగిపోతున్నాయి' అని అనుకునే సమయంలో బయటకు వచ్చిన టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. కానీ, బాబా చల్లని చూపు వల్ల ఆ సమస్య నుండి కూడా బయటపడతానని నా దృఢ నమ్మకం. ఎందుకంటే, బాబా ఎల్లప్పుడూ మన వెంట ఉండి కాపాడుతుంటారు. ఆయన అనుగ్రహం వల్ల 2022, జులై మొదటివారంలో నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కంపెనీ నుండి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. "శతకోటి వందనాలు బాబా. బాధల నుండి విముక్తి కలుగజేసి నాకు ప్రశాంత జీవనాన్ని ప్రసాదించు సాయీ".
నడుము నొప్పి తగ్గించిన బాబా
ముందుగా సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు నవ్య. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఈమధ్య నేను ఒకరోజు ఇల్లు దులుపుదామని మా ఇంట్లో చిన్న మంచం ఒకటి ఉంటే దానిపైకి ఎక్కాను. పని అయ్యాక దిగేటప్పుడు అనుకోకుండా పడిపోయాను. మంచం కూడా పడిపోయింది. ఆ ఘటనలో నడుముకి దెబ్బ తగిలింది. నాకు మామూలుగానే హాస్పిటల్‍కి వెళ్ళాలంటే చాలా భయం. కానీ రోజురోజుకీ నొప్పి ఎక్కువ అవుతుండేసరికి నాకు చాలా భయమేసింది. ఆ సమయంలో తిరుపతి వెళ్తున్న మావారు, "రెండు, మూడు రోజులు కాస్త ఓపిక పట్టు. నేను వచ్చాక హాస్పిటల్‍కి వెళ్దాం" అన్నారు. నేను, "నొప్పి తగ్గిపోవాల"ని భారమంతా సాయిపై వేసి, హాస్పిటల్‍కి వెళ్లకుండా క్రీములతోపాటు ఊదీ నడుముకి రాసుకుంటూ ఉండేదాన్ని. బాబా అనుగ్రహం వల్ల మావారు తిరుపతి నుండి వచ్చేసరికి నాకు నొప్పి చాలావరకు తగ్గిపోయింది. ఇలా బాబా ఎన్నోసార్లు నన్ను బిడ్డవలె కాపాడుకుంటున్నారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. ఇలాగే ఎల్లవేళలా మమ్మల్ని రక్షించండి బాబా. ఐ లవ్ యు బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయి బాబా
ReplyDeleteOm sai baba 2nd miracle is nice.with Sai's power problem solved. Once we went to nalla malla forest.my son was driving we want to go hotel to have break fast.one vehicle came fast towards our car.with baba blessings my son turn ed into another side.we saved with baba blessings.i felt very afraid.Thus baba has power to save his devotees
ReplyDeleteSai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Na bidda ki fever rakunda chei baba..2months lo 2times vachindi please baba Inka 4months varaku a fever rakunda chudu baba
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete