సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1258వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ తప్ప వేరొకటి కాదు
2. ఆరోగ్య సమస్యను పరిష్కరించిన బాబా
3. డబ్బులు తిరిగి వచ్చేలా అనుగ్రహించిన బాబా

బాబా దయ తప్ప వేరొకటి కాదు


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః!!!


శ్రీసాయినాథునికి నా సాష్టాంగ ప్రణామాలు. సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. "ఓ సాయినాథా! నా మనస్సు కాసేపు నిశ్చలంగానూ, కాసేపు చంచలంగానూ ఉంటోంది. నా మనస్సును నిశ్చలపరచి ఎల్లప్పుడూ మీ ధ్యానాన్ని విడవకుండా ఉండేలా ఆశీర్వదించు తండ్రీ. మీరు నా హృదయంలో కొలువై ఉన్నారన్న స్పృహను నేను ఎప్పుడూ కోల్పోకుండా ఉండేలా చూడండి దేవా. జన్మజన్మలందు మీరే మాకు మార్గనిర్దేశం చేసి మమ్మల్ని చేయిపట్టుకుని నడిపించండి బాబా. మీ పాదాలను ఎప్పుడూ విడువనివ్వకండి తండ్రీ. నా పిల్లల భారం మీదే సాయిదేవా. వాళ్ళను ఎప్పుడూ మీ కృపాకటాక్షవీక్షణాలతో చూస్తూ సరయిన దారిలో పెట్టండి దేవా. తెలిసీతెలియక చేసిన తప్పులను మన్నించండి బాబా". ఇంక నా అనుభవాల విషయానికి వస్తే..


ఒకసారి నేను మామ్మోగ్రామ్ టెస్టుకోసం వెళ్ళినప్పుడు రేడియాలజిస్ట్ రిపోర్టులు చూసి, "కొన్ని అనుమానాలున్నాయి. మరోసారి టెస్ట్ చేద్దాము. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయాలి" అని చెప్పారు. నాకు చాలా భయమేసి వెంటనే అపాయింట్‌మెంట్ తీసుకుందామని చూస్తే, మళ్ళీ నెలదాకా అపాయింట్‌మెంట్ దొరకలేదు. నేను ఆ నెలరోజులు భయంతో నరకం అనుభవించాను. 'పిల్లలు చిన్నవాళ్లు. నాకు ఏ క్యాన్సర్ అన్నా అయితే హాస్పిటళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే జరిగితే, పిల్లల్ని చూసుకోవడంలో నా భర్తకి సహాయం చేసేవారెవరూ లేర'ని చాలా ఆందోళన చెందాను. ఆ నెలలో ప్రతిరోజూ నా భయాలతో బాబాను విసిగించేస్తూ, "బాబా! మీ దయవల్ల నా ఆరోగ్య విషయంలో ఏమీ సీరియస్ కాకుండా ఉండాలి" అని చెప్పుకున్నాను. అంతలో నేను డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకున్నరోజు రానేవచ్చింది. నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపం చేస్తూ ఉండగా టెస్ట్ చేశాక రేడియాలజిస్టు, "సిస్టులు(తిత్తులు) ఉన్నాయి. కానీ ఇప్పుడేమీ భయం లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పటి, అప్పటి రిపోర్టులు పోల్చి చూస్తే సమస్య ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది" అని అన్నారు. అంతా బాబా దయ. ఆయన కృపవల్ల నాకు ఏమీ ఉండదన్న నమ్మకంతో ఉన్నాను. "బాబా! మీరు ఎల్లప్పుడూ మా అందరికీ తోడుగా ఉన్నారన్న ఎరుకలో ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి".


మేము వేసవి సెలవులకు భారతదేశం వెళదామని అంతా ప్రణాళిక చేసుకున్నాక మా ప్రయాణానికి రెండువారాల ముందు ఇంటిల్లిపాదికీ కరోనా వచ్చింది. దాంతో అందరికీ బాగా నీరసంగా ఉండేది. ఆ స్థితిలో ముప్పై గంటలకు పైన ప్రయాణం. దానికి తోడు వెనక్కి తిరిగి రావాలంటే కరోనా నెగిటివ్ రిపోర్టు ఉండాలి. కానీ కరోనా ఒకసారి వస్తే తగ్గినా కూడా 6 నుండి 8 వారాల వరకు టెస్టులో పాజిటివ్ వస్తుందని ఎవరో చెప్పారు. మేమేమో నెలరోజులకే తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నాము. ఆఖరి నిమిషంలో టిక్కెట్లు మార్చాలంటే చాలా ఖర్చవుతుంది, పైగా టిక్కెట్లు దొరకటం కూడా చాలా కష్టం. ఇలా పరిపరి విధాల భయపడుతూ, కరోనా నీరసంతో పనులు చేసుకోలేక అయోమయంగా కొన్నిరోజులు గడిపాము. ఆ సమయంలో నేను రోజూ బాబాను ప్రార్థిస్తూ ఆయనపైనే భారం వేశాను. హఠాత్తుగా మేము ఉంటున్న దేశంలో వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు కరోనా నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇది బాబా దయ తప్ప వేరొకటి కాదు. "మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయీ. మీరు మీ భక్తుల కష్టాలు తీర్చే విధానం మా ఊహలకు అందనిది. మీ దయవల్ల మా ప్రయాణం సజావుగా సాగి, మా సెలవులన్నీ అయినవాళ్లతో  సంతోషంగా గడిపి తిరిగి ఏ ఇబ్బందీ లేకుండా ఇంటికి వచ్చేలా ఆశీర్వదించండి తండ్రీ. శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కూడా ప్రసాదించండి బాబా".


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఆరోగ్య సమస్యను పరిష్కరించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మహేశ్వరి. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటాను. ఒకసారి నాకు నడుమునొప్పి ఎక్కువగా ఉంటుండేది. అదే సమయంలో మోకాళ్ళనొప్పి విషయంగా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. కానీ నడుమునొప్పితో వెళ్ళడానికి భయపడి, "బాబా! మీ దయవలన నడుమునొప్పి తగ్గిపోవాలి" అని బాబాకి దణ్ణం పెట్టుకుని, ఊదీ నడుముకి రాసుకున్నాను. బాబా దయవల్ల నొప్పి తగ్గిపోయి డాక్టరు దగ్గరకు వెళ్ళగలిగాను. ఒకసారి మా అమ్మాయి ఉంగరం కనపడలేదు. అప్పుడు బాబాని తలచినంతనే దొరికింది. 11 నెలల మా మనవడు మధ్యరాత్రిలో తరచూ ఏడుస్తుంటాడు. బాబా ఊదీ పెడితే వెంటనే ఏడుపు ఆపేస్తుంటాడు. అంతా బాబా దయ. ఇలా బాబా ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ వస్తున్నారు. లెక్కలేనన్నిసార్లు సహాయం చేశారు. వాటిలో నుండి కొన్ని మాత్రమే నేనిప్పుడు మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


డబ్బులు తిరిగి వచ్చేలా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. మాది గుంటూరు. నేనొక సాయిభక్తురాలిని. నాకు ఏ సమస్య వచ్చినా అది చిన్నదైనా, పెద్దదైనా బాబాకు చెప్పుకుని, 'ఈ బ్లాగులో పంచుకుంటాన'ని అనుకోగానే నా సమస్యలు తీరిపోతున్నాయి. అటువంటి రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు మా బాబు 'AJIO' అనే ఒక సైట్లో 2,000 రూపాయల విలువైన ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడు. ఆ పార్సిల్ మా బాబు కాలేజీకి వెళ్లిన సమయంలో వస్తే, నేను తీసుకున్నాను. తరువాత మా బాబు వచ్చి పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే, అది మేము ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ కాదు. దానికి బదులు వేరే ప్రోడక్ట్ మాకు డెలివరీ అయింది. మా బాబు, "మాకు వేరే ప్రోడక్ట్ వచ్చింది, దీన్ని రిటర్న్ తీసుకోమ"ని రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాడు. కానీ వాళ్ళనుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళనుండి సరైన సమాధానం లేదు. ఇక, కట్టిన 2000 రూపాయలు మాకు రావేమోననిపించి నేను బాబాను, "బాబా! ఆ డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా దయవలన కొద్దిరోజులకి ఆ డబ్బులు మా బాబు అకౌంటులో పడ్డాయి. ఇకపోతే, మా అమ్మమ్మకు సంబంధించిన ఆస్తి విషయంలో ఆమె కొడుకులు ఎలాంటి గొడవలు పడకుండా ఆస్తి పంపకాలు చేసుకునేలా చూడమని బాబాని వేడుకున్నాను. ఆయన దయవల్ల నేను కోరుకున్నట్లే సమస్య పరిష్కారమైంది. కానీ ఈ రెండు అనుభవాలు పంచుకోవటం మర్చిపోయి ఆలస్యం చేశాను. "నన్ను క్షమించండి బాబా. మీ బిడ్డలందరిపై సదా మీ అనుగ్రహం ఉండేలా దయ చూపు తండ్రీ".


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo