సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1272వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రత్యక్ష దైవం బాబా
2. సాయి పాదాలను ఆశ్రయించినంతనే లభించిన అనుగ్రహం
3. బాబా కృపతో ఒక్కరోజులో తగ్గిన జ్వరం

ప్రత్యక్ష దైవం బాబా


అందరికీ నమస్తే. నా పేరు అరుణ. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇలానే ఎప్పుడూ పంచుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. మా అమ్మ ఆరోగ్య విషయంలో నాకు ఎప్పుడూ టెన్షన్‍గా ఉంటుంది. ఎందుకంటే, ఆమెకి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం వంటి మొదలైన చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. అవి చాలదన్నట్టు అమ్మ కాలిపై ఒక సెగగడ్డ వచ్చింది. అమ్మని సర్జన్ దగ్గరకి తీసుకుని వెళ్తే, "సర్జరీ చేయాలి. కానీ గాయం మానిపోవడం షుగర్ నియంత్రణలో ఉండడం మీద ఆధారపడి ఉంటుంది" అన్నారు. నాకు చాలా బాధగా, భయంగా అనిపించి, "ఉన్న ఆరోగ్య సమస్యలకి తోడు కొత్తగా ఈ ప్రాబ్లం ఏంటి బాబా?" అని అనుకున్నాను. ఆయన్ని ఆర్తిగా వేడుకోవడం తప్ప మన చేతుల్లో ఏముందని బాబాని ప్రార్థించడం మొదలుపెట్టి, "గాయం తొందరగా తగ్గేటట్లు చూస్తే, బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు డాక్టరు చెక్ చేసి, "షుగర్ నియంత్రణలో ఉంది. కాబట్టి తొందరగా నయమవుతుంది" అని అన్నారు. "చాలా సంతోషం సాయితండ్రి. మీ వల్ల ఏదైనా సాధ్యపడుతుందని అర్థమవుతుంది బాబా. చాలా చాలా ధన్యవాదాలు సాయి. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండాలి బాబా".


ఇటీవల మా బావగారికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. మేము మందులతో తగ్గిపోతుంది అనుకున్నాము. కానీ డాక్టరుని సంప్రదిస్తే, "స్కాన్ చేయాలి" అన్నారు. డాక్టరు అలా చెప్పేసరికి భయమేసి నేను, "బాబా! స్కానింగ్‍లో బావగారికి సమస్య లేదని వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల స్కాన్ రిపోర్టు నార్మల్ వచ్చింది.  "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ అనుగ్రహ రూపమైన అనుభవాలతో నా జీవితం నిండిపోవాలని కోరుకుంటున్నాను తండ్రి. మీ వల్ల అసాధ్యం అయినది కూడా సుసాధ్యం అవుతుంది. మీరే మా పాలిట ప్రత్యక్ష దైవం బాబా. నా మనసులో ఉన్న కోరికలు ఏంటో మీకు తెలుసు. వీలైనంత త్వరగా వాటిని కూడా తీర్చండి. మీ ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఇలానే ఉండనీయండి బాబా".


మా మావయ్యగారు పోస్టు కోవిడ్ సమస్యల వలన చాలా బాధపడుతుంటే నేను, "ఒకసారి గుండె అంతా చెక్ చేయిద్దాము" అని చెప్తూండేదాన్ని. కానీ అయన వినేవారు కాదు. అలా ఒక 6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆయన, "హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళదాం" అన్నారు. నేను పోస్టు కోవిడ్ వల్ల ఆయనకి మేజర్ సమస్యలు ఏమైనా ఉంటాయేమోనని చాలా భయపడి, "బాబా! మీ దయవల్ల రిపోర్టులు అన్నీ నార్మల్‍గా‍ వస్తే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్‍గా వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. ఇలా అన్ని విషయాలలో మీరు అండగా ఉండండి బాబా".


నెలన్నర వయసున్న మా అక్క మనవడికి చెవి మరియు మాడు మీద ఇన్ఫెక్షన్ వచ్చింది. అది తెలిసి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, వాడు పుడుతూనే పెద్ద గండం నుంచి బయటపడ్డాడు(ఆ అనుభవాన్ని ఇదివరకు పంచుకున్నాను). మళ్ళీ ఇంతలోనే బాబుకు ఇంకో సమస్య రావడంతో నేను, "బాబా! 'పెద్ద సమస్యేమీ కాదు, మామూలు సమస్య' అని డాక్టరు చెప్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల బాబుకి పెద్ద సమస్యేమీ లేదు, వాడు బాగున్నాడు. బాబా దయవల్ల బాబు ఆరోగ్యంగా ఉన్నాడన్న ఆనందంలో మా అక్క వాడికి బారసాల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అప్పుడే బాబుకి ఇంకో ఆరోగ్య సమస్య మొదలైంది. అది ఏంటంటే, వాడికి ఎలర్జీలా వచ్చి మళ్లీ ఆయాసం, గురక మొదలయ్యాయి. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "రోజుకు ఐదుసార్లు బాబుకి నెబులైజర్ పెట్టాలి" అని చెప్పారు. దాంతో మా అందరికీ భయం వేసింది. ఫంక్షన్ చేద్దామంటే, ఇలా అయిందేంటి అని అనుకున్నాము. అప్పుడు నేను, "బాబా! బాబు బారసాల బాగా జరిగి, అలాగే వాడి ఆరోగ్యం బాగుంటే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల బారసాల బాగా జరిగింది. బాబు ఆరోగ్యం కూడా చాలా బాగుంది. "చాలా ధన్యవాదాలు బాబా. సమస్య ఏదైనా మీ చేయి గట్టిగా పట్టుకుంటే చాలు, గట్టున పడేస్తావు తండ్రి. మా అక్కకి మానసిక ప్రశాంతతని ప్రసాదించండి బాబా. అలాగే నా కోపాన్ని తగ్గించి, అందరిలో మంచిని చూసే స్వభావాన్ని, మనోధైర్యాన్ని నాకు ప్రసాదించండి బాబా. నా జీవితమంతా మీ స్మరణలో ఉండాలి. నేను ఎన్నడూ మిమ్మల్ని మర్చిపోకూడదు. మీరు నాకు సదా తోడుగా ఉండండి బాబా. నేను ఏం కోరుతున్నానో మీకు తెలుసు, వాటిని తీర్చి తత్సంబంధిత అనుభవాలను త్వరలో తోటి భక్తులతో పంచుకునేలా అనుగ్రహిచండి. మీదే భారం. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి".


సాయి పాదాలను ఆశ్రయించినంతనే లభించిన అనుగ్రహం


సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా శిరిడీ శ్రీసాయి మహరాజ్ కి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నేను నా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను. నా పేరు శివకుమార్ పల్లెంపాటి. మాది కృష్ణ జిల్లాలోని విజయవాడకి సమీపంలో ఉన్న పోరంకి గ్రామం. 2022, జులై రెండో వారంలో నేను, నా శ్రీమతి హైదరాబాద్ వెళ్ళాము. మేము అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి కుండపోతగా ఒకటే వర్షం. ఆ వర్షంలోనే ఒకరోజు మేము మా అన్నయ్య వాళ్ళింట్లో ఉంటున్న మా నాన్నగారిని పలకరించి, ఇంకో రోజు ఒక ఫంక్షన్‍‍కి వెళ్ళి, ఇంకో రోజు మా చిన్న అక్క వాళ్ళింట్లో ఉండి నాలుగో రోజు ఉదయం విజయవాడకి బస్సులో తిరుగు ప్రయాణమయ్యాము. అంతకు ముందురోజు రాత్రి నుంచే నాకు జ్వరం, జలుబు మొదలయ్యాయి. మా అక్క, బావ ఇద్దరూ డాక్టర్లు అవ్వటం వలన అస్వస్థత నుంచి ఉపశమనం కోసం నాకు కొన్ని మందులిచ్చి, ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉండటానికి మరికొన్ని మందులు ఇచ్చారు. మేము వాటిని తీసుకుని బయలుదేరాము. ఆ సాయినాథుని కృపాశీస్సులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. అయితే ఇంటికి వచ్చేసరికి జ్వరం తీవ్రత, ఒళ్ళునొప్పులు చాలా ఎక్కువయ్యాయి. అక్కాబావ ఇచ్చిన మందులు కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రం కలిగించేవి. విపరీతమైన నీరసంతో ఎప్పుడు చూసిన మంచం మీద పడుకోవాలని అనిపించేది. ఇలా మూడురోజులు గడిచాక నాలుగోరోజు నిద్రకు ఉపక్రమించే ముందు నేను ఆ సాయినాథుని పాదాలకు నమస్కరించి, కొంచెం ఊదీ నోట్లో వేసుకుని పడుకున్నాను. ఆశ్చర్యం! అర్ధరాత్రి దాటాక నా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఆ తరువాత క్రమేణా జ్వర తీవ్రత, నీరసం తగ్గి ఇప్పుడు నేను నా పనులు చేసుకోగలుగుతున్నాను. నేను తమ పాదాలను ఆశ్రయించినంతనే నన్ను ఆశీర్వదించి, అస్వస్థత నుండి ఉపశమనం కలుగజేసిన ఆ సాయినాథునికి వేలవేల నమస్కారపూర్వక ధన్యవాదాలు.


ఆ సాయినాథుని ఆశీస్సులతో మా అబ్బాయి చిరంజీవి రామప్రణీత్ ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగంలో చేరి గత 15 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాడు. తను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అవసరమైన గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సాయి భగవానుని ఆశీస్సులతో 2020 సంవత్సరంలో గ్రీన్ కార్డు కరెంట్ అయి అక్టోబరులో దానికి సంబధించిన ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో దేశం విడిచి బయటకు వెళ్లకూడదు. కానీ మరదలు పెళ్లికోసం మా అబ్బాయి ఇండియాకి రావాల్సి వచ్చింది. అదే పెద్ద ఇబ్బంది అయి తన తోటి వారందరికీ గ్రీన్ కార్డు వచ్చినా మా అబ్బాయికి రాకుండా ఆగిపోయింది. అప్పుడు నేను సాయినాథుని కాళ్ళ మీద పడి, "మా బాబుకి ఏ అవాంతరం లేకుండా గ్రీన్ కార్డు వచ్చేటట్లు చూడండి బాబా" అని చిన్న కోరిక కోరుకున్నాను. విశాల హృదయులైన సాయి మా మొర ఆలకించారు. ఆయన మా చిరంజీవిని ఆశీర్వదించి 2022, జూలై 18న గ్రీన్ కార్డు అప్రూవ్ చేయించారు. ఇంతటి మహోపకారం చేసిన ఆ సాయినాథునికి వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఈ బ్లాగు ద్వారా తోటి భక్తులతో నా అనుభవాలు పంచుకునే అవకాశం కల్పించిన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వారికి అనేక కృతజ్ఞతలు. ముందు ముందు రాబోయే రోజుల్లో నా అనుభవాలను ఇంకా ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకుంటానని వినమ్రంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.


బాబా కృపతో ఒక్కరోజులో తగ్గిన జ్వరం


ముందుగా సాయి బంధువులకు మరియు బ్లాగ్ నిర్వాహకులకు నమస్తే. నా పేరు సత్యనారాయణమూర్తి. నేను గతంలో రెండుసార్లు ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకున్నాను. ఇది మూడవసారి. 2022, జూలై రెండో వారంలో మా బాబుకి ఉన్నట్టుండి 102 డిగ్రీల జ్వరం వచ్చింది. నేను వెంటనే, "బాబా! రేపటికల్లా జ్వరం పూర్తిగా తగ్గి, బాబుకి నార్మల్ అయితే, వెంటనే నేను మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని సాయినాథునికి నమస్కరించుకుని కొద్దిగా బాబా ఊదీ ఒక గ్లాసు నీటిలో కలిపి బాబు చేత త్రాగించి నిద్రపుచ్చాను. బాబా దయవల్ల మర్నాటికి జ్వరం నార్మల్ అయి బాబు తేలిక పడ్డాడు. "ధన్యవాదాలు సాయినాథా! మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకోవడం కొద్దిగా ఆలస్యమైంది. నన్ను క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sai ram today sai Leela's are very nice.when we pray with sraddha and saburi baba gives us miracles and he takes care of our family.

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo