ఈ భాగంలో అనుభవాలు:
1. శ్రీసాయి అనుగ్రహ తరంగాలు
2. కేవలం రెండు గంటల్లో 80% పని పూర్తిచేసేలా అనుగ్రహించిన బాబా
3. బాబా దయతో తగ్గిన బాబు జ్వరం
శ్రీసాయి అనుగ్రహ తరంగాలు
సాయిబంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలను ఇచ్చారు. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2022, జూన్ నెలలో మేము మా ఇంట్లో ఒక హోమం చేయాలని అనుకున్నాము. హోమం చేసిన తర్వాత తిరుపతి వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాము. అయితే అదే సమయంలో నాకు, మా పాపకి నెలసరి సమయం ఉండటం వల్ల నేను చాలా భయపడ్డాను. బాబాకి దణ్ణం పెట్టుకుని, "హోమానికి ఇబ్బంది లేకుండా చూడండి బాబా. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా అనుగ్రహించారు. ఆయన దయతో మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోమం, తిరుపతి యాత్ర పూర్తిచేసుకున్నాము. "థాంక్యూ సో మచ్ బాబా".
మా పాప స్నేహితునికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. ఎన్ని హాస్పిటల్స్‌కి తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఆరోగ్య సమస్య వల్ల ఆ అబ్బాయి ఏమీ తినలేకపోయేవాడు. ఏది తిన్నా కూడా వెంటనే వాంతి అయిపోతుండేది. దానితో ఆ అబ్బాయి 10 కేజీల బరువు తగ్గిపోయాడు. ఇట్టి స్థితిలో నేను, "బాబా! మీ దయతో ఆ అబ్బాయికి త్వరగా నయమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత వాళ్ళు ఇంకో హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడి డాక్టరు అబ్బాయిని పరిశీలించి పెద్ద సమస్యేమీ లేదని, కొన్ని మందులు రాసిచ్చారు. బాబా దయవల్ల ఇప్పుడు ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుంది. "థాంక్యూ సో మచ్ బాబా".
ఈమధ్య మావారి బాబాయిగారు చనిపోయారు. ఆయన చివరిరోజు కార్యక్రమాలకని 2022, జూలై 14న మావారు వెళ్లొచ్చారు. మరుసటిరోజు నుండి మావారికి జ్వరం, వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. టాబ్లెట్ వేసుకుంటే జ్వరం కంట్రోల్ అయ్యింది. కానీ, వాంతులు, విరోచనాలు మాత్రం తగ్గలేదు. డాక్టరు దగ్గరకి వెళ్తే మందులు ఇచ్చారు. కానీ నాకు భయమేసి, "బాబా! మావారికి త్వరగా నయమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అప్పటినుండి మావారికి తగ్గడం మొదలై, క్రమంగా పూర్తిగా తగ్గిపోయింది. నేను అనుకున్నట్లుగా నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను "థాంక్యూ సో మచ్ బాబా".
2022, జూలైలో సమయం దాటిపోయి ఒక వారమైనా నాకు నెలసరి రాలేదు. ఆ కారణంగా నాకు బాగా కడుపునొప్పి, వెన్నునొప్పి ఉంటుండేవి. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "నాకు నెలసరి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న రెండో రోజుకి నాకు నెలసరి వచ్చింది. బాబాకి మాట ఇచ్చినట్లు నా అనుభవాలను మీ అందరితో ఇలా పంచుకుని, ఆలస్యమైనందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. మీ ప్రేమ ఎప్పుడూ మా అందరిమీద ఇలాగే ఉండాలని, అలాగే త్వరగా కరోనా అంతమైపోయి ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".
కేవలం రెండు గంటల్లో 80% పని పూర్తిచేసేలా అనుగ్రహించిన బాబా
నా పేరు శ్వేత. ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ బ్లాగులో వచ్చిన అనుభవాలు చదువుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబా ఎంతోమందికి ఎన్నో సమస్యలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారో చదువుతూ నేను మనసులో ఎన్నోసార్లు బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. ఇక నా అనుభవానికి వస్తే... ఒకసారి మా ఆఫీసులో కొంచెం వర్క్ తొందరగా పూర్తిచేసి ఇవ్వమని నాతో చెప్పారు. అందుకు నేను సరేనన్నాను. కానీ, ఆ వారంలో మా అన్నయ్యవాళ్ళు మా ఇంటికి వచ్చినందువల్ల నేను వర్క్ కొంచెం కూడా చేయలేకపోయాను. హఠాత్తుగా ఒకరోజు ఉదయం కంపెనీవాళ్ళు ఫోన్ చేసి, "ఈరోజు 11:30కి కాల్ చేస్తాము. వర్క్ ఎంతవరకు వచ్చిందో చూపించమ"ని అన్నారు. దాంతో నా కాళ్ళుచేతులు అస్సలు ఆడలేదు. చాలా టెన్షన్‌గా అనిపించి వెంటనే పని మొదలుపెట్టి, బాబా నామస్మరణ చేస్తూ, "మీరే సహాయం చేయాలి సాయీ" అని అనుకుంటూ పనిచేశాను. బాబా దయవల్ల రెండు గంటల్లో 80% పని పూర్తిచేయగలిగాను. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తే, "ఇంకా కొద్దిగా చేయాల్సి ఉంది, చేస్తున్నాను" అని చెప్పాను. వాళ్ళు సరేనన్నారు. రెండు గంటల్లో అంత వర్క్ ఎలా చేశానో నాకే తెలియట్లేదు. బాబానే నాతో చేయించారు. ఏ సమస్యా లేకుండా అంతా మంచిగా జరిగితే బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్పుకున్నట్లు నేను ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "కొంచెం ఆలస్యమైనందుకు క్షమించండి సాయీ. థాంక్యూ సాయీ. ఎప్పుడూ అందరికీ ఇలాగే తోడుగా ఉండి కాపాడు సాయీ. ఆఫీసుకి దగ్గర్లో మేము ఇల్లు చూస్తున్నాం, తొందరగా మంచి ఇల్లు దొరికేలా ఆశీర్వదించండి సాయీ".
బాబా దయతో తగ్గిన బాబు జ్వరం
నా పేరు శివ. నా జీవితంలో బాబా ఎన్నోసార్లు కష్టం నుండి నన్ను కాపాడారు. ఇదివరకు అటువంటి అనుభవాలు కొన్ని పంచుకున్నాను. 2022, జూలై మూడో వారంలో బాబా నా కొడుకుకి సంబంధించి ఒక అందమైన అనుభవాన్ని ప్రసాదించారు. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నా కొడుకు పేరు పవన్. తను నాలుగవ తరగతి చదువుతున్నాడు. జూలై మూడో వారంలో ఒకరోజు తనకి స్వల్పంగా జ్వరమొచ్చింది. ఆ జ్వరం మినహా వేరే ఇతర లక్షణాలేవీ లేనందున నేను అంతగా పట్టించులేదు. మరుసటిరోజు బాబు మామూలుగానే స్కూలుకి వెళ్ళొచ్చాడు. కానీ ఆ రాత్రి తనకి జ్వరం తీవ్రంగా వచ్చింది. దానితోపాటు తలనొప్పి, కళ్ళమంటలు కూడా ఉండేసరికి నేను వెంటనే బాబాని ప్రార్థించి, "పరిస్థితి విషమంగా ఉందా బాబా?" అని అడిగాను. సాధారణంగా నేను సచ్చరిత్రను ఆధారంగా చేసుకుని బాబాను ప్రశ్న అడుగుతాను. అప్పుడు బాబా సూచించే పేజీ నెంబరులో నాకు ఆయన సమాధానం దొరుకుతుంది. అలాగే ఆరోజు బాబాను అడిగినప్పుడు దురదృష్టవశాత్తూ, "బాబు పరిస్థితి విషమంగా ఉంటుంద"ని బాబా సమాధానం వచ్చింది. మరుక్షణం నేను, "బాబా! ఈ బిడ్డని మీరే మాకు ప్రసాదించారు. ఇప్పుడు వీడి పరిస్థితి విషమంగా ఉందని మీరు చెప్తున్నారు. నేను ఏ డాక్టరునీ సంప్రదించను. రేపటికల్లా మీరు నా కొడుకుకి నయంచేస్తే, నేను నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకుని ఆ రాత్రంతా బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. కొంతసేపటికి బాబుకి జ్వరం తగ్గింది. కానీ, వేకువఝామున మరలా వచ్చింది. అప్పుడు నేను బాబు నుదుటన ఊదీ పెట్టి, మరికొంత ఊదీని నీళ్లలో కలిపి వాడి చేత త్రాగించాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గి మళ్ళీ రాలేదు. ఇప్పుడు బాబు పూర్తి ఆరోగ్యంతో రోజూ స్కూలుకి వెళ్తున్నాడు. "మీ కృపకు ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు మన్నించండి బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSairam always be with me
Om sai ram if we had faith and sureneder in sai we can live without fear.Baba be with us and bless us
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete