సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 438వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నిత్య నవ్యమైన బాబా ప్రేమ
  2. బ్లాగుకి బాబా ప్రసాదించిన ఎంబ్లమ్(చిహ్నం)

నిత్య నవ్యమైన బాబా ప్రేమ

ఈరోజు నా స్వీయ అనుభవాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను. బాబా ఇచ్చిన ప్రేమను సంక్షిప్తంగా చెప్పలేక సవివరంగా చెప్పబోతున్నాను. నిజానికి సవివరంగా అనడం కూడా సబబు కాదు. ఎందుకంటే మనసులో బాబా ప్రేమ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా అది మాటలకు అందడం లేదు. అందుకే నా భావాలను ఉన్నది ఉన్నట్లు చెప్పలేనేమో! అందుకు నన్ను క్షమించాలి. ఇక అసలు విషయంలోకి వెళతాను.

2020, మే 14, సాయంత్రం జరిగిన ఒక చిన్న వాట్సాప్ సంభాషణ నా మనసులో కలవరాన్ని రేపింది. అయితే తరువాత నేను బ్లాగ్ వర్క్ చేస్తూ బాబా స్మరణలో నిమగ్నమయ్యాను. దాంతో ఆ కలవరం నాపై అంతగా ప్రభావం చూపలేదు. కానీ మరుసటిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి పదేపదే ఆ సంభాషణ గుర్తుకు వస్తూ, నా తప్పు ఉన్నా లేకున్నా అవతలి వ్యక్తి బాధపడుతున్నారేమో అని ఆలోచించసాగాను. చివరికి బాబా ముందు కూర్చున్నా అవే ఆలోచనలు. దాంతో, "బాబా! మీ ముందు కూర్చుని, మీ మీద దృష్టి పెట్టకుండా ఉండటం నా మనసుకి నచ్చట్లేదు. దయచేసి నా మనసును మీ వైపుకి మళ్లించండి" అని బాబాకి చెప్పుకున్నాను. ఆ తరువాత అప్రయత్నంగా నా ఆలోచనలు బాబాతో నా మొదటి పరిచయం వైపుకు సాగాయి. 

నా మనుష్యుడు ఎంత దూరాన ఉన్నప్పటికీ, వేయి క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చునట్లు అతనిని నా వద్దకు లాగెదను” అన్నది బాబా చెప్పిన మాట. అదే రీతిన బాబా నన్ను తమ దగ్గరకు తీసుకున్నారు. ఆ మధురమైన అనుభవాన్ని ముందుగా మీతో పంచుకుంటాను.

చిన్నప్పటినుండి మా ఇంటికి దగ్గరగా ఏ దేవుడి ఆలయం ఉంటే ఆ ఆలయానికి రోజూ వెళ్లడం నాకలవాటు. అలా నేను ఎక్కువగా శివుడు, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండేవాడిని. కానీ నాకు విష్ణుమూర్తి అవతారాల పట్ల కాస్త ఎక్కువ ఆసక్తి ఉండేది. అలాంటి నా జీవితంలోకి బాబా అద్భుతరీతిన ప్రవేశించారు. అది 1997వ సంవత్సరం. మేము శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో నివసిస్తూండేవాళ్ళం. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఒకరోజు సాయంకాలం నా స్నేహితుడు సుజిత్ నన్ను, “బాబా మందిరానికి వెళదాం, రా" అని పిలిచాడు. అప్పటికి నాకు బాబా గురించి ఏమీ తెలియదు. అసలు శిరిడీ సాయిబాబా అంటూ ఒకరున్నారని కూడా నాకు తెలియదు. ఆ సమయంలో సత్యసాయిబాబా గురించి కొన్ని వదంతులు విని ఉండటం వలన, బాబాలను నమ్మకూడదనే ఒక అభిప్రాయం కూడా ఉండేది. అందువలన నేను తనతో రానని ఖచ్చితంగా చెప్పాను. కానీ అతను తనతో రమ్మని పట్టుబట్టాడు. “అటువంటి బాబాలను నమ్మను, నేను రాను” అన్నాను. కానీ అక్కడున్న నా ఇతర స్నేహితులు “వెళ్లొచ్చు కదా!” అని తలా ఒక మాట చెప్పారు. చివరిగా నా స్నేహితుడు, “నీకు ఇష్టం లేకపోయినా, కేవలం నా కోసం రా! ఇలా వెళ్లి, అలా వచ్చేద్దామ”ని అన్నాడు. స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టంలేక “సరే పద” అని తనతోపాటు వెళ్ళాను. అలా మొదటిసారి బాబా మందిరంలో అడుగుపెట్టి, ఆయన దర్శనం చేసుకున్నాను. అసలు ఏం జరిగిందో మాటల్లో చెప్పలేను గానీ, బాబాను చూస్తూనే చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఏ మాయ చేశారో ఏమోగానీ, ఆరోజునుండి తోడెవ్వరూ లేకపోయినా ప్రతిరోజూ బాబా మందిరానికి వెళ్ళటం నాకు అలవాటైపోయింది. రోజూ సంధ్య ఆరతికి వెళ్తూ, వీలైనప్పుడు మధ్యాహ్న ఆరతికి, అప్పుడప్పుడు శేజ్ ఆరతికి వెళ్తుండేవాడిని. గురువారంనాడు సంధ్య ఆరతి మొదలుకొని భజన, శేజ్ ఆరతి పూర్తయ్యేవరకు మందిరంలోనే ఉండేవాడిని. అంతలా బాబా నన్ను మొదటి దర్శనంతోనే తన వైపుకు లాక్కున్నారు. ఒకసారి భజనలో “నువు లేక అనాథలం...” అనే పాట ఎవరో పాడుతుంటే నాకేం జరుగుతోందో తెలియనంత తన్మయత్వం కలిగింది. అలా బాబా నా దారి మళ్లించి తన చెంతకు రప్పించుకున్నారు. అంతవరకు వేరే దేవతల మందిరాలకు వెళ్ళే నా ప్రయాణం బాబా వైపుకు మళ్ళింది. దేవతారాధన నుండి సద్గురు ఆరాధన వైపు నా జీవిత ప్రయాణం సాగింది. ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నప్పటికీ నా మనసులో బాబాకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. అంతవరకు వేరే దేవతలను కోరికలు కోరే నేను, ఏది కావాలన్నా బాబానే అడగటం ప్రారంభించాను. ఏ సమస్య వచ్చినా, బాధ కలిగినా బాబాకే చెప్పుకొనేవాడిని. ఎన్నో జన్మల నుండి బాబాతో ఉన్న ఋణానుబంధం వలన ఆ క్షణం నుండి బాబా నన్ను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. "నా భక్తులను నేనే వివిధ మిషలతో నా దగ్గరకు చేర్చుకుంటాను" అని బాబా చెప్పినట్లుగా, నా విషయంలో నా స్నేహితుని ఒక మిషగా చేసుకొని నన్ను తమ సంరక్షణలోకి తీసుకున్నారు బాబా.

ఇక్కడివరకూ నేనెప్పుడూ అనుభూతి చెందుతుండేవాడిని. కానీ, అంతకుమించిన బాబా అనుగ్రహాన్ని మొదటిసారి 2020, మే 15న బాబా ముందు కూర్చుని అనుభూతి చెందాను. ఆ సమయంలో మొదటిసారి దర్శించిన ఆ బాబా మందిరం, అక్కడి ఆవరణ, లోపలి జనసందోహం, ఒక మూలగా వున్న బాబా మూర్తి ఇవన్నీ నా కళ్ళముందు కదలాడాయి. అప్పట్లో ఎంత ఆనందాన్ని పొందానో అంతకుమించిన ఆనందం అనుభవమవుతుండగా బాబా నాపై తమ అనుగ్రహాన్ని ఇంకా కురిపించారు. నా ఆలోచనలు ముందుకు సాగాయి. 

బాబా పరిచయమయ్యేనాటికి నేను డిగ్రీ చదువుతున్నాను అని చెప్పాను కదా! నేను రోజూ ముప్ఫై కిలోమీటర్ల దూరంలో వున్న కాలేజీకి బస్సులో వెళ్లి వస్తుండేవాడిని. బాబాని దర్శించినప్పటినుండి ప్రయాణంలో దారిపొడవునా కనపడే చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టల మీద నా మనసు బాబా రూపాన్ని చిత్రించుకుంటుండేది. ఆ కొండల మీద మనసులోనే బాబాకి మందిరాలు కూడా కట్టేస్తుండేవాడిని. ఇది ఏదో ఒకరోజు జరిగింది కాదు, ప్రతిరోజూ ఇదే ధ్యాసలో ఉండేవాడిని. ఆయా ప్రదేశాలు వస్తే చాలు, మనసులోనే బాబాకి నమస్కరించుకుంటుండేవాడిని. పక్కన స్నేహితులున్నా, వాళ్ళు మాట్లాడుతున్నా నా మనసు మాత్రం బాబా మీదనే ఉండేది. బాబా కృపతో అదంతా ఇప్పుడు జ్ఞప్తికి రాగా, 'ఇంతటి అనుగ్రహాన్ని మొదటి దర్శనంలోనే బాబా నాపై కురిపించారా! బాబా నాకింత ఇచ్చారా!' అని ఆనందస్వరూపుడైన బాబా కురిపిస్తున్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యాను. కళ్ళనుండి ఆనందభాష్పాలు ప్రవహించసాగాయి. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఎప్పడెప్పుడు ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకుందామా అనిపించింది. నా ఆరాటానికి తగినట్లుగానే ఒక సాయిబంధువుతో నా అనుభూతులను పంచుకునే అవకాశాన్ని బాబా ప్రసాదించారు. తనతో నా అనుభూతులను పంచుకుంటుంటే బాబా ఇచ్చిన ఆనందం ఎన్నోరెట్లు అధికంగా అనుభవమైంది. తనతో మాట్లాడుతున్నంతసేపూ నా కళ్ళనుండి వచ్చే ఆనందప్రవాహానికి అంతులేదు.  

మనసులోని చిన్న కలవరపాటు ఇంత ఆనందానికి దారితీస్తుందని నేను అస్సలు ఊహించలేదు. 23 ఏళ్లుగా అనుభవిస్తూ కూడా అనుభూతి చెందలేని ఆ మాధుర్యాన్ని బాబా కృపతో మొదటిసారి అనుభూతి చెందాను. ఆ అనుభూతిలో ఎన్నెన్నో భావాలు, అవన్నీ పంచుకోవాలని ఉన్నా ఆ పారవశ్యం పదాలకు చిక్కట్లేదు. 'అంతలా మనసు ఆయన వశం కావడానికి కారణమేమిటి? 'ఏదో బాబా ద్వారా పొంది, ఆయనకు శరణాగతి చెందానా?' అంటే, అలాంటిదేమీ లేదే! మరి ఏ పాశం నన్నలా కట్టిపడేసిందా?" అని అనిపించింది. దానికి సమాధానం 'ప్రేమపాశమ'ని బాబా స్ఫురింపజేశారు. అవును, ప్రేమతో బాబా నన్ను తమ వశం చేసుకున్నారు. తొలిచూపులోనే బాబా ప్రేమలో పడిపోయాను. "భక్తుల ప్రేమకోసం తపిస్తూ నేను వారి చెంతనే ఉంటాను" అని బాబా అంటారు. మరి నాలో అంత ప్రేమ ఉందో లేదో గానీ, బాబా నాపై అనంతమైన ప్రేమను కురిపిస్తున్నారని ఎప్పుడు తలచుకున్నా ఆనందంతో కన్నీళ్లు ఆగటం లేదు. ఎప్పుడో ఇరవైమూడేళ్ల క్రితం నాటి అనుభవం ఇప్పటికీ అంతే తాజాగా, మధురంగా అనుభవమైంది. అదీ బాబా ప్రేమంటే. ఆయన ప్రేమ నిత్య నవ్యమైనది. ప్రపంచంలోని ఏ ప్రేమ అయినా ఏదో ఒకరోజు వాడిపోయేదే. ఒక్క బాబా ప్రేమ మాత్రమే ఎప్పటికీ తాజా కుసుమంలా శోభిల్లుతోంది. మనందరిపై బాబా కురిపించే ఆ అద్భుతమైన ప్రేమను బాబా ప్రసాదించిన మనందరి ఈ 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్' ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటూ, మనమంతా సదా ఆనందంగా ఉండాలని బాబాని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

"బాబా! మీకు నా హృదయపూర్వక నమస్కారములు. మేమంతా ఎల్లప్పుడూ మీ ప్రేమజల్లులలో తడుస్తూ మమ్ము మేము మైమరచిపోతూ ఉండేలా అనుగ్రహించండి".

బ్లాగుకి బాబా ప్రసాదించిన ఎంబ్లమ్(చిహ్నం)

సాయిభక్తులందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ 2020, జూన్ 3వ తేదీన బాబా ప్రసాదించిన అనుగ్రహాన్ని మీతో పంచుకుంటాము. 

మన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ మొదలుపెట్టడానికి ప్రేరణనిచ్చినది మొదలు ఇప్పటివరకు బ్లాగ్ విషయంలో బాబా అడుగడుగునా తమ సహాయాన్ని మాకందిస్తూ ఎన్నెన్నో అనుభవాలు ప్రసాదించారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఈ బ్లాగ్ కోసం బ్లాగును ప్రతిబింబించేలా ఒక ఎంబ్లమ్ (చిహ్నం) ఉండాలని తలచి దానికి రూపకల్పన చేసే పని మొదలుపెట్టాము. కానీ ఆ ఎంబ్లమ్ ఎలా ఉండాలో, ఏ విధంగా చేయాలో, దాని అవసరమెంతో అన్న విషయాలలో మాకెవరికీ కాస్త కూడా అవగాహన లేదు, కేవలం చేయాలన్న తపన తప్ప. అది అలా సాగుతూ ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈమధ్యకాలంలో తరచూ శిరిడీలో శేజారతి సమయంలో బాబా బ్లూ రంగు వస్త్రాల్లో దర్శనమిస్తున్నారు. ఆ రంగు వస్త్రాల్లో బాబాను ఎప్పుడు చూసినా 'మా సాయి మహరాజ్' అనే ఆనందానుభూతి మా మదిలో ఉప్పొంగేది. ఎందుకంటే, మన ఈ  బ్లాగ్ ఓపెన్ చేయగానే సాయి మహరాజ్ దర్శనమిచ్చేది ఈ రంగు వస్త్రాల్లోనే. ఒకరోజు ఆ బ్లూ కలర్ వస్త్రాల్లో ఉన్న బాబా ఫోటోలను చూస్తుంటే, 'ఈ బాబా ఫోటోతో ఎంబ్లెమ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా' అని ఒక ప్రేరణ కలిగింది. ఆ విషయాన్ని లోగో డిజైన్ చేస్తున్న సాయిబంధువుతో చెప్పాను. తను ఆ విధంగానే చేయటానికి ప్రయత్నిస్తానన్నారు. కానీ తనకు కూడా ఆ విషయంలో పెద్దగా అవగాహన లేదు. ఇలాంటి స్థితిలో బాబా ఎలా అనుగ్రహించారో చూడండి

2020, జూన్ 1వ తేదీన నాకు తెలిసిన ఒక సాయిఫ్రెండ్ గుర్తొచ్చారు. తనకి ఫోటోషాప్ పట్ల అవగాహన ఉంది కాబట్టి తను ఎంబ్లమ్ విషయంలో సహాయం చేయగలరని నా మనసుకి అనిపించింది. అనుకోకుండా మరుసటిరోజు ఉదయమే అతను బాబా సన్నిధిలో చేసిన అలంకరణకి సంబంధించిన కొన్ని బాబా ఫోటోలను నాకు షేర్ చేశారు. నిజానికి తన నుండి నాకు మెసేజ్ రావడం చాలా అరుదు. అలాంటిది అతని నుండి బాబా ఫోటోలు రావడంతో ముందురోజు నాకొచ్చిన ఆలోచనకి బాబా ఆశీస్సులు లభించాయని, అతనిని సంప్రదిస్తే పని అవుతుందని బాబా సూచిస్తున్నట్లుగా అనిపించింది. దాంతో నేను 2020, జూన్ 3వ తేదీన తనకి బ్లూ కలర్ వస్త్రాల్లో ఉన్న ఒక బాబా ఫోటోని, నమూనా కోసం ఒక ఎంబ్లెమ్ ఫోటోని అతనికి పంపి, తనతో ఒకసారి మాట్లాడాలని మెసేజ్ పెట్టాను. కాసేపటి తరువాత తనతో మాట్లాడి విషయమంతా వివరించాను. తను నాతో మాట్లాడుతూనే డిజైన్ పని మొదలుపెట్టారు. కేవలం పదిహేను నిమిషాల్లో అతను పైన ఇవ్వబడ్డ ఎంబ్లెమ్ తయారుచేసి ఇచ్చారు. ఆ ఫోటోకి మార్పులు చేర్పులు ఏమైనా సూచిస్తారేమోనని నలుగురు సాయిబంధువులకు పంపాను. ఆ ఫోటో మా అందరి మనసులని కట్టిపడేసింది. ఇంకేమైనా మార్పులు చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు, అంత గొప్పగా అనిపించింది. బాబా అనుగ్రహం ఉంటే పని ఎంత చకచకా సాగిపోతుందో, ఫలితం యెంత గొప్పగా ఉంటుందో అన్నదానికి నిదర్శనమిది. మేము చెప్పకపోయినా మా ఆలోచనలు, డిజైన్ చేసిన అతని ఆలోచనలు ఒకటే అవడం ఇందులో మరో అద్భుత విషయం. అయినా నడిపించేది, చేయించేది అంతా బాబా అయినప్పుడు మాటల అవసరం ఏముంటుంది? ఆంతర్యంలో వశిస్తూ, మనల్ని ప్రేరేపిస్తూ అంతా ఆయనే చేస్తారు. ఇలా బ్లాగుకి సంబంధించి మరో అనుభవాన్నిచ్చి ఆశీర్వదించిన సాయి మహరాజ్‌కు మా కృతజ్ఞతభివందనములు.

బాబా కురిపిస్తున్న అనుగ్రహాన్ని, ప్రేమని బ్లాగులో పంచుకుంటూ, బ్లాగులోని తోటి సాయిభక్తుల అనుభవాల ద్వారా బాబా ప్రేమని ఆస్వాదిస్తూ ఇంతలా బ్లాగును ఆదరిస్తున్న సాయిభక్తులందరికీ కూడా పేరుపేరునా మా కృతజ్ఞతలు. మీరు పంపే అనుభవాలలోని వాక్యనిర్మాణాలు, అక్షరదోషాలు సరిచేస్తూ, వాటిని ప్రచురిస్తూ, బాబా మనందరిపై చూపుతున్న ప్రేమకు కన్నీళ్లు పెట్టుకుంటూ పరవశంతో మురిసిపోతూ, మైమరచిపోతూ మేము పొందుతున్న ఆనందాన్ని వర్ణించాలంటే అక్షరాలు కరువవుతున్నాయి. అమృతం కూడా చిన్నబోయే బాబా ప్రేమను ఆస్వాదించవలసిందేగానీ మాటల్లో వర్ణించలేము. ఎప్పటికీ ఇలాగే వారి ప్రేమ మనందరిపై కురిపిస్తూ ఉండాలని బాబాను వేడుకుంటూ... 

- సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ బృందం.


11 comments:

  1. om sai ram sai emblam is very nice.congrats in completing 1year.om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  2. Emblam is very attractive.very peaceful.ome Sri smardhasadguru sainadh maharajku jai.

    ReplyDelete
  3. ఎంబ్లెమ్ చాలా బాగుంది ..దీన్ని స్వయంగా బాబా నే రూపొందించుకున్నారు ..అది అద్భుతం కాక మరేమవుతుంది ? మీ బ్లాగ్ బృందం అందరికి మా నమస్సుమాంజలి ..ప్రతీ రోజు బాబా కృపామృత వర్షం లో తడిసి ముద్దవుతూ వున్నాం ..🙏🙏🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. చాలా చక్కగా చెప్పారు సాయి.

      Delete
  4. om sairam
    sai always be with me

    ReplyDelete
  5. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete
  6. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🌹 బాబా గారి ఎంబ్లం చాలా బాగుందండి. ధన్యవాదములు🙏🙏🙏

    ReplyDelete
  7. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo