సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 428వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నేను పూర్తిగా బాబా భక్తురాలిగా మారిన అనుభవం
  2. ఆరోగ్యాన్ని ప్రసాదించిన సమాధిమందిరం ఊదీ

నేను పూర్తిగా బాబా భక్తురాలిగా మారిన అనుభవం

నా పేరు సాయి. ఈ బ్లాగ్ నిర్వహకులకి నా నమస్కారములు. బాబా దయతో ఈ బ్లాగ్ ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొంది, అమూల్యమైన బాబా లీలలతో సాయిభక్తులందరినీ తరింపచేయలని ఆశిస్తున్నాను.

గతవారంలో నేను నా అనుభవమొకటి ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా బాబా భక్తురాలిగా మారిన సందర్భాన్ని మీతో పంచుకోబోతున్నాను.

నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు, మేము క్రొత్తగా నిర్మించిన మా స్వంత ఇంట్లోకి మారాము. మేము ఆ ఇంట్లోకి వెళ్లిన కొద్దిరోజుల తర్వాత మా నాన్నగారు మెల్లిమెల్లిగా నడవలేని స్థితికి వచ్చారు. నడవటానికి కాళ్ళు సరిగా సహకరించక ఎంతో అవస్థ పడ్డారు. ఎంతోమంది డాక్టర్లను సంప్రదించినప్పటికీ ఎవరూ కూడా సమస్య ఏమిటో సరిగా నిర్ధారించలేకపోయారు. అలా చాలారోజులు గడిచాక, ఒక డాక్టర్ రిఫరెన్స్ మీద, నరాలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదించారు. అప్పుడు తెలిసింది, సమస్య కాళ్ళలో కాదు, వెన్నెముక దగ్గర అని. నాన్నగారిని పరీక్షించిన డాక్టరు, మా నాన్నగారికి చాలా పెద్ద సర్జరీ చేయాలనీ, సర్జరీ తర్వాత కూడా నడవగలరని హామీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇంట్లో అందరం చాలా భయపడ్డాము. మా నాన్నగారైతే ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయారు. కాళ్ళు లేకుండా జీవితం ఎలా గడపాలి అని చాలా బాధపడ్డారు.

ఆ తరువాత కొద్దిరోజులకు మరో స్పెషలిస్ట్ డాక్టర్ గురించి విన్నారు. మా నాన్నగారికున్న సమస్య లాంటి సమస్యలను ఆయన ఎన్నిటినో పరిష్కరించారని తెలిసింది. మా నాన్నగారు ఆ డాక్టరును సంప్రదించటానికి ఆసుపత్రికి వెళ్లినప్పుడు, ఆయన ఇండియాలో లేరని ఆసుపత్రి సిబ్బంది చెప్పారట. దాంతో మావాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారు. కానీ అనుకోకుండా ఆ డాక్టర్ ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా ఆసుపత్రికి వచ్చేశారట. ఎంత అదృష్టం! ఆయన మా నాన్నగారి రిపోర్టులన్నీ పరిశీలించి, సర్జరీ చేయటానికి అంగీకరించారట.

మేము ఉండేది మెదక్‌లో, ఆపరేషన్ జరిగేది హైదరాబాదులో. నా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కూతుర్ని అవటం వల్ల నేను అమ్మానాన్నలని వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఆపరేషన్ సమయంలో 15 రోజులు అమ్మానాన్నలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మా బామ్మ నా దగ్గరే ఉండి నన్ను చూసుకుంది. ఒకరోజు నేను మా నాన్నగారి ఆపరేషన్ గురించి నా స్నేహితులతో చెప్పుకుని బాధపడ్డాను. నేను బాధపడటం చూసిన నా స్నేహితురాలు నాతో, “నేను నీకు అమ్మ భగవాన్ ఫోటో ఇస్తాను, భగవాన్‌ని మొక్కుకో, మీ నాన్నగారికి నయమైపోతుంది” అని చెప్పింది. సరేనని తను ఇచ్చిన ఫోటో తీసుకుని ఇంటికి వెళ్లాను. 

కానీ ఇంటికి వెళ్ళాక ఎందుకో నాకు అమ్మ భగవాన్ ఫోటో కాకుండా బాబా విగ్రహం పెట్టుకోవాలని అనిపించింది. అప్పుడు నేను ఇంట్లో ఉన్న ఒక చిన్న బాబా విగ్రహం తీసుకుని, ఒక అలమరాలో నాకు తోచినట్లుగా చిన్న చిన్న మార్పులు చేసి, బాబా విగ్రహాన్ని ఆ అలమరాలో పెట్టుకుని పూజించడం మొదలుపెట్టాను. అంతకుముందు మా అమ్మతో కలిసి గుడికి వెళ్లడం అలవాటే. కానీ నాకు నేనుగా బాబాకి దగ్గరవటం, బాబా విగ్రహం దగ్గరికి వెళ్లి ఆయనతో నా బాధలు, భయాలు చెప్పుకోవడం అదే మొదటిసారి. అలా ప్రతిరోజూ బాబాకి నమస్కారం చేసుకుని, ప్రార్థనాష్టకం చదవేదాన్ని. 31, డిసెంబరు 2008న మా అమ్మతో కలిసి మా నాన్నగారు ఆసుపత్రి నుండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకున్నాక మెల్లమెల్లగా నడవడం ప్రారంభించారు. బాబా దయవల్ల మా నాన్నగారు ఇప్పుడు హాయిగా నడిచేస్తున్నారు. “చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”

అప్పటినుండి ఇప్పటిదాకా బాబా నన్ను ఎప్పుడూ వదిలేయలేదు. ప్రతిక్షణం మాతోనే ఉన్నారు, ఏదో ఒక రీతిలో మా ప్రార్థనలకు స్పందిస్తున్నారు. “బాబా! నాకు నీ మీద పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఉన్నాయి. మాకు ఏది మంచో ఏది చెడో నీకే తెలుసు. నీవు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. దయచేసి నన్ను ఎప్పటికీ నీకు దూరం అవనీయకు, నీ యందే నా మనస్సు ఉండేలా అనుగ్రహించు తండ్రీ!”

ఓం సాయిరాం!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ఆరోగ్యాన్ని ప్రసాదించిన సమాధిమందిరం ఊదీ

ఓం సాయిరాం! సాయిబంధువులకు నమస్కారం. నా పేరు మల్లూరు చంద్రశేఖర్. నేను ఖమ్మం జిల్లా వేంసూరులో సి.పి.ఎమ్.పార్టీ లీడరుని. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.

22-05-2020 తేదీ ఉదయం వేకువఝామున నిద్రలేచాక నా అర్థాంగి వెంకటేశ్వరి వాంతులతో, విపరీతమైన తలనొప్పితో అనారోగ్యానికి గురై బాగా నీరసించిపోయింది. తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చింది. అంత నీరసంగా ఉన్నప్పటికీ ఆసుపత్రికి వెళ్ళడానికి మాత్రం తను అంగీకరించలేదు. దాంతో దగ్గరలో ఉన్న మందుల దుకాణానికి వెళ్లి టాబ్లెట్లు తీసుకొచ్చి తన చేత మింగించాను. టాబ్లెట్లు వేసుకున్న వెంటనే మళ్ళీ తనకి వాంతులు అయ్యాయి. అయినా తను ఆసుపత్రికి వెళ్ళడానికి అంగీకరించలేదు. దీంతో నాకు భయమేసి, వెంటనే బాబా వైపు ఆర్తిగా చూసి, “బాబా! నా భార్యకి అయిదు నిమిషాలలో ఆరోగ్యాన్ని ప్రసాదించి తనని యాక్టివ్‌గా చెయ్యి తండ్రీ. నీ (భక్తుల) గృహములో ఎలాంటి లేమీ వుండదు తండ్రీ, నాకు సాయం చేయి వైద్యుడా” అని మనసులోనే బాబాను వేడుకున్నాను. తరువాత శిరిడీలోని సమాధిమందిరం దర్శనానంతరం ఇచ్చే ఊదీని నా అర్థాంగి నుదుటిపై పెట్టాను. బాబా అనుగ్రహంతో సరిగ్గా అయిదు నిమిషాలలో నా అర్థాంగి కోలుకుంది. "తనకు చాలా ఆరోగ్యంగా ఉందని, ఇది తనకు బాబా ప్రసాదించిన వరమే" అని సంతోషంగా చెప్పింది. తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించారని మేమిద్దరం ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఈ లీల ద్వారా సమాధిమందిరం ఊదీలో తన శక్తి వున్నదని బాబా నిరూపించారు. 

ఓం శ్రీ సాయినాథుని చరణం శరణం.


6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo