సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 408వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభై రెండవ  భాగం 

నిన్నటి తరువాయిభాగం..... 

ఆ మరుసటి సంవత్సరం 1917లో నేను చాతుర్మాస్యం పాటించాను. అప్పుడు బ్రహ్మసూత్రం మూడవ అధ్యాయంలో 16వ అధికరణంలో ఉత్పన్నమైన ప్రశ్నలకు సమాధానాలు సిద్ధాంతానుసారం అనుభవాన్నిచ్చాయి. ఆ రాత్రి విరజానది స్మృతి జాగృతమై, “మృత్యువుకి పూర్వం ఉపాసకుడికి ఉపాస్య వస్తువు సాక్షాత్కరిస్తే పుణ్యపాపాలు పరిత్యజించబడతాయి. వ్రతాదులు, జపము, పునశ్చరణ, ప్రాయశ్చిత్తము ఇత్యాదులు వేర్వేరు పాపాలను క్షయం చేస్తాయి కానీ పుణ్యాన్ని క్షయం చేయవన్న జ్ఞానం కలిగింది.

భగవద్గీతలో 2వ అధ్యాయంలో 50వ శ్లోకం ఇలా ఉంది:

బుద్ధి యుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతౌ ౹
తస్మాద్యోగయా యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ౹౹

(అర్థం - సమత్వ బుద్ధిని కలిగి ఉన్న పురుషులు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే త్యాగం చేస్తారు. అంటే, అవి వారిని అంటవు. ఈ సమత్వ బుద్ధి యోగం కోసమే పనులు చేస్తారు. ఈ సమత్వ బుద్ధి యోగం కూడా కర్మలో చతురతయే. అంటే కర్మ బంధాల నుంచి విముక్తి పొందే ఉపాయమే.)

మోరోపంత్ గారి -

పాపాతే ఘుణ్యాతేజితాచీ బుద్ధి యుక్త్ తో నాశీ౹
హాణ ఉని యోగీ యోజీ కర్మీ కౌశల్య తోచీ యోగ్ ఖరా౹౹

(అర్థం -  పుణ్యక్షయం జ్ఞానంతోనూ, జ్ఞానయోగం వల్లనే అవుతుంది. ఏమేం చేస్తావో, ఏమేం తింటావో, ఏయే హోమాలు చేస్తావో, ఏయే దానాలు చేస్తావో, ఏయే తపస్సులు చేస్తావో అవన్నీ నాకు అర్పణ చేయటంతో సమస్త కర్మబంధనాల నుండీ, శుభాశుభ ఫలముల నుండీ నీకు ముక్తి లభిస్తుంది. ఈ రకమైన యోగయుక్త సన్యాసంతో నీ ఆత్మకు ముక్తి కలిగి నేను ప్రాప్తించి నాలో లీనమౌతావు.) నా శుభాశుభ కర్మలనే ముళ్ళతో కూడిన మార్గంలోని కష్టాలనుండి బయటపడేసి బాబా నన్ను ముక్తుడ్ని చేశారు.

ఒకరోజు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల సమయంలో రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళాను. అప్పుడామె తన ముఖం ముందర ఒక పచ్చిమిరపకాయ పట్టుకుని కూర్చున్నది. నేను కూర్చోవటంతోనే ఆమె, “ఇది తీసుకో'' అన్నది. ఆ మిరపకాయను తీసుకొని నేను నోట్లో పెట్టుకుని నమిలి తినేశాను. అయినా అది నాకసలు కారమనిపించలేదు. ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత ఒక యోగసిద్ధుడైన గురువుగారు తన శిష్యునికిచ్చిన మంత్రం గురించిన వ్యాఖ్య నా దృష్టిలో పడింది. అందులో ఆభిమంత్రించిన మిరపకాయను తినటానికిచ్చే ప్రయోగం ఉంది. మాయి ఆ మిరపకాయ ద్వారా నాపై ఏదో ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం యొక్క పరిణామమేమిటో నేను ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయాను. కానీ అనేకమైన అగోచర వస్తువులు చూడగలిగేవాణ్ణి. అలాగే, ఎన్నోసార్లు ఎదురుగా ఉన్న వస్తువు కూడా నాకు కనపడేది కాదు. ఒకసారి దండెం మీదున్న రుమాలును తీసుకురమ్మని మాయి ఆజ్ఞాపించింది. దండెం దగ్గరకు వెళ్ళాక ఆ రుమాలు నాకు కనిపించలేదు. అప్పుడు రాధాకృష్ణమాయి వచ్చి, “ఇదుగో చూడు రుమాలు” అని నాకు చూపించింది. గురుసేవ కూడా గురువు అనుజ్ఞ లేకుండా అసంభవమన్న దానికి ఇది ప్రత్యక్ష అనుభవం.

రాధాకృష్ణమాయి పైకి ఏమీ చెప్పేది కాదు, కానీ నేను అన్నింటినీ త్యజించి శిరిడీలో ఉండాలన్నది ఆమె మనసులోని కోరిక. పదకొండు నెలలు శిరిడీలో ఉండి (1913లో) ముంబాయి తిరిగి వచ్చాను. ఈ విషయంలో ఆమె నాతో, “నీవు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఏడుపొచ్చేది” అన్నది. నా శిరిడీ నివాసం సమాప్తమై నేను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి ఆమె, "నేను నీకోసం కార్చిన కన్నీళ్ళన్నీ వ్యర్థం” అన్నది. ఇలా ఆమె ఖచ్చితంగా అంటున్నప్పటికీ నా నివాసానికి మాత్రం ఎటువంటి ఏర్పాట్లు చేయటం గానీ లేదా చేయించటం గానీ చేసేది కాదు. అందువల్ల నాకు చాలా ఆశ్చర్యం కలిగేది..

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo