సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 390వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ఇరవై నాలుగవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి ప్యాకింగులో వచ్చిన చిన్న చిన్న అందమైన కాగితం ముక్కలతో పూలు చేసి, వాటితో హారాలు తయారుచేసే పనిని రాధాకృష్ణమాయి నాకు అప్పగించింది. ఆ పనిని నేను నా గదిలో కూర్చొని నాకు సమయం చిక్కినప్పుడు చేస్తుండేవాడిని. ఈ హారాలన్నిటినీ రాధాకృష్ణమాయి సంతోషంగా చావడి మూలల్లో అలంకరించేది. గుఱ్ఱం కోసం సజ్జలు నానబెట్టి వాటిని దంచే పనిని నేను గంటల తరబడి చేసేవాడిని. పదకొండు నెలలు శిరిడీలో ఉన్న తరువాత నేను ముంబాయి వెళ్లి, మళ్ళీ మే నెలలో శిరిడీ వెళ్ళేటప్పటికి అక్కడ వట్టివేళ్ళ తడికలు తయారుచేసే పని నడుస్తోంది. రాధాకృష్ణమాయి ఆ పనిని నాకు నేర్పింది. ఈ పని కూడా నేను చాలా చేశాను. ఏదైనా పని నాకు రాకపోతే అప్పుడు రాధాకృష్ణమాయి ప్రేమపూర్వకంగా నన్ను తనవద్ద కూర్చోపెట్టుకొని నేర్పించేది.

సేవచేసే సమయంలో కొన్ని నా చేత్తో విరగటాలు, పగలటాలు కూడా జరిగేవి. ఒకసారి మశీదులోదో లేక చావడిలోదో ఒక గాజు డూమ్ నా చేతుల్లో పగిలింది. రాధాకృష్ణమాయి అలమర శుభ్రం చేసేటప్పుడు గాజు జాడీనో లేక దాని మూతో నా చేతుల్లో పగిలిపోయింది. కొత్త జాడీ తెచ్చిద్దామనే ఉద్దేశంతో నేను జాడీని దాచిపెట్టాను. శ్రీవామనరావు నార్వేకర్‌ని నా డబ్బుతో క్రొత్త జాడీ, గాజు డూమ్ తెమ్మని అర్థించాను. ఈ మాట ఆయన రాధాకృష్ణమాయితో చెప్పేశాడు. అలా చేయటానికి ఆమె అంగీకరించకపోవటం వల్ల నేను ఊరుకున్నాను.

ఒకసారి మధ్యాహ్న భోజన సమయంలో ఆమె నాతో, “ఇక్కడ నేనొక అణా పెట్టాను. దాన్ని నీవు కాజేసావు” అన్నది. “నేను మీ అణా చూడను కూడా లేదు. మీరొకవేళ అలా అనుకుంటే ఇదిగో, ఈ అణా తీసుకోండి” అని నేను ఆమెకో అణా ఇచ్చేశాను. ఈ ప్రకరణం అంతటితో శాంతించింది. (ఈ రూపకానికి అర్థం స్వయంగా శ్రమించి సంపాదించిన “జ్ఞానం యొక్క చోరీ” అనే ఉంది. దాన్ని ఈ రచయిత స్వయంగా తరువాత తెలుసుకున్నారు. దీని వివరణ ముందు చదువుదాం.)

ఈ మధ్యకాలంలో నేను కాకాసాహెబ్ దీక్షిత్ ఇచ్చిన నాభాజీ భక్తిమాలను నా గదిలో కూర్చొని చదువుతుండేవాడిని. రాధాకృష్ణమాయితో పరిచయమయ్యాక ఆమె ఇంట్లోనే కూర్చొని చదివేవాడిని. ఒకసారి నేనలా చదువుతున్న సమయంలో సంతుపురుషుల వృత్తాంతాన్ని విన్న వెంటనే ఆమె కళ్ళలోంచి విరహాశ్రువులు స్రవించి వెక్కివెక్కి ఏడ్చింది. ఆ చీకటి గదిలో విద్యుత్ లాంటి మెరుపు మెరిసింది. అప్పుడు రాధాకృష్ణమాయి శాంతించి నిద్రపోయింది.

నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళ “తుకారాం గాథ” అనే పుస్తకం రాధాకృష్ణమాయికి ప్రియమైన పుస్తకం. దాని వెల ఒక రూపాయి. ఎవరు ఏ రకమైన సిద్ధాంతాలను గురించి మాట్లాడినా ఆ సందర్భానుసారం సంత్ తుకారామ్ అభంగాలను, పదాలను ఆమె పాడి వినిపించేది. ఏకాంతంలో ఎప్పుడూ ఆమె ఈ అభంగాలను పాడుకుంటూ ఉండేది. “ఇక్కడికొచ్చిన మొదట్లో సంతులు పాడే అభంగాలను నేను బాబా ఎదుట పాడేదాన్ని. అవి బాబాకు చాలా నచ్చేవి” అని ఆమె అంటుండేది. ఆ అభంగాలు చాలామటుకు సంత్ పురుషులపైన కరుణాపూరితంగానూ లేక వారి స్థితిపరంగానూ ఉండేవి. 'తుకారాం గాథ' అనే నా పుస్తకంలో ఆమె తను పాడే అభంగాలపైనా, తను ఆకర్షితురాలైన అభంగాలపైనా విశేషంగా గుర్తులు పెట్టింది. ఒకసారి 'నవనీత్' అనే మరాఠీ కావ్య సంగ్రహాన్ని ఆమె నా దగ్గర్నుంచి తీసుకొని కొద్దిరోజులు తన దగ్గర పెట్టుకుంది. అందులో గోపబాలుడి వేషంలో ఉన్న శ్రీకృష్ణుని మనోహర ముద్రల గురించి సుందరంగా వర్ణించబడి ఉంది. అందులో గొల్లవేషంలోని హరిదర్శన ప్రతిబింబాన్ని హృదయంలో అంకితం చేసుకొని, దాన్ని ఎప్పుడూ ఆమె స్మరిస్తూ ఉండేది. ఆ పది, పన్నెండు పంక్తులనూ ఆమె ఎప్పుడూ పాడుతుండేది. పుస్తకం తిరిగి ఇచ్చే సమయంలో భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో వర్ణించబడి ఉన్న బ్రాహ్మణ ధర్మంపై టిప్పణీ చేయబడి ఉన్నచోట ఆమె గుర్తుపెట్టింది. “బ్రాహ్మణ సద్గుణాలను అనుసరించమ"ని ఆమె ద్వారా నాకిది సూచన అనిపించింది.

"శమో దమస్ తపః శౌచం శాంతి రార్జవమేవచ,
జ్ఞానం విజ్ఞాన మస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం” 

(భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం)

అర్థం:- అంతఃకరణ నిగ్రహం, ఇంద్రియ దమనం, బాహ్య-అంతరంగిక శుద్ధి, ధర్మం కోసం కష్టాన్ని సహించటం, క్షమాభావంతో ఉండే మనసు-శరీరం, ఇంద్రియాల సరళత్వం, ఆస్తిక్య బుద్ధి, శాస్త్ర విషయ జ్ఞానము, పరమాత్మ తత్వాన్ని గురించిన జ్ఞానము - ఇవి బ్రాహ్మణులకు స్వాభావిక కర్మలు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo