సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 434వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సర్వమూ సాయికి తెలుసు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

బాబాకు తెలియనిది ఏమీ లేదు. మనకు ఏది మంచిదో, ఏది శ్రేయస్సునిచ్చేదో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే ఆయన మనకోసం అన్నీ ముందుగానే ఏర్పరచి ఉంటారు. ఇక నా అనుభవంలోకి వస్తాను.

1994వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. అంతటితో మా కుటుంబం ఆర్థికంగా చాలా కృంగిపోయింది. సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేని ఆ సమయంలో మేము కేవలం బాబానే నమ్ముకున్నాము. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. నా తమ్ముడి వయస్సు పన్నెండు సంవత్సరాలు. అమ్మ కాన్వెంట్‌లో పనిచేస్తూ వచ్చిన నాలుగు డబ్బులతో మా బాగోగులు చూసుకుంటూ ఉన్నంతలోనే సర్దుకుపోతూ ఉండేది. 1998లో నాకు వివాహమైంది. 2000వ సంవత్సరంలో తమ్ముడు చదువు మానేసి ఒక హోటల్లో పనికి చేరాడు. కొన్నాళ్ళకి వృద్ధాప్యం చేరువకావడంతో అమ్మ ఒంటరిగా చేసుకోలేక తమ్ముడు దగ్గరకి వెళ్లి, వాడున్న ఊరిలోనే వాడితో ఉండసాగింది. బ్రాహ్మణ కులస్థులమైనందువలన తమ్ముడు చేస్తున్న హోటల్ పని చూసి చాలా బాధపడుతూ ఎన్నోసార్లు నాతో, "నాకేమైనా అయితే వాడికి దిక్కెవరు? వాడు అనాథ అయిపోతాడు. ఎట్లాగైనా వాడు నీ దగ్గరికి చేరుకుంటే బాగుంటుంది" అని చెప్పుకుంటూ ఉండేది. కానీ నేను మా అత్తగారింట్లో ఉండేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకి వేరు కాపురం పెట్టినా వాడిని మా దగ్గరకు రమ్మనేంత ధైర్యం నాకు లేకపోయింది. ఎందుకంటే, మా కుటుంబం ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. కేవలం సాయి దయతో కాలం గడుపుతున్నాం. అటువంటి సమయంలోనే, అంటే 2011 సంవత్సరంలో అమ్మ సాయి సన్నిధికి చేరుకుంది. 'వాడు అనాథ అయిపోతాడు' అనే అమ్మ మాటే నాకు చాలా బాధ కలిగిస్తూ ఉండేది. దాంతో నేను నా తమ్ముడితో, 'నువ్వు నా దగ్గరకి వచ్చి నాతో ఉండు' అని ఎన్నోసార్లు చెప్పాను. కానీ వాడు వినేవాడు కాదు. 

నాకు ఏ సమస్య వచ్చినా బాబా ముందు కూర్చొని, నా సమస్య ఆయనకు చెప్పుకొని, బాబా పారాయణ గ్రంథంలోని ఒక పేజీ తెరుస్తాను. ఆ పేజీలో ఉన్నటువంటి బాబా మాటలను నాకు సమాధానంగా అర్థం చేసుకుంటాను. అలా బాబా చెప్పే ప్రతి మాటా నా జీవితంలో ఇంతవరకు నిజమే అవుతూ వస్తున్నాయి. పీకల్లోతుల్లో మునిగిపోయిన సమస్యల నుండి కూడా ఆయన చిటికెలో పరిష్కరించి మమ్మల్ని కాపాడారు. మా తమ్ముడి విషయం కూడా బాబాకి చెప్పుకొని, "బాబా! వాడు నా మాట వినటం లేదు. ఏమి చేయమంటారు?" అని అడిగితే, "ఎప్పటికైనా వాడు నీ దగ్గరకి వస్తాడు" అని బాబా చెప్తుండేవారు. బాబా మీద విశ్వాసంతో అన్నీ ఆయన చూసుకుంటారని ధైర్యంగా ఉండేదాన్ని.

3 సంవత్సరాల క్రితం ఒకరోజు మా తమ్ముడి యజమాని ఫోన్ చేసి, "అమ్మా, మీ తమ్ముడు పనిలోకి రావడం లేదు, ఊరికి ఏమైనా వచ్చాడా?" అని అడిగారు. నేను అతనితో, "లేదు, ఇక్కడికి రాలేదు" అని చెప్పాను. దాంతో అతను మా తమ్ముడు ఉండే రూమ్ వద్దకి పనిచేసే కుర్రాళ్ళని పంపి విషయం కనుక్కోమన్నాడు. వాళ్ళు వెళ్లి నా తమ్ముడిని అడిగితే, "రేపు వస్తాను" అని చెప్పాడు కానీ, పనికి వెళ్ళలేదు. దాంతో యజమాని నాతో, "అతను పనికి ఎందుకు రావడం లేదో కనుక్కోమ"ని చెప్పారు. నేను ఫోన్ చేస్తే వాడు, "ఏం లేదు, రేపట్నుంచి పోతానులే" అని అన్నాడు. సరే, ఇంకేం భయం లేదులే అని నేను ఊరుకున్నాను. కానీ మనసు ఉండబట్టలేక బాబాతో, "ఏమిటి  బాబా, వాడి పరిస్థితి ఎట్లా ఉంది?" అని అడిగాను. అప్పుడు, "నువ్వు వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని ఇక్కడికి తీసుకు రా. వాడు రానంటే ఎవరి ద్వారానైనా బలవంతంగా తీసుకొని రా" అని బాబా మెసేజ్ వచ్చింది. అప్పుడు మధ్యాహ్నం 12:00 గంటలైంది. ఇంట్లో చిన్నపిల్లలున్నారు. మేము వెళితే వాళ్ళని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరూ ఉండరని ఆలోచిస్తూ ఆందోళన చెందాను. కానీ బాబా అలా చెపుతున్నారంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అని భయం వేసింది. వెంటనే నా భర్తతో, "బాబా చెప్పారు కదా, మనం వెళ్దామా?" అని అడిగాను. అందుకాయన, "ఇక్కడినుండి అక్కడికి వెళ్లాలంటే 5 గంటల ప్రయాణం చేయాలి. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా రాత్రికి ఇంటికి చేరుకోవాలి. ఇదంతా కుదిరేపని కాదు. కాబట్టి ఇప్పుడు వద్దులే, రేపు నేను వెళ్లి చూసి వస్తాను" అని చెప్పారు. కానీ నేను, "బాబా చెప్పారు కాబట్టి మనం వెళ్లాల్సిందే" అని పట్టుబట్టాను. దాంతో మావారు ఒప్పుకున్నారు. వెంటనే ఇద్దరమూ బయల్దేరి తమ్ముడు ఉండే ఊరికి చేరుకున్నాం.

తమ్ముడు ఉండే గదికి వెళ్లి తలుపు తట్టి ఎన్నిసార్లు పిలిచినా తను తలుపు తీయలేదు. టెన్షన్ పడుతూ ఉంటే సుమారు పదినిమిషాల తరువాత వాడు తలుపు తీశాడు. చూస్తే, చాలా నీరసించిపోయి ఉన్నాడు, మాట్లాడడానికి కూడా శక్తి లేదు. ఎలాగో శక్తి కూడదీసుకుని, "నాలుగురోజుల నుంచి తీవ్రమైన జ్వరం. లేవడానికి కూడా చేతకావడం లేదక్కా" అని చెప్పాడు. 'బాబా ఇందుకే నన్ను పంపించాడు' అని అనుకున్నాను. మరి రెండురోజులు అలాగే సాగితే వాడు కోమాలోకి వెళ్లిపోయేలా ఉన్నాడు. త్రాగడానికి నీళ్ళు ఇస్తే గ్లాసు కూడా పట్టుకోలేకపోతున్నాడు. వాడినలా చూస్తుంటే నాకు చాలా బాధేసింది. మనసులో, "ఏమిటి బాబా వీడి పరిస్థితి? నాకు చాలా భయమేస్తోంది" అని అనుకున్నాను. తరువాత నేను వాడితో, "చూడు నాయనా! బాబా నిన్ను తీసుకొని రమ్మని నాతో చెప్పారు. నువ్వు వెంటనే బయల్దేరు, ఇంటికి పోదాము" అని అన్నాను. వాడు, "నాకు ఏం పర్వాలేదు, నేను రాను, ఇక్కడే ఉంటాను" అని అన్నాడు. నేను, "అలా కాదుగానీ, రా పోదాం" అని చెప్పి, "కావాలంటే ఈ మెసేజ్ చూడు" అని నా ఫోన్లో ఉన్న బాబా మెసేజ్ చూపించాను. దాంతో వాడు "సరేన"ని మాతోపాటు బయలుదేరాడు. వణుకుతూ బస్సు ఎక్కి నీరసంగా కూర్చున్నాడు. ప్రయాణం చేస్తున్నంతసేపూ నేను బాబాని తలుచుకుంటూ, "బాబా! అమ్మ లేదు, ఉన్నది మేమిద్దరమే. మీరు గనుక హెచ్చరించకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో? నేను నా తమ్ముడిని కోల్పోయేదాన్ని. ఒంటరినైపోయేదాన్ని కదా" అని బాబాతో చెప్పుకున్నాను.

ఇంటికి చేరుకున్నాక చెకప్ కోసం తమ్ముడిని బెంగళూరు పంపించాను. అక్కడ అన్ని టెస్టులూ చేసి, పచ్చకామెర్లు తిరగబెట్టి లివర్ ఉబ్బిపోయిందని చెప్పి, టాబ్లెట్లు ఇచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. రెండు, మూడు నెలలు తమ్ముడిని నా వద్దే ఉంచుకున్నాను. తర్వాత నేను, "ఇక ఎక్కడికీ వెళ్లొద్దు, ఇక్కడే ఉండు" అని చెప్పాను. కానీ వాడు నా మాట వినకుండా, "నేను అక్కడే ఉంటాను. నా యజమాని నన్ను బాగా చూసుకుంటాడు" అని చెప్పాడు. అది కూడా నిజమే! అతను చాలా మర్యాదస్తుడు, మంచి మనసున్న వ్యక్తి, మాకు చాలా సహాయం చేశాడు. కానీ 'బాబా వాడిని నా దగ్గర వుంచుకోమని చెప్పారు కదా!' అని అనుకొని మళ్ళీ వాడి గురించి బాబాను అడిగాను. అందుకు బాబా, "యజమాని చూస్తున్న సంగతి తెలిసిందే! కానీ, అతని దగ్గర ఉద్యోగం మానుకొని అనుభవం ఉన్న దాంట్లో సొంత వ్యాపారం చేసుకో" అని సందేశమిచ్చారు. నాకు బాబా మాట వేదం. ఆయన చెప్పారంటే అందులో ఏదో పరమార్థం ఉంటుంది. "వాడు అనాథ అవుతాడు" అన్న అమ్మ మాటలు తమ్ముడికి గుర్తుచేసి, "నువ్వు ఇప్పటికైనా ఇక్కడ ఉండరా" అని అన్నాను. కానీ వాడు వినలేదు, "నేను ఉండను. అక్కడికే వెళ్తాను" అని చెప్పాడు. 'సరే, ఏం చేసినా ఇక బాబానే చేయాలి' అని అనుకొని నేను వాడి ఇష్టానికి అభ్యంతరపెట్టలేదు. 'సాయి సంకల్పం ఉంటే మన ఇష్టాయిష్టాలు పనిచేయవు కదా' అని ధైర్యంగా ఉన్నాను.

2019 డిసెంబరులో తమ్ముడు నా దగ్గర రెండురోజులు ఉండి వెళ్దామని వచ్చాడు. అప్పుడు నేను మళ్ళీ వాడికి బాబా మాటలు గుర్తుచేసి, "ఇక వెళ్ళకు, ఇక్కడే ఉండు. బాబానే ఏదో ఒక దారి చూపిస్తారు. నువ్వు ఒక ఇంటివాడివి కూడా కాదు. 20 సంవత్సరాలు అక్కడ పనిచేసి నువ్వు సంపాదించుకున్నది లేదు. ఉన్నది ఇద్దరమే. మనకు ఎవరూ లేరు. కాబట్టి నా పిల్లలతో సమానంగా నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఉన్నదాంట్లో అందరం కలిసి సంతోషంగా ఉందాం. బాగా ఆలోచించుకో! బాబా చెప్పిన మాట ఎన్నడూ వ్యర్థంకాదు. నీ గురించి ఎప్పుడు బాబాని అడిగినా ఆయన మళ్ళీ మళ్ళీ అదే మాట చెబుతున్నారు. మనము ఆయనకు, ఆయన మాటకు విలువ ఇవ్వాలి. ఆయన చెప్పేది ఎప్పుడూ సత్యమే అవుతుంది. "జ్యోతిష్కులు చెప్పేదానికన్నా నేను ఇంకాస్త ముందుకు వెళ్లి భవిష్యత్తు చెబుతాను. నేను చెప్పిన మాటలు ఎప్పుడూ ఖచ్చితంగా నిజమవుతాయి" అని బాబా చెబుతారు. కాబట్టి నీకు బాబా మీద విశ్వాసం అనేది ఉంటే నువ్వు ఇంక వెళ్ళవద్దు" అని చెప్పాను. దాంతో వాడు ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించుకున్న మీదట నా దగ్గర ఉండటానికి నిర్ణయించుకున్నాడు.

బాబా సొంత వ్యాపారం పెట్టుకోమని వాడి విషయంలో చెప్పారు కాబట్టి వాడి శక్తిసామర్థ్యాలు ఏమిటో నాకు పూర్తిగా తెలియకపోయినా వాడికి తెలిసింది హోటల్ పనేనని బాబా మీద విశ్వాసంతో ఒక చిన్న గది చూసి అందులో వాడి చేత 2020, మార్చి 20న ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయించాను. అయితే ఓపెన్ చేసిన మూడురోజులకే లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో మార్చి 24వ తేదీన టిఫిన్ సెంటర్ క్లోజ్ చేశాము. అది మూతబడినా బాబా ఎంత మేలు చేశారో తలచుకుంటుంటే నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. విషయం ఏమిటంటే, వాడు హోటల్ పని చేసిన ఊరిలోనే అత్యధికంగా కొరోనా కేసులు నమోదయ్యాయి. ఆ ఊరిని తలుచుకుంటేనే అందరూ భయపడుతున్నారు. ఈ కొరోనా సమయంలో తమ్ముడు అక్కడ ఇరుక్కుపోయి ఉంటే, వాడు రావడానికిగానీ, మేము వెళ్లడానికిగానీ లేకుండా ఎంతో భయపడాల్సి, బాధపడాల్సి వచ్చేది. కానీ ఏ కష్టం లేకుండా బాబా ఎలా ఏర్పాటు చేశారో చూడండి. సర్వమూ సాయికి తెలుసు, ఆయన మన జీవితాలను ఎంతో అందంగా అమరుస్తారు. ఎల్లప్పుడూ మనల్ని కనిపెట్టుకొని ఉంటారు.

అయితే టిఫిన్ సెంటర్ మూడురోజులకు మూసివేయాల్సి రావడంతో తమ్ముడు బాధపడుతుంటే నేను తనతో, "చూడు! నేను నిన్ను నమ్మి నీ చేత టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయలేదు. నేను బాబానే నమ్మాను. ఆయన వ్యాపారం చేయమని చెప్పారు కాబట్టి వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది జరిగినా మన మంచికే. మనకు తెలియని విషయాలన్నో బాబాకు తెలుసు. ఆయన జగన్నాటక సూత్రధారి. అయినా 'సాయి ఉండగా భయమేల?' ఆ తండ్రి సర్వమూ చూసుకుంటారు" అని చెప్పాను.

"బాబా! ఈ కొరోనా రక్కసి బారినపడి ఎంతోమంది బలి అవుతున్నారు. దీన్ని త్వరగా అంతం చేయండి. పట్టెడు అన్నం లేక ఎందరో అల్లాడిపోతున్నారు తండ్రీ. దయచేసి ఈ కొరోనా కరవు రక్కసి నుండి అందరికీ ముక్తిని ప్రసాదించండి. ఇది మీకు మాత్రమే సాధ్యం. ఈ కష్టకాలంలో నీవు కాక ఇంకెవరు మాకు సహాయం చేస్తారు? బాబా! మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై, ప్రతి జీవిపై ఉంటుందని నమ్ముతున్నాను. మీ ఆశీస్సులతో నా తమ్ముడు సంతోషంగా ఉంటాడని ఆశిస్తున్నాను. సదా మమ్మల్ని చల్లగా చూసుకుంటున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా".


11 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. om sai namo namo
    sri sai namo namo
    jaya jaya sai namo namo
    sadguru sai namo namo

    ReplyDelete
  3. sairam opika ledu
    please do something
    om sairam

    ReplyDelete
  4. Om sai ram
    Mana andarpi sai Ashirwadam undali ellappudu
    ...very nice leela

    ReplyDelete
  5. అద్భుతమైన అనుభవము..

    ReplyDelete
  6. 🙏🌹 om Sri sairam tatayya 🌹🙏

    ReplyDelete
  7. Om Sri Sai Ram thaatha 🙏🙏..
    Bhavya sree

    ReplyDelete
  8. ఓం సాయిరాం...,,🌹🙏🌹

    ReplyDelete
  9. Madam baba miku ela samadanam istunnaru prashnalu ,Javabulu website ha andhi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo