సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 410వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైనాలుగవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

నేనలాంటి అస్థిరమైన విచిత్ర మానసికస్థితిలో ఉండగా ఒకసారి బాబా స్నానానికి సిద్ధమౌతున్నప్పుడు రాధాకృష్ణమాయి నా రెండు భుజాలమీదా తువ్వాలు వేసి 'పద' అన్నది. నేనక్కడికి వెళ్ళినప్పుడు బాబా స్నానం చేసి నిలుచొని ఉన్నారు. భక్తులు ఆయన శరీరాన్ని తుడుస్తున్నారు. కానీ నేనో చెట్టులాగా శూన్యమనసుతో అలాగే నిలబడిపోయాను. ఎవరో ఒకతను నేను అన్యమనస్కంగా ఉండటాన్ని చూసి నా భుజం మీదున్న తువ్వాలును తీసుకుని బాబాను తుడవటం ప్రారంభించాడు. నా భుజాల మీద తువ్వాలు పెట్టిన రాధాకృష్ణమాయి ఉద్దేశ్యం అప్పుడర్థమైంది నాకు. నేను తువ్వాలు తీసుకొని కేవలం ద్వారకామాయికి వెళ్ళటం కాదు, అక్కడ బాబా శరీరాన్ని నా చేతులతో తుడిచి సేవచేసుకోవాలన్నదే ఆమె ఉద్దేశ్యం. కానీ అప్పుడు ఆ మానసికస్థితిలో సేవచేసే సాధనమూ, సేవచేసే సమయమూ వచ్చి కూడా బాబాకు సేవ చేసుకోలేకపోయాను.

అదేవిధంగా ఓసారి రాధాకృష్ణమాయి ఇచ్ఛానుసారం నేను చావడికి బయలుదేరి, 'ఇప్పుడు నేనెందుకు వెళ్ళాలి? ఇది రాధాకృష్ణమాయి ఇచ్ఛ, రాక్షసిమాయ' అనుకొని నేను చావడికి వెళ్ళలేదు. ఆ రోజుల్లో నాకు భోజనం మీద కూడా ధ్యాస ఉండేది కాదు. మధ్యాహ్నం పూట ఎన్నోసార్లు నేను భోజనం చేయటం మరచిపోయేవాడిని. ఒకసారి డా౹౹పిళ్ళే ఉదయమే నన్ను భోజనానికి ఆహ్వానించాడు, కానీ నేనా విషయం మరచిపోయాను. సాయంకాలం అతను 'ఎందుకు రాలేద'ని నన్ను అడిగినప్పుడుగానీ నాకా విషయం గుర్తురాలేదు. రాధాకృష్ణమాయి ఇంటిక్కూడా గుర్తుంటేనే వెళ్ళేవాడిని. ఈ రకమైన మానసికస్థితి వల్ల నా శరీరం చిక్కి శల్యమైంది. వాడాలో ఉండే ఒక భక్తుడు నాతో, "వామనరావ్! నీకేదైనా కష్టంగానీ లేదా విచారంగానీ ఉందా? నువ్విక్కడకు వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయావు” అన్నాడు. ఇదంతా చూసి బాపూసాహెబ్ బూటీ ఒకసారి నాతో, “నీవు ఇక్కడ ఉండాలనుకొంటే సంతోషంగా ఉండు. నీ ఖర్చుకోసం నేను ప్రతి నెలా యాభయ్యో అరవయ్యో ఇస్తాను. అంతేకానీ ఈ రకంగా దుఃఖించకు” అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదని చెప్పనవసరం లేదనుకుంటా. బాపూసాహెబ్ బూటీ అన్న ఆ మంచిమాటలకు నేను సమాధానం కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు మరి కృతజ్ఞతలు మాత్రం ఎందుకు చెప్పాలి?

ఒకసారి అందరూ దీక్షిత్ వాడాలో భోజనం చేస్తున్నారు. కానీ శ్రీమతి దీక్షిత్ మాత్రం భోజనానికి కూర్చోలేదు. నేనక్కడ పచార్లు చేస్తున్నాను. ఆమె నన్ను చూసి, "వామనరావ్! భోజనానికి పద, మనిద్దరం కూర్చుందాం” అన్నది. నేను సరేనని భోజనం చేయటానికి కూర్చున్నాను. భోజన సమయంలో నా పళ్ళెం దగ్గర ఒక అణా పడివుండటం కనిపించింది. ఈ అణా ఎక్కడ్నించి వచ్చిందని నేను ఆలోచించసాగాను. శ్రీమతి దీక్షిత్ దాన్నక్కడ పెట్టలేదు. అలాగే ఇతరులెవరూ అక్కడకు రాలేదు. ఇంకా వేరెవరో పెట్టటమనేది అసంభవం. అప్పుడే, 'ఈ అణాకి అర్థం - గురుకృప' అని ఆకాశవాణి వినిపించింది.

పదకొండు నెలలు నేను శిరిడీలో ఉన్న సమయంలో ఒకరోజు మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటలై ఉంటుంది. రాధాకృష్ణమాయి నేనొక అణాని దొంగిలించానని నాపై ఆరోపణ చేసింది. “శ్రమచేసి తాను ప్రాప్తింపచేసుకున్న జ్ఞానాన్ని నేను దొంగిలించాను” అని రాధాకృష్ణమాయి నాకు చెప్పాలనుకున్నదని నేను అర్థం చేసుకున్నాను. ఆమె ద్వారా బాబా నాకెన్నో నేర్పించారు. ఆ మాట నిస్సందేహం. అలా చూస్తే ఆ ఆరోపణ ఒకరకంగా నిజం కూడా. ఒక సాయంకాలం బాబా మాధవరావుతో, “ఇతను నా కాలిని ఖండించి తీసుకెళ్ళాడు” అన్నారు. ఈ ప్రకారంగానే రాధాకృష్ణమాయి కూడా ఆరోపించారు. నేను రాధాకృష్ణమాయి ఆరోపణను అంగీకరించాను. అలాంటప్పుడు బాబా చెప్పిన మాట అసత్యమెలా అవుతుంది? వీరిద్దరి మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

  1. **:*:*:*:*:*:*:*:*:*:*:*:**
    🛕 ఓం సాయిరాం!! ఓం సాయిరాం🛕
    **:**:*:*:*:*:*:*:*:***:*:*

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo