సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 399వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్ఫైమూడవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా ఆజ్ఞానుసారం మర్నాడు బాబా, రాధాకృష్ణమాయిల దర్శనం చేసుకుని పరేల్ తిరిగి వచ్చాను. శిరిడీ నుండి బయలుదేరే సమయంలో కాకాసాహెబ్ కాషాయరంగు వస్త్రంలో చుట్టబడ్డ ‘గురుగీత’ను నాకు చదవటానికిచ్చారు. బాబా నాకు ఏ పుస్తకమూ ఇవ్వలేదు. ఏ విధమైన సూచన కూడా ఇవ్వలేదు. అయితే బాబాను ప్రసన్నం చేసుకోవటానికి నేను ఇంగ్లీషులో ఒక కవిత వ్రాశాను. నాకు గురుగీతను ఇవ్వమని కాకాసాహెబ్ కు బాబా ప్రేరణ కలిగించటం బహుశా దాని ప్రతిఫలమే. నా బుద్ధిని ఆవరించి ఉన్న అజ్ఞానం తొలగలేదు. ‘అన్నిటికీ ప్రేరకులు సాయినాథులే’ అన్న భావన నా మనసులో దృఢం కాలేదు. అంటే, జ్ఞానం ఎక్కడినుంచి లభించినా కూడా దాన్ని గ్రహించి, జ్ఞానం పొందాలనే అభిలాష కూడా జాగృతం కాలేదు. అందువల్ల బాబాగానీ లేక రాధాకృష్ణమాయిగానీ నాకు గురుగీతను ఇవ్వలేదు కనుక నేనా పుస్తకాన్ని పఠించలేదు. దాన్ని కొంచెం కూడా చదవకుండా తిరిగి కాకాసాహెబ్‌కు ఇచ్చేశాను. కానీ, 1935 తరువాత గురుగీతను ఎన్నోసార్లు పఠించాను. రాధాకృష్ణమాయి సమ్మతితో కాకాసాహెబ్ ఇచ్చిన గురుగీతను అప్పుడే పఠనం చేసివున్నట్లయితే అనేక విషయాలు తెలిసివుండేవని ఇప్పుడనిపిస్తోంది. దీనిద్వారా, “బాబా ఇతరుల ద్వారా ఏదైనా పుస్తకాన్ని పంపితే దాన్ని తప్పకుండా చదవాలి” అని తెలుసుకున్నాను.

కొద్దిరోజుల తరువాత, గురుపూర్ణిమ వస్తున్నందువల్ల మళ్ళీ నేను శిరిడీ వెళ్ళాను. అంతకుముందు శిరిడీకి వచ్చినప్పుడు రాధాకృష్ణమాయి, “వచ్చేటప్పుడు నీ వెంట పూరీ మొదలైనవి తీసుకొచ్చే బదులు కూర, జొన్న రొట్టెలు తీసుకురమ్మ"ని సలహా ఇచ్చింది. అందువల్ల ఈసారి నేను శిరిడీ వెళ్ళేటప్పుడు కూర, జొన్న రొట్టెలు వెంట తీసుకెళ్ళాను. మర్నాడు రాధాకృష్ణమాయి అడిగినప్పుడు వెంట తీసుకెళ్ళిన పదార్థాలను ఆమెకి చూపించాను. ఆమె ఆ రొట్టెలు తిన్నదో లేదో నాకు గుర్తులేదు కానీ, నేను చద్ది రొట్టెలు తిందామని ప్రయత్నం చేస్తే అవి గొంతు దిగటం చాలా కష్టమైంది. పాలో లేక వేరే ఏవైనా ద్రవపదార్థాలో తీసుకురావాలని నాకు గుర్తురాలేదు. గురుపూర్ణిమరోజు రాధాకృష్ణమాయి, “ఈరోజు ఆరతి తర్వాత బాబా తమ ప్రసాదాన్ని నీకోసం పంపిస్తారు. ఆరతయ్యాక ఇక్కడకొచ్చి తిను. అరే! ఇంత స్వచ్ఛమైన మనసుతో ప్రభువు దర్శనం కోసం ఇక్కడికొచ్చేవారు ఎవరున్నారు?” అన్నది. ఆరతయిన తరువాత రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్ళాను. అప్పుడామె సజ్జరొట్టెను పొడిచేసి కప్పులోని పాలల్లో ముంచి నాకు ఇస్తూ, “తీసుకో, ఇదంతా తిను” అన్నది. తరువాత ఆమె నాకు ఒక హపూస్ మామిడిపండును కూడా ఇచ్చింది. “నాకొద్దు, బాబా కోసం ఉంచండి” అన్నాను. అప్పుడామె, “ఇది కూడా ప్రసాదమే, పూర్తిగా తీసుకో” అన్నది. పాలల్లో ముంచిన సజ్జరొట్టెని నేను తిన్నాను. తరువాత మాయి ఆ గిన్నెని ఎత్తి అందులో కొంచెం నీరు పోసి వేలితో కడిగి దాన్ని త్రాగేసింది. ప్రసాదంగా ఇచ్చిన మామిడిపండును కూడా నేను తిన్నాను. 

ఆ గురుపూర్ణిమ చిరస్మరణీయమైన రోజు. పొద్దున ద్వారకామాయికి వెళ్ళాను. ఆ సమయంలో బాబా ఒంటరిగా కూర్చున్నారు. వేరే ఎవరూ లేరు. అప్పుడు సాహసించి నేను పైకి వెళ్ళాను. బాబా నన్ను తమ దగ్గర కూర్చోపెట్టుకున్నారు. నెమ్మదిగా ఏకనాథ భాగవతం (సంత్ ఏకనాథ మహారాజుచే రచింపబడిన) నుంచి ఒక వాక్యం చెప్పి, “ఊదీ తీసుకుని మరీ వెళ్ళు” అన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడని ఈ ఉపదేశానికి అర్థం.

1914లో గురుపూర్ణిమ తరువాత నేను సి.జె.ఎన్.ఎల్. హైస్కూల్లో సహాయక ఉపాధ్యాయుడుగా 65 రూపాయల నెలజీతం మీద పనిచేయటం మొదలుపెట్టాను. రాధాకృష్ణమాయి ఆదేశం మీద నేను అన్నం తినటం మానేశాను. కానీ అన్నం అలవాటు అయినందువల్ల మానటం చాలా కష్టమనిపించేది. ఒకసారి బాబా నా స్వప్నంలోకి వచ్చి, “రొట్టెతో పాటు ఉల్లి పచ్చడి తినాలి. ఎర్ర ఉల్లిపాయ దొరికితే మరీ మంచిది” అన్నారు. ఉల్లి తినటం వల్ల కొద్దిరోజులయ్యాక నా గొంతు పాడయినట్లు అనిపించింది. ఉల్లిపాయను జీర్ణించుకునే శక్తి నా సూక్ష్మశరీరానికి లేదని తెలిసిన తరువాత ఉల్లి తినటం మానేశాను. మా చెల్లెలు నవసారి వచ్చీరాగానే మళ్ళీ అన్నం తినటం మొదలుపెట్టాను. కానీ అన్నంతో అపత్యమైంది. తరువాత రాధాకృష్ణమాయి అన్నం తినటం ప్రారంభించమని సలహా ఇచ్చింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo