సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 441వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా అనుగ్రహంతో గాణ్గాపురం దర్శనం
  2. పక్షి రూపంలో బాబా వచ్చారు

సాయిబాబా అనుగ్రహంతో గాణ్గాపురం దర్శనం

ఓం శ్రీసాయిరామ్! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారములు. నా పేరు దీప్తి. నేను హైదరాబాద్ నివాసిని. నేను ఇంతకుముందు నా అనుభవాలు కొన్నిటిని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు గాణ్గాపురం వెళ్లడానికి సాయిబాబా నాకు ఎలా సహాయపడ్డారో మీతో పంచుకుంటాను. 

2015వ సంవత్సరంలో ఒకసారి నా స్నేహితురాలు నాకు 'శ్రీగురుచరిత్ర' పుస్తకాన్ని ఇచ్చి చదవమని చెప్పింది. అప్పటివరకు శ్రీగురుని గురించి గానీ, గాణ్గాపురం గురించి గానీ నాకు ఏమీ తెలియదు. గురుచరిత్ర పారాయణ చేశాక, నాకు ఉద్యోగం వస్తే మొదటినెల జీతం నుంచి రూ.1116/- గాణ్గాపురం పంపిద్దామని అనుకున్నాను. కానీ శ్రీగురుడు నన్నే గాణ్గాపురం పిలుచుకున్నారు. అనుకోకుండా నాకు గాణ్గాపురం వెళ్లాలని బలంగా అనిపించింది. అంతకుముందు గాణ్గాపురం వెళ్ళినవారిని అడిగితే, "మేము రైలులో వెళ్ళాము. గుల్బర్గా వరకు వెళ్ళి అక్కడ్నుంచి బస్సులో వెళ్ళాల"ని చెప్పారు. అయితే ఎండాకాలం కావడం వలన నాతోపాటు రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. నాకు బస్‌స్టాండు కూడా తెలియదు. అలాంటి నేను ఒంటరిగా ఎలా వెళ్ళాలా అని దిగులుపడుతుంటే, మా అత్తమ్మ మా పెద్దపాపని తోడు తీసుకొని వెళ్ళమని చెప్పింది. కానీ మొదటిసారి గాణ్గాపురం వెళ్లడం కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడుండాలి వంటి వివరాలేమీ నాకు తెలీవు. అందువలన నేను జూన్ ఒకటవ తేదీన దిల్‌షుఖ్‌నగర్ సాయిబాబా మందిరానికి వెళ్లి, "బాబా! ఒక నెలపాటు అన్నం తినడం మానేసి గాణ్గాపురం వెళ్లాకే మళ్ళీ అన్నం తింటానని మ్రొక్కుకున్నాను. ఇప్పుడు చూస్తే ఎవరూ నాకు తోడుగా రావడం లేదు. ఏదైనా చేసి మీరే నా కోరిక తీర్చాలి" అని కన్నీళ్లతో బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా అద్భుతం చేశారు. అంతవరకు రామంటున్న మా అమ్మ, నా మేనమామ భార్య నాతో రావడానికి సిద్ధమయ్యారు. దాంతో మొత్తం నలుగురం కలిసి జూన్ రెండవ తేదీన హైదరాబాద్ నుండి బయల్దేరాము. బస్సులో నేను సాయిసచ్చరిత్ర పారాయణ చేస్తూ ప్రయాణం సాగించాను. గాణ్గాపురంలో ఎక్కడ ఉండాలో, ఎలా దర్శనం చేసుకోవాలో, ఏ వివరాలూ మాకు తెలియవు అని ఆలోచిస్తుంటే, బస్సులో ఒక దంపతులు మా అమ్మకి పరిచయమయ్యారు. మేము మొదటిసారి గాణ్గాపురం వెళ్తున్నామని చెప్తే వాళ్లు మాకు తోడుగా ఉండి అక్కడ అన్ని దర్శనాలు చేయించారు. వాళ్ళు మమ్మల్ని సంగమానికి తీసుకెళ్లారు. అక్కడ మఠంలో ఉన్న రావిచెట్టుకి మేము ప్రదక్షిణలు చేసి, సంగమేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఆ రాత్రి శ్రీగురుని మఠంలో నిద్రించి తెల్లవారుఝామున హారతి చూసి మళ్ళీ సంగమం, కల్లేశ్వరుని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాము.

రెండవసారి మేము గృహప్రవేశం చేసుకున్నాక గాణ్గాపురం వెళదామని అనుకున్నాను. కానీ హఠాత్తుగా మళ్ళీ నాకు స్వామి పిలుపు వచ్చింది. అయితే ఆ సమయంలో బస్సుల స్ట్రైక్ ఉన్నందున ఒక్కదానినే ఎలా వెళ్ళాలా అనుకుంటుంటే, బాబా దయవలన మా అత్తమ్మ, ఆడపడుచు వాళ్ళ కారులో గాణ్గాపురం వెళ్ళివద్దామని అడిగారు. నా ఆనందాన్ని ఏమని చెప్పను? 2019, అక్టోబర్ 12, శనివారం ఉదయం 5 గంటలకు మేము మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. బాబా ఎక్కడైనా కనిపిస్తారేమోనని ఆత్రంగా చూస్తుంటే, ఒక ఆయిల్ టాంకర్ మీద ఆరెంజ్ కలర్ దుస్తులలో బాబా దర్శనమిచ్చారు. ఆనందంతో మనసులోనే బాబాకు నమస్కరించుకున్నాను. ఈ ప్రయాణంలో నేను గాణ్గాపురంతోపాటు మాణిక్‌నగర్, అక్కల్‌కోట కూడా దర్శించాలని అనుకున్నాను. కానీ ఆ రాత్రికి మేము తిరిగి ఇల్లు చేరుకోవాల్సి ఉండటంతో అక్కల్‌కోట వెళ్లడం కుదరదనుకున్నాము. ముందుగా హమ్నాబాద్ వెళ్లి మాణిక్య ప్రభువు వారి సంస్థానం దర్శనం చేసుకుని గాణ్గాపురానికి బయలుదేరాము. మార్గంలో బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని మంచి ప్లేస్ కోసం చూస్తున్నాము. అలా వెళ్తూ ఉండగా కారు డ్రైవరు ఒక గుట్టమీద ఉన్న గుడిని చూసి అక్కడికి వెళదామని తీసుకెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే, ఆ గుడి ఆవరణలో స్వామి సమర్థ మందిరం, గోశాల ఉన్నాయి. "బాబా! నా కోరిక ఇలా తీర్చావా తండ్రీ" అని అనుకొని స్వామి సమర్థ దర్శనం చేసుకున్నాను. తరువాత గాణ్గాపురం వెళ్లి ముందుగా సంగమానికి వెళ్ళాము. అక్కడినుండి మఠానికి వెళ్ళడానికి దారి అడుగుతుంటే ఒక సాధువు, 'ముందు కల్లేశ్వరుని దర్శనం చేసుకోండి' అని చెప్పారు. దాంతో కల్లేశ్వరుని దర్శనం కూడా చేసుకున్నాము. తరువాత శ్రీగురుని దర్శనం, పాదుకాదర్శనం చేసుకొని తిరిగి ప్రయాణమయ్యాము. ఈ విధంగా సాయిబాబా నాకు రెండుసార్లు గాణ్గాపుర దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. ప్రతిసారీ ఆయన మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

పక్షి రూపంలో బాబా వచ్చారు

యు.ఎస్.ఏ నుండి ఒక సాయిసోదరి తన రీసెంట్ అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తురాలిని. 'బాబా ఆ రూపంలో వచ్చారు, ఈ రూపంలో వచ్చారు' అని సాయిభక్తులు తమ అనుభవాల్లో పంచుకుంటుంటే, 'నాకెప్పుడూ ఇలాంటి అనుభవం జరగలేదు' అని అనుకుంటూండేదాన్ని. బాబా ఏదో ఒక రూపంలో వస్తారని నేను చాలా సంవత్సరాల నుండి ప్రతిరోజూ మా బాల్కనీ తలుపు తెరచి ఉంచుతున్నాను. కానీ ఎప్పుడూ బాబా వచ్చినట్లు నాకు అనుభవం కాలేదు. బహుశా యు.ఎస్.ఏ లో ఇది అసాధ్యమేమో అనుకున్నాను. కానీ 2020, జూన్ 2న బాబా నా కోరికను తీర్చారు. ఆరోజు నేను పూజచేస్తూ బాబా గురించి ఆలోచనలో పడ్డాను. అలా ఆలోచిస్తూ, 'బాబా అందరికీ ఏదో ఒక రూపంలో దర్శనమిస్తారు, కానీ నాకు అటువంటి అవకాశం ఎప్పుడూ రాలేద'ని అనుకున్నాను. తరువాత ఒక స్తోత్రమ్ చదవాలని ఆలోచిస్తున్నంతలో ఒక పక్షి ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చి గోడకున్న బాబా ఫోటోకి క్రిందగా ఉన్న కిటికీ గోడమీద కూర్చుంది. నా ఆనందానికి అవధులు లేవు. నా ఆనందం(పక్షి) నా తమ్ముడి పెళ్లి కానుకగా వచ్చిన బాబా ఫోటో క్రింద కూర్చుని నన్నే చూస్తూ ఉంది. సాధారణంగా మనం అటు ఇటు తిరిగితేనే పక్షులు ఎగిరిపోతాయి. అలాంటిది నా భర్త ఆ పక్షిని తరమడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది బయటకు పోలేదు. నేను, "నా పూజ పూర్తయ్యేవరకు ఉండండి బాబా" అని చెప్పుకొని, దాన్నే చూస్తూ నా పూజ కొనసాగించాను. బాబా నా ప్రార్థన విన్నారు. నా పూజ పూర్తైన తరువాత కూడా ఐదు నుండి పదినిమిషాల వరకు అది అక్కడే ఉండి తరువాత వెళ్ళిపోయింది. సుమారు గంటపైన ఆ పక్షి రూపంలో నా బాబా నన్ను అనుగ్రహించి వెళ్లారు. నా భర్త ఆ ఆనందాన్ని ఫోటో తీశారు. దాన్ని క్రింద జతపరుస్తున్నాను, మీరూ చూడండి.



9 comments:

  1. very nice leela.sai comes in many rupalu.

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయి రాం జై సాయి మాస్టర్
    అద్భుతం ఈ సాయి లీల

    ReplyDelete
  4. శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  5. Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
    Bhavya sree

    ReplyDelete
  6. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete
  7. SaiNadha! Eppudhu na life lo kudha happiness anedhii istav Inka enduku edipistav tandri!!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo