సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 432వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా పిచ్చుకలా నన్ను తన దరికి లాగిన వైనం - రెండవ భాగం 

వృద్ధునిగా బాబా దర్శనం:

నేను ముందుగా దుర్గాదేవి దర్శనం, బాబా దర్శనం చేసుకొని CBT-3 పరీక్షా కేంద్రానికి వెళ్ళాను. పరీక్షా కేంద్రం బయట ఒక వృద్ధుడు నాకు ఎదురుపడి, "నాకు రెండు రూపాయలు ఇవ్వు" అని అడిగాడు. సరేనని నేనతనికి రెండు రూపాయలిచ్చాను. అతను ఆ రెండు రూపాయలను అటు ఇటు త్రిప్పి చూసి తన జేబులో వేసుకున్నాడు. కాసేపటి తరువాత చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అర్థమైంది, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తూ నా తండ్రి సాయినాథుడే అని. అలా దక్షిణ రూపంగా బాబా నా చెడుకర్మనంతా తొలగించారు.

అమ్మవారిగా బాబా దర్శనం:

పరీక్ష పూర్తైన తరువాత విజయవాడ బస్టాండులో కూర్చొని ఉన్నాను. ఒక స్త్రీ నా దగ్గరకొచ్చి, "నాకు దాహం వేస్తోంది, మజ్జిగ త్రాగాలి, మూడే మూడు రూపాయలు ఇవ్వు" అని అడిగింది. నేను ఆమెకి డబ్బులిచ్చి, ఆమెనే గమనిస్తున్నాను. ఆమె మజ్జిగ త్రాగి అటు ఇటు తిరిగి హఠాత్తుగా అదృశ్యమైంది. అప్పుడు బాబానే అమ్మవారి రూపంలో వచ్చారని అర్థమైంది. మజ్జిగ మాములుగా కడుపులో మంట ఉంటే త్రాగుతారు. బాబా మజ్జిగ త్రాగి మంట అనే నాలోని చెడుకర్మని అణచివేశారని నా భావన.

బాబా అనుగ్రహంతో CBT-3 ఫలితం కూడా నాకు అనుకూలంగా వచ్చింది. ఇక మిగిలినది ‘వైద్య పరీక్షలు’. అవి కూడా సాయిబాబా అనుగ్రహంతో విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్న “గుంతకల్ డివిజన్”కి నా నియామకం జరిగింది. అక్కడనుంచి జాయినింగ్ లెటర్ రావడం, నేను జాయిన్ అవడమే మిగిలింది. త్వరలోనే బాబా ఆశీస్సులతో నేను ఉద్యోగ విధులలో చేరుతానని ఆశిస్తున్నాను. 

"కంట్లో మచ్చ ఉంది, అదృష్టవంతుడివి లేరా!"

ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా మూడవ సంవత్సరంలో ఉన్నప్పుడు బాబా ఒక చక్కటి అనుభవాన్ని మాకిచ్చారు. ఒకరోజు నేను నిద్రలో ఉండగా ఒక కల వచ్చింది. కలలో నేను, మా అమ్మ సాయి దర్బారుకి వెళ్ళాము. అక్కడ బాబా దర్శనం కోసం చాలామంది వేచి ఉన్నారు. మేము ఒక ప్రక్కగా నిల్చొని ఉండగా బాబానే స్వయంగా మా దగ్గరకి వచ్చి ఆ జనసమూహంతో, "ఈ తల్లి ఎన్ని సంకల్పాలు చేసిందో, ఆ సంకల్పాలన్నీ నెరవేరే సమయం వచ్చింది" అని అమ్మ గురించి చెప్పారు. తరువాత నా గురించి “వీడికి కంట్లో మచ్చ ఉంది" అని చెప్పి, "అదృష్టవంతుడివి లేరా!" అని అన్నారు. అంతటితో నాకు మెలకువ వచ్చింది. ఈ విషయాన్ని మేము కలగా భావించలేదు. ఎందుకంటే ఏదైనా చెప్పాలనుకుంటే బాబాకి ఏ వాహకాలు గానీ, పగలు, రాత్రి వంటి కాలనియమాలు గానీ అవసరం లేదు. దీనికి నిదర్శనంగా బూటీకి, శ్యామాకి కలలో శిరిడీ మందిర నిర్మాణం గురించి బాబా కలలోనే సూచించడాన్ని చెప్పుకోవచ్చు. సాయి చరిత్రలో ఉన్న ఈ సంఘటన అందరికీ విదితమే!

నాకు కంట్లో నిజంగానే మచ్చ ఉంది. రైల్వే ఉద్యోగానికి సంబంధించి వైద్య పరీక్షలలో కంటి పరీక్ష కూడా ఉంటుంది. ఈ మచ్చ విషయంలో ఏదైనా సమస్య అవుతుందని మా నాన్నగారు చాలా భయపడ్డారు. బాబా స్వప్నంలో ఈ మచ్చ గురించి చెప్పడంతో మా అమ్మ మా నాన్నతో, "ఏమీ అవదు, బాబా మచ్చ గురించి అలా చెప్పారంటే ఈ మచ్చ వల్ల ఏ సమస్యా రాదని అర్థం. కాబట్టి దాని గురించి పట్టించుకోవద్దు” అని ధైర్యం చెప్పేది. నిజంగానే ఏ సమస్య రాలేదు. పైగా మెడికల్ రికార్డులలో ప్రూఫ్‌గా ఈ మచ్చనే వ్రాశారు. బాబా చెప్పినట్లుగానే నేను అదృష్టవంతుడినయ్యాను. నాకు రైల్వే ఉద్యోగం వచ్చింది.

కొరోనా బారినపడకుండా నన్ను, నా చెల్లిని కాపాడటం:

2020 మార్చి 15న నేను శిరిడీ బయలుదేరాను. భారతదేశంలో కొరోనా నెమ్మదిగా విస్తరిస్తున్న సమయమది. అప్పటికే మహారాష్ట్రలో 40 కేసులు నమోదయ్యాయి. నేను మార్చి 16వ తేదీ మధ్యాహ్నం శిరిడీ చేరుకొని మన తండ్రి బాబా దర్శనం చేసుకున్నాను. సాయంత్రం ధూప్ ఆరతికి కూడా హాజరయ్యాను. రాత్రి ద్వారకామాయిలో బాబాకు నా నమస్సులు అర్పించుకొని ఆ రాత్రంతా అక్కడే గడిపాను. తెల్లవారుఝామున కాకడ ఆరతికి హాజరయ్యాను. మధ్యాహ్న ఆరతి సమయానికి చావడిలో కూర్చొని ఆరతి పాడుకున్నాను. అలా శిరిడీలో మొత్తం మూడు ఆరతులకు హాజరయ్యాను. అదేరోజు మార్చి 17వ తేదీ మధ్యాహ్నం కొరోనా వైరస్ కారణంగా సమాధిమందిరం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో బాబాని "నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రీ" అని వేడుకున్నాను. ఆరోజే నేను శిరిడీ నుండి బయలుదేరి ఇంటికి వచ్చేశాను. ఇంటికి తిరిగి వచ్చిన రెండు మూడు రోజులకి నాకు జలుబు చేసి ఎంతకూ తగ్గలేదు. మొదట్లో నీళ్ల మార్పు వల్ల అనుకుని టాబ్లెట్స్ వేసుకున్నాను. అయితే ఎంతకీ తగ్గకపోయేసరికి కొంచెం భయపడ్డాను. ఎందుకంటే కొరోనా లక్షణాలలో జలుబు కూడా ఒకటి. ఒకరోజు ఆ జలుబుతో బాధపడుతూ నిద్రపోయాను. తెల్లవారుఝామున 5-6 గంటల మధ్యలో మెలకువ వచ్చింది. ఇంకా నిద్రమత్తు ఉండడంతో అలానే కళ్ళుమూసుకొని ఉన్నాను. అంతే! బాబా స్వయంగా దర్శనమిచ్చి నా శరీరమంతా ఊదీ రాశారు. తరువాత కొద్దిరోజులకి నా జలుబు పూర్తిగా తగ్గిపోయింది. ఇది బాబా చేసిన అద్భుతం. తమను నమ్మిన భక్తులకు ఎల్లవేళలా రక్షణనిస్తుంటారని చాటిన లీల. బాబా కరుణామయుడు. ఆపద్బాంధవుడు.

ఇక చెల్లి విషయానికి వస్తే, తను పూణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండేది. చాలారోజులుగా తను ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వేరే కంపెనీలో చేరాలని అనుకుంటూ ఉండేది. రెండు నెలలు ఇంటి దగ్గర గడిపి మరో ఉద్యోగంలో చేరాలని కూడా తన ఆలోచన. అయితే క్రొత్త ఉద్యోగం కోసం తను చేసిన ప్రయత్నాలేవీ కలిసి రాలేదు. ఇక తను చివరి ప్రయత్నం చేస్తూ నవగురువార వ్రతం మొదలుపెట్టింది. వ్రతం పూర్తయ్యేలోపే బాబా చమత్కారం చేశారు. చాలారోజుల క్రిందట తను ఒక కంపెనీకి సంబంధించిన పరీక్ష వ్రాసింది. ఆ కంపెనీ నుండి ఇంటర్వ్యూకి హాజరుకమ్మని పిలుపు వచ్చింది. తను బాబాకి పూజ చేసి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళింది. బాబా దయతో అందులో తను విజయం సాధించడంతో తనకా ఉద్యోగం వచ్చింది. మార్చి 4న చెన్నై కంపెనీలో చేరమని తెలియజేస్తూ ఆఫర్ లెటర్ ఇచ్చారు. దాంతో తను ఫిబ్రవరి 19వ తేదీన పూణేలో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటికి వచ్చి, తన నవగురువార వ్రతాన్ని పూర్తి చేసింది. మార్చి 4వ తేదీన క్రొత్త ఉద్యోగంలో చేరింది. కొరోనా కారణంగా మార్చి 20వ తేదీన ఇంటికి వచ్చేసి అప్పటినుండి ఇప్పటివరకు ఇంటినుంచే వర్క్ చేస్తోంది. ఈ విధంగా రెండు నెలలు ఇంటి దగ్గర ఉండాలనుకున్న చెల్లి కోరికను నెరవేర్చడమే కాకుండా, తనని ఈ కొరోనా బారినుండి రక్షించారు బాబా.

ఈ రీతిన ఎప్పుడో ఒకసారి బాబా గుడికి వెళ్ళే నన్ను పిచ్చుక కాలికి దారం కట్టి తమ వద్దకు లాక్కున్నట్లు తమ వైపుకు పూర్తిగా లాక్కున్నారు బాబా. ఇప్పుడు నేను ప్రతి రెండు రోజులకు ఒకసారి గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటున్నాను. ఇదంతా కేవలం బాబా వలనే సాధ్యమైంది. ఇదంతా బాబా మా కుటుంబంపై చూపించిన దయ. బాబా మన వెన్నంటి ఉన్నంతవరకు మనకి ఏ సమస్యా రాదు. ఒకవేళ ఉన్నా కూడా బాబా వాటిని తీర్చేస్తారు. మనకు బాబా తోడే శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. మనసా శిరస్సు వంచి సాయికి పాదాభివందనం చేస్తూ ఆ తండ్రి తన కృపను ఎల్లవేళలా మనపై కురిపిస్తూ ఉండాలని, ప్రపంచాన్ని ఈ కొరోనా అనే విషపురుగు నుంచి కాపాడాలని వేడుకుంటూ, సెలవు... 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!

లోకాః సమస్తాః సుఖినో భవంతు!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!! శుభం భవతు!!!


10 comments:

  1. very nice leelas that devotee is very lucky to have live darshan of sai.i want sai to come in dream.but i am not having that much luck.om sai ram.please give darshn in dreams.

    ReplyDelete
    Replies
    1. Faithfully read sai satcharitra definately baba comes in u r dreams

      Delete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!

    ReplyDelete
  3. om sairam
    sai always be with me

    ReplyDelete
  4. Om sai ram
    All sai devotes are lucky

    ReplyDelete
  5. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. 🙏🌹 ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏

    ReplyDelete
  8. ఓం సాయిరాం,,,🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo