సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 385వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పంతొమ్మిదవ  భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఈ మధ్యకాలంలో ఒకసారి నేను సభామండపంలో నిలుచొని ఉన్నప్పుడు, “సాఖరేగారి జ్ఞానేశ్వరి చదువు” అని ఒక శబ్దం వినిపించింది. 'ఇది భ్రమ కాదు కదా!' అన్న శంక నాకు కలిగింది. తరువాత ఈ విషయం గురించి నేను ఇతరులను అడిగినప్పుడు సాఖరే అనే పేరుగల పండితుడు జ్ఞానేశ్వరి మీద టీక వ్రాశాడని తెలిసింది. దాన్ని ముంబాయి నుంచి నా తమ్ముడి ద్వారా తెప్పించుకుని ఒకరోజు మధ్యాహ్నం భోజనమైన తరువాత చదవటం ప్రారంభించాను. ఒకటి రెండు పేజీలు చదివిన తరువాత నిద్ర రావటం మొదలుపెట్టింది. అయినప్పటికీ చదవటం ఆపాలని అనిపించలేదు. దాన్ని ఎలాగోలా చదవాలని అనుకుంటుంటే, అప్పుడే ఒక వ్యక్తి వచ్చి "బాబా నన్ను రమ్మంటున్నార"ని చెప్పాడు. వెంటనే మశీదుకు వెళ్ళాను. బాబా, "ఏం చేస్తున్నావు?” అని అడిగారు. నేను, “జ్ఞానేశ్వరి చదవటం ప్రారంభించాను. ఒకటి రెండు పేజీలు చదవగానే నిద్రొచ్చింది” అన్నాను. బాబా ఏమీ అనలేదు కానీ నా కళ్ళల్లోంచి నిద్ర ఎగిరిపోయింది. 

దాని తరువాత ముంబాయి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన జగద్‌హితేచ్ఛు ప్రెస్ వాళ్ళు ముద్రించిన జ్ఞానేశ్వరి చదవాలని కోరిక కలిగింది. దానికి ముఖ్య కారణం, ఆ అనువాదం సాఖరేగారు చేసిన దానికంటే సులభంగా ఉన్నట్లనిపించటం. నస్తుసాహిత్య ముద్రణాలయం వారి జ్ఞానేశ్వరి కూడా ముంబాయి నుంచి వచ్చేటప్పుడు తెచ్చాను. కానీ, జగద్‌హితేచ్ఛు ప్రెస్ వారి జ్ఞానేశ్వరీ, నస్తుసాహిత్య ముద్రణాలయం వారి జ్ఞానేశ్వరీ పేజీలను తిరగేస్తున్నప్పుడు నా దృష్టికి ఈ రెండు పుస్తకాల్లోనూ ఎనిమిదెనిమిది పేజీలు తక్కువ ఉన్నట్లు నాకు అనిపించింది. అసంపూర్ణ గ్రంథాలను నిత్యపఠనలో పెట్టుకోకూడదన్న నియమం ఉంది కనుక నిత్యపఠన కోసం సాఖరేగారి టీక ఉన్న గ్రంథాన్నే నేను ఉపయోగించాను. జ్ఞానేశ్వరి పారాయణ ఒకసారి పూర్తయ్యాక ఆ విషయం బాబాతో చెప్పి, “ఇప్పుడేం చదవమంటారు?” అని అడిగాను. బాబా, "ఒకసారి చదివితే ఏమవుతుంది? చాలాసార్లు పారాయణ చేయాలి” అని, దగ్గరలో కూర్చున్న మహల్సాపతి వైపు చూసి, “నేను చెప్పింది నిజమే కదూ?" అన్నారు. మహల్సాపతి, “నిజమే, ఒకసారి చదివితే ఏమవుతుంది?” అన్నాడు.

ఈ మధ్యకాలంలో మధ్యాహ్న భిక్ష తీసుకొచ్చే పని బాలక్‌రాం లేనందువల్ల నాకు అప్పగించబడింది. కొద్దిరోజుల తరువాత శ్రీగణపతిరావు నార్కే వచ్చాడు. అయినప్పటికీ బాబా ఈ సేవను నాచేతే చేయించేవారు. రెండు మూడ్రోజుల తరువాత రాధాకృష్ణమాయి ఇచ్చిన కాఫీ త్రాగి నేను నా నివాసానికి వెళ్ళాను. సరిగ్గా ఆరోజు ఎంత నిద్ర వచ్చిందంటే, ఆరతయిపోయి భిక్ష అడిగే సమయం కూడా దాటిపోయినప్పటికీ నేను నిద్రనుంచి లేవలేకపోయాను. అందువల్ల బాబా ఈ సేవను శ్రీనార్కేకి ఇచ్చారు. అయితే అతను వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆ సేవ నాకే వచ్చింది. భిక్షలో భాకరీ(జొన్నలు లేక మొక్కజొన్నలతో చేసిన లావుగా ఉన్న రొట్టె), కూర(ఏదో ఒక కూర) దొరికేది. అలాగే అర్థశేరు ఆవుపాలు చెంబులో విడిగా లభించేవి. ఈ రోజుల్లో నా నిద్ర ప్రమాణం చాలా ఎక్కువగా ఉండేది. ఉదయం ఆలస్యంగా లేచేవాడిని. ఒకటి రెండుసార్లు బాబా ఎవరో ఒక వ్యక్తిని పంపి నన్ను లేపించి 'త్వరగా లేవటం ఎంతో గొప్పద'న్న విషయం నా మనసులో ముద్రించేలా చేశారు.

కాకాసాహెబ్ దీక్షిత్ నాకు ఇచ్చిన నాభాజీగారి భక్తమాలను ఈ సమయంలోనే చదివేవాడిని. దాంట్లో నాకు ఎక్కువ అభిరుచి ఉండేది. ఈ గ్రంథం చదివిన తరువాత సంతుల లేదా భగవంతుడి దర్బారులో జ్ఞానం ప్రాప్తించే మార్గం ఒకటుందనీ, అది ఆ సంతుల సేవేననీ, ఆ సేవనుంచే వారి కృప ప్రాప్తిస్తుందనీ, ఇది లేకుండా ఈశ్వరుని సాక్షాత్కారంగానీ, జ్ఞానంగానీ ప్రాప్తించటమనేది సంభవించదనీ నాకు అనిపించింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo