సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 397వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - ముప్పైఒకటవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బాబా ఆజ్ఞతో 1914లో విల్లేపార్లేకి తిరిగి వచ్చాను. ‘శ్రీజహంగీర్ గులాబ్‌భాయి & బిల్లిమోరియా’ ఆర్గనైజేషన్లోని ముఖ్య వాటాదారుడైన సొలిసిటర్ శ్రీజహంగీరుని కలిశాను. అంత ఎక్కువకాలం నేను శిరిడీలో ఉండటం ఆయనకు నచ్చలేదు. నేను శిరిడీలో ఉన్నప్పుడు ఆయన నాకు ఉత్తరం రాశాడు. అందులో నాలాంటి సామాన్యుడు సాధువులు, ఫకీర్ల చుట్టూ తిరగటం మంచిది కాదని రాశాడు. ఇప్పుడు త్వరగా తిరిగి రాకపోతే, మొదటి సంవత్సరం వ్యర్థమై మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొదటి సంవత్సరంలో కలిసిపోతుందని ప్రత్యేకమైన సందేశంలో రాశాడు. ఆ ఉత్తరానికి నేను, "నాకు బాబా ఇచ్చే ఆజ్ఞ ఈశ్వరుడి ఆజ్ఞతో సమానమైనందువల్ల వారి అనుమతి లభిస్తేనే తిరిగి వస్తాను, అప్పటివరకు నేను ఇక్కడనుంచి బయల్దేరటం జరగదు" అని వివేకపూర్వకంగా సమాధానం వ్రాశాను. ఇప్పుడు శ్రీజహంగీరు నాతో, “ఇన్ని రోజులు నీవు ముంబాయికి దూరంగా ఉండటం వల్ల రెండు సంవత్సరాల పీరియడ్ మళ్ళీ నీవు పూర్తి చేయవలసి ఉంటుంది" అన్నారు. 

అందుకని వారి ఆఫీసుకు వెళ్ళటాన్ని మానుకొని, ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాలనుకున్నాను. శ్రీజహంగీరు వద్దనుంచి సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాను. దాంతో 80 రూపాయల నెలజీతం మీద పోలీసు ప్రాసిక్యూటరుగా ఒక ఇంటర్వూకి, నవసారీలో ఉన్న సి.జె.ఎన్.ఎల్. పాఠశాలలో సహాయక ఉపాధ్యాయుడిగా మరొక ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. శిరిడీ వెళ్ళి, "ఈ రెండు పదవుల్లో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాల"ని బాబాని అడిగినప్పుడు, "పోలీసు ప్రాసిక్యూటర్ అవొద్దు, ఉపాధ్యాయుడివి అవు” అన్నారు బాబా. బాబా ఆజ్ఞను అనుసరించి గురుపూర్ణిమ తరువాత బొంబాయిలో ఉన్న పాఠశాల ఆఫీసరుని కలిసి 65 రూపాయల నెలజీతంతో ఉపాధ్యాయ వృత్తిలో చేరాను. 

శిరిడీనుంచి బయలుదేరే సమయంలో, "నేను ఇంట్లో నుండి భగవంతుడి నామస్మరణలో సమయాన్ని గడపాలా? లేక ఏదైనా పని చేయాలా?” అని కాకాసాహెబ్ ద్వారా బాబాను అడిగించాను. అందుకు బాబా, “ఎవరి పనిని వారు చేసుకోవాలి” అని అన్నారు. అయితే శ్రీజహంగీరు మాట విని భగవన్నామస్మరణ మినహాయించి నేనింకేమీ చేసేవాణ్ణి కాదు. అప్పుడు కాకాదీక్షిత్ తన భార్యతో కలిసి మా ఇంటికి వచ్చారు. ఆయన నాతో, “ఏదో ఓ పనిని చేస్తూనే ఉండాలని బాబా ఆజ్ఞాపించారు” అని చెప్పారు.

కొద్దిరోజులు గడిచాక నేను శిరిడీ వెళ్ళాను. వేసవి సెలవు దినాలవి. అందరూ నన్ను చూసి బాబాతో, “వామన్‌రావు వచ్చాడు” అన్నారు. బాబా నావైపు ప్రేమపూర్వకంగా చూస్తూ, “అవును, అమ్మ దగ్గర ఇంకా అతని డబ్బుంది కదా!” అన్నారు. "ఇంటి నుంచి ఫలహారానికి ఏం సామగ్రి తెచ్చావు?” అని రాధాకృష్ణమాయి అడిగినప్పుడు, నా వెంట తీసుకొచ్చిన పూరీలు, చక్కెరతో చేసిన మైదా బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు వగైరాలన్నీ చూపించి ఆమెని స్వీకరించమని అర్థించాను. అప్పుడామె, “ఇవెందుకు తెచ్చావు? జొన్న రొట్టెలో, మొక్కజొన్న రొట్టెలో, సజ్జ రొట్టెలో తీసుకురావలసింది” అన్నది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo