సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 413వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైఆరవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఒకసారి మధ్యాహ్న ఆరతి, భోజనం అయ్యాక బాపూసాహెబ్ జోగ్ నాతో, “వామనరావ్! ఈ ఎడ్లబండి ఎక్కు. బాబా రహతాలో కుశాల్ సేట్ ఇంటికి వెళ్ళారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పద!” అన్నాడు. జోగ్ ధర్మపత్ని కూడా ఆయన వెంట ఉంది. వారిద్దరితోపాటు నేనూ బండిలో కూర్చున్నాను. దారిలో ఒకచోట బండి చక్రం బురదలో కూరుకుపోయింది. దాన్ని చూసి బాపూసాహెబ్ నాతో, “నీకు సిద్ధి ప్రాప్తించిందని అందరూ అంటున్నారు. ఈ చక్రాన్ని నీ చేత్తో స్పృశించు. దాంతో ఈ చక్రం బురద నుండి బయటకు వచ్చి బండి ముందుకు నడిస్తే అప్పుడు నేను లోకుల మాటలు సత్యమని అంగీకరిస్తాను” అన్నాడు. ఇలా అని ఆయన నా చేత బండిచక్రాన్ని స్పృశింపచేశాడు. ఆయన శ్రద్ధ వల్ల చక్రం వెంటనే బయటకు వచ్చి బండి తనంత తానే నడవసాగింది. ఇది చూసి బాపూసాహెబ్, "లోకులు చెప్పిన దాంట్లో అసత్యమేమీ లేదు. నీ వద్ద ఖచ్చితంగా ఏదో ఉంది. కానీ, నాకు స్వతహాగా వీటన్నిటి మీదా నమ్మకం లేదు. బాబా ఎవరిపై కృప చూపిస్తారో వారికన్నీ ప్రాప్తిస్తాయని నాకనిపిస్తుంది” అన్నాడు. అతని శ్రద్ధకు బాబా సరైన ప్రమాణాన్ని చూపించారు. నదిని దాటిన తరువాత రహతాలో ఒడ్డుమీద బండి ఆగిపోయింది. మేం దిగి కుశాల్ భాయి ఇంటివైపు నడవటం ప్రారంభించాం.

అక్కడొకవైపున నేను బాబాని చూశాను. నేను వారి వెనక్కి వెళ్ళాను. ఒక పెద్ద హాల్లో సర్కస్ లేదా నాట్యాలయాల్లో వెనకటిరోజుల్లో కూర్చోవటానికి ఏర్పాట్లు ఎలా ఉండేవో, లేదా మా రోజుల్లో కాలేజీలో కూర్చునేందుకు ఏర్పాట్లు ఎలా ఉండేవో ఆ ప్రకారంగానే మూడువైపులా కూర్చోవటానికి బెంచీలు వేసి ఉన్నాయి. కూర్చునేచోట మూడువైపులా స్త్రీ పురుషులతో క్రిక్కిరిసిపోయి ఉంది. నాలుగవ ప్రక్క ఖాళీగా ఉంది. ఆ ప్రక్కన నేలమీద ఇత్తడితో తయారుకాబడిన ఒక చిన్న పంజరం వుంది. దాని పైభాగం తెరవబడి ఉంది. అక్కడున్న జనసముదాయమంతా కలిసి బాబాకు ప్రేమపూర్వకంగా వందనం చేసింది. బాబా తన స్థానంలోనే నిలబడి వారందరి నమస్కారాలనూ చేతులు ముకుళించి స్వీకరించారు. అలాగే ఆయన ఆ పంజరాన్నించి బయటకు వచ్చి కుశాల్ భాయి దగ్గరకు వెళ్ళారు. ఆ హాలు గురించి తరువాత నేను శిరిడీలో చాలాసార్లు అడిగాను. 1957లో కూడా మళ్ళీ మరోసారి అడిగాను. కానీ రహతాలో ఇలాంటి హాలు ఉండేదని ఎవరికీ తెలిసినట్లు లేదు. బాపూసాహెబ్ జోగ్‌తో ఈ విషయం గురించి మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. నేను చూసిన దృశ్యాన్ని గురించి నేను ఆయనతో కానీ, ఆయన భార్యతో కానీ మాట్లాడలేదు. దీంతో ఈ దృశ్యం బాబా కేవలం నాకోసమే చూపించారని నాకిప్పుడు అర్థమవుతోంది. బాబా దర్శనం కోసం గుమిగూడిన ప్రజలు సుమారు ఒక వెయ్యిమంది ఉంటారు. వారు దర్శన సమయంలో ఎంత శాంతిగా, క్రమశిక్షణతో ఉన్నారంటే అది నిజంగా ప్రశంసనీయం. ఇంతేకాదు, ఇలా అరుదుగా దృష్టికి కనిపించే ఈ రకమైన శాంతి, క్రమశిక్షణలు అనునరించవలసినవి. అందువల్ల నా మనసులో ఆ చిత్రం చెరిగిపోని విధంగా ముద్రించుకుపోయింది. అక్కడ్నుంచి బాబాని అనుసరిస్తూ అనుసరిస్తూ మేము కుశాల్ సేట్ ఇంటికి వెళ్ళాం.

బాబా తన గద్దెమీద దిండ్లనానుకొని కూర్చున్నారు. నేను, కాకాసాహెబ్ మొదలైన వారందరం బాబా ఎదుట కూర్చున్నాం. బాబా ఆగమనానికి స్వాగతం చెప్తూ, పూజ, అర్చన చేసి పండ్లతో నిండిన పళ్ళాన్ని బాబా ఎదుట ఉంచాడు కుశాల్ సేట్. నేను బాబాకి సరిగ్గా ఎదురుగా కూర్చున్నాను. ఆ పళ్ళెం నుంచి ఒక అరటిపండుని తీసి, ఒలిచి నేను బాబాకిచ్చాను. అందులో సగం అరటిపండుని తాము గ్రహించి మిగిలిన సగభాగాన్ని నాకు తిరిగిచ్చారు బాబా. నేను చేసిన ఈ పనిని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ముఖ్యంగా కాకాసాహెబ్. శిరిడీకి వెళ్ళాక ఈ విషయాన్ని రాధాకృష్ణమాయితో చెప్పారు. అప్పుడు ఆమె నన్ను చూస్తూ, “ప్రేమను కేవలం శిరిడీ బయటే చూపించాలా ఏం? వామన్! ఇంతటి ప్రేమను చూపించటం పట్ల ఇక్కడ ఎవరు అడ్డుచెబుతారు?” అన్నది. నా మనసులో అలా ఏమీ లేదు. నాకు అంతరంగం నుంచి ఆదేశం వచ్చిన ప్రకారం నేను బాబాకు అరటిపండిచ్చాను, ఆ ప్రకారంగానే ఆయన తిన్నారు. దీన్నిబట్టి బాబానే దీన్ని ఆదేశించారని తెలుస్తోంది. ఇదే సత్యం. దీన్ని అంగీకరించడంలో ఎవరూ సందేహించనక్కరలేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo